నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

5, ఏప్రిల్ 2019, శుక్రవారం

ఈ ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారు?

నా కొలీగ్స్ లో స్నేహితులలో అన్ని పార్టీలవాళ్ళూ ఉన్నారు. ఎలక్షన్ల వేడి మొదలైపోవడంతో రోజూ వేడివేడి చర్చలు జరుగుతున్నాయి. చర్చలు అరుపులలోకీ తిట్లలోకీ దిగుతున్నాయి. కానీ మళ్ళీ కలసిపోతున్నారు. వారి చర్చలను నేను మౌనంగా వింటూ ఉంటాను. మొన్నోకరోజున ఎవరు గెలుస్తారో చెప్పమని నన్నే అడిగారు. నేనేం మాట్లాడలేదు. ఊరకే నవ్వి  ఊరుకున్నాను.    అలా  ఊరుకుంటే లాభం లేదు. జ్యోతిష్యం ఉపయోగించి చెప్పాల్సిందే అని పట్టుబట్టారు.

'ఎవరు గెలిచినా దేశానికి ఉపయోగం ఏమీ లేదు. కొన్ని కులాలు బాగుపడతాయి. కొన్ని వర్గాలు బాగుపడతాయి. అందరూ తోడుదొంగలై దేశసంపదను వారి సంపదగా మార్చుకుని నల్లధనంగా దాచుకుంటారు. డెబ్భై ఏళ్ళుగా జరుగుతున్నది ఇదే. కనుక ఎలక్షన్లలో  ఎవరు గెలుస్తారు?' అన్న ప్రశ్నమీద నాకు కుతూహలం లేదు. నేను చూడను. చెప్పను' అన్నాను.

'ఇంతకుముందు ఎలక్షన్లప్పుడు చెప్పారుకదా?' అని  వారిలో నా బ్లాగు చదివే ఒకాయన అడిగాడు.

'అప్పుడు  చూద్దామని అనిపించింది. ఇప్పుడనిపించడం లేదు' అన్నాను.

నేను వినేలా కనిపించకపోవడంతో నన్నొదిలేసి వారి  చర్చలు వారు కొనసాగిస్తున్నారు.

మన దేశం పెద్ద మేడిపండని నేను ఎప్పుడో చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నాను. ఈ దేశంలో దోపిడీ, అవినీతి, అవకాశవాదం, కులం, స్వార్ధం తప్ప ఇంకేమీ లేవు. మన వ్యవస్థలన్నీ డొల్లవ్యవస్థలే. వీటిల్లో నిజాయితీపరులు, మంచివాళ్ళూ ఇమడలేరు, బ్రతకలేరు. ఒకవేళ కొంతమంది మంచిగా ఉందామంటే వారిని ఉండనివ్వరు కూడా. అందుకే తెలివైనవాళ్ళు దేశాన్ని వదలిపెట్టి వేరే దేశాలలో సెటిలై పోతున్నారు.

కానీ మననాయకులు వారిని వదలకుండా అక్కడికికూడా వెళ్లి కులమీటింగులు పెట్టి 'మీరిక్కడ కష్టపడి సంపాదించిన డబ్బులు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టండి. మేము వాటిని స్వాహాచేస్తాం' అని అన్యాపదేశంగా చెబుతున్నారు. వారిలో అమాయకులు, ఆశపోతులూ మోసపోతున్నారు.

డెబ్భై ఏళ్ళ క్రితం అరవిందయోగి  ఇలా అన్నారు.

'ప్రస్తుతం ప్రపంచంలోని డబ్బుమీద ప్రతికూల శక్తులు (hostile forces) పెత్తనం చెలాయిస్తున్నాయి. ఈ పరిస్థితి మారనంత వరకూ ప్రపంచపు పరిస్థితి ఏమీ బాగుపడదు'.

ఆయన ఈ మాటనని డెబ్భై ఏళ్ళు దాటిందికానీ ఇప్పటికి కూడా పరిస్థితిలో ఏమీ మార్పులేదు. ఒకవిధంగా చెప్పాలంటే అప్పటికంటే ఇప్పుడింకా దిగజారింది.

