Pages - Menu

Pages

30, ఆగస్టు 2019, శుక్రవారం

మార్షల్ ఆర్ట్స్ ఎలా అభ్యాసం చెయ్యాలి?

మార్షల్ ఆర్ట్స్ లో అనేక రకాలున్నాయి. మన దేశంలో పుట్టి అనేక దేశాలకు విస్తరించి ఇప్పుడు అక్కడి నేషనల్ స్పోర్ట్స్ గా, నేషనల్ మార్షల్ ఆర్ట్స్ గా గుర్తింపు పొందిన అనేక విద్యలు అతి ప్రాచీనకాలంలో ఇక్కడ పుట్టినవే. అయితే, మిగతా అన్ని విద్యలలాగే, ఇవి కూడా, మన నిర్లక్ష్యధోరణి వల్ల మనవి కాకుండా పోయాయి. ఇదే మనకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి.

మార్షల్ ఆర్ట్స్ లో స్థూలంగా చూస్తే, తూర్పు దేశాల విద్యలు, పశ్చిమ దేశాల విద్యలు అని రెండు గ్రూపులుగా ఉన్నాయి. తూర్పువి - కలారిపయత్, వర్మకలై, సిలంబం, కుంగ్ ఫూ, తాయ్ ఛి, బాగ్వా, జింగ్ యి, కరాటే, టైక్వోన్ డో, హ్వరాంగ్ డో, జుజుట్సు, సుమో, జూడో, ఐకిడో, కెండో, నింజుత్సు,కాలి సిలాట్, తాయ్ బాక్సింగ్ మొదలైనవి. పశ్చిమపు విద్యలు - కుస్తీ, బాక్సింగ్, ఫెన్సింగ్ మొదలైనవి.

లోకంలో ఉన్న ఒక భ్రమ ఏంటంటే - మార్షల్ ఆర్ట్స్ చేసేవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు అని. ఇది నిరాధారమైన నమ్మకం. సినిమాలు, యాడ్స్ చూసి జనం అలా అనుకుంటూ ఉంటారు. ఇది నిజం కాదు. ఒక భ్రమ మాత్రమే.

ఉదాహరణకు బ్రూస్ లీ 33 ఏళ్ళకే అనేక రోగాలతో చనిపోయాడు. ఒయామా అరవై దాటి బ్రతికినా, లంగ్ కేన్సర్ తో పోయాడు. మహమ్మద్ అలీ పార్కిన్సన్ డిసీస్ తో పోయాడు. ఇదే విధంగా ప్రఖ్యాత  అథ్లెట్లు చాలామంది పెద్ద వయసులో అనేక రోగాల బారిన పడ్డారు. కారణాలు ఏమిటి?

కండలు పెంచడం మీద ఉన్న శ్రద్ధ ప్రాణశక్తి మీద పెట్టకపోవడమే దీనికి కారణం. నేటి జిమ్ కల్చర్ కూడా కండలనే ప్రోత్సహిస్తోంది. ఇది చాలా పొరపాటు విధానం. జిమ్ చేసేవారు దానిని మానేశాక ఒళ్ళు విపరీతంగా పెరుగుతుంది. దానిని కంట్రోల్ చెయ్యడానికి నానా అవస్థలు పడాల్సి వస్తుంది. కండలనేవి వయసులో ఉన్నపుడు మాత్రమె పెంచగలం. పెద్ద వయసులో కండలు ఉండవు. నిలబడవు. పెంచాలని ప్రయత్నిస్తే హార్ట్ ఎంలార్జ్ మెంట్ వంటి ఇతర అనేక రోగాలు రావడం ఖాయం. దీనికి కారణం కండలకు, మేల్ హార్మోన్ కు సూటి సంబంధం ఉండటమే.

