Pages - Menu

Pages

26, ఫిబ్రవరి 2020, బుధవారం

Three LInes

ఫిట్నెస్ చాలెంజ్ మీద పోస్టులు చదివిన కొందరు 'మీ యవ్వనరహస్యం ఏమిటి?' అని అడుగుతున్నారు. ఎంత చెప్పినా ఇంకా డౌట్స్ అడిగితే ఎలా? అంత అర్ధం కాకుండా ఏముంది నా పోస్టులలో? అయినా అడుగుతున్నారు కాబట్టి, అలాంటివారికోసం ఈ పోస్ట్.

నా రహస్యం అంతా మూడు గీతలలో దాగుంది, అంటే త్రీ లైన్స్ అన్నమాట. అవి నొసటి గీతలు కావు. బ్రహ్మ వ్రాసిన గీతలూ కావు. వీటిలో రెండు మనం వ్రాసుకునే గీతలు. మూడోది దానంతట అదే వస్తుంది. అవే - pipeline, waistline, lifeline.

Pipeline ని అదుపులో పెడితే Waist line అదుపులో ఉంటుంది. Waist line ని అదుపులో పెడితే Lifeline పెరుగుతుంది. ఇదే నా సూత్రం. అయితే, ఇక్కడ కొంచం వివరణ అవసరం.

Pipeline అంటే నోరు. అంటే, నోరు, పేగులు, జీర్ణాశయం, విసర్జన వ్యవస్థ ఇదంతా ఒక pipeline గా మనలో ఉంటుంది. దీనిని అదుపులో పెట్టడం అంటే, తిండిని కంట్రోల్ చెయ్యడం. ఇష్టం వచ్చినట్లు నానా చెత్తా మెక్కుతూ నా ఆరోగ్యం బాగుండాలంటే కుదరదు. కనుక ముందుగా తిండిని కంట్రోల్ చెయ్యాలి. కంట్రోల్ చెయ్యడం అంటే, ఉపవాసాలు ఉండటం కాదు. మితంగా, అన్నీ ఉన్న సమతుల ఆహారం తీసుకోవడం. అంటే, మనం రోజూ తినే తిండిలో ఆకుకూరలు ఉండాలి, పచ్చి కూరగాయలు ఉండాలి, పండ్లు ఉండాలి, నట్స్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. అయితే అతిగా వేటినీ తినకూడదు. మితంగా తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఎక్కువగా నూనెలు, నాన్ వెజ్, జంక్ ఫుడ్ ను పూర్తిగా దూరం ఉంచాలి.

దీనిని కంట్రోల్లో పెడితే waistline అదుపులోకి వస్తుంది. అంటే, పొట్ట పెరగదు. మనిషికి వచ్చే రోగం పొట్ట+నడుము పెరగడంతోనే మొదలౌతుంది. అందుకే నేను సరదాగా ఒక మాట చెబుతూ ఉంటాను. "మధ్యప్రదేశ్ బాగుంటే ఇండియాలో అన్ని రాష్ట్రాలూ బాగుంటాయి" అని. అర్ధమైంది కదూ?

పొట్టని అదుపులో పెట్టడం అంటే, ఒక్క తిండిని కంట్రోల్ చెయ్యడం మాత్రమే కాదు. నీ ఒంటికి సరిపోయిన వ్యాయామం ప్రతిరోజూ చెయ్యాలి. అందరికీ అన్ని వ్యాయామాలూ సరిపోవు. మీ ఒంటికి ఏవి సరిపోతాయో చూచుకుని వాటిని మాత్రమే చెయ్యాలి. అంటే, శరీరంలోని అన్ని భాగాలకూ తగినంత వ్యాయామం ప్రతిరోజూ ఇవ్వాలి. ఈ వ్యాయామానికి నా అనుభవంతో నేను డిజైన్ చేసిన Yoga & Martial arts schedule అనేది అత్యుత్తమమైనది. నా శిష్యులు దీనిని అనుసరిస్తారు. అయితే, దీనిని చేసేవాళ్ళు కూడా వారానికి ఒకరోజు బాడీకి రెస్ట్ ఇవ్వచ్చు. కానీ ఆ రోజున కూడా మినిమం వాకింగ్ చెయ్యాలి. వాకింగ్ అనేది ప్రధానమైన వ్యాయామం కాదు. ఒక సహాయకారి మాత్రమే. దీనిని మర్చిపోకూడదు. Waistline అనేది ఒంట్లోని అన్ని భాగాలకూ ఒక ప్రతిబింబం అన్నమాట. అలా తీసుకోవాలి ఆ పదాన్ని !

ఎప్పుడైతే ఈ విధంగా చేస్తామో అప్పుడు waistline కంట్రోల్లో ఉంటుంది. అంటే, ఒళ్లంతా కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే అది కంట్రోల్లో ఉందో, అప్పుడు lifeline పెరుగుతుంది. అంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది నిజమో కాదో మీకు మీరే ప్రత్యక్షంగా చూసుకోవచ్చు.

లైఫ్ లైన్ తగ్గడానికి ప్రధానమైన కారణం పైప్ లైన్ మీద అదుపు లేకపోవడం, ఆ ఫలితంగా వెయిస్ట్ లైన్ పెరగడం. కనుక రెండు లైన్స్ కంట్రోల్లో ఉంటే ఆరోగ్యమూ ఉంటుంది. ఫిట్నెస్ కూడా ఉంటుంది. అప్పుడు వయసు పెరగడం ఆగిపోతుంది.

కనుక Pipeline-Waistline-Lifeline అనేదే నా సూత్రం. చూశారా ఎంత సులభమో? మరి ఈరోజు నుంచీ చెయ్యడం మొదలుపెట్టండి ! ఫలితాలు మీరే చూడండి !