నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

18, జులై 2019, గురువారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 37 (మహిమలు అల్పవిశ్వాసుల కోసమే)

జిల్లెళ్ళమూడి అమ్మగారి దగ్గర ఒకాయన ఉండేవాడు. చాలాకాలం అమ్మను నమ్ముకుని ఉన్నప్పటికీ ఆయన జీవితంలో ఎప్పుడూ ఏ మహిమా, ఏ అద్భుతమూ జరగలేదు. చాలామంది భక్తులు మాత్రం అమ్మ దగ్గరకు వచ్చి, "మిమ్మల్ని నమ్మాక, ప్రార్దించాక, మాకీ అద్భుతం జరిగింది. మా జీవితంలో ఈ మహిమలు జరిగాయి' అంటూ రకరకాలైన సంఘటనలు చెబుతూ ఉండేవారు. అవన్నీ వినీ వినీ, 'ఒకవేళ తనలో ఏదైనా లోపం ఉందేమో? అందుకే తనకు ఏ అధ్బుతమూ జరగడం లేదని ' ఆయనకు అనుమానం వచ్చింది.

ఈ విషయమై అమ్మనే ఒకరోజున అడిగాడాయన.

'అమ్మా ! అందరూ వారి వారి జీవితాలలో ఎన్నెన్నో మహిమలు జరిగాయని చెబుతున్నారు. మరి నాకేమీ అలాంటి నిదర్శనాలు కనిపించడం లేదు. ఏంటిది?'

దానికి అమ్మ ఇలా జవాబిచ్చారు.

'విశ్వాసం లేనివాళ్ళకోసమే మహిమలు. అవి నీకెందుకు ?'

అమ్మ చెప్పిన ఈ మాటలో ఎంతో లోతైన అర్ధముంది. నేటి లోకానికి చెంపపెట్టు లాంటి మహత్తరమైన బోధ దాగి ఉంది. ఎందుకంటే నేటి భక్తులూ, మతాలూ అన్నీ ఆశిస్తున్నదీ, గొప్పగా చెబుతున్నదీ ఈ అద్భుతాలు మహిమల గురించే. కానీ నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతాలకు ఏమాత్రం విలువ లేదు.

అల్పవిశ్వాసుల విశ్వాసాన్ని ఎక్కువ చెయ్యడం కోసమే, మహనీయుల చేత మహిమలు చూపించబడతాయి. కాకపోతే, అలా మహిమలు చెయ్యడం వల్ల, అసలైన ప్రయోజనం నెరవేరక పోగా, ఎవరికోసమైతే ఆ మహిమలు చేశారో, వారు ఇంకా ఇంకా బురదలో కూరుకుపోయే ప్రమాదమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

ఇదెలా జరుగుతుందంటే - ఆ మహనీయులు చెబుతున్న మార్గం మీద దృష్టి తగ్గి, వారి మహత్యం మీద ధ్యాస ఎక్కువౌతుంది. దాని ఫలితంగా - "మనం ఎలా ఉన్నా పరవాలేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏదన్నా ఉపద్రవం వచ్చినపుడు 'గీ' పెడితే ఆ కష్టాన్ని ఆయనే తీరుస్తాడు. కానీ ఆయన చెప్పినట్లు మనం ఉండవలసిన పనిలేదు. మన జీవితంలో మనిష్టం వచ్చినట్లు ఉండవచ్చు. ఆయన పటానికి పూజ చేస్తే చాలు" అనే దరిద్రపు మైండ్ సెట్ అలవాటు అవుతుంది ఈ భక్తులకు. ఇదే అతిపెద్ద ప్రమాదం. ప్రపంచం మొత్తంమీద భక్తులందరూ ఎక్కడ చూచినా ఇదే దరిద్రపు ఊబిలో దిగిపోయి ఉన్నారు.