ఈ హార్మోన్ కొంత వయసు వచ్చాక బాడీలో పుట్టదు. కనుక పెద్దవయసులో కండలు పెంచడం కుదరదు. కండలు పెంచాలని అనుకునే అమ్మాయి అథ్లెట్లు, బాక్సర్లు కూడా మేల్ హార్మోన్ సప్లిమెంట్లు తీసుకుంటారు. లేకుంటే వారికి కండలు పెరగవు. అలాంటి హార్మోన్స వాడకం వల్ల, వారిలో సహజమైన సౌకుమార్యం లాలిత్యం మాయమై మొగరాయుళ్ళ లాగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటారు. ఇది మరో కోణం. అమెరికా దేశంలో ఇలా అబ్బాయిలలాగా అసహ్యంగా కనిపించే అమ్మాయి అధ్లెట్లను, బాడీ బిల్డర్లను చాలా మందిని చూడవచ్చు. వారు సెలబ్రిటీలు కావచ్చు. కానీ చాలా అసహ్యంగా కనిపిస్తారు.

ప్రసిద్ధ ఆధ్లెట్లూ, బాక్సర్లూ, మార్షల్ ఆర్ట్ రింగ్ యోధులూ, వస్తాదులూ, బాడీ బిల్డర్లూ 35 కి సాధారణంగా రిటైర్ అవుతూ ఉంటారు. కారణం ఇదే. శరీరాన్ని విపరీతంగా కష్టపెట్టే వ్యాయామాలు కొన్నేళ్లు చేస్తే ఆ తర్వాత చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిని వారు తప్పుకోలేరు. ఉదాహరణకు సల్మాన్ ఖాన్ వంటి హిందీ నటులు వయసులో ఉన్నప్పుడు కండలు బాగా పెంచారు. కానీ ఒక వయసు వచ్చాక అవి నిలబడవు. జారిపోతాయి. అప్పుడు వాటిని ఫామ్ లో ఉంచడం వారికి గగనం అవుతుంది. నటులకే కాదు అధ్లెట్స్ కి మార్షల్ ఆర్టిస్టులకీ కూడా అంతే అవుతుంది. అప్పుడు నానా హార్మోన్లు వాడి ఒళ్ళు గుల్ల చేసుకుంటారు. లివరూ, హార్టూ, కిడ్నీలూ పాడౌతాయి.

మార్షల్ ఆర్ట్స్ లో థాయ్ బాక్సింగ్ చాలా భయంకరమైన ఆర్ట్. వాళ్ళు పడీపడీ వ్యాయామాలు చేస్తారు. రాక్షసుల లాగా ఒంటిని రాటు దేలుస్తారు. కానీ వాళ్ళు కూడా 35 తర్వాత రిటైర్ అవుతారు. ఇది ఎవరికైనా తప్పదు. ఆ తర్వాత, మునుపు చేసినట్లు వాళ్ళు వ్యాయామాలు చెయ్యలేరు. అది శరీర ధర్మం అంతే.

ఇదంతా ఎందుకు జరుగుతుంది? కండలు పెంచడం ఒక్కదాని మీదనే దృష్టి పెట్టడం వల్ల ఇది జరుగుతుంది. బ్రూస్లీ కూడా ఇదే అలవాటుకు బలై పోయాడు. 'ఎంటర్ ది  డ్రాగన్' సినిమా సరిగ్గా చూస్తే, ముఖ్యంగా, హాన్ ద్వీపంలో జరిగే చివరి ఫైట్స్ లో, బ్రూస్లీ ఎంత అనారోగ్యంగా ఉన్నాడో తెలుస్తుంది. తనను ఎటాక్ చేయబోయిన ఒకడిని త్రో చేయబోయి బ్రూస్లీ బాలెన్స్ తప్పి తూలడం ఒక సీన్ లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత అతి త్వరలో అతను బ్రెయిన్ ఎడీమా తో చనిపోయాడు.

