నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

26, మే 2019, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 34 (సాధ్యమైనదే సాధన)

'ధర్మపదం' పుస్తకం ఆవిష్కరణకు జిల్లెళ్లమూడికి వెళ్లాము. అక్కడ అమ్మ పాదాల దగ్గర ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాలని మా సంకల్పం. ముందుగా మా ఫ్లాట్ లో దిగి, ఫ్రెష్ అయ్యి, టిఫిన్లు చేసి, పుస్తకాలు తీసుకుని అమ్మ ఆలయానికి వెళ్ళాము. అక్కడున్న మేనేజర్ గారికి ఇలా చెప్పాను.

'మాకు ఈ పూజ తంతు అక్కర్లేదు. ఊరకే అమ్మ పాదాల దగ్గర ఈ పుస్తకాలు ఉంచి తిరిగి ఇవ్వండి చాలు.'

నేను చెప్పినది ఆయనకు అర్ధం కాలేదు. అందుకని అక్కడున్న పూజారిని పిలిచి "అంగపూజ ఒక్కటి చెయ్యండి చాలు" అని చెప్పాడాయన.

నేనుండి ' అదీ ఒద్దు. ఎంత వీలైతే అంత సింపుల్ గా చెయ్యండి. అసలు పూజే వద్దు.' అని చెప్పాను.

ఆ పూజారి అదేమీ పట్టించుకోకుండా 'ఆచమ్య, కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా' అంటూ తనకలవాటైన తంతు మొదలు పెట్టాడు.

అమ్మ విగ్రహం వైపు చూచాను. గుంభనంగా నవ్వుతున్నట్లు అనిపించింది.

ఆ మంత్రాలూ అవన్నీ నాకు చిన్నప్పటినుంచీ తెలిసినవే. కానీ ఇప్పుడా మంత్రాలు వింటుంటే నాకు ఒళ్లంతా కంపరం ఎత్తుతోంది. ఎందుకంటే వాటిల్లో ప్రతిదానికీ - 'ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి, వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి' అంటూ చదవకూడని మంత్రాలు చదువుతున్నాడు ఆ పూజారి. అదీగాక ఆ దేవుడే ఎదురుగా ఉన్నప్పుడు ఇక ఈ మంత్రాలెందుకు? ఈ పూజారులెందుకు?

'బాబూ ఇక ఆపు నీ పూజ' అని అతనికి మెల్లిగా చెప్పాను.

ఏమనుకున్నాడో ఏమో, అదో రకంగా నన్ను చూస్తూ, పూజని కట్ షార్ట్ చేసి ముగించాడు పూజారి.

పూజ ముగిశాక బయటకు వస్తుండగా ఆ మేనేజర్ గారితో ఇలా చెప్పాను.

'మాకు ఈ తంతులు ఇష్టం ఉండదు. మేము చెప్పినట్లుగా మాకు చెయ్యండి చాలు. మాకీ పూజలూ అవీ అవసరం లేదు. ఇంకోసారి ఇలా చెయ్యకండి మాకు నచ్చదు.'

ఆయన నిర్లిప్తంగా చూచాడు నా వైపు.

'మీది ఏ మార్గం?' అని అడిగాడు.

'అమ్మ మార్గం' అని అందామని అనుకున్నా కానీ అనలేదు.

'ఆత్మవిచారణ మార్గమా మీది?' అడిగాడాయన.

'కలుస్తుంది' అన్నాను.

'ధ్యాన మార్గమా?' మళ్ళీ అడిగాడాయన.

'అదీ ఉంది' అన్నాను.

ఇంకేమనుకున్నాడో ఏమో ఆయనేమీ రెట్టించలేదు.

మర్నాడు కలిసినప్పుడు ఆయనిలా అన్నాడు.

'అమ్మ ఒకటంటూ ఎవరికీ ఏమీ బోధించలేదు. ఎవరికి వీలైనది వారిని చెయ్యమంది. 'సాధ్యమైనదే సాధన' అనేది అమ్మ బోధ. మీకు ధ్యానం నచ్చవచ్చు. మాకు పూజలు నచ్చవచ్చు. ఎవరి సాధన వారిది.'

నేనిలా అన్నాను.

'నేను చెబుతున్నదీ అదే. మాకు సాధ్యమైనది మేము చేస్తాము. మాదే చెయ్యమని మిమ్మల్ని బలవంతం చెయ్యము. మీకు పూజలు తంతులు సాధ్యమౌతున్నాయి. మీరవి చేసుకోండి. అవి మాకొద్దు. అవి కాకుండా ఇంకేదో మాకు సాధ్యమౌతోంది. దానిని మేము చేసుకుంటాము. మీ పూజలు మాచేత చేయించకండి. అమ్మ చెప్పినదే మేము ఆచరిస్తున్నాము. 'సాధ్యమైనదే సాధన' - కరెక్టే !' అన్నాను.

ఆయనకు అర్ధమైందో లేదో నాకర్ధం కాలేదు.

ఉన్నతమైన సాధనలు అందరూ చెయ్యలేరు. వాటికి కావలసిన అర్హతలు అందరికీ ఉండవు. ఆ కష్టం కూడా అందరూ పడలేరు. ఉన్నత స్థాయికి చెందిన సాధనలు చెయ్యలేనివారు, షోడశోపచార పూజలు, నోములు, వ్రతాలు, చేసుకుంటూ భక్తి చానల్ లో ప్రోగ్రాములు చూసుకుంటూ, మహా అయితే టీవీ ఉపన్యాసకుల ఉపన్యాసాలు వింటూ, ఏదో హిందూధర్మాన్ని ఉద్ధరిస్తున్నామనుకుంటూ భ్రమల్లో బ్రతకవలసిందే. వాళ్లకు చేతనైంది అంతే మరి !

గుళ్ళూ, పూజలూ, పారాయణలూ చాలా తక్కువ తరగతికి చెందిన 'లో క్లాస్' తంతులు. వాటిని దాటినవారికి అవి అవసరం ఉండవు. ఇప్పటికే నాలుగు పీ.హెచ్.డీలు చేసినవాడు మళ్ళీ ప్రతిరోజూ 'అ.. ఆ..' లు దిద్దుకోవాల్సిన అవసరం ఏముంది?