Pages - Menu

Pages

10, ఫిబ్రవరి 2020, సోమవారం

సంగీతయోగం - 1 (శ్రీపాద పినాకపాణి గారు - వోలేటి వెంకటేశ్వర్లు గారు)

ఫిబ్రవరి 8 మా పెళ్లిరోజు.

ఈ మధ్యనే నాకు తెలిసింది ఏమంటే, అదే రోజు, ఘజల్ గాయకుడు జగ్ జీత్ సింగ్ పుట్టినరోజని. జగ్ జీత్ సింగ్ అంటే నాకిష్టం గనుక ఆ రోజు స్మూల్ లో రెండు పాటలు పాడాను. ఒకటి - "ఆ మిల్ జాయే హమ్ సుగంద్ ఔర్ సుమన్ కి తర్హా", రెండోది - "బేదోనా మోధుర్ హొయే జాయ్, తుమీ జోడీ దావో'. రెండూ సుమధుర గీతాలే.

నిన్న ఆదివారం యోగసాధన అయిపోయాక, అందరం కూచుని ఉండగా, చక్రపాణిగారు తన శిష్యురాలితో కలసి మా ఇంటికి వచ్చారు. చక్రపాణిగారు ప్రసిద్ధ కర్నాటక సంగీత విద్వాంసుడు మరియు సంగీతకళానిధి శ్రీపాద పినాకపాణి గారి శిష్యుడు. ఈ ఒక్క కితాబు చాలు సంగీతంలో ఆయన స్థాయి ఏమిటో చెప్పడానికి !

అదీ ఇదీ మాట్లాడాక, ఇలా అడిగాను.

'సంగీతం అంటే ఇష్టంతో నేనూ ఏవో 'ఖూనిరాగాలు' అప్పుడప్పుడూ తీస్తూ ఉంటాను. కానీ నాకు సంగీతం రాదు. ఆ రాగాల పేర్లు నాకు తెలియవు. నిన్న ఒక పాట పాడాను. "ఆ మిల్ జాయే హమ్ సుగంద్ ఔర్ సుమన్ కి తర్హా" ఆ పాట పేరు. అది ఏ రాగమో కాస్త చెప్పగలరా?'

చక్రపాణి గారు ఆ ట్యూన్ని ఒకసారి విని, దాని పేరు చెప్పేశారు.

ఇక అక్కడనుంచి సంగీతం మీద టాపిక్ మొదలైంది.

'సంగీతాన్ని సంగీతంగా చూడాలి. దాన్ని వ్యాపారవస్తువును చెయ్యకూడదు. కలుషితం చెయ్యకూడదు. ఆత్మానందం కోసం సంగీతాన్ని ఆలపించాలి గాని ఆత్మను అమ్ముకోకూడదు. అది మనస్సును రంజింపజేసే ఒక కళ మాత్రమే కాదు, భగవంతుని పాదారవిందాల సన్నిధికి మనల్ని చేర్చే ఒక సాధనం కూడా' అంటూ సంగీతాన్ని ఒక తపస్సులాగా ఆరాధించిన శ్రీపాద పినాకపాణిగారి స్కూలే కనుక చక్రపాణిగారు కూడా సంగీతాన్ని అదే కోవలో ఆలోకిస్తారు. ఆరాధిస్తారు. ఆయన్ను కదిలిస్తే వోలేటి వెంకటేశ్వర్లు గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, నూకల చినసత్యనారాయణ గారు, మల్లాది సోదరులు, శ్రీరంగం గోపాలరత్నం మొదలైన దిగ్గజాల గురించే మాట్లాడతారు. ఇక మిగతా గాయకుల గురించి మాట్లాడటం అనవసరం అంటారు. వీరందరూ శ్రీపాద పినాకపాణి గారి శిష్యులనేది జగమెరిగిన సత్యమే.

కర్నాటక, హిందూస్తానీ సంగీతాల గురించి టాపిక్ నడుస్తోంది.

చక్రపాణిగారు ఇలా అన్నారు.

'వోలేటి వెంకటేశ్వర్లు గారికి హిందూస్తానీ కూడా చాలా బాగా వచ్చు. ఇటు కర్ణాటక సంగీతమూ, అటు హిందూస్తానీ సంగీతమూ రెండింటిలో ఆయనకున్న అమోఘమైన ప్రజ్ఞతో, ఆయన బాణీ చాలా విలక్షణంగా ఉండేది. ఖాళీగా ఉన్నపుడు ఏవేవో హిందూస్తానీ రాగాలను ఆలపిస్తూ ఉండేవాడాయన.

వోలేటి వెంకటేశ్వర్లు గారు నిజంగా గానగంధర్వుడే. ఎవరో ఒక గంధర్వుడే అలా భూమ్మీద జన్మ ఎత్తాడు. ఈ మాటను మా గురువుగారైన శ్రీపాద పినాకపాణి గారే స్వయంగా అన్నారు. వెంకటేశ్వర్లు గారి స్థాయి ఎలాంటిదో ఒక ఉదాహరణ వినండి.

'ఒకసారి బాంబేలో ఒక స్టూడియోలో ఓలేటి వెంకటేశ్వర్లు గారి రికార్డింగ్ జరుగుతోంది. పక్కనే ఇంకో రూములో, మహమ్మద్ రఫీ గారి రికార్డింగ్ ఉంది. అక్కడకు పోబోతున్న రఫీ, వోలేటిగారి స్వరం విని, ఆగిపోయారు. తన రికార్డింగ్ రూములోకి పోకుండా ఆగిపోయి, వోలేటి గారి రికార్డింగ్ అంతా శ్రద్దగా విన్నారు. ఆ తర్వాత వోలేటిగారికి నమస్కారం చేసిన రఫీ ఇలా అన్నారట'

'మీరు సినీ ఫీల్డ్ లోకి రాకపోవడం వల్ల మాకు ఇంకా తిండి దొరుకుతోంది' 

వింటున్న నేను 'ఈ సంఘటన ఎప్పుడు జరిగింది?' అనడిగాను.

'1960 ప్రాంతాలలో జరిగింది' అని చక్రపాణి గారు బదులిచ్చారు. ఇలా అంటూ, ఇంకో సంఘటన కూడా వినండి అని ఆయనిలా చెప్పారు.

'ఘజల్ చక్రవర్తి మెహదీ హసన్ ఒకసారి ఇండియా వచ్చి బాంబే లో కచేరి ఇస్తున్నారు. ఆయన కచేరీ వినడానికి లతా మంగేష్కర్ వచ్చింది. అదే సమయంలో వోలేటి వెంకటేశ్వర్లు గారి కచేరీ అక్కడ జరుగుతోందని తెలిసి మెహదీ హసన్ తన కచేరీని కాసేపు ఆపించి, వోలేటి గారి కచేరీలో కూచుని చివరిదాకా శ్రద్ధగా విన్నాడు. ఆయనతో బాటు లతాజీ కూడా కూచుంది. అదీ వోలేటి వెంకటేశ్వర్లు గారి సంగీత స్థాయి !'

వింటున్న నాకు మతిపోయినంత పనైంది.

'వోలేటి గారికి కొన్ని విచిత్ర అలవాట్లుండేవి. శుక్రవారం ఏ ప్రోగ్రామూ ఆయన ఒప్పుకునేవాడు కాడు. ఆరోజు పూర్తిగా సినిమాలకే అంకితం. పొద్దున్న మార్నింగ్ షో, తర్వాత మేటినీ, ఫస్ట్ షో, సెకండ్ షో ఇలా ఒకేరోజున నాలుగు సినిమాలు చూసి అర్ధరాత్రికి ఇంటికి వచ్చేవాడు.

అలాగే, మంచి తిండిపుష్టి ఉన్నవాడాయన. మిరపకాయ బజ్జీలు, దోశెలు బాగా లాగించేవాడు.' అంటూ నవ్వారు చక్రపాణి గారు.

సంభాషణ అన్నమాచార్యుల కీర్తనల మీదకు మళ్ళింది. ఇరవైఏళ్ళ క్రితమే చక్రపాణిగారు, అన్నమాచార్య కీర్తనలను TTD వారికి కేసేట్స్ గా పాడారు. ఆ విషయాలు చెబుతూ ఇలా అన్నారాయన.

'ప్రస్తుతం మనకు దొరుకుతున్న 15000+ అన్నమయ్య కీర్తనలలో 5000 మాత్రమే ఆధ్యాత్మిక కీర్తనలు. మిగతా 10000 పైచిలుకు శృంగార కీర్తనలే. కానీ వాటిని పాడటం మహాపరాధంగా భావిస్తాం మనం.'

వింటున్న నేనిలా అన్నాను.

'అవును. చాలామందికి తెలిసిన అన్నమయ్య కీర్తనలు ఏవంటే - 'బ్రహ్మ కడిగిన పాదము, కొండలలో నెలకొన్న, అదివో అల్లదివో, నారాయణతే నమో నమో' - ఇంతే. అదేంటి చక్రపాణి గారు? ఆయన 60000 కీర్తనలు వ్రాశారని కొందరు, 35000 అని కొందరు అంటున్నారు కదా! '

చక్రపాణిగారు నవ్వారు.

