Pages - Menu

Pages

30, మార్చి 2020, సోమవారం

పద ఇంటికి....

పనికిరాని మాటల్లో
పలుకులేని తోటల్లో
తిరుగుతావెందుకు  నేస్తం?
పద ఇంటికి

స్నేహమెరుగని  బీడుల్లో
ప్రేమ తెలియని నీడల్లో
వెతుకుతావెందుకు నేస్తం?
పద ఇంటికి

నిన్ననుకోని ఊరికోసం
కన్నుకలపని వారికోసం
విలపిస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

వదిలేసిన ఊరికోసం
వ్యధ నింపిన వారికోసం
ఎదురుచూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

చదరంగపు పావుకోసం 
తిరిగిరాని నావకోసం
తీరంలో ఎందుకు నేస్తం?
పద ఇంటికి

నీ చేతిని విసిరే వారికోసం
నిన్నెపుడూ కసిరే వారికోసం
ముసురులో బయటెందుకు నేస్తం?
పద ఇంటికి

స్వార్ధం నిండిన మనుషుల కోసం
ఆర్ద్రత తెలియని మనసుల కోసం
ఆశగా ఉన్నావెందుకు నేస్తం?
పద ఇంటికి

ఎండలు మండిపోతుంటే
బండలు భళ్ళున పగుల్తుంటే
వానెలా వస్తుంది నేస్తం?
పద ఇంటికి

ఎడారి ఇసుక భూముల్లో
తడంటూ తెలియని సీమల్లో
గులాబీలెలా వస్తాయి నేస్తం?
పద ఇంటికి

జాడలేని ఉదయం కోసం
తోడురాని హృదయం కోసం
వాడిపోతూ పూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

పిలుపు వినని వారికోసం
తలచుకోని వారికోసం
మలుపులో ఉన్నావెందుకు నేస్తం?
పద ఇంటికి

శుష్కహృదయాల లోకంలో
సున్నితమైన ప్రేమకోసం
చుట్టూ చూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

వధ్యశిలపై తలను పెట్టి
కసాయి కత్తిలో కరుణకోసం
బేలగా చూస్తావెందుకు నేస్తం?
పద ఇంటికి

ఏవో అతీత లోకాలు ....

ఏవో అతీతలోకాలు
నన్ను పిలుస్తున్నాయి
ఏవో అదృశ్యహస్తాలు
నన్ను కలుస్తున్నాయి

పొద్దున్నే తాకే నీరెండ
ముద్దు ముద్దుగా పలకరిస్తుంది
మండించే మధ్యాన్నపుటెండ
మనోజ్ఞంగా అనిపిస్తుంది

చలచల్లని పిల్లగాలి
అమాయకంగా ఆదరిస్తుంది
ఈడ్చికొట్టే వేడిగాడ్పు
అలౌకికపు ఆనందాన్నిస్తుంది

పొద్దున్నే నిద్రలేచే
తోటలోని ప్రకృతికన్య
ముగ్దమనోహరంగా చూచి
మురిపెంగా నవ్వుతుంది

మండించే మధ్యాహ్నం
మాయలన్నీ మాయం చేసి
మహస్సును మనస్సులోకి
మౌనంగా దింపుతుంది

సాయంత్రపు నీడలలో
సరసాల సంధ్యాసుందరి
మరచిపోయావా అంటూ
చేతులు సాచి పిలుస్తుంది

అర్ధరాత్రి నిశ్శబ్దం
ఆర్ణవంలా ఆవరించి
అగాధపు ఔన్నత్యాన్ని
అడ్డులేకుండా అందిస్తుంది

చూడలిగితే
ప్రతిక్షణమూ ప్రత్యేకమే
పాడగలిగితే
ప్రతిరాగమూ అతీతమే

అందరూ ఉన్న ఆర్భాటం
అనవసరపు ఆనందాన్నిస్తే
ఎవరూ లేని ఏకాంతం
ఎల్లలు లేని వెల్లువనిస్తుంది

ప్రేయసి ఎదురుగా ఉన్నా
ఆపలేని ఆనందమే
అందరాని సీమల్లో ఊహైనా
మాటరాని మనోజ్ఞమే

ఎవరన్నారు?
అన్నీ ఉంటేనే ఆనందమని
నేనంటున్నా
అది తెలివిలేని ఆలోచనని

ఏదీ నీతో లేకున్నా
ఎవరూ నీతో రాకున్నా
నీ మనసే ఒక స్వర్గమని
నీ ఉనికే ఒక మోక్షమని

చూచే చూపుంటే
స్వర్గమే నీ చుట్టూ కనిపిస్తుంది
తలచే మనసుంటే
దేవతే నీకోసం దిగి వస్తుంది....

29, మార్చి 2020, ఆదివారం

కరోనా కతలు - 3 (భలే కొత్త జోకు Go In)

ఈ మధ్యన ఒక కొత్త జోకు విన్నాను.

ఎవరో గురువుగారు ప్రోమోట్ చేసారో లేక వాళ్ళ శిష్యులు ప్రస్తుత లోకపరిస్థితిని తెలివిగా మార్కెటింగ్ చేసుకోవడం కోసం పోమోట్ చేశారో తెలీదు గాని, ఇది చక్కర్లు కొడుతోంది. నాకూ ఎవరో పంపించారు. భలే నవ్వొచ్చింది. అదేంటో చెప్పనా ?

