Pages - Menu

Pages

29, ఆగస్టు 2019, గురువారం

ప్రస్తుతం నేను హైదరాబాద్ వాసిని

ఉద్యోగం హైదరాబాద్ కు మారడంతో, ఒక నెలనుంచీ నా నివాసం కూడా హైదరాబాద్ లోనే. తార్నాక దగ్గరలోనే ఉంటున్నాను. ఉద్యోగమూ, కుటుంబమూ, మిగతా విషయాలూ ఎలా ఉన్నప్పటికీ, ఈ మార్పుతో నా జీవితంలోనూ, మా సంస్థలోనూ ముఖ్యమైన అనుబంధ మార్పులు కొన్ని జరుగబోతున్నాయి.

నా హైదరాబాద్ శిష్యులూ అభిమానులూ కొన్నేళ్ల నుంచీ నన్ను హైదరాబాద్ రమ్మని కోరుతున్నారు. అది ఇప్పటికి జరిగింది. ఎందుకంటే, నేను పెడుతున్న స్పిరిట్యువల్ రిట్రీట్లూ, యాస్ట్రో వర్క్ షాపులూ, యోగా కేంపులూ,  హోమియో క్లాసులూ, మార్షల్ ఆర్ట్స్ క్లాసులూ అన్నీ హైద్రాబాద్ లోనే పెడుతున్నాను. దానికోసం నేను గుంటూరు నుంచి రావడం జరుగుతోంది. మాటమాటకీ అలా రావడం కుదరడం లేదు. ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను గనుక ఇకమీద  ప్రతి వీకెండూ ఒక సమ్మేళనమే. ఈ మార్పువల్ల ఇక్కడ ఉన్న నా శిష్యులకూ నాకూ చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే 'పంచవటి' లో నూతన అధ్యాయం మొదలైందని అంటున్నాను.

మా సాధనా సమ్మేళనాలు ఇకమీద ప్రతివారమూ మా ఇంటిలోనే జరుగుతాయి. నిజంగా సాధన చేయాలనుకునేవారికి ఇది సువర్ణావకాశం. అందుకున్నవారికి అందుకున్నంత ఇస్తాను. తెలుసుకోవాలనుకునేవారికి వారు కోరినంత చెబుతాను. నాతో నడిస్తే, చెయ్యి పట్టి నడిపిస్తాను. నాతో కలసి ఎక్కువకాలం గడపాలని, జ్యోతిష్య - యోగ - తంత్ర రహస్యాలను తెలుసుకోవాలని, వాటిలో సాధన చెయ్యాలని అనుకునేవారికి ఇది మళ్ళీమళ్ళీ రాని అవకాశం. మినిమమ్ ఒక ఏడాది నేను ఇక్కడే ఉంటాను. అందుకే నా హైదరాబాద్ శిష్యులు ప్రస్తుతం మహా ఉత్సాహంగా ఉన్నారు.

'ఎలా ఉంది హైదరాబాద్?' అని మిత్రులు అడిగారు. 'ఎలా ఉంటుంది? ఎప్పటిలాగానే ఉంది. హైదరాబాద్ నాకేమీ కొత్త కాదు.  నలభై ఏళ్ల నించీ తెలుసు' అని చెప్పాను. అయితే అప్పటికీ ఇప్పటికీ వాతావరణం బాగా పాడయింది. గాలిలో దుమ్మూ, పొగా పెరిగాయి. ఎండలో వేడి పెరిగింది. జీవితాలలో వేగం పెరిగింది. మానవ సంబంధాలు తగ్గిపోయి జీవితాలు యాంత్రికం అయిపోయాయి. ఉరుకులు పరుగులు ఎక్కువయ్యాయి. బాంధవ్యాలు ప్రేమలు ఉన్నా, మనుషులు ఒకరినొకరు కలవలేని పరిస్థితి. జీవనపోరాటం ప్రధమస్థానాన్ని ఆక్రమించింది. అన్నింటికంటే డబ్బే ముఖ్యం అయిపోయింది. ఇంతే అప్పటికీ ఇప్పటికీ మార్పు' - అని చెప్పాను.

అదంతా ఎలా ఉన్నప్పటికీ, నాకేమీ సంబంధం లేదు. అది గుంటూరైనా, హైదరాబాద్  అయినా, ఇండియా అయినా అమెరికా అయినా - నా జీవనవిధానం ఒక్కలాగానే ఉంటుంది.  ఏమీ తేడా ఉండదు. సమాజంతోనూ దానిలో వస్తున్న మార్పులతోనూ నాకు సంబంధం ఉండదు. నాలోకం నాది గనుక ఇబ్బంది లేదు.

అటూ ఇటూ మారడంతో గత నెలరోజులుగా వెనుక పడిన నా కార్యక్రమాలు, వ్రాతలు, ఉపన్యాసాలు, పాటలు, అభ్యాసాలు ఇక మళ్ళీ మునుపటి కంటే వేగంగా మొదలు కాబోతున్నాయి. వచ్ఛే వారం నుంచీ వీక్లీ రిట్రీట్స్ మొదలు కాబోతున్నాయి. వాటిల్లో నా శిష్యులను అనేక విద్యలలో ప్రాక్టికల్ గా గైడ్ చేయబోతున్నాను. నాతో కలసి ప్రతిరోజూ ధ్యానం చేసే అవకాశం వారికిప్పుడు లభిస్తున్నది. నాతో యోగా చేసే అవకాశమూ, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసే అవకాశమూ లభిస్తున్నాయి. నా ఆధ్యాత్మిక పయనం ఇప్పుడు మరింత రాకెట్ స్పీడుతో ముందుకు పోబోతోంది. అందుకే 'పంచవటిలో ఇది కొత్త అధ్యాయం' అంటున్నాను. కొంతమంది ఇన్నర్ సర్కిల్ శిష్యులు ఇప్పటికే నన్ను రెగ్యులర్ గా కలుస్తున్నారు.

ఈ ప్రయాణంలో నాతో కలసి నడిచే ధైర్యమూ తెగింపూ ఉన్న నా మిగతా శిష్యులకు కూడా బ్లాగుముఖంగా స్వాగతం పలుకుతున్నాను. నేను హైదరాబాద్ వచ్చాక జరిగే మన మొదటి సమ్మేళనం త్వరలో ఉంటుంది. గమనించండి.