Pages - Menu

Pages

5, ఫిబ్రవరి 2020, బుధవారం

పాండిచేరి, ఆరోవిల్ యాత్ర - 1 (భక్తులు - బండ మనస్తత్వాలు)

గత మూడు రోజులుగా జరిగిన పాండిచేరి, ఆరోవిల్ యాత్ర ముగిసింది.

అరవిందుల సాహిత్యం నాకు  1983 లోనే పరిచయం ఉంది. కానీ ఆయన యోగాన్ని గురించి, ఆయన మార్గాన్ని గురించి నేను వివరంగా 1987 లో 'Bases of Yoga' అనే పుస్తకంలో చదివాను. అప్పట్లో నేను ఆదోనిలో ఉండేవాడిని. రాఘవేంద్రరావని ఒక TTE రైల్వేలో ఉండేవాడు. తర్వాత అతను చిన్నవయసులోనే చనిపోయాడు. అతను నాకా పుస్తకాన్నిచ్చాడు. అప్పటి నుంచి 1995 లోపు అరవిందులు, మదర్ ఇద్దరి సాహిత్యమూ ఆమూలాగ్రం చదివాను, 'సావిత్రి'తో సహా !

అదృష్టవశాత్తూ నేను వారు వ్రాసిన ఇంగ్లీష్ పుస్తకాలే డైరెక్ట్ గా చదివాను, కామెడీ తెలుగు అనువాదాలు చదవలేదు గనుక బ్రతికిపోయాను !

అరవిందుల భాష చాలా చిక్కటి ఇంగ్లీష్ లో ఉంటుంది. దానికి తోడు ఆయన వాడే Overmind, Supermind, Oversoul, subconscient, hostile forces, Superman, Supramental descent, Titans, Transformation of the psychic being మొదలైన మార్మికపదాలు అంత సులువుగా అర్ధం కావు. కానీ నా చిన్నప్పటి నుంచీ చేసిన అధ్యయనం వల్లా, సాధన వల్లా, ఆ మార్మిక టెక్నికల్ పదాలు నాకు సులువుగా అర్ధమయ్యేవి. అందుకని దిండ్ల లాంటి ఆయా పుస్తకాలను కూడా నేను చకచకా చదవగలిగే వాడిని.

ఆ రోజులలో ఇంటర్ నెట్ లేదు. లైబ్రరీలే గతి. ఆదోని నుంచి గుంటూరు విజయవాడలకు మకాం మార్చాను. గుంటూరు రీజినల్ లైబ్రరీలో కూచుని కొన్ని వారాలలో Complete works of Mother (16 or 17 volumes) చదివాను.  ఆ తరువాత, విజయవాడకు మారినప్పుడు, 1990 - 1995 మధ్యలో అక్కడ టాగూర్ లైబ్రరీకి ప్రతిరోజూ వెళ్లి, Complete works of Sri Aurobindo (37 volumes) చదివాను. వీటిల్లోనే వారిద్దరి మిగతా పుస్తకాలన్నీ, ఉదాహరణకి, Synthesis of Yoga, Lectures on the Gita,  The Life Divine, Evening talks with Sri Aurobindo, Talks with the Mother, మొదలైన అనేక చిన్నా పెద్దా పుస్తకాలు అంతర్భాగాలుగా ఉన్నాయి.

గుంటూరు రీజినల్ లైబ్రరీలోనూ, విజయవాడ టాగూర్ లైబ్రరీలోనూ, ఆ పుస్తకాలను అంత దీక్షగా పొద్దుటినుంచీ సాయంత్రం దాకా ఓపికగా కూచుని చదివి పూర్తి చేసింది నేనొక్కడినే అని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే, రీడర్స్ కార్డ్ ను బట్టి చూస్తె, నేను తప్ప ఇంకెవరూ వాటి దుమ్ముకూడా ఏళ్ళ తరబడి దులపలేదు గనుక. అక్కడి లైబ్రేరియన్స్ కూడా నన్ను వింతగా చూసేవాళ్ళు ఆ రోజులలో. ఎందుకంటే కొన్ని రోజులు లంచ్ కూడా చెయ్యకుండా సాయంత్రం వరకూ అలా కూచుని పుస్తకం తర్వాత పుస్తకం చదువుతూనే ఉండేవాణ్ని !

ఈ అధ్యయనం వల్లా, దానికితోడు అప్పట్లోనే నేను చేస్తున్న సాధనవల్లా, అరవిందుల పూర్ణయోగం ఏమిటో నేను సరిగ్గా పరిపూర్ణంగా అనుభవపూర్వకంగా అర్ధం చేసుకోగలిగాను. అప్పటినుంచీ, పాండిచేరి వెళదామని చాలాసార్లు అనుకున్నప్పటికీ, కారణాంతరాల వల్ల వీలు కాలేదు. ఇదిగో, ఇన్నేళ్ళకి ఆ అవకాశం వచ్చింది.

Auroville Administration లో ఉన్నతస్థాయిలో ఉన్న మూర్తిగారు, మా స్నేహితుడు రవిగారి కజిన్ కావడంతో, ఆయన పరిచయం ద్వారా అన్ని ఏర్పాట్లు ముందుగానే జరిగిపోయాయి.

శనివారం సాయంత్రం హైదరాబాద్ లో బయల్దేరి ఉదయం చెన్నైలో దిగాను. డైరెక్ట్ గా చెన్నై సెంట్రల్ నుంచి టాక్సీ మాట్లాడుకుని పాండిచేరిలో నేను బస చెయ్యబోతున్న International Guest House కు 10 గంటలకల్లా  చేరుకున్నాను. దారిలో టీ త్రాగడానికి ఒకచోట ఆగడంతో ఒక అరగంట ఆలస్యం అయింది.

చెన్నై నుంచి పాండిచేరికి, నాన్ స్టాప్ బస్ అయితే Rs 150/- అవుతుంది. అదే డైరెక్ట్ Ola or Uber అయితే Rs 1500/, ప్రైవేట్ టాక్సీ అయితే Rs 2500 to Rs 3000 మధ్యలో ఎంతైనా అవుతుంది. ప్రయాణం అంతా East coast వెంట, బీచ్ పక్కగా సాగుతుంది. అక్కడి చెట్లూ చేమలూ, కొబ్బరి తోటలూ, మధ్యలో వచ్చే చెరువులూ, నదులూ చూస్తూ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగుతుంది.

మధ్య మధ్యలో రోడ్డుపక్కనే మంచి మంచి కాఫీ షాపులున్నాయి. Only Coffee అనే చైన్ రెస్టారెంట్లు చాలా కనిపిస్తాయి. అలాగే Kumbakonam Degree Coffee అనే రెస్టారెంట్స్ కూడా కనిపిస్తాయి. అక్కడి కాఫీ త్రాగాక, కాఫీ త్రాగితే అక్కడే త్రాగాలని నాకు అనిపించింది. నేను కాఫీ ప్రియుడిని కాను, కాఫీ మీద రీసెర్చి కూడా చెయ్యలేదు. కానీ మంచి కాఫీని ఇష్టపడతాను. నాకున్న స్వల్ప అనుభవంలో ఈ కాఫీ చాలా బాగా ఉన్నట్టు తోచింది.

అసలు కాఫీ గాని, టీ గాని చెయ్యడం ఒక ఆర్ట్. ఎవరు బడితే వారు వాటిని కరెక్ట్ గా చెయ్యలేరు. ఒక ధ్యాని మాత్రమే వాటిని సరిగ్గా చెయ్యగలడు. వాటిని సరిగ్గా ఆస్వాదించగలడు కూడా. అందుకే నా శిష్యులకు నేనెప్పుడూ చెబుతూ ఉంటాను " టీ సరిగ్గా చెయ్యడం వస్తే మీకు ధ్యానం వచ్చినట్లే" అని. ఎందుకంటే మనస్సుని పూర్తిగా లగ్నం చేసి చెయ్యకపోతే టీ పాడౌతుంది. కాఫీ అయినా అంతే. అదే విధంగా ధ్యానం కూడా అంతే !

Typical Tamil Culture నీ, ఆ గుడులనీ, తోటలనీ, మనుషులనీ, వాళ్ళ అలవాట్లనీ, కట్టు బొట్లనీ గమనిస్తూ ఉంటే, ఎప్పుడు పాండిచేరి వచ్చిందో కూడా తెలియలేదు. ఆ ప్రయాణంలోనే నేను ధ్యానస్థితిని ఆస్వాదించడం మొదలుపెట్టాను. చుట్టూ ప్రకృతీ, మౌనం, ఏకాంతం నన్ను తేలికగా ధ్యానస్థితిలోకి తీసుకుపోతాయి. దానికి పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం ఉండదు. చూస్తుండగానే పాండిచేరి యూనివర్సిటీ, పాండిచేరి ఇంజనీరింగ్ కాలేజీలు దాటుకుంటూ ఊళ్లోకి ప్రవేశించి International Guest House ముందు కారాగింది. దిగి నా సూట్ కేస్ తీసుకుని లోపలకు అడుగుపెట్టాను.

కౌంటర్లో విచారిస్తే, మీ పేరుతో రూమ్ ఉందిగాని, "ఇంతకు ముందున్న వాళ్ళు ఇంకా ఖాళీ చెయ్యలేదు గనుక లాంజ్ లో కొంచంసేపు కూర్చొని వేచి ఉండండి. వాళ్ళు ఖాళీ చేశాక మీకిస్తాం" అన్నారు. సరేనని అక్కడే ఒక కుర్చీలో కూచున్నాను.

అప్పటికే అక్కడ ఇద్దరు బెంగాలీ ఫామిలీలు వెయింటింగ్ లో ఉన్నారు. అంతా మధ్యవయసు వాళ్ళే. నోరుముయ్యకుండా లొడలోడా ఏదేదో వాగుతూనే ఉన్నారు ఆడాళ్ళూ మొగాళ్ళూ కూడా. ఇంతలో ఇంకో గుంపు బయటనుంచి వచ్చి వాళ్ళను కలిశారు. ఇక చాపల మార్కెట్ లాగా అందరూ అరవడం మొదలుపెట్టారు. నాకు భలే నవ్వొచ్చింది. ఎందుకంటే, ఇలాంటి ప్రవర్తన అరవిందుల తత్వానికి విరుద్ధం గనుక ! ఆయన భక్తులే ఆయన సిద్ధాంతాలను పాటించడం లేదు గనుక !

మౌనంగా వారిని గమనిస్తూ కూచుని ఉన్న నాకు మదర్ జీవితంలోనుంచి ఒక సంఘటన గుర్తొచ్చింది.

1970 ప్రాంతాలలో ఒకసారి స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది. ఆశ్రమవాసులూ, విద్యార్ధులూ అందరూ కలసి అక్కడ ఒక జెండాకర్రను పాతడం లాంటి పని ఎదో చేస్తున్నారు. అందరూ కలసి గోలగోలగా అరుస్తూ typical Indian mob mentality తొ ఆ పనిని పూర్తిచేశారు. అదంతా అయిపోయాక, బాల్కనీ నుంచి మౌనంగా గమనిస్తున్న మదర్ ఇలా అన్నారు.

'వాళ్ళు ఆ విధంగా చెయ్యకుండా ఉంటె బాగుండేది. వాళ్ళ పనిలో పొందిక లేదు. క్రమశిక్షణ లేదు. ఒక ఐక్యతాభావం లేదు. అది Yogic action కాదు. తొందరపాటుతో, అందరూ ఒకేసారి మాట్లాడుతూ, చంచలమైన మనస్సులతో, గందరగోళంగా వాళ్ళా పనిని పూర్తిచేశారు. ఒక పని పూర్తికావడం కాదు ప్రధానం ! దానిని చేస్తున్నపుడు మనం ఏ మానసిక స్థితిలో ఉన్నాము? దానిని ఎలా చేశాము? అన్నదే ప్రధానం. అది అరవిందులు చెప్పిన Yogic action అనిపించుకుంటుంది. వీళ్ళ పనితీరు నన్ను చాలా అసంతృప్తికి గురిచేసింది'

ఎప్పుడో చదివిన ఈ మాట నాకు హటాత్తుగా గుర్తొచ్చింది. ఆ బెంగాలీ గుంపు మీద జాలీ, నవ్వూ ఒకేసారి నాలో కలిగాయి. "వీళ్ళు అంతదూరం నుంచి ఎందుకొచ్చారు? అసలు వీళ్ళు అరవిందుల మార్గాన్ని ఏం అర్ధం చేసుకున్నారు?" అని జాలి కలిగింది.

