నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, ఏప్రిల్ 2019, సోమవారం

చాదస్తానికి పరాకాష్ట - టీవీల నిర్వాకం

మన శాస్త్రాల గురించి, జ్యోతిష్యాది మన ప్రాచీనవిజ్ఞానాల గురించి మనం తెలుసుకోవడం మంచిదే. కాకపోతే, ఆ తెలుసుకున్నది సరియైన విజ్ఞానం అయి ఉండాలి. లేకపోతే జీవితంలో చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది.

నేడు టీవీల పుణ్యమని, టీవీ బోధకుల పుణ్యమని, అందరికీ మిడిమిడి జ్ఞానం ఎక్కువగా వంటబట్టింది. అది పనికిరాని చాదస్తంగా తయారై నానాబాధలకు వీరినేగాక, చుట్టుపక్కల వారిని కూడా గురిచేస్తున్నది. నా మాట సత్యం అనడానికి ఉదాహరణగా ఈ మధ్యనే జరిగిన ఒక సంఘటన వినండి.

ఒక నాలుగు రోజుల క్రితం అమావాస్య పరిధిలో జరిగిన ఒక యాక్సిడెంట్ లో మా ఫ్రెండ్ వాళ్ళ బంధువు చనిపోయాడు. వేరే రాష్ట్రంలో ఇది జరిగితే ఆ బాడీని వాళ్ళ ఊరికి తీసుకొచ్చారు. దహన సంస్కారాలు చెయ్యాలి. అంతా సిద్ధంగా ఉంది. కానీ ఎవ్వరూ ముందుకు కదలడం లేదు. తాత్సారం చేస్తున్నారు. 

'ఏంటయ్యా ఆలస్యం? శవాన్ని ఎత్తండి' అని మా ఫ్రెండ్ అడిగితే 'ప్రస్తుతం రాహుకాలం నడుస్తున్నది. ఇది మంచి టైం కాదు. అందుకని అది అయిపోయే దాకా ఆగుదాం' అని అందరూ ఒకేమాటగా చెప్పారట. అది విని మా ఫ్రెండ్ కి మతిపోయింది. పైగా ఇతను పూజ చేసుకుని బొట్టు పెట్టుకుని అక్కడకు వెళ్ళాడట. అది చూచి, 'ఏంటి? శవం దగ్గరకు వస్తూ బొట్టు పెట్టుకుని వస్తావా? నీకు బుద్ధుందా?' అని ఆక్షేపించారట. అసలిదంతా ఏంటో అతనికేమీ అర్ధంగాక నాకు ఫోన్ చేసి అడిగాడు.

'నువ్వేం అన్నావు?' అనడిగాను.

'మంచిముహూర్తం చూసి ప్రారంభం చెయ్యడానికి ఇదేమైనా కంపెనీనా? అలా చేస్తే ఈ శవం బాగా వృద్ధిలోకి వస్తుందా? శవానికి రాహుకాలం, యమగండం ఏంటిరా మీ బొంద? యముడు ఆల్రెడీ వచ్చి వాడిని ఎత్తుకుపోయాడు. మళ్ళీ యమగండం చూడటం ఏమిటి? శవానికి గండం ఏమిటి?' అన్నాను. కానీ ఎవరూ నా మాట పట్టించుకోలేదు. నన్నే తిట్టారు. చివరకు ఆ రాహుకాలం యమగండకాలం అయిపోయేదాకా ఉండి, టైం  కాని టైంలో శవాన్ని ఎత్తుకెళ్ళారు.' అని మా ఫ్రెండ్ చెప్పాడు.

నాకు పొట్ట చెక్కలయ్యేంత  నవ్వొచ్చింది.

'టీవీలలో పనికిమాలిన జ్యోతిష్య ప్రోగ్రాములు చూచీచూచీ జనాలకు జ్యోతిష్యపిచ్చి బాగా ఎక్కింది. అయితే అది సైంటిఫిక్ గా ఎక్కలేదు. చాదస్తంగా ఎక్కింది. అందుకే ఇలా తయారయ్యారు' అన్నాను.

1970 ప్రాంతాలలో  కమ్యూనిజం బాగా ప్రచారంలో ఉన్నకాలంలో జ్యోతిష్యాన్నీ వాస్తునూ ఎవడూ నమ్మేవాడు కాదు. ఇల్లు కట్టడం కూడా ఇష్టం వచ్చినట్లు కట్టుకునేవారు. ముహూర్తాలమీద ఇంత చాదస్తం  అప్పుడు ఉండేది కాదు. కానీ మళ్ళీ చక్రం పైకి తిరిగింది. ఇప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా అందరూ జ్యోతిష్యం వాస్తు చూస్తున్నారు. ఇది ముదిరి ముదిరి మరీ పిచ్చిగా తయారైంది. ఎంతగా అంటే, ఇదుగో ఇంతగా అని చెప్పడానికి ఈ సంఘటనే చాలు.

నాలుగురోజుల క్రితం ఇది నిజంగా జరిగిన  సంఘటన ! టీవీలు చూసి జనాలు ఎంత పిచ్చోళ్ళు అవుతున్నారో చెప్పడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదనుకుంటాను !