Pages - Menu

Pages

21, డిసెంబర్ 2019, శనివారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (వివాహ ముహూర్తాలు)

నేడు బంపర్ గా సాగుతున్న రెండు వ్యాపారాలేవంటే జ్యోతిష్యమూ, వాస్తులే. టీవీ పెడితే చాలు రకరకాల బిరుదులున్న జ్యోతిష్కులు ఊదరగొడుతూ కనిపిస్తారు. పత్రిక పేజీ తిప్పితే చాలు, జ్యోతిష్యమూ, వాస్తుల గురించి ప్రశ్నలు సమాధానాలు కనిపిస్తాయి. రోడ్డుమీద ఎక్కడ చూసినా పెద్దపెద్ద బోర్డులు కన్పిస్తాయి. వెరసి సమాజంలో ఇవి రెండూ బాగా చెలామణీ అవుతున్నాయని అందరికీ తెలుసు.

కానీ, నేడు సమాజంలో చలామణీ అవుతున్న జ్యోతిష్యం నిజమైనదేనా? వాస్తు నిజమైనదేనా అంటే, 'కాదంటే కాదని' నేనంటాను. నేటి జ్యోతిష్కులు చెబుతున్న జ్యోతిష్యమూ తప్పే, వాస్తుశాస్త్రజ్ఞులు చెబుతున్న వాస్తూ బూటకమే అని బల్లగుద్ది మరీ చెబుతాను. నా ఈ వాదనకు ఆధారాలు జ్యోతిశ్శాస్త్ర ప్రామాణిక గ్రందాల నుంచి, శ్లోకాల నుంచి వందలకొలది చూపించగలను. మిగతా పూర్తి వివరాలకు త్వరలో రాబోతున్న నా పుస్తకం 'జ్యోతిశ్శాస్త్ర రహస్యాలు' చదవండి !

ప్రస్తుతానికి మాత్రం, అందరికీ తెలిసిన కొన్ని విషయాలనుంచి చిన్నచిన్న ఉదాహరణలతో నేను చెబుతున్నది నిజమే అని నిరూపిస్తాను.

వివాహ ముహూర్తాలు

మీరు ఏ పంచాంగం తిరగేసినా, వివాహ ముహూర్తాలు కనిపిస్తాయి. ఒక రోజున ముహూర్తం ఉంటె, ఆ రోజున ఆ ముహూర్తానికి వేల కొలది పెళ్ళిళ్ళు జరుగుతాయి. మరి ఆ వేల పెళ్ళిళ్ళలో అన్ని కాపురాలూ అన్నివిధాలుగా బాగుండాలి కదా? ధనకనక వస్తు వాహనాలతో, అన్యోన్య దాంపత్యంతో, దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి కదా? ఎందుకని అలా ఉండటం లేదు? 

ఖచ్చితంగా వీటిల్లో కొన్ని పెళ్ళిళ్ళు మాత్రమే సక్సెస్ అవుతాయి. కొన్ని చెడిపోతాయి. వీరిలో కొంతమంది చనిపోతారు. కొంతమంది విడాకులు తీసుకుని విడిపోతారు. కొంతమంది తిట్టుకుంటూ కొట్టుకుంటూ సంసారం చేస్తూ ఉంటారు. మరికొంతమందికి పిల్లలు ఉండరు. కొంతమందికి పెళ్లి అయిన వెంటనే పెద్దలు గతిస్తారు. లేదా ఏవేవో అశుభాలు జరుగుతాయి. మరికొంతమంది, పది ఇరవై ఏళ్ళు సంసారం చేసి, పిల్లల్ని కని, ఆ తరువాత డైవోర్స్ తీసుకుని విడిపోతుంటారు. మరికొంతమంది ఒకరు గాని, ఇద్దరూ గాని, extra marital affairs నడుపుతూ ఉంటారు.

ఇదంతా ఏమిటి? అన్నీ చూసి, అన్ని లెక్కలూ వేసి, మంచి సుముహూర్తంలో చెయ్యబడిన పెళ్ళిళ్ళు ఇలా ఎందుకు అవుతున్నాయి? అన్న ప్రశ్నకు ఏ పురోహితుడు గాని, ఏ జ్యోతిష్కుడు గాని, ఏ పంచాంగకర్త గాని జవాబు చెప్పలేడు. ఎందుకంటే, వాటికి అసలైన జ్యోతిష్యం తెలియదు కాబట్టి ! వారికి తెలిసిన జ్యోతిష్యమూ, తెలుసని అనుకుంటున్న జ్యోతిష్యమూ అసలైనది కాదు కాబట్టి !

నేటి జ్యోతిష్కులు, జ్యోతిశ్శాస్త్రం మీద తపనతో, దానిని మధించిన వాళ్ళు కారు. ఏళ్లకేళ్లు దానిని పరిశోధించినవారూ కారు. అమాయకుల్ని మోసం చెయ్యగా వఛ్చిన డబ్బుమదంతో మదించిన వాళ్ళు మాత్రమే. వీళ్ళకు కావలసింది శాస్త్రం కాదు, ధనం. వీళ్ళకు రీసెర్చి చేసే ఓపిక ఉండదు. Investigative thinking ఉండదు. తపశ్శక్తి అసలే ఉండదు. కనుక, అంత లోతైన రీసెర్చి చెయ్యకుండా, అంత కష్టపడకుండా, ఏవేవో నాలుగు మాటలు బట్టీపట్టి, హోమాలని, పూజలని, లోకాన్ని మోసం చేస్తూ, మార్కెటింగ్ చేసుకుంటూ, పబ్బం గడుపుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. అందుకే వీరు పెట్టె ముహూర్తాలు ప్రాక్టికల్ గా నిలబడవు. వీరు చెప్పే జ్యోతిష్యాలు నిజం అవవు.