'నేనెలా బ్రతికినా పరవాలేదు. ఎంత అధర్మంగా, ఎంత అవినీతిగా బ్రతికినా పరవాలేదు. దేవుణ్ణి నమ్మితే చాలు, లేదా ఎవడో ఒక గురువును నమ్మితే చాలు. ఇక నాకన్నీ విజయాలే." అనే మైండ్ సెట్ నేడు అందరిలోనూ ఉంది. ఆధ్యాత్మికలోకంలో ఇదే అతిపెద్ద ప్రమాదం.

ఇది ఆ మహనీయులకు తీవ్రమైన నిరాశను కలిగిస్తుంది. "నేను ఇన్నాళ్ళ బట్టీ చేస్తున్న బోధల ఫలితం ఇదా?" అని వారికి చాలా నిరుత్సాహమూ నిర్లిప్తతా కలుగుతాయి.

అసలు, అధ్బుతాలను, మహిమలను ఆశించడం ఒక పెద్ద తప్పు మాత్రమే కాదు, అది దురాశకు, అహంకారానికి చిహ్నం కూడా. ఏమీ చెయ్యకుండా తేరగా ఏదో కొట్టెయ్యాలని అనుకోవడమే దురాశ. "నేనింత భక్తుడిని, నాకు ఏదో అద్భుతం తప్పకుండా జరుగుతుంది. దేవుడు నన్ను కాకుంటే ఇంకెవరిని కరుణిస్తాడు?" అనుకోవడమే అహంకారం. నేటి సోకాల్డ్ భక్తులలో, ముఖ్యంగా షిర్డీ సాయిబాబా భక్తులలో ఈ చెడు లక్షణాలు చాలా ఎక్కువగా ఉండటాన్ని మనం గమనించవచ్చు.

నిజమైన భక్తునికి, నిజమైన విశ్వాసికి ఏ అద్భుతాలతోనూ పని లేదు. ఏ మహిమలనూ అతడు ఆశించకూడదు. ఏదో ఆశించి అతడు ఏ పూజలనూ చెయ్యకూడదు. ఇదే నిజమైన భక్తుని లక్షణం.

జిల్లెళ్ళమూడి అమ్మగారు చెప్పిన మాటలో ఏంతో గొప్ప అర్ధం ఉంది. నేటి లోకానికి చెంప చెళ్ళుమనిపించే మహత్తరమైన బోధన దాగుంది.

'అల్పవిశ్వాసులకోసమే మహిమలుగాని, అవి నీకెందుకు?' అంది అమ్మ. నిజమే కదూ !

కానీ, అమ్మ దగ్గర ఎంతోకాలం ఉండి ఆమె బోధనలు విని, తరువాత ఆమెకు దూరమై వేరే కుంపట్లు పెట్టుకుని గురువులుగా స్వామీజీలుగా సిద్దులుగా చెలామణీ అవుతున్న చాలామంది నేడు చేస్తున్న పని  ఏంటంటే - నోరుతెరిస్తే చాలు అద్భుతాలను, మహిమలను చెబుతూ ఊదరగొట్టడం.

అమ్మ దేనినైతే చెప్పిందో దాన్ని గాలికొదిలేసి, దేనినైతే వద్దన్నదో దానినే అనుసరిస్తున్నారు వీరందరూ !

చివరకి, నేటి అమ్మ భక్తులలో కూడా ఎక్కువమంది అమ్మ చేసిన మహత్యాల మీదే కధలు చెబుతున్నారు గాని, అమ్మ తాత్వికచిన్తననూ, అమ్మ జీవనవిధానాన్నీ చెప్పడం లేదు. తమతమ జీవన విధానాలలో అమ్మను ఏమాత్రమూ అనుసరించడం లేదు.

మాయాప్రభావం అంటే ఇది కాకపోతే మరేంటి?

వీరిలో అల్పవిశ్వాసులు ఎంతమంది? నిజమైన భక్తులు ఎంతమంది?