Pages - Menu

Pages

25, మార్చి 2020, బుధవారం

ఉగాది కవిత - 2020

వచ్చింది వచ్చింది శార్వరి
తెచ్చింది తెచ్చింది కొలవెరి
రోడ్డుమీద కొస్తేను పోకిరి
వాడిపని అవుతుంది ఆవిరి

ఇంట్లోన ఉంటే ఉగాది
బయట కొస్తే మాత్రం సమాధి
కరోనా అసలే కబోది
నీలో వేసుకుంటుంది పునాది

ఇంట్లో ఉంటే
అమ్మచేతి ఉగాది పచ్చడి
రోడ్డుమీదకొస్తే
బాబాయి చేతిలో చింతకాయ పచ్చడి

కరీనా కోసం బయటకొస్తే
కరోనా నీతో వస్తానంటుంది
మెరీనా బీచ్ లో తిరుగుతానంటే
చలానా నీ చేతిలో ఉంటుంది

ఇంట్లో కూచుంటే
పట్టుపంచె, పంచాంగ శ్రవణం
బయటకొస్తే
పుట్టగోచి, సర్వాంగ మర్దనం

ఇంట్లో చేసుకుంటావ్
దేవుడికి ఆకుపూజ
బయటకొస్తే
నీకౌతుంది బడితెపూజ

పంచాంగం చెబుతోంది
బాగుంటుందని వర్షపాతం
బయట తిరిగావంటే మాత్రం
నీకొస్తుంది పక్షవాతం

పంచాంగంలోని తిధి
సంపదను నీకిస్తానంటుంది
కరోనా కనిపిస్తే మాత్రం
పదపద నీతో వస్తానంటుంది

వారమేమో నీ ఆయువును
బాగా పెంచుతానంటుంది
కరోనామాత్రం జటాయువై
నిన్నెత్తుకు పోతానంటుంది

నక్షత్రం నీ పాపాన్ని
ప్రక్షాళన గావిస్తుంది
కరోనా మాత్రం సరుకుల కోసం
భిక్షాటన చేయిస్తుంది

యోగమేమో రోగాన్ని
తగ్గిస్తా రమ్మంటుంది
కరోనామాత్రం
కాటికెళదాం పదమంటుంది

కరణం గంగాస్నాన ఫలితం
ఇక్కడే ఇస్తానంటుంది
కరోనామాత్రం మరణం
ఇప్పుడే తెస్తానంటుంది

ఆదాయ వ్యయాలన్నీ
అలవిగాని లెక్కలు
కందాయఫలితాలన్నీ
కనిపించని తళుకులు

తప్పు పంచాంగాలు చదివి
ముప్పు తెచ్చుకోకు
అయనాంశే తేలనప్పుడు
అసలెందుకీ పంచాంగాలు?

కరోనా ఒక్కటే సత్యం
పంచాంగాలన్నీ అసత్యం
అవి చెప్పేవారి జాతకాలు
వారికే తెలియవు ఇదినిజం

అయ్యాబాబూ అంటున్నా
మాట వినని ప్రజానీకం
ప్రభుత్వాలను చూస్తే
అనిపిస్తుంది అయ్యోపాపం

మాస్కు వేసుకోకుంటే
ఫ్లాస్కు పగిలిపోతుంది
హ్యాండు వాషు లేకుంటే
బ్యాండు నీకు పడుతుంది

శానిటైజరొద్దంటే
లోని టైరు పగుల్తుంది
దూరం వద్దువద్దంటే
రోగం ముద్దులిస్తుంది

దగ్గు తుమ్ము మొదలైతే
డప్పు ఇంటికొస్తుంది
పెగ్గు వేసి పడుకుంటే
ముప్పు తప్పిపోతుంది

చెప్పుల్లో కాళ్ళు పెడితే
పప్పు పగిలిపోతుంది
కప్పు కింద తొంగుంటే
నిప్పు దూరమౌతుంది

టిక్కు టాకు చేస్తుంటే
తప్పు జరగకుంటుంది
నిక్కి నీల్గి బయటకొస్తే
తుప్పు వదిలిపోతుంది

అందరూ ఆన్లైన్ కొస్తే
సర్వరు క్రాషౌతుంది
దగ్గేవాడు దగ్గరకొస్తే
నీపని ట్రాషౌతుంది

తప్పులు చెయ్యకపోతే
డ్యూటీ మెచ్చుకుంటుంది
చెప్పింది వినకపోతే
చీటీ చినిగిపోతుంది

క్వారంటైను వద్దంటే
ఘోరం జరిగిపోతుంది
వీరంగాలు వేస్తుంటే
కారం కంట్లో పడుతుంది

వాసన తెలియకపోతుంటే
కరోనా నిన్ను రమ్మంటోంది
వేషాలు మానుకోకుంటే
చలోనా అని అదంటోంది

మరోలా అర్ధమైతే
కండ కావరమౌతుంది
కరోనా లేదులే అనుకుంటే
దండ దగ్గరౌతుంది

ఎవరి పద్ధతుల్లో వారుంటే
అంతా బాగుండేది
చేతులు కాలాక ఆకులంటే
మందా? ఇప్పుడేది?