మౌనంగా కుర్చీలో రిలాక్స్ అవుతూ కళ్ళు మూసుకున్నాను. కార్లో కలిగిన ధ్యానస్థితి కంటిన్యూ అవుతోంది. అదే ధ్యానంలో రెండు గంటలు సునాయాసంగా గడిచిపోయాయి. "సార్ ! లేవండి ! మీ రూమ్ రెడీ" అంటూ భుజాన్ని ఎవరో తట్టినట్లు అనిపిస్తే కళ్ళు తెరిచి చూచాను. టైం చూస్తె, పన్నెండుం బావు అయింది. అంటే, దాదాపు రెండుగంటలు ఆ లాంజ్ లోని కుర్చీలోనే ధ్యానంలో ఉన్నాను.

చుట్టూ చూశాను. ఆ బెంగాలీ ఫామిలీలు లేవు. వాళ్ళ కుర్చీలలో ఇంకెవరో కూచుని నావైపు వింతగా చూస్తున్నారు. నేను వాళ్ళ చూపులను పట్టించుకోకుండా, కౌంటర్ దగ్గరకు నడిచాను. అందులోని వాళ్ళు కూడా నన్ను అదోరకమైన గౌరవంతో చూచారు. వారి చూపుల లోని సంభ్రమాన్ని నేను గుర్తించాను. ఎందుకంటే, ఒక్కమాట కూడా మాట్లాడకుండా, మౌనంగా రెండుగంటలు వెయిట్ చేసిన ఒక వ్యక్తిని వాళ్ళ జీవితంలో బహుశా వాళ్ళు చూసి ఉండరు. వారి చూపులను కూడా పట్టించుకోకుండా, కౌంటర్లోని పుస్తకంలో నా వివరాలు నింపి లగేజి తీసుకుని ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న రూమ్ నంబర్ 15 కి దారితీశాను.

ఆగస్ట్ 15 అరవిందుల జన్మతేదీ. నాకు అలాట్ అయిన రూమ్ కూడా 15 నంబరే. దీనిని గమనించి నవ్వుకుంటూ రూమ్ ఓపన్ చేసి ఆ గదిలో ఉన్న రెండు మంచాలలో ఒక మంచం మీద సెటిలయ్యాను.

"గురువులు చెప్పినది పాటించకపోవడం, మళ్ళీ ఆ గురువులను వదలకపోవడం" - ఈ రెండు చెడు లక్షణాలూ ఇప్పటివి కావేమో? అందరు సద్గురువులూ ఈ సమస్యను వారివారి భక్తులనుంచి, అనుచరులనుంచి ఎదుర్కోవలసిందేనేమో? లేకపోతే ఇక్కడ కూడా భక్తులలో ఏంటీ చవకబారు ప్రవర్తనలు? కాసేపు మౌనంగా ఉండలేని వాళ్ళు ధ్యానం ఎలా చేస్తారు? 'మనం ఎక్కడకు వచ్చాం? ఎలా ఉండాలి? మనవల్ల పక్కవారికి ఇబ్బంది కలుగుతోంది కదా ! మనం అలా ఎందుకు ఉండాలి?' అన్న కామన్ సెన్స్ కూడా లేనివాడికి ఆధ్యాత్మికత ఎలా అందుతుంది? వీళ్ళకు అరవిందుల మార్గం అసలెలా ఎక్కుతుంది? ఇలాంటి గుదిబండలను వీరు ఎలా ఉద్ధరిస్తారో? బహుశా ఆయా భక్తులకు కావలసింది కూడా ఉద్ధరింపబడటం కాదేమో? కోరికలు తీరడం మాత్రమేనేమో?" అనుకుంటూ బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాను.

(ఇంకా ఉంది)