Pages - Menu

Pages

17, మే 2019, శుక్రవారం

'ధర్మపదము' - మా క్రొత్త E Book ఈరోజు విడుదలైంది

రేపు బుద్ధపౌర్ణమి. బుద్ధభగవానుని నేను ఎంతగానో ఆరాధిస్తాను. ఆయనంటే పడని చాందస హిందువులకు చాలామందికి ఇదే కారణంవల్ల నేను దూరమయ్యాను. అయినా సరే, నేను సత్యాన్నే ఆరాధిస్తాను గాని లోకులని, లోకాన్ని, కాదు. నా సిద్ధాంతాల వల్ల కొందరు వ్యక్తులు నాకు దూరమైతే, దానివల్ల నాకేమీ బాధా లేదు నష్టమూ లేదు. నేను అసహ్యించుకునే వారిలో మొదటిరకం మనుషులు ఎవరంటే - చాందసం తలకెక్కిన బ్రాహ్మణులే. మన సమాజానికి జరిగిన తీరని నష్టాలలో కొన్ని వీరివల్లనే జరిగాయి.

బుద్ధుని వ్యతిరేకించిన వారిలోనూ, అనుసరించిన వారిలోనూ బ్రాహ్మణులున్నారు. ఛాందసులు ఆయన్ను వ్యతిరేకిస్తే, నిస్పక్షపాతంగా ఆలోచించే శక్తి ఉన్న బ్రాహ్మణులు తమ వైదికమతాన్ని వదలిపెట్టి 2000 ఏళ్ళ క్రితమే ఆయన్ను అనుసరించారు. విచిత్రంగా - బుద్ధుని ముఖ్యశిష్యులలో చాలామంది బ్రాహ్మణులే. అయితే, వైదికమతంలా కాకుండా, ఆయన బోధలు కులాలకతీతంగా అందరినీ చేరుకున్నాయి. అందరికీ సరియైన జ్ఞానమార్గాన్ని చూపాయి. అదే బుద్ధుని బోధల మహత్యం.

కులానికీ మతానికీ బుద్ధుడు ఎప్పుడూ విలువనివ్వలేదు. సత్యానికే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. గుణానికీ, శీలానికీ, ధ్యానానికీ, దు:ఖనాశనానికీ ప్రాధాన్యతనిచ్చాడు. చాలామంది నేడు నమ్ముతున్నట్లుగా 'అహింస' అనేది ఆయన యొక్క ముఖ్యబోధన కానేకాదు. అయితే ఈ సంగతి చాలామందికి తెలియదు.

బుద్ధుని యొక్క ముఖ్యమైన బోధలన్నీ త్రిపిటకములలో ఉన్నాయి. ఆయా బోధలన్నీ ఈ దమ్మపదము (ధర్మపదము) అనే గ్రంధంలో క్రోడీకరింపబడి మనకు లభిస్తున్నాయి. 2000 సంవత్సరాల నాటి ఈ పుస్తకం మనకు ఇంకా లభిస్తూ ఉండటం మన అదృష్తం. దీనికి తెలుగులో వ్యాఖ్యానాన్ని వ్రాయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా బుద్ధుని అసలైన బోధనలు ఏమిటన్న విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు.

పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పూజలు చేస్తూ, లలితా పారాయణాలు, విష్ణు సహస్రపారాయణాలు చేస్తూ ఉండే బ్రాహ్మణులు ఎందఱో మనకు కనిపిస్తారు. కానీ సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలి? మనసును మాటను చేతను ఎలా శుద్దంగా ఉంచుకోవాలి? అన్న విషయం మాత్రం వీరిలో చాలామందికి తెలియదు. ఇలాంటివారు బ్రాహ్మణులు అన్న పేరుకు తగరు. బ్రాహ్మణవంశంలో పుట్టిన చీడపురుగులు వీరంతా.

నిజమైన బ్రాహ్మణుడు ఎవరో వివరిస్తూ బుద్ధుడు అనేక సందర్భాలలో చెప్పిన మాటలు ఈ పుస్తకంలోని 26 అధ్యాయంలో వివరించబడ్డాయి. ఆయా నిర్వచనాలతో నేటి బ్రాహ్మణులలో ఎవరూ సరిపోరు. కనుక వీరంతా కులబ్రాహ్మణులే కాని నిజమైన బ్రాహ్మణత్వం వీరిలో లేదని నేను భావిస్తాను.

అసలైన జీవితసత్యాలను బుద్దుడు నిక్కచ్చిగా చెప్పాడు. అందుకే ఆయన్ని మన దేశంలోనుంచి తరిమేశాం. దశావతారాలలోని బలరాముణ్ణి తీసేసి ఆ స్థానంలో బుద్ధుడిని కూచోబెట్టి చేతులు దులుపుకున్నాం. కానీ బుద్ధుని బోధనలను మాత్రం గాలికొదిలేశాం. అంతటి ఘనసంస్కృతి మనది !

బుద్ధుని బోధలనే ఆయన తదుపరి వచ్చిన కొన్ని ఉపనిషత్తులూ, పతంజలి యోగసూత్రాలూ, భగవద్గీతా నిస్సిగ్గుగా కాపీ కొట్టాయి. క్రీస్తు బోధలు కూడా చాలావరకూ బుద్దుని బోధలకు కాపీలే. అయితే తన పూర్వీకులు అనుసరించిన యూదు మతాన్ని కూడా బుద్ధుని బోధలకు ఆయన కలిపాడు. అంతే తేడా ! కానీ బుద్ధుని పేరును మాత్రం హిందూమతం గాని, క్రైస్తవం గాని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది ఆయా మతాలు చేసిన సిగ్గుమాలిన పనిగా నేను భావిస్తాను. నేను హిందువునే అయినప్పటికీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఈ విషయాన్ని నేను సతార్కికంగా నిరూపించగలను.

అప్పటివరకూ లేని ఒక క్రొత్తమార్గాన్ని బుద్ధుడు తను పడిన తపన ద్వారా, తన సాధనద్వారా ఆవిష్కరించాడు. లోకానికి దానిని బోధించాడు. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఇప్పటికి కొన్ని కోట్లమంది జ్ఞానులైనారు. పరమస్వేచ్చను, బంధ రాహిత్యాన్ని, దుఖనాశనాన్ని పొందారు. 

బుద్ధభగవానుని ఉపదేశసారమైన 'ధర్మపదము' కు నేను వ్రాసిన వ్యాఖ్యానాన్ని E - Book రూపంలో ఈరోజున విడుదల చేస్తున్నాను. తెలుగులో ఇలాంటి పుస్తకం ఇప్పటివరకూ లేదని నేను గర్వంగా చెప్పగలను. త్వరలోనే దీని ఇంగ్లీష్ వెర్షన్ మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రింట్ పుస్తకం రేపు బుద్ధపౌర్ణిమ నాడు జిల్లెళ్ళమూడిలో అమ్మ పాదాల సమక్షంలో విడుదల అవుతుంది.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకెంతో సహాయపడిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీల డిజైన్ అధ్బుతంగా చేసి ఇచ్చిన నా శిష్యుడు ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం google play books నుండి లభిస్తుంది.