Pages - Menu

Pages

6, జనవరి 2020, సోమవారం

నేటి జ్యోతిష్యమూ, వాస్తూ రెండూ తప్పుల తడకలే - (అమెరికా ముహూర్తాలు)

పాపం మనవాళ్ళు ఎక్కడకు పోయినా చిన్నప్పటినుంచీ నేర్చుకున్న ఆచారాలనూ పద్ధతులనూ అక్కడకు కూడా తీసుకుపోతూ ఉంటారు. ఇది మంచి విషయమే. ఏ దేశానికి పోయినా, మనం మనంగానే ఉండాలి. అయితే, అక్కడి పద్ధతులను కూడా ఆకళింపు చేసుకోవాలి. పాటించాలి. కానీ, లోలోపల మనం మనంగానే ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వం మనదిగా ఉంటుంది. కానీ, దీనిని ఆసరాగా తీసుకుని దొంగ గురువులు, దొంగ జ్యోతిష్కులు, దొంగ పురోహితులు, దొంగ పూజారులు అలాంటివారికి చుక్కలు చూపిస్తున్నారు. ఈ బెడద అమెరికాలో ఉన్న మనవారికి బాగా ఎక్కువగా ఉంటోంది.

పాపం అక్కడున్న మనవాళ్ళు, ఏ శుభకార్యం తలపెట్టుకున్నా, మంచి ముహూర్తం కోసం పురోహితుడినో, జ్యోతిష్కుడినో సంప్రదిస్తారు. అందులోనూ, అమెరికాలో ఉంటున్నారు గనుక, డబ్బులు బాగా ఉంటాయి గనుక, పేరుమోసిన పంచాంగకర్తలకు ఫోన్ చేసో, లేదా టీవీలో కనిపించే జ్యోతిష్కులకు ఫోన్ చేసో, ముహూర్తం పెట్టమని అడుగుతూ ఉంటారు. వీళ్ళు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఆ సమయానికి అమెరికాలో ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారు. పప్పులో కాలేస్తూ ఉంటారు. కానీ అలా కాలేశామని కూడా తెలియనంత స్థితిలో ఉంటారు. వెరసి ఏదో ఒక దుర్ముహూర్తంలో ఆ కార్యక్రమం జరిగిపోతూ ఉంటుంది. వింతగా ఉంది కదూ? నేను చెబుతున్నది పచ్చి నిజం. ఎలాగో వినండి మరి !

ఒక ఉదాహరణ చెప్తాను. విషయం బాగా అర్ధమౌతుంది !

ఒకాయన కూతురూ అల్లుడూ కాలిఫోర్నియా లో ఉన్నారు. వాళ్లకు ఒక పాప పుట్టింది. అన్నప్రాశన ముహూర్తం పెట్టాలి. ఇండియాలో ఉన్న ఒక పేరుమోసిన జ్యోతిష్కుల వారిని ఫోన్లో సంప్రదించారు. ఈయన సింపుల్ గా పంచాంగం చూసి, కాలిఫోర్నియాకీ మనకీ ఉన్న time difference ను తీసేసి, అలా తియ్యగా వచ్చిన అమెరికా టైం కి కార్యక్రమం చేసుకోమని చెప్పాడు. వాళ్ళు చేసుకున్నారు. కానీ అది శుద్ధ తప్పుడు ముహూర్తం ! ఇంతా చేస్తే, ఒక దుర్ముహూర్తంలో ఆ పాప అన్నప్రాశన జరిగింది. ఎలాగో వినండి !

ఏ ముహూర్తమైనా సూర్యోదయకాలం నుంచి లెక్కించాలి. మనకు సూర్యోదయమే అన్నింటికీ ముఖ్యం. ఆ రోజున కాలిఫోర్నియాలో సూర్యోదయం ఎప్పుడౌతుందో లెక్కించి, అక్కడనుంచి లెక్క పెడుతూ ఇష్టసమయానికి ఏ ముహూర్తం ఉన్నదో చూచి ఆ ముహూర్తాన్ని పెట్టుకోవాలి. అంతేగాని, డే లైట్ సేవింగ్ అవర్స్ ని లెక్కలోకి తీసుకోకుండా, సూర్యోదయ సమయాన్ని లెక్కించకుండా, సింపుల్ గా ఇండియా టైం లోనుంచి ఇంత తగ్గించండి సరిపోతుంది అని చెప్పే ముహూర్తాలన్నీ తప్పులే ! ఎందుకంటే, ఇండియాకూ కాలిఫోర్నియాలకూ కాలగణనంలో చాలా తేడాలుంటాయి. ఇవి ముఖ్యంగా సూర్యోదయకాలంలోనూ, దినప్రమాణంలోనూ ఉంటాయి.

కాలగణనం అనేది సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉన్న సమయాన్ని బట్టి లెక్కించబడుతుంది. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో అయితే ఇది 12 గంటలకు అటూ ఇటూ గా ఉంటుంది. కానీ దానికి దూరంగా ఉండే ప్రదేశాలలోనో. లేక దినప్రమాణం  చాలా తక్కువగా ఉండే ప్రాంతాలలోనో ఇది మారిపోతూ ఉంటుంది. కనుక ఆయా దేశాలలోని హోరలు, కాలప్రమాణాలు, లగ్నప్రమాణాలు,  పుష్కరాంశలు మొదలైనవన్నీ మారిపోతాయి.