When you cant go out , go in అట. పక్కనే ధ్యానంలో ఉన్న ఒక మంచి ఒంపుసొంపుల అమ్మాయి బొమ్మ. దేవుడా ! ధ్యానాన్ని మార్కెటింగ్ చెయ్యడానికి కూడా అమ్మాయే కావాలి ! సబ్బులు, టూత్ పేస్టులు, నూనెలు, క్రీములతో సమానంగా ధ్యానాన్ని కూడా చేసి కూచోబెట్టారన్న మాట నేటి వ్యాపార గురువులు?

ఈ మెసేజిని అందరికీ పంపించేవాళ్ళకైనా కొంచం బుద్ధి ఉండాలి. ఇదేం చెబుతోంది? నిన్ను నీ లోపలకి పొమ్మంటోంది. మరి నువ్వేం చేస్తున్నావు? అది చెయ్యకుండా అందరికీ ఆ మెసేజి పంపించి, అది వాళ్ళకిలే నాక్కాదు అని హాయిగా టీవీ పెట్టుకుని కాళ్ళు బారజాపుకుని కారప్పూస మెక్కుతూ కూచున్నావు? అంతేలే ! అన్ని సూక్తులూ వేరేవాళ్ళ కోసమే కదా? మనకోసం మాత్రం కాదు. వేరేవారికి మెసేజి పంపిస్తే మన బాధ్యత తీరిపోయింది. అంతేనా?

ఈ మధ్యలో ఇంత మంచి జోకు నేను వినలేదు. ఎలాగో చెప్తా వినండి.

ఈ రోజు కరోనా వచ్చిందని, బయటకు వెళ్లకూడదని, ఉన్నట్టుండి ఎవరూ లోపలకు వెళ్ళలేరు. ఎందుకంటే ఎన్నో జన్మల నుంచీ మనకు బయట తిరగడం అలవాటై ఉంది. ఈరోజు ప్రభుత్వాలు మిమ్మల్ని రోడ్ల మీదకు రానివ్వడం లేదు గనుక, ఉన్నట్టుండి పెద్ద ధ్యానులం కావాలంటే అస్సలు కుదరని పని. నేను చెప్పేది అబద్దం అనుకుంటే కాస్త ప్రయత్నించండి. అది జరిగే పని కాదని మీకు ఒక్క పావుగంటలో అర్ధమౌతుంది.

ధ్యానమనేది ఎవరికీ ఒక్కరోజులో రాదు. Go in అని చెప్పడం సులువే. లోకంలో అదే అసలైన కష్టం. దానికి ఎన్నో పునాదులుండాలి. ఎంతో పరిశ్రమ ఉండాలి. దానికోసం నీ జీవితంలో ఎన్నింటినో నువ్వు వదులుకుని ఉండాలి. దానికోసం ఎంతో తపన పడి ఉండాలి. ఏళ్ళకేళ్ళు దానికోసం శ్రమించి ఉండాలి, అప్పుడు మాత్రమే ఎప్పుడు కావాలంటే అప్పుడు నువ్వు Go in కాగలుగుతావు. లేకపోతే వేరే వాళ్లకు మెసేజీలు పంపుకోవడమే సరిపోతుంది. అంతకంటే ఇంకేమీ రాదు.

ధ్యానమనేది ఇంకేమీ చెయ్యలేక చేసేది కాదు. అన్నీ చెయ్యగలిగి ఉన్నపుడు అవన్నీ మానుకొని చేసేది. అలా చేస్తేనే నీకది వస్తుంది. అప్పుడే నువ్వు Go in కాగలుగుతావు. అలా చెయ్యాలంటే దాన్ని అసలెందుకు చెయ్యాలో నీకు తెలియాలి. దానికోసం ఒక తపన, ఒక ఆకలి నీలో పుట్టాలి. దానికోసం నీకు పిచ్చెక్కాలి. అప్పుడు నీకది దక్కుతుంది. అదంతా ఏళ్ళకేళ్ళు పట్టే ఒక పెద్ద ప్రాసెస్. అంతేగాని ఇవాళ బయటకేల్తే పోలీసులు తంతున్నారని ఏమీ తోచక ధ్యానం చేద్దాంలే అని కళ్ళు మూసుకుంటే రెండే వస్తాయి. అయితే నిద్ర, లేకపోతే కలలు. ఈ రెండూ తప్ప అక్కడ Go in ఉండదు. Get out ఉండదు. మధ్యలో త్రిశంకు స్వర్గమే మనకు మిగిలేది.

కాబట్టి ఈ మెసేజిని ఇలా మారుస్తున్నా నేను.

When you cant go out, go out anyway, because you cant go in.
And be thrashed by the police. Then you will go in (to your house).

అదీ సంగతి. చివరకు మిగిలేది బుచ్చిబాబు అన్నట్టుంది.

అర్ధమైందా?

28, మార్చి 2020, శనివారం

కరోనా కతలు - 2 (సెల్ఫ్ క్వారంటైన్)

సెల్ఫ్ క్వారంటైన్ అనేది ఇప్పుడు కొత్తగా వింటున్నాం. కానీ ఇది మనకేప్పుడో తెలుసు. ఎందుకంటే ఇది మన దేశంలోని యోగులకు ధ్యానులకు ఎప్పటినుంచో అలవాటైన పనే.

నా శిష్యులు చాలామంది ఫోన్లు చేసిన పాపం నా క్షేమసమాచారాలు కనుక్కుంటూ ఉంటారు. 'జాగ్రత్తగా ఉన్నారా సెల్ఫ్ క్వారంటైన్ లో?' అంటూ. వాళ్ళందరికీ ఒకటే చెబుతూ ఉంటాను. 'కొత్తేముంది? ఎప్పటినుంచో మనం చేస్తున్నది అదేగా?' అని.