ఒకప్పుడు డబ్బొక్కటే వాటిచేతుల్లో ఉండేది. కానీ ఇప్పుడు అధికారం, సంపద, విద్య, వైద్యం, ఆహారం. అన్నీ ఆ శక్తుల చేతులలోనే ఉన్నాయి. కనుక దేశపరిస్థితి నైతికంగా ఆధ్యాత్మికంగా నానాటికీ దిగజారుతూనే ఉంది. జనాలదగ్గర డబ్బులు పెరుగుతూ ఉండవచ్చు. విలాసాలు పెరుగుతూ ఉండవచ్చు. హోదాలు పెరుగుతూ ఉండవచ్చు. కానీ మౌలికంగా మనుషుల వ్యక్తిత్వాలలో ఉన్నతమైన ఎదుగుదలలు లేవు. ఆధ్యాత్మికం సంగతి దేవుడెరుగు. కనీసం మానవత్వం కూడా కనుమరుగై పోతున్నది. కనుకనే బయటకు చాలా దర్జాగా ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపలమాత్రం ఎవడి పరిస్థితి అయినా డొల్లే. అందుకే మేడిపండుతో మన దేశాన్ని నేను పోల్చాను.

ఇంతకుముందు పాలకులే దొంగలుగా ఉండేవారు. ఇప్పుడు ప్రజలూ దొంగలయ్యారు. తోడుదొంగలై దోపిడీ సాగిస్తున్నారు. కనుక మాట్లాడటం అనవసరం. అంతుబట్టని రోగాలూ, ప్రకృతి విలయాలొక్కటే ఈ సమస్యకు పరిష్కారం. అవి జరిగే సమయం అతిదగ్గరలోనే ఉందికూడా !

ఈలోపల ఎన్నికలలో ఏపార్టీ గెలిస్తే ఏముంది? గెలవకపోతే ఏముంది? అనంతకాలగమనంలో భూగోళమే ఒక నలుసైతే, ఇక దానిమీద ఉన్న ఒకదేశంలోని పార్టీలెంత? వాటి నాయకులెంత? అబద్దాలు  చెప్పడం, చేతనైనంత దోచుకోవడం ఇదేగా ఎవడైనా చేసేది?

'ఇదంతాకాదు గాని నేనొక మంచి పరిష్కారం చెబుతాను వినండి. ఎలక్షన్లు వద్దు ఏమీ వద్దు, ప్రతి కులానికీ ఒక ఏడాది చొప్పున అధికారం ఇవ్వండి. ఏడాదిపాటు వాళ్ళను దోచుకోనివ్వండి. ఆ తర్వాత ఇంకో కులానికి ఆధికారం కట్టబెట్టండి. వాళ్ళూ యధేచ్చగా ఇంకో ఏడాదిపాటు దోచుకుంటారు. ఈ విధంగా అన్నికులాలూ 'బాగుపడతాయి'. సమస్య తీరిపోతుంది.'

మా కొలీగ్స్ అయోమయంగా చూశారు.

'ప్రస్తుతం ఎలక్షన్ల పేరుతో జరుగుతున్నది అదేగా? ఇది లీగలైజుడు దోపిడీ కాకపోతే మరేమిటి? కొన్ని దేశాలలో వ్యభిచారం లీగలైజ్ కాబడింది. ఇది పోదు దీన్ని మనమేమీ చెయ్యలేం అనుకున్నపుడు దానిని లీగలైజ్ చెయ్యడమే పరిష్కారం. అలాగే మన దేశంలో ఎన్నికలు కూడా లీగల్ గా దోచుకోవడానికి పార్టీలకు లైసెన్స్ గా ఉపయోగపడుతున్నాయి అంతే. కనుక నేను చెప్పిన పరిష్కారం చేసి చూడండి. కనీసం ఒకరిమీద  మరొకరు  దుమ్మెత్తి    పోసుకోవడం,  తిట్టుకోవడం, చంపుకోవడం అయినా లేకుండా పోతుంది. అందరూ హాయిగా బాగుపడవచ్చు' అన్నాను.

'అది జరిగే పని కాదులే' అన్నారు వాళ్ళు.

'మనదేశంలో ఏదీ జరిగేపని కాదు. ఈ ప్రహసనం మాత్రం  ఎప్పటికీ ఇలాగే జరుగుతూ ఉంటుంది' అన్నాను.

మనుషుల తక్కువబుద్ధులు ఎప్పటికీ మారవేమో? మౌలికంగా మానవ స్వార్ధపూరిత మనస్తత్వం ఎప్పటికీ మారదేమో? మనిషి ఆధ్యాత్మికంగా ఔన్నత్యాన్ని పొందటం ఎప్పటికీ జరిగేపని కాదేమో అని నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది.

ఈ ఎన్నికలలో ఏ పార్టీ గెలిచినా, ఓడిపోయేది మాత్రం ప్రజలే !