నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

24, సెప్టెంబర్ 2019, మంగళవారం

షిరిడీ సాయిబాబా శిష్యుడు దాసగణు మహారాజ్ ఆశ్రమానికి వెళ్ళొచ్చాను







ఉద్యోగపనులలో భాగంగా మహారాష్ట్రలోని ఉమ్రీ స్టేషన్ తనిఖీకి వెళ్ళవలసి వచ్చింది. ఈ స్టేషన్ నాందేడ్ కు 30 కి. మీ దూరంలో ఉంటుంది. పని అయిపోయాక యధాలాపంగా చూస్తే, సాయిబాబా ముఖ్యశిష్యుడైన దాసగణు మహారాజ్ ఆశ్రమం అక్కడకు దగ్గర్లోనే గోరఠీ గ్రామంలో ఉందని తెలిసింది.

నేనా  బోర్డు వైపు చూడటం గమనించి, స్టేషన్ మాస్టర్ ఇలా అన్నాడు - 'ఆశ్రమం బాగుంటుంది సార్. వెళ్ళిరండి.  చాలా దగ్గర. రెండు కి.మీ లోపే ఉంటుంది'. అక్కడి స్టాఫ్ అందరూ సాయిభక్తుల లాగా ఉన్నారు. ఆశ్రమం గురించి గొప్పగా చెప్పారు. దగ్గరే కదా చూద్దామని బయలుదేరాము. 'మధ్యాన్నం ఒంటిగంట దాటింది. ఆశ్రమం మూసేసి ఉంటారు. సాయంత్రం వెళ్ళండి' అని కొంతమంది అన్నారు. వాళ్లకు  ఒక చిరునవ్వును బహుమతిగా ఇచ్చి 'చలో, దర్శన్ కర్కే ఆయేంగే' అన్నాను. 'ప్రత్యేక పూజ చేయిద్దాం' అన్నారు మా స్టాఫ్. ప్రత్యేక పూజ కాదు, అసలుపూజ కూడా వద్దు. నా గురించి మీరేదో గొప్పగా వారికి చెప్పకూడదు. సామాన్య భక్తులలాగా హడావుడి లేకుండా వెళ్లి వద్దాం. నో స్పెషల్ ట్రీట్మెంట్ ప్లీజ్' అని మావాళ్లకు ఖరాఖండిగా చెప్పాను.

కాసేపట్లోనే గోరఠీ గ్రామంలోని ఆశ్రమానికి చేరుకున్నాం. గోరఠీ అనేది చాలా చిన్న ఊరు. ఆ ఊళ్లోకి అడుగుపెడుతూనే ఒక 100 ఏళ్ళు వెనక్కు వెళ్లినట్లు అనిపించింది. అంత కుగ్రామం. ఊరి చుట్టూ పచ్చటి పొలాలు, సమృద్ధిగా నీళ్లు. కోనసీమలోని గ్రామంలాగా అనిపించింది.  గ్రామం మొదట్లోనే ఒక చిన్న గుట్టమీద పెద్ద భవనం కనిపించింది. ఆశ్రమం అదేనేమో అనుకున్నాను. నా సంశయాన్ని గమనించి బైక్ నడుపుతున్న స్టేషన్ మాస్టర్ ఇలా అన్నాడు. 'అది ఆశ్రమం కాదు. ఎమ్మెల్యే ఇల్లు'.  నాకు నవ్వొచ్చింది. అంత కుగ్రామంలో ఎమ్మెల్యే కి అంత రాజభవనమా? మన దేశంలో ప్రజాధనం దోపిడీ ఇంతేనేమో అనిపించింది.

కొంచం దూరంలోనే, వినమ్రంగా ఉన్నా, ఆధ్యాత్మిక తరంగాలను వెదజల్లుతున్న ఆశ్రమం ఉంది. ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంది. కమిటీ మెంబర్లు కొంతమంది, బాంబే నుంచి వఛ్చిన భక్తులు కొంతమంది తప్ప  అందులో ఎవరూ లేరు. ముందువైపున దాసగణు మహారాజ్ సమాధి ఉంది. లోపలగా ఆ ఆశ్రమం స్థాపించిన స్వామి వరదానంద భారతి గారు ఉన్న గది ఉన్నది. ఆ కమిటీ వారికి మా స్టాఫ్ నన్ను పరిచయం చెయ్యబోతుంటే సున్నితంగా వారించాను. స్టాఫ్ అంతా ఇక్కడివారేనని నేనుమాత్రం హైదరాబాద్ నుంచి వచ్చానని చెప్పాను.