ఈరోజున చేతులెలా కడుక్కోవాలో, బయటనుంచి వస్తే కాళ్లేలా కడుక్కోవాలో, స్నానం చేస్తున్నపుడు ఒళ్లెలా రుద్దుకోవాలో కూడా టీవీల్లో నేర్పిస్తున్నారు. సినీనటులు మరీ వచ్చి చెబుతున్నారు. వాళ్ళు ఎన్నాళ్లకోసారి స్నానం చేస్తారో మనకు చెప్పరనుకోండి. అది వేరే విషయం.

పాతరోజుల్లో అయితే మనిషి ఊపిరి ఇంకొక మనిషికి తగలనంత దూరంలో ఉండి మాట్లాడేవారు. శుచీ శుభ్రతా బాగా పాటించేవారు. నా చిన్నప్పుడు పల్లెటూర్లలో దీనిని చూచాను. కానీ ఇన్నేళ్ళ తర్వాత నాగరికనగరాల్లో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం - అందరిముందు దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలని, కర్చీఫ్ అడ్డుగా ఉంచుకోవాలని, వేరే వాళ్ళ ముఖంమీద దగ్గడం తుమ్మడం చెయ్యకూడదని. రోడ్డుమీద ఒంటేలు పొయ్యకూడదని, క్యూలలో తోసుకోకుండా దూరం పాటించాలని . ఇలాంటి చిన్నచిన్న విషయాలు కూడా కోట్లు ఖర్చు చేసి ఉద్యమస్థాయిలో ప్రభుత్వాలు ప్రజలకు నేర్పించే స్థితిలోకి మనం చేరుకున్నాం ! కలికాలం ఇది కాకుంటే మరేంటి?

పాతకాలంలో బయట నుంచి ఇంట్లోకి వస్తుంటే 'ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి రా' అని చెప్పేవాళ్ళు. చాలా కుటుంబాలలో అయితే ఎవరూ చెప్పకుండా వాళ్ళే కడుక్కుని లోపలకు వచ్చేవాళ్ళు. దానికి వీలుగా నీళ్ళ తొట్లు ఇంటి బయటే ఉండేవి. లేకపోతే కనీసం బకెట్లో నీళ్ళన్నా వాకిట్లో పెట్టేవాళ్ళు. ఆ అలవాట్లన్నీ హుష్ కాకీ అయ్యాయి నేడు. పొద్దున్న లేస్తే ఎలా పళ్ళు తోముకోవాలో ఎవరో ఒక తార టీవీలో చూపిస్తే గాని మనకు అర్ధం కానంత ఘోరమైన స్థితిలో ఉన్నాం మనం.

మనలాంటి వాళ్లకి కరోనా రాకపోతే ఇంకేం వస్తుంది మరి?

కొద్దిగా సంస్కారం ఉన్నవాళ్ళకు ఈ క్వారంటైన్ రూల్స్ కొత్తగా ఏమీ నేర్పక్కర్లేదు. ఎవరూ చెప్పకుండానే వాళ్ళవి పాటిస్తారు. ఇక పరిణతి చెందిన యోగులు ధ్యానులు అయితే కొన్ని వేల ఏళ్ళ నుంచీ వారంతట వారే వీటిని పాటిస్తున్నారు. అందరూ పాటించడం లేదేమని బాధపడుతున్నారు. బహుశా అందుకే ఈ వైరస్ ఇప్పుడు వచ్చి అందరికీ నేర్పుతోందేమో - ఎలా పళ్ళు తోముకోవాలి, ఎలా వళ్ళు రుద్దుకోవాలి, ఎలా ముఖం కడుక్కోవాలి, ఎంత దూరంలో ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు అంటూ.

నిజమైన ధ్యాని జీవితం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ సూత్రం మీదే నడుస్తుంది. అందులో చాలా ఆనందం ఉంటుంది. అది రుచిచూస్తేగాని అర్ధం కాదు. ఇప్పటిదాకా మనకు తెలిసిన అతి గొప్ప సెల్ఫ్ క్వారంటైన్ యోధుడు శ్రీ అరవిందులు. ఆయన 40 ఏళ్ళ పాటు బయటకు రాకుండా ఒక గదిలో ఉండిపోయాడు. 1910 లో పాండిచేరి కి వచ్చి సెటిల్ అయిన ఆయన 1950 లో చనిపోయెంతవరకూ తన గదిలోనుంచి బయట ప్రపంచంలోకి రాలేదు. ఇంతకంటే పెద్ద సెల్ఫ్ క్వారంటైన్ ప్రపంచానికి ఇప్పటిదాకా తెలియదు.

ఇంతకంటే ఇంకా పెద్ద క్వారంటైన్ యోధులు హిమాలయాలలో ఉన్నారు. ఏభై ఏళ్ళ పాటు తమ గుహలలో నుంచి బయటకు రాకుండా ఉన్న సాధువులు, యోగులు హిమాలయగుహలలో చాలామంది నేటికీ ఉన్నారు. వాళ్ళ జీవితాలు వేరు. వాళ్ళ గమ్యాలు ఆశయాలు వేరు. మన కుళ్ళు జీవితాలు వేరు. మనకీ వాళ్ళకీ పోలిక ఉండదు.

మనది ఎంతసేపూ బయట వెతుకులాట. వాళ్ళదేమో లోపల ప్రయాణం. ఆబగా లోకం మీద పడి తినకపోతే ఏదో నష్టపోతాం అని మన బాధ. ఎలా తిన్నా నీకు దక్కెంత మాత్రమే దక్కుతుంది మెల్లిగా తిను, సుఖంగా తిను, పక్కవాడి నోటిదగ్గరది లాక్కొని తినకు, పరుగెత్తకు, నిదానంగా నడువు, నువ్వు నష్టపోయేది ఏమీ లేదు - అని వాళ్ళు చెబుతారు. మంచి చెబితే మనకు ఎక్కదు కదా !