'అవన్నీ, రాగిరేకుల మీదా, బంగారు రేకుల మీదా వ్రాయించారు. కానీ ఆ గది తలుపులు తెరిచి వాటిని మొదటగా చూచినవారు ఆ రేకులను కరిగించి బిందెలు,చెంబులు చేయించుకున్నారు. వారి దృష్టిలో వాటి విలువ అంతే. ఆ విధంగా వేలాది అన్నమాచార్యుని కీర్తనలు మంటల్లో కరిగిపోయాయి. కనీసం ఇప్పుడు మిగిలి ఉన్నవన్నా అందరికీ తెలియాలన్న సంకల్పంతో మళ్ళీ అన్నింటినీ ప్రింట్ చేయిద్దామని నేను సంకల్పిస్తున్నాను.'

'ఇప్పటికే TTD వారు ఆ పని చెయ్యలేదా?' అడిగాను నేను.

'చేశారు. అప్పట్లో వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు మొదలైన దిగ్గజాలు పూనుకుని మొత్తం 29 వాల్యూమ్స్ లో దాదాపు 15000+ కీర్తనలను ప్రింట్ చేయించారు. కానీ అవన్నీ నేటి తరానికి తెలియవు. కొన్నింటిని పాడితే పరమబూతు అని నేటి పిచ్చిజనం అనుకుంటున్నారు.' అన్నాడాయన.

'అదెప్పుడూ ఉండేదే. పామరజనానికి అంతా బూతుగానే కనిపిస్తుంది. కానీ వాళ్ళు పగలూ రాత్రీ ఉండేది మాత్రం పచ్చిబూతులోనే. లోకులంతే. వాళ్ళని ఒదిలెయ్యండి. ఏంటవి? ఒకటి ఆలపించండి' అడిగాను నేను.

'కామయాగము జేసె కలికి తన - ప్రేమమే దేవతా ప్రీతిగాను' అనే కీర్తనను ఆలపించారు చక్రపాణిగారు. శుద్ధమైన స్వరాలతో కూడిన ఆయన స్వరంలో ఈ కీర్తన వింటుంటే, అద్భుతంగా అనిపించి, ధ్యానస్తితిలోకి తీసుకుపోయింది.

'ఓహో ! లోకానికి ఇది బూతుగా కనిపించిందా? ప్రేమభక్తినీ తంత్రసాధననూ కలిపి ఎంత అద్భుతమైన కీర్తనను వ్రాశారు ఆచార్యులవారు?' అన్నా నేను.

ఈ కీర్తనను గురించి వివరంగా తరువాతి పోస్ట్ లో వ్రాస్తాను.

వచ్చే వారం జరుగబోతున్న మీ Astro workshop లో, దీక్షితులవారు వ్రాసిన నవగ్రహ కృతులను ఒక medley గా ఆలపిద్దామని అనుకుంటున్నాము నేనూ నా శిష్యురాలూ కలసి.' అన్నారు చక్రపాణి గారు.

అంతటి గొప్ప విద్వాంసుడు అలా అంటుంటే నాకు మాట రాలేదు.

'అంతకంటేనా? అమ్మ అనుగ్రహం !' అన్నాను నేను.

'దీక్షితుల వారు వ్రాసిన నవగ్రహ కృతులలో ఆయా గ్రహమంత్రాలు ఇమిడి ఉంటాయి. ఆయా గ్రహాల దోషపరిహారానికి ఏమేం చెయ్యాలో ఆ కృతులలోనే ఇమిడ్చి చెప్పారాయన. సూర్యుని పైన ఆయన వ్రాసిన ఈ కృతి సౌరాష్ట్రరాగంలో ఉంటుంది.

చాలా రాగాలు ప్రాంతాలను బట్టి దేశాలను బట్టి వచ్చినవే. ఉదాహరణకు యదుకుల కాంబోజి రాగం తీసుకోండి. దాని అసలు పేరు ఎరుకల కాంబోజి. 'యదుకుల' అని తర్వాత మార్చుకున్నారు. అసలు పేరు ఎరుకల కాంబోజి మాత్రమే' అన్నారాయన.

'కాంబోజదేశం అంటే నేటి కాంబోడియా. అక్కడంతా ట్రైబల్ జాతులు ఉండేవి ప్రాచీనకాలంలో. వాళ్ళు పాడుకునే రాగం కనుక ఎరుకల కాంబోజి అయిందన్నమాట' అన్నాను నేను.