ఉదాహరణకు, దినప్రమాణం 12 గంటలు ఉండే దేశాలలో మాత్రమే, హోరలు ఒక్కొక్క గంట పాటు ఉంటాయి. అది తగ్గితే ఇవీ తగ్గుతాయి. కానీ జ్యోతిష్కులు ఇది చెప్పరు. అలాగే రాహుకాలం సంగతి చూడండి. దీనిని సామాన్యంగా గంటన్నరగా చూపిస్తారు. ఎందుకంటే 12 గంటలను 8 భాగాలు చేస్తే (ఏడు గ్రహాలు+1 ఖాళీ భాగం) ఒక్కొక్కటి గంటన్నర వస్తుంది గనుక. అదే, పగటి సమయం ఎనిమిది గంటలు మాత్రమే ఉండే దేశాలలో, రాహుకాలం ఒక గంట మాత్రమే ఉంటుంది. ఈ విధంగా అన్ని ముహూర్తాలూ, కాలహోరలూ, ఉపగ్రహసమయాలూ అన్నీ సూర్యోదయాన్ని బట్టి, దినప్రమాణాన్ని బట్టి మారిపోతాయి. ఈ విషయం గుర్తించకుండా, మనకీ ఆ దేశానికీ ఉన్న టైం డిఫరెన్స్ ను బట్టి, ఇండియా టైం లోనుంచి అన్ని గంటలు తగ్గించి, అదే అసలైన ముహూర్తం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్లే. అర్ధమైంది కదూ !

కానీ, నేటి ప్రముఖ టీవీ జ్యోతిష్కులూ, పంచాంగకర్తలూ ఇవే ముహూర్తాలను అమెరికా వారికి పెడుతున్నారు ! వారు చంకలు చరుచుకుంటూ దుర్ముహూర్తాలలో కార్యక్రమాలు చేసుకుంటున్నారు, నవ్వొస్తోందా? హాయిగా నవ్వుకోండి. ఇదే కలిమాయ అంటే !!

ఆ మధ్యన, విజయవాడలో ఒక జ్యోతిష్యసభ జరిగింది. ఆ సభలో, మిత్రుడు పాలపర్తి శ్రీకాంత్, ఒక ప్రముఖ పంచాంగకర్తను ఇలా ప్రశ్నించాడు. 'ఒక ప్రదేశానికి సూర్యోదయసమయాన్ని ఎలా గణిస్తారో, వేదిక మీద నుంచి కొంచం వివరించండి'. ఆ పంచాంగ కర్తగారు తెల్లముఖం వేసి, 'సారీ! మర్చిపోయామండి. మేము సూర్యోదయ సమయాన్ని మూడేళ్ళకు ఒకసారి మాత్రమే లెక్కలు వేస్తాము. తర్వాత గుడ్డిగా దానినే అనుసరిస్తాము' అని ఒప్పుకున్నాడని శ్రీకాంత్ నాతో చెప్పారు. ఇదీ నేటి పంచాంగజ్యోతిష్కుల పరిస్థితి ! ఇక గ్రహగణితం ఏ మాత్రమూ రాని టీవీ జ్యోతిష్కుల సంగతి చెప్పనే అక్కర్లేదు.

జ్యోతిష్కులలో ఒక విచిత్రం ఉంది. గణితం వచ్చినవాడికి ఫలితం చెప్పడం రాదు. ఫలితం చెప్పేవాడికి గణితం రాదు. గణితం ఫలితం రెండూ వచ్చినవాడికి పరిహారం (రెమెడీ) చెయ్యడం రాదు. గణితం - ఫలితం - పరిహారం - ఈ మూడూ వచ్చినవాడు లోకంతో బిజినెస్ చెయ్యడు. మౌనంగా వాడి పని వాడు చూసుకుంటాడు. ఎందుకంటే వాడొక ఋషిగా మారిపోతాడు. కనుక వాడు లోకానికి పనికిరాడు. ఈ మధ్యలో ఉన్నవారు మాత్రం తమతమ వేషాలతో లోకాన్ని బాగా ఆడుకుంటూ ఉంటారు. పిచ్చిలోకులు మోసపోతూ ఉంటారు. ఈ మొత్తం నాటకంలో, జ్యోతిష్కుడూ, పృఛ్చకుడూ ఇద్దరూ చెడుకర్మను మూటగట్టుకుని భుజాన వేసుకుని మోస్తూ ఉంటారు. ఇదీ అసలు సంగతి !

అందుకే ఈ ఆశుపద్యాన్ని ఇక్కడ చెబుతున్నాను.

కం || గణితము, ఫలితము, మఱియున్
గుణముగ పరిహారమెల్ల గురుతుగ జెప్పన్
పణమున నెగ్గెడి జోస్యుల్
అణువుల్ ! పరికింతమన్న నందరు సత్యా !

గణితం, ఫలితం, పరిహారం - ఈ మూడూ శుద్ధంగా తెలిసిన, ఋషితుల్యులైన జ్యోతిష్కులు ఈ భూమిమీద లక్షకొకరో, కోటికొకరో ఉంటారుగాని ఎక్కడబడితే అక్కడ దొరకరు.

పాపం అమెరికా ఎన్నారైలు మాత్రం ఇండియా జ్య్తోతిష్కుల చేతుల్లో ఇలా మోసపోతున్నారు. దుర్ముహూర్తాలకు కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఏం చేస్తాం? సముద్రాలు దాటి వెళ్ళినా ఎవరి కర్మ వారిని వెంటాడటం తప్పదు గదా !