జైలులాగా ఉంది ఇంకా ఎన్నాళ్ళు ఈ క్వారంటైన్? అని చాలామంది తెగ బాధపడుతున్నారు. ఎందుకంటే, తోచక. నన్నడిగితే ఇది చాలా బాగుందని అంటాను. తపస్సు అలవాటైతే, ధ్యానం అలవాటైతే అలాంటివారికి ఈ సెల్ఫ్ క్వారంటైన్ చాలా బాగుంటుంది. వారికి కావలసింది ఇదే. నాలుగుగోడల మధ్యన తలుపులేసుకుని కూచుంటే వారికదే స్వర్గంలా ఉంటుంది. ఎంతసేపు అలా ఉంటారు? అని అనుమానం వస్తోందా? ఎంతసేపు కాదు ఎన్ని రోజులు అని అడగండి. ఎన్ని రోజులైనా ఉండవచ్చు, ఎలా ఉండాలో తెలిస్తే !

మనోనేత్రం విచ్చుకుంటే గది తలుపులు తియ్యకుండానే ప్రపంచంలో ఎక్కడ ఏముందో కళ్ళముందు కనిపిస్తుంది. చూడాలనుకుంటే. ఆఫ్ కోర్స్ చూసే అవసరం లేదనుకోండి. అది వేరే విషయం.

చావు నెత్తిమీదకొస్తే గాని లోకం సెల్ఫ్ క్వారంటైన్ విధించుకోదు. కానీ కొంతమంది చావును అన్వేషిస్తూ, చావును ఎలా దాటాలో అన్వేషిస్తూ, తమకు తామే సెల్ఫ్ క్వారంటైన్ అవుతారు. ఇదేమీ వారికి కొత్త కాదు. ఎప్పటినుంచో తెలిసిన విషయమే.

కొంతమంది తాగుబోతులు, డ్రగ్ అడిక్స్ ఉంటారు. వాళ్లకు లివర్ పాడైపోయి ఒళ్లంతా గుల్ల అయిపోతుంది. మానుకోరా లేకపోతే చస్తావ్ అని డాక్టర్లు చెబుతారు. కానీ వాళ్ళు వినరు. చావనైనా చస్తారు గాని ఆ అలవాట్లు మానుకోరు. అలా ఉంది నేటి జనాల పరిస్థితి కూడా ! జనం చేత మంచి వినిపించాలంటే, చావుతో దానికి ముడిపెట్టాలి. అప్పుడు వింటారు. ఇది ప్రకృతికి బాగా తెలిసిన రూలే.

అందుకే నేనంటాను. ఇన్నాళ్ళకు, ఇన్నేళ్ళకు, లోకం ఎలా ఉండాలో అలా ఉంటోంది. ప్రజలు ఎలా ఉండాలో అలా ఉంటున్నారు. అనవసరమైన విషయాలన్నీ మూలనపడి అత్యంత అవసరమైన విషయాలే మిగిలాయి. ఇదీ లోకం ఉండవలసిన తీరు. కనుక, ఈ క్వారంటైన్ కనీసం రెండు మూడేళ్ళైనా కొనసాగాలి. ఇలాగే ఎవరింట్లో వాళ్ళుండాలి. ఎవరి హద్దుల్లో వారుండాలి అని నేనంటాను.

ఏం తట్టుకోలేరా? చాలా ఎక్కువనిపిస్తోందా? రోడ్లమీదకు రాకుండా ఉండలేకపోతున్నారా? టీవీ చూడకుండా గాసిప్ వాగకుండా బ్రతకడం కష్టంగా ఉందా? బలాదూరుగా తిరుగుతూ చెత్త తిండ్లు తింటూ, చెత్త వాగుడు వాగుతూ, చెత్తపనులు చేస్తూ, చెత్తచెత్తగా బ్రతకడం మానేస్తే బ్రతకలేకపోతున్నారా? మీ ఖర్మ ! చెత్తలో కలవండి ! మిమ్మల్ని బాగుచెయ్యడం నా వల్ల కాదు.

27, మార్చి 2020, శుక్రవారం

కరోనా కతలు - 1 (బయట తిరుగుళ్ళు)

ఇండియాలో మనకొక మంచి అలవాటుంది. ఆఫ్ కోర్స్ చాలా మంచి అలవాట్లు మనకెన్నో ఉన్నాయి. కానీ వాటిల్లోకెల్లా ఇది చాలా మామంచి అలవాటు. అదేంటో చెప్పనా? - బయట తిరుగుడు.

ఈ మాట వినగానే మళ్ళీ నేనేదో రసవత్తరమైన కధ రాస్తున్నాననుకుని "ఇదేదో భలే బాగుంది. మంచి టాపిక్ ఇన్నాళ్ళకు రాస్తున్నారు సారు' అని సీట్లో ముందుకు జరగకండి. నేను రాస్తున్నది మీరు తిరిగే తిరుగుడు గురించి కాదు. పనీపాటా లేకుండా ఊరకే రోడ్లమీద తిరగడాన్నే నేను 'బయట తిరుగుడు' అంటున్నాను. తిరుగుడు  అంతగా అలవాటై పోయింది మనకు ! సారీ ! మీకు !