దాసగణు గారు 1962 లో చనిపోయారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించిన వరదానంద భారతి గారు 2002 లో ఉత్తరకాశీలో చనిపోయారట. స్వామీజీ గారి గదిలో ఒక ఫోటో చూశాము. కొండల మధ్యన ఒక రాతిమీద కూర్చుని ఉన్న చతుర్భుజ మహావిష్ణువు చిత్రం అది. మామూలుగా మనం ప్రతిచోటా చూచే చిత్రం కాదది. నేను దానివైపు తదేకంగా చూడటం గమనించి ఆశ్రమాన్ని మాకు చూపిస్తున్న పదహారేళ్ళ పూజారి ఇలా అన్నాడు. ' భగవంతుడు స్వామీజీకి అలా దర్శనం ఇచ్చారు. ఆయన చెప్పినట్లు ఆ చిత్రం గీశారు.'

స్వామీజీ గదిలో ఆయన నిలువెత్తు చిత్రం ఉన్నది. పక్కన ఉన్న గదిలో రాక్స్ నిండా ప్రాచీన గ్రంధాలున్నాయి. వివేకానందస్వామి, శంకరాచార్య, తుకారాం, విఠోబా చిత్రాలున్నాయి. ఆ గదిలోనే స్వామీజీ నివసించారని చెప్పారు. అక్కడ మంచి శక్తివంతమైన వేదాంత భావనా తరంగాలుండటం గమనించాను. స్వామీజీ డెబ్భైకి పైగా పుస్తకాలు వ్రాశారని పూజారి పిల్లవాడు చెప్పాడు.

దాసగణు మహారాజ్ పోలీసు ఉద్యోగిగా పనిచేసేవాడు. ఎస్సై కావాలని ఆయనకు గట్టి కోరిక ఉండేది. సాయిబాబా మీద అనేక పాటలు పద్యాలు వ్రాసేవాడు. చదువు అబ్బకపోయినా, పెద్దల నుంచి వఛ్చిన జీన్స్ ప్రభావమో ఏమోగాని 'తమాషా' అనే పల్లెపదాలలో అలవోకగా ఆశుకవితలు చెప్పేవాడు. సాయిబాబాను విష్ణువు, శివుడు, అని తన పాటల్లో పొగిడినా, ఆయనంటే గట్టి నమ్మకం లోలోపల ఉండేది కాదు. ఆ సంగతి సాయిబాబాకూ తెలుసు. సాయిబాబా ఒక ముస్లిం అని, తాను శుద్ధ బ్రాహ్మణవంశంలో పుట్టానని కొంచం తిరస్కార భావం ఆయనకు లోలోపల ఉండేది.

దాసగణు జీవితంలో సాయిబాబా అనేక అద్భుతాలు చేశాడు. ఎన్నోసార్లు అతని ప్రాణాలను రక్షించాడు. ఉద్యోగం పోయే పరిస్థితుల నుంచి రక్షించాడు. 'పోలీసు ఉద్యోగం మానుకో' అని సాయిబాబా అనేకసార్లు దాసగణుకు చెప్పాడు. దాసగణు వినేవాడు కాదు. 'ఫౌజుదార్ (ఎస్సై) అయ్యాక ఉద్యోగం వదిలేస్తా' అని దాసగణు, సాయిబాబాకు చెప్పేవాడు. కొన్నాళ్ళపాటు ఆ అధికారమూ హోదా చెలాయించాలని ఆయనకు కోరిక ఉండేది. చివరకు ఒక కేసులో ఇరికించబడి 32 రూపాయల కోసం  ఉద్యోగం మానుకోవలసిన పరిస్థితి వచ్చింది. మానుకున్నాడు. 'మంచిగా చెబితే నువ్వు వినడం లేదు. ముల్లుతో గుచ్చితే గాని వినవన్నమాట' అని సాయిబాబా ఈయనతో అన్నాడు.