ప్రసిద్ధి గాంచిన వేమన పద్యాన్ని గమనించండి.

ఆ || విప్రులెల్ల జేరి వెర్రికూతలు గూసి
సతిపతుల జేర్చి సమ్మతమున
మును ముహూర్తముంచంగ ముండెట్లు మోసెరా?
విశ్వదాభిరామ వినుర వేమ !

ఎంతో జాగ్రత్తగా జాతకాలు చూసి, పంచాంగాలు వెదికి, వాదప్రతివాదాలు చేసి, మంచి ముహూర్తాన్ని నిర్ణయించి, మంగళవాయిద్యాలతో, వేద మంత్రాలతో, వేదాశీర్వచనాలతో పెళ్లి చేస్తే, అది డైవర్స్ వరకూ ఎందుకు పోతోంది? లేదా కాపురం సజావుగా ఎందుకు సాగడం లేదు? రకరకాల అశుభాలు ఎందుకు జరుగుతున్నాయి? అన్న ప్రశ్న ఈ నాటిది కాదు. ఆలోచనాపరులకు ఏనాడో వచ్చింది. దానికి ప్రతిరూపమే ఈ వేమన పద్యం. ఇందులో ఎంతో నిజం ఉంది.

అసలూ, 'గుంపులో గోవిందా' అన్నట్లు సమాజం మొత్తానికీ ఒకే ముహూర్తం ఎలా సరిపోతుంది? జాతకం అనేది వ్యక్తిగతమా సామూహికమా? ఎవడి జాతకం వాడికి చూస్తారా, లేక లోకం మొత్తానికీ ఒకే జాతకం చూస్తారా? ఎవరి జాతకం వారిదైనప్పుడు, ముహూర్తం మాత్రం వ్యక్తిగతం కాదా? అందరికీ ఒకేరోజున పెళ్లి ముహూర్తం ఎలా ఉంటుంది? ఎవరి జాతకాన్ని బట్టి వారికి సరిపోయే మాసంలో, పక్షంలో, వారంలో, తిధి రోజున, లగ్నాన్ని ఎన్నుకొని వివాహ ముహూర్తం పెట్టాల్సిన అవసరం లేదా? గుడ్డిగా పంచాగం చూసి అందులో ఉన్న ముహూర్తాన్ని అడిగిన ప్రతివాడికీ నిర్ణయించడం తప్పు కదా? అన్న ప్రశ్నకు నేటి పంచాంగ కర్తలతో సహా, ఏ జ్యోతిష్కుడూ జవాబు చెప్పలేడు. ఛాలెంజ్ ! చెప్పండి చూద్దాం !

అందుకే నేనేం చెప్తానంటే - నేటి పెళ్లి ముహూర్తాలన్నీ శుద్ధతప్పులే, పొరపాట్లే, తప్పు ముహూర్తాలే అంటాను. ఆ ముహూర్తాలు రాస్తున్న పంచాంగకర్తలకు నిజమైన జ్యోతిష్యం రాదు. పెళ్లి చేయిస్తున్న పురోహితులకు మంత్రాలు తప్ప, జ్యోతిష్యం తెలియదు. చేయించుకుంటున్న వారికి, భయమూ దురాశా తప్ప, బుద్ధి ఉండదు. అందుకే సమాజం ఇలా ఉంది మరి ! కానీ మనం చెబితే ఎవరు వింటారు? 'వినాశకాలే విపరీత బుద్ధి:' అంటే ఇదే కదూ మరి !

కొన్ని మాసాలు వివాహానికి మంచివి కావనడమే అసలైన పెద్దతప్పు. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఏ మాసంలోనైనా వివాహం చెయ్యవచ్చు. దోషం లేదు. శూన్యమాసం అనేది అసలు లేదు. చెడుకాలమూ అంతకంటే లేదు. అనేది నా అభిప్రాయం. ఈ నా అభిప్రాయానికి ప్రాచీన జ్యోతిష్యశాస్త్రపు అండ ఉంది. అనుభవంలో పరీక్షకు నిలిచే సత్తా ఉంది. పంచాగంలో మీరు చూసే ముహూర్తాలకు ఇవి రెండూ లేవు. గమనించండి.

ముహూర్తం అనేది, వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయించాలిగాని, పంచాంగాన్ని బట్టి కాదు. అందరికీ ఒకేరోజున పెళ్ళిళ్ళు చేసే సామూహిక ముహూర్తాలు ఎక్కడా లేవు ఉండవు. కానీ ఏ పంచాగం చూసినా ఇవే మీకు కనిపిస్తాయి. అందరూ వీటినే అనుసరిస్తున్నారు. మోసపోతున్నారు. ఇదే కలిప్రభావం ! ఈ మోసానికి లోను కాకండి. ఈ ఊబిలో ఇరుక్కోకండి.

అసలైన శాస్త్రం తెలియని సో కాల్డ్ ఘనాపాటీలు, జ్యోతిష్యసామ్రాట్లు, టీవీలో ఊదరగొట్టే మాయజ్యోతిష్కులు చెప్పే మాయమాటలకు పడిపోకండి. తప్పుడు ముహూర్తాలకు పెళ్ళిళ్ళు చేసి మీమీ జీవితాలను, మీ పిల్లల జీవితాలను చెడగొట్టుకోకండి !

(ఇంకా ఉంది)