పనున్నా లేకపోయినా ఊరకే తయారై కాసేపు రోడ్లమీద తిరిగి వస్తే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందం మనకు కలుగుతుంది. ఇదేం దరిద్రమో తెలీదు గాని, దాదాపు అయిదారెళ్ళ క్రితమో ఇంకా ముందో నేను వ్రాసిన 'ఏకాంతం లోని ఆనందం' అనుకుంటా దాని పేరు, అలాంటి ఒక పోస్ట్ లో ఇదే వ్రాశాను.

చాలామందిలో ఈ రోగం ఉంటుంది. ఇంట్లో ఉండలేరు. పొద్దున్న లేవగానే ముందు రోడ్డెక్కాలి. వాళ్ళవి వీళ్ళవీ ముఖాలు చూసి, 'వాడెక్కడ తిరుగుతున్నాడు? ఇదెక్కడ తిరుగుతోంది?' అంటూ నానాగాసిప్ చెప్పుకుని ఇంటికి చేరకపోతే జ్వరం వఛ్చినట్టు ఉంటుంది. ఒకవేళ అలా రోడ్డెక్కకపోతే, ఇంట్లో ఆడాళ్ళే విసుక్కుంటారు. 'ఎంతసేపూ ఆ దేభ్యం మొహంతో నా మొహం చూస్తూ కూచోకపోతే అలా కాసేపు బయటకెళ్ళి ఏడవచ్చుగా' అంటూ. ఈ రోగం ఒక్క మగాళ్ళకే అనుకుంటున్నారా? భలేవారే. అదేంటో ఆడాళ్ళు కూడా అంతే, 'అబ్బ. బయటకెళ్ళి నెలైంది. కాస్త అలా వెళ్ళి ఒక తిరుగుడు తిరిగి రావాలి. అప్పుడుగాని కాస్త రిలీఫ్ గా ఉండదు' అనే ఆడవాళ్ళను నేను చాలామందిని చూచాను. మళ్ళీ నన్ను వేరే విధంగా అర్ధం చేసుకోకండి. ఇది కూడా నేను మహామంచి ఉద్దేశ్యంతోనే చెబుతున్నాను.

మామూలు రోజుల్లో అలా తిరిగితే పోనీలే ఇదొక రోగంలే అనుకోవచ్చు. కానీ ప్రాణంమీదకు వస్తున్న ఈ రోజుల్లో కూడా, కదిల్తే కరోనా కాటేస్తున్న ఈ రోజుల్లో కూడా, పోలీసులు కర్రలిరిగేలా వీపు పగిలేలా బాత్తున్న ఈ రోజుల్లో కూడా, ఏదో ఒక రకంగా, ఎప్పుడో కాసేపు, పోలీసుల కళ్ళు గప్పి, రోడ్లమీద అటూఇటూ తిరిగి వస్తేగాని తోచని క్షుద్రజీవులు కోట్లలో ఉన్నారు మన దేశంలో. అదేం శునకానందమో మరి?

చాలామంది ఆడాళ్ళలోనూ, మగాళ్ళలోనూ నేనీ పోకడను గమనించాను. పౌర్ణమి అమావాస్యలు వస్తున్నాయంటే చాలు, కాలు గాలిన పిల్లులై పోతారు. ఏదో ఒక కుంటిసాకుతో రోడ్దేక్కాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాల్సిందే. తిట్లో దెబ్బలో తినాల్సిందే. చేతులు కాల్చుకోవాల్సిందే. తర్వాత తీరిగ్గా ఏడవాల్సిందే.

ఈ మధ్యన ఇంకో విచిత్రమైన మాట వింటున్నా.

ఇంతకు ముందైతే 'వాడు మగాడ్రా బుజ్జీ. తిరగాలి. తిరక్కపోతే మగాడు చెడిపోతాడు' అనేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. 'అది ఆడదిరా. ఎన్నాళ్ళు ఇంట్లో కూచుంటుంది? తిరగాలి, లేకపోతే చెడిపోతుంది' అంటున్నారు. అసలు బయట తిరగడానికీ ఈ చెడిపోడానికీ ఏమిటో సంబంధం? నా చిన్నప్పటినించీ ఆలోచిస్తున్నా ఇప్పటికీ అర్ధం కావడంలేదు నా మట్టిబుర్రకి. ఏం ఇంట్లో ఉండేవాళ్ళు చెడిపోరా? చెడిపోకూడదా? ఏంటీ గోలసలు?

'ఎవరి ఇళ్ళలో వాళ్ళుండండి. బయటకు రావద్దురా బాబూ' అని ముఖ్యమంత్రులూ ప్రధానమంత్రీ దండాలు పెట్టి మరీ మొక్కుతున్నారు ప్రజలకి. వీళ్లేమో దసరాబుల్లోళ్ళ మాదిరి రోడ్లెక్కి పోలీసులతో గొడవ పడుతున్నారు. చావుతన్నులు తింటున్నారుగాని ఇంట్లోకి పొండిరా అంటే పోవడంలేదు. వీధి వాకిట్లోంచి ఇంట్లోకి పంపిస్తే దొడ్డి వాకిట్లోంచి బజార్లోకి తుర్రుమంటున్నారు.

అసలు, మన ఇండియా వాళ్ళకి వేరే శిక్ష ఏమీ అక్కర్లేదని నా ఉద్దేశ్యం. 'బయటకు రాకుండా ఇంట్లో ఉండండిరా' అంటే చాలు, ఒక వారానికి గుండాగి చస్తారు. వేరే మరణశిక్షా ఉరిశిక్షా ఏవీ అక్కర్లేదు వీళ్ళకి.

పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి ముందు రోడ్డెక్కి కాసేపు అటూ ఇటూ తిరిగి, ఏదో ఒక బజ్జీలబండి దగ్గర నానా చెత్తా తిని, ఏదో ఒక మాల్ లో పనికిరానివన్నీ కొని, ఆ చెత్త పట్టుకుని ఇంటికి చేరితే IAS పరీక్షలో సెలక్ట్ అయినంత ఆనందం మనకి.

ఇదేం ఖర్మో మరి?

ఇలాంటి ఇంపల్సివ్ రోమింగ్, కంపల్సివ్ బయ్యింగ్ రోగాలున్న చాలామంది ఆడాళ్ళను నేను ఎరుగుదును. మళ్ళీ మరోలా అర్ధం చేసుకోకండి 'అన్ని రోగాలున్న ఆడాళ్ళూ మీకే తెలుస్తారా?' అంటూ. నేను ఇప్పుడు కూ.....డా చాలామంచి ఉద్దేశంతోనే ఈ మాటను చెబుతున్నాను. అలాంటి ఆడాళ్ళందరూ ఇప్పుడు కాళ్ళు కట్టేసిన కుందేళ్ళై పోయారు. బయటకెళ్ళి ఏదో ఒకటి కొనకపోతే వాళ్లకు మహాచావుగా ఉంటోంది. వాళ్ళంతా నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. గ్రహాల ప్రకారం ఈ క్వారంటైన్ ఎప్పుడైపోతుంది? మేం బయటకెళ్ళి ఎప్పుడు తిరగొచ్చు? అంటూ. ఏమో నాకేం తెలుసు? నేను క్వారంటైన్నీ కాదు, గ్రహాన్నీ కాదుగా జవాబు చెప్పడానికి.

కరోనా ఏమోగాని, ముందు రోడ్లమీద తిరగనివ్వక పోవడం మనవాళ్ళ చావుకొస్తున్నది. కొన్నాళ్ళు గనక ఇలాగే సాగితే, 'ముందు మమ్మల్ని ఇంట్లోనించి రోడ్డెక్కనివ్వండి. కరోనా వచ్చి చచ్చినా పరవాలేదు. మేము ఇంట్లో మాత్రం ఉండలేం. రోడ్డెక్కాల్సిందే' అని అందరూ పోలోమంటూ బయటకు వస్తారేమో చీమల పుట్టలలోంచి చీమల్లాగా !

'మనిషి రోడ్డున పడ్డాడు' అనేది ఒకనాటి సినిమా. 'మనిషి రోడ్డున పడలేక ఇంట్లోనే చస్తున్నాడు' అనేది నేటి సినిమా.

ఇంకెన్ని సినిమాలు చూడాలో? చూద్దాం !

ఇవిగో శని-కుజ-గురు-యోగప్రభావాలు - 2

గ్రహప్రభావంతో వరుసగా ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న భూకంపాలు, కరోనాకు తోడుగా మేమూ ఉన్నామంటున్నాయి. ఎక్కడెక్కడ ఇవి వస్తున్నాయో చూద్దామా ?

>>25 వ తేదీన రష్యాకు చెందిన దీవులలో 7. 5 స్థాయి భూకంపం వచ్చింది. 

>> 26 వ తేదీన న్యూమెక్సికో లో 5. 0  స్థాయి భూకంపం వచ్చింది. 

>> అదే రోజున సౌత్ మెక్సికో లో 6. 1 స్థాయిలో భూకంపం వచ్చింది. 

>> అదే రోజున అమెరికాలోని సాల్ట్ లేక్ సిటీలో 3. 0  స్థాయిలో భూమి వణికింది.

>> 27 న అంటే నేడు ఇండోనేషియాలో 5. 8  స్థాయిలో భూకంపం వచ్చింది.

ఈ వరుస భూకంపాలకు, నా ప్రిడిక్షన్ కు ఏమీ సంబంధం లేదా మరి?

25, మార్చి 2020, బుధవారం

ఉగాది కవిత - 2020

వచ్చింది వచ్చింది శార్వరి
తెచ్చింది తెచ్చింది కొలవెరి
రోడ్డుమీద కొస్తేను పోకిరి
వాడిపని అవుతుంది ఆవిరి

ఇంట్లోన ఉంటే ఉగాది
బయట కొస్తే మాత్రం సమాధి
కరోనా అసలే కబోది
నీలో వేసుకుంటుంది పునాది

ఇంట్లో ఉంటే
అమ్మచేతి ఉగాది పచ్చడి
రోడ్డుమీదకొస్తే
బాబాయి చేతిలో చింతకాయ పచ్చడి

కరీనా కోసం బయటకొస్తే
కరోనా నీతో వస్తానంటుంది
మెరీనా బీచ్ లో తిరుగుతానంటే
చలానా నీ చేతిలో ఉంటుంది

ఇంట్లో కూచుంటే
పట్టుపంచె, పంచాంగ శ్రవణం
బయటకొస్తే
పుట్టగోచి, సర్వాంగ మర్దనం

ఇంట్లో చేసుకుంటావ్
దేవుడికి ఆకుపూజ
బయటకొస్తే
నీకౌతుంది బడితెపూజ

పంచాంగం చెబుతోంది
బాగుంటుందని వర్షపాతం
బయట తిరిగావంటే మాత్రం
నీకొస్తుంది పక్షవాతం

పంచాంగంలోని తిధి
సంపదను నీకిస్తానంటుంది
కరోనా కనిపిస్తే మాత్రం
పదపద నీతో వస్తానంటుంది

వారమేమో నీ ఆయువును
బాగా పెంచుతానంటుంది
కరోనామాత్రం జటాయువై
నిన్నెత్తుకు పోతానంటుంది