ప్రాణశక్తి అనేదాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్త కండల మీద దృష్టి పెట్టడం వల్లనే ఇది జరుగుతుంది. నేటి సినిమా హీరోలు కూడా కండలు పెంచడం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. ఇది హాలీవుడ్ హీరోలను చూసి మనవాళ్ళు కాపీ కొట్టడం వల్ల వచ్చిన దరిద్రం. వీళ్ళందరూ ముందు ముందు చాలా అవస్థలు పడతారు.

అందుకనే, భయంకరంగా కండలు పెంచి రింగ్ ఫైట్స్ చేసే యోధుల కంటే, యోగా, తాయ్ ఛీ, బాగ్వా వంటి ప్రాణశక్తి అభ్యాసాలు శ్రద్ధగా చేసేవారు ఆరోగ్యంగా ఎక్కువకాలం బ్రతుకుతారు.

మార్షల్ ఆర్ట్స్ లోని సాఫ్ట్ స్టైల్స్ అన్నీ ప్రాణశక్తి మీదనే దృష్టి పెడతాయి. అందుకనే వాటిని Internal Martial Arts అంటారు. ఈ విద్యలు అభ్యాసం చేసేవారికి బాడీ బిల్డర్స్ లాగా, బాక్సర్ల లాగా కండలు ఉండవు. కానీ వారి ప్రాణశక్తి మంచి స్థితిలో ఉంటుంది. 90 ఏళ్ళు వచ్చినా అది వారిని ఆరోగ్యంగా ఉంచుతుంది. వారిలో జీవశక్తి ఉట్టిపడుతూ ఉంటుంది.

ఈ సూత్రం బాగా అర్థమైంది గనుకనే, షావోలిన్ టెంపుల్ లో, మధ్యవయసు వరకూ హార్డ్ స్టైల్ కుంగ్ ఫు, ఆ తర్వాత సాఫ్ట్ స్టైల్ కుంగ్ ఫు అభ్యాసం చేసేవారు. ఆరోగ్యంగా ఉండేవారు.

Internal Martial Arts కూ యోగాభ్యాసానికీ పెద్ద తేడా లేదు. ఆహార నియమాలు పాటిస్తూ, ఆసన ప్రాణాయామాలు సరిగ్గా చేస్తే మాత్రమే అన్ని రకాలుగా ఆరోగ్యం బాగుంటుంది. ఎక్కువకాలం హాయిగా బ్రతకడమూ జరుగుతుంది. అంతేగాని, లాంగ్ రన్ లో హార్డ్ ఎక్సర్ సైజులు మంచివి కావు.

బాడీ బిల్డింగ్, కుస్తీ, రన్నింగ్, మొదలైన హార్డ్ వ్యాయామాలు ఒక విధంగా భూతాల వంటివి. మనం ఒకసారి వాటి జోలికి పోతే, ఆ తరువాత మనం వాటిని వదిలినా, అవి మనల్ని వదలవు. బలవంతంగా వదిలించుకుంటే, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కనుక వాటి జోలికి పోకుండా ఉండటం మంచిది.

బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో 'సమ్యక్ వ్యాయామం' అని ఒక దానిని చెబుతాడు. సరియైన వ్యాయామం చెయ్యమని దాని అర్ధం. పెద్దవయసు వరకూ మనలని రక్షించే వ్యాయామాలే మనం చెయ్యాలి గాని, ఇప్పటికిప్పుడు కండలు పెరుగుతున్నాయని చెప్పి, ఒక వయసు దాటాక సమస్యలు తెచ్చేవాటిని చెయ్యకూడదు.

ఈ స్పృహతో మార్షల్ ఆర్ట్స్ అభ్యాసం చెయ్యడం సరియైన విధానం. అప్పుడే ఆయుస్సూ, ఆరోగ్యమూ రెండూ బాగుంటాయి. ఇవి ఉన్నప్పుడు ఆనందంగా బ్రతకడం సాధ్యం అవుతుంది.