'అవును. అలాగే, దిజవంతి, ద్విజావంతి అనే పేరుగల రాగం కూడా అంతే. అవంతీదేశంలో ద్విజులు పాడుకునే రాగం అది. అందుకని దానిపేరు అలా వచ్చింది. అలాగే ఇప్పుడు పాడబోయే సూర్యస్తుతి, సౌరాష్ట్రరాగంలో ఉంటుంది. అంటే గుజరాత్ లో ఈ రాగం పుట్టిందన్నమాట. ప్రస్తుతానికి, ఇవాళ ఆదివారం గనుక, దీక్షితుల వారు వ్రాసిన సూర్యకృతి 'సూర్యమూర్తే నమోస్తుతే' ఆలపిస్తాను వినండి.' అన్నారు చక్రపాణి గారు.

అద్భుతమైన సౌరాష్ట్రరాగంలో ఆ కృతిని ఆలపించారాయన. యధావిధిగా మళ్ళీ ధ్యానస్థితి కలిగింది.

అలా మాట్లాడుకుంటూ ఉండగా 'సద్గురు శివానందమూర్తిగారు వ్రాసిన 'కఠయోగం' అనే పుస్తకం మీకిస్తాను. చూస్తారా?' అనడిగారు చక్రపాణి గారు. శివానందమూర్తిగారు చక్రపాణిగారికి బాగా తెలుసు.

నవ్వాను.

'ఆయన గుంటూరులో కృష్ణా లాడ్జ్ లో దీనిగురించి ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసం నేను విన్నాను. అంతకు 25 ఏళ్ళ ముందే నేను కఠోపనిషత్తును క్షుణ్ణంగా చదివాను. ఉపనిషత్తులలో అది నా ఫేవరేట్. శివానందమూర్తిగారి భావం నాకర్ధమైంది. ప్రత్యేకంగా చదవనక్కరలేదు. కఠోపనిషత్తులో చెప్పబడినది "పంచాగ్నివిద్య". యమధర్మరాజు నచికేతునికి బోధించినది అదే. దానినే కఠయోగం అన్నారు శివానందమూర్తిగారు. తెలుసు. నా సాధనామార్గంలో అది అంతర్భాగం. నా పుస్తకం 'శ్రీవిద్యారహస్యం'లో కఠోపనిషత్తు అధ్యాయం చూడండి, అక్కడ ప్రస్తావించాను. మీకర్ధమౌతుంది.' అన్నాను.

'పినాకపాణి గారు పోయినప్పుడు శివానందమూర్తిగారు ఇలా అన్నారు 'నాదం ముద్దకట్టి అక్కడ పడుకుని ఉన్నట్టు నాకనిపించింది. ఆయన పాడుతున్నపుడు ఎన్నోసార్లు నేను విన్నాను. ఎంతో ఎత్తులో ఆయనను చూచాను. కానీ ఆయన పోయినప్పుడు మాత్రం, "నాదం ముద్దకట్టి అక్కడ ఉన్నట్టు అనిపించింది" అన్నారాయన" - అన్నారు చక్రపాణిగారు. 

వింటున్న నా కళ్ళు చెమర్చాయి.

ఆయనింకా ఇలా అన్నారు.

'పినాకపాణిగారు చివరిరోజుల్లో - బెడ్ మీద ఉన్నపుడు - ప్రతిరోజూ గాయత్రీమంత్రజపంతో బాటు, ఎన్నో కీర్తనలను గొంతెత్తి పాడుకుంటూ ఉండేవారు, చివరకు మంగళం పాడి, ఆయన శిష్యులమైన మాకందరికీ ఆ ఫలితాన్ని ధారపోసేవారు. 'మీలాంటి శిష్యులవల్లే నాకింత మంచిపేరు వచ్చింది' అనేవారు చాలాసార్లు"

వారి గురువుగారిని ఒక రోజులో ఎన్నిసార్లు తలచుకుంటారో చక్రపాణి గారు ! ఆయన గురుభక్తికి నేను ముగ్దుడనైనాను.

ఇలా చాలాసేపు మాట్లాడి సెలవు తీసుకుని వెళ్ళిపోయారాయన. ఆ విధంగా ఆదివారం యోగసాధనతో బాటు సంగీతసాధన కూడా జరిగింది !

వచ్చే పోస్ట్ లో - అన్నమాచార్యులవారి శృంగార కీర్తన -''కామయాగము జేసె కలికి తన - ప్రేమమే దేవతా ప్రీతిగాను' గురించి వివరంగా చూద్దాం. అందులో బూతే ఉందో, లేక ఆధ్యాత్మికమే ఉందో గమనిద్దాం !

(ఇంకా ఉంది)