నక్షత్రం నీ పాపాన్ని
ప్రక్షాళన గావిస్తుంది
కరోనా మాత్రం సరుకుల కోసం
భిక్షాటన చేయిస్తుంది

యోగమేమో రోగాన్ని
తగ్గిస్తా రమ్మంటుంది
కరోనామాత్రం
కాటికెళదాం పదమంటుంది

కరణం గంగాస్నాన ఫలితం
ఇక్కడే ఇస్తానంటుంది
కరోనామాత్రం మరణం
ఇప్పుడే తెస్తానంటుంది

ఆదాయ వ్యయాలన్నీ
అలవిగాని లెక్కలు
కందాయఫలితాలన్నీ
కనిపించని తళుకులు

తప్పు పంచాంగాలు చదివి
ముప్పు తెచ్చుకోకు
అయనాంశే తేలనప్పుడు
అసలెందుకీ పంచాంగాలు?

కరోనా ఒక్కటే సత్యం
పంచాంగాలన్నీ అసత్యం
అవి చెప్పేవారి జాతకాలు
వారికే తెలియవు ఇదినిజం

అయ్యాబాబూ అంటున్నా
మాట వినని ప్రజానీకం
ప్రభుత్వాలను చూస్తే
అనిపిస్తుంది అయ్యోపాపం

మాస్కు వేసుకోకుంటే
ఫ్లాస్కు పగిలిపోతుంది
హ్యాండు వాషు లేకుంటే
బ్యాండు నీకు పడుతుంది

శానిటైజరొద్దంటే
లోని టైరు పగుల్తుంది
దూరం వద్దువద్దంటే
రోగం ముద్దులిస్తుంది

దగ్గు తుమ్ము మొదలైతే
డప్పు ఇంటికొస్తుంది
పెగ్గు వేసి పడుకుంటే
ముప్పు తప్పిపోతుంది

చెప్పుల్లో కాళ్ళు పెడితే
పప్పు పగిలిపోతుంది
కప్పు కింద తొంగుంటే
నిప్పు దూరమౌతుంది

టిక్కు టాకు చేస్తుంటే
తప్పు జరగకుంటుంది
నిక్కి నీల్గి బయటకొస్తే
తుప్పు వదిలిపోతుంది

అందరూ ఆన్లైన్ కొస్తే
సర్వరు క్రాషౌతుంది
దగ్గేవాడు దగ్గరకొస్తే
నీపని ట్రాషౌతుంది

తప్పులు చెయ్యకపోతే
డ్యూటీ మెచ్చుకుంటుంది
చెప్పింది వినకపోతే
చీటీ చినిగిపోతుంది

క్వారంటైను వద్దంటే
ఘోరం జరిగిపోతుంది
వీరంగాలు వేస్తుంటే
కారం కంట్లో పడుతుంది

వాసన తెలియకపోతుంటే
కరోనా నిన్ను రమ్మంటోంది
వేషాలు మానుకోకుంటే
చలోనా అని అదంటోంది

మరోలా అర్ధమైతే
కండ కావరమౌతుంది
కరోనా లేదులే అనుకుంటే
దండ దగ్గరౌతుంది

ఎవరి పద్ధతుల్లో వారుంటే
అంతా బాగుండేది
చేతులు కాలాక ఆకులంటే
మందా? ఇప్పుడేది?

23, మార్చి 2020, సోమవారం

ఇవిగో శని-కుజ-గురు-యోగప్రభావాలు - 1

శనికుజయోగం ప్రభావాలు చూపడం మొదలైంది. గమనించండి.

1. కుజుడు మకరరాశిలో ప్రవేశించిన రోజే (మార్చ్ 22) క్రోషియాలో భూకంపం వచ్చింది. ఇంత భూకంపం గత 140 ఏళ్ళలో రాలేదు.
2. కరోలినా, టెన్నెస్, సాల్ట్ లేక్ లోయ ప్రాంతాలలో ఐదురోజుల క్రితమే వరుస భూకంపాలు వచ్చాయి. ఇది twilight zone effect. అంటే, అసలైనవి జరుగబోయే ముందు వచ్చే సూచనలు. ఇలా ఇంతకుముందు కూడా జరిగాయి. గమనించండి.
3.  మార్చ్ 21 న కార్సన్ సిటీ నెవడాలో భూకంపం వచ్చింది.
4. నిన్న యూరేకా కాలిఫోర్నియాలో భూకంపం వచ్చింది.
5. మెక్సిలో దగ్గర దీవులలో ఈరోజే ఒక భూకంపం వచ్చింది.

భూమిమీద ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒక భూకంపం వస్తూనే ఉంటుంది అనిమాత్రం అనకండి. ఈ మాత్రం తెలివితేటలు నాకూ ఉన్నాయి. ఉన్నట్టుండి ఇప్పడే ఇన్ని భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? చెప్పండి చూద్దాం? కుజుడు భూకంపాలకు కారకుడన్న జ్యోతిష్యశాస్త్ర నియమం నిజమా కాదా మరి? ప్రతివారి కళ్ళూ నెత్తినుంచి కాళ్ళలోకి వచ్ఛే సమయం వచ్ఛేసింది. కాస్త ఓపిక పట్టండి ! 

22, మార్చి 2020, ఆదివారం

మకరరాశిలో శని, కుజ, గురువులు - రాబోయే రెండు నెలలలో ఏం జరుగుతుంది?

మరో రెండుగంటల్లో అంగారకుడు మరకరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే శనీశ్వరుడున్నాడు. ఈ రాశి అంగారకునికి ఉచ్చస్థితినిస్తుంది. ఇది విధ్వంసయోగం లేదా దుర్ఘటనాయోగం అనబడుతుంది. ఈ పేర్లు జ్యోతిష్య గ్రంధాలలో లేవు. నేనే పెట్టాను.