బాసర దగ్గర గోదావరి ఉంది. నాందేడ్ లో కూడా ఉంది. గోదావరి అంటే దాసగణుకు భక్తి. గంగామాయి అని గోదావరిని పిలిచేవాడు. 'గోదావరిలో స్నానం చేసి వస్తానని' ఒకరోజున సాయిబాబాతో అన్నాడు దాసగణు. 'గోదావరి కోసం ఎక్కడికో పోవడం ఎందుకు. అది ఇక్కడ లేదా?' అన్నాడు బాబా. అలా అంటూ తన పాదాలనుండి గోదావరి నీటిధారను పుట్టించాడు. దాసగణు ఆ నీటిని నెత్తిన చల్లుకున్నాడు. సాయిబాబా మౌనంగా ఊరుకున్నాడు. కానీ సాయిబాబా గతించిన కొన్నేళ్ళకు దాసగణు ఇంకొక మహాత్ముడిని కలిశాడు. ఆయన ఇలా అన్నాడు 'నీవు సాయిబాబా భక్తుడివి, ఆయన దేవుడంటూ నువ్వు పాటలు వ్రాశావు. కానీ నీకు ఆయనంటే నిజమైన భక్తి లేదు'. దాసగణు బిత్తరపోయాడు. ఆ మహాత్ముడు కొనసాగించాడు. 'నీకోసం సాయిబాబా తన పాదాలనుండి గోదావరిని సృష్టించాడు. నీవా నీటిని నెత్తిన చల్లుకున్నావే గాని, లోపలకు త్రాగలేదు. సాయిబాబా ఒక ముస్లిం అని నీకు లోలోపల కొంత తిరస్కార భావం ఉంది. అందుకే నువ్వా నీటిని తీర్థంగా తీసుకోలేకపోయావు'. సాయిబాబా గతించిన అనేక సంవత్సరాల తర్వాత, ఆ విధంగా తాను చేసిన తప్పు దాసగణుకు అర్ధమైంది.

ఇలాంటి సంఘటనలు దాసగణు జీవితంలో చాలా జరిగాయి. దాసగణు, నానాసాహెబ్ చందోర్కర్ ఇద్దరూ సాయిబాబా ముఖ్యభక్తులు. దాసగణు మహరాజ్ యొక్క వస్త్ర సమాధి ఇక్కడ గోరఠీ గ్రామంలో ఉంది. 'వస్త్ర సమాధి' అంటే ఏమిటి? అని అక్కడివాళ్లను అడిగాను. ఆయన శరీరాన్ని సాంప్రదాయ బద్దంగా దహనం చేశారు. ఆయన వస్త్రాన్ని మాత్రం ఇక్కడ ఉంచి సమాధి కట్టారు అని అక్కడి పూజారి చెప్పాడు.

దాసగణు ఒక హరికథా భాగవతార్ వంటి కళాకారుడు. ఆశువుగా ఎన్నో పాటలు పద్యాలు పాడుతూ ఏడెనిమిది గంటల పాటు శ్రోతలను ఆయన రంజింపజెయ్యగలిగేవాడు. తాను అలా ఇఛ్చిన అనేక ప్రోగ్రాములలో, స్టేజిమీద ఒకవైపున సాయిబాబా ఫొటో ఉంచి, ఆయన మహిమలు. లీలలు, దైవత్వం గురించి చెప్పేవాడు. అవి విని వేలాదిమంది సాయిబాబా దర్శనార్ధం వచ్చేవారు. ఆ విధంగా సాయిబాబాను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో ప్రముఖ పాత్ర వహించాడు దాసగణు. విజయదశమి నాడు షిరిడీలో జరిగే ఉత్సవంలో మొదటి నివేదనగా ఈ ఊరిలోని దాసగణు ఆశ్రమం నుండి వెళ్లిన నివేదననే సమర్పిస్తారని అక్కడి వారు నాకు చెప్పారు. బాంబే నుంచి వచ్చిన కొందరు మహిళా భక్తులు అక్కడ కనిపించారు. మౌనంగా  వచ్చేస్తున్న మమ్మల్ని ఆగమని చెప్పి, డైమండ్ కోవా శ్వీట్ ను మాకు ప్రసాదంగా ఇచ్చారు. బాబా ఆశీస్సులుగా భావించాం.

కాసేపు అక్కడ కూర్చుని తిరిగి ఉమ్రీ స్టేషన్ కు చేరుకున్నాం. సాయంత్రం వరకు వెళ్లిన పని ముగించుకుని, తిరుగు రైలెక్కి మల్కాజిగిరి స్టేషన్లో దిగాను. ఆ విధంగా సాయిబాబా ముఖ్య భక్తుడైన దాసగణు సమాధిని అనుకోకుండా సందర్శించాను. 'అనుకోకుండా జరిగేదే అనుగ్రహం' అని జిల్లెళ్ళమూడి అమ్మగారు అనలేదా మరి?