ఈ యోగాలు చాలా రకాలైన ప్రమాదాలను ముఖ్యంగా ప్రకృతి ప్రమాదాలను కలిగిస్తాయి. ఆ తరువాత కొన్నాళ్ళకు గురువు అదే మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనిని దృఢకర్మయోగం అంటారు. ఈ పేరుకూడా నేనే డిజైన్ చేశాను. మకరరాశి ఈయనకు నీచస్థితి గనుక ఇదీ చెడునే చేస్తుంది. మొత్తమ్మీద శనీశ్వరుడు, అంగారకుడు గురువు కలసి కొన్నాళ్ళు మకరరాశిలో సంచరిస్తారు. ఆయా సమయాలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలు, చావులు, విధ్వంసాలు జరుగుతాయి. ఆ టైం స్లాట్స్ ఇక్కడ ఇస్తున్నాను.

అసలే కరోనా వైరస్ మనకు చుక్కలు చూపిస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాని విధ్వంసం ఊహాతీతంగా ఉంటుంది. జాగ్రత్త పడండి మరి !
----------------------------------------
అంగారకుని మకర రాశి సంచారం:--- మార్చి 22 నుండి మే 5 వరకు
గురువు మకరరాశి సంచారం:--- మార్చి 30 నుండి జూన్ 30 వరకు
ఈ సమయంలో అమావాస్యలు:--- మార్చి 24, ఏప్రిల్ 22
పౌర్ణములు:--- ఏప్రిల్ 7, మే 7
----------------------------------------
ఈ టైం స్లాట్స్ లో జరుగబోయే దుర్ఘటనలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. అగ్నిప్రమాదాలు, ఫేక్టరీలలో ప్రమాదాలు, అగ్ని/రసాయనిక ప్రమాదాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, డ్యాములు కూలడాలు, రైళ్ళు, రోడ్డు, విమాన ప్రమాదాలు.

2. మతగురువుల మరణాలు, వారిమీద దాడులు, కేసులు, వారి రహస్య కలాపాలు బయటపడటం, మతపరమైన అల్లర్లు, దేవాలయాలలో మతసంస్థలలో ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు, టెర్రరిస్ట్ దాడులు.

3. వ్యక్తిగత జీవితాలలో -- చిన్నాపెద్దా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, సర్జరీలు, అకాల మరణాలు.

4. దీర్ఘరోగాలతో బాధలు పడుతున్నవారికీ, కేన్సర్, ఎయిడ్స్ వంటి అసాధ్యరోగాలున్నవారికీ ఈ సమయంలో పరలోకప్రయాణానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఏయే లగ్నాలకు రాశులకు ఏయే రంగాలలో ఇబ్బంది కలుగుతుంది?
-------------------------------------------------------------------------
మేషరాశి - ఉద్యోగం, చదువు, ఇల్లు.
వృషభరాశి - దూరప్రాంతాలు, కమ్యూనికేషన్, తండ్రి, పెద్దలు.
మిథునరాశి - వీరు ఎక్కువగా ఈ ప్రభావానికి గురౌతారు. మాట, దీర్ఘరోగాలు, మానసిక వ్యధ ఏరియాలలో వీరికి చెడు జరుగుతుంది.
కర్కాటక రాశి - వీరు కూడా ఎక్కువగా దెబ్బ తింటారు. భార్య/భర్త ఆరోగ్యం, కుటుంబ, వ్యాపార సంబంధాలు.
సింహరాశి - వీరు కూడా ఎక్కువగానే దెబ్బ తింటారు. ఆరోగ్యం, వృత్తి.
కన్యారాశి - సంతానం, వ్యాపారం, షేర్ మార్కెట్, ప్రేమ, రోగాలు,
తులారాశి - ఆరోగ్యం, ఇల్లు, చదువు, ఉద్యోగం.
వృశ్చికం -  కమ్యూనికేషన్, తమ్ముళ్ళు/చెల్లెళ్ళు, తండ్రి, తల్లి, పెద్దలు.
ధనుస్సు - వీరు కూడా ఎక్కువగా దెబ్బలు తింటారు. మాట, దీర్ఘరోగాలు, నష్టాలు.
మకరరాశి - వీరు కూడా ఎక్కువగా దెబ్బ తింటారు. ఆరోగ్యం, ఉద్యోగం, మానవసంబంధాలు, భార్య/భర్త.
కుంభరాశి - వీరు కూడా బాగా ప్రభావితం అవుతారు. నష్టాలు, అనారోగ్యాలు, కష్టాలు, యాక్సిడెంట్లు.
మీనరాశి - రోగాలు, నష్టాలు, అన్నలు/అక్కలు, బిజినెస్.

మొత్తం మీద -  ముఖ్యంగా మకర, కర్కాటక రాశులు ఆ తర్వాత మిథున, సింహ, ధనూ, కుంభరాశులు ఎక్కువగా ఈ ప్రభావాలు చవిచూస్తారు. 
-------------------------------------------------------------
టీవీలలో యూట్యూబులలో తెలిసీ తెలియని జ్యోతిష్కులు అనేక రెమెడీలు చెబుతున్నారు. అవేవీ పనిచెయ్యవు. పనిచేసినాయని మీకనిపిస్తే అది మీ జాతకంలో ఉన్న మంచియోగాల వల్లనేగాని ఈ రెమేడీలు పనిచేసి కాదు. భ్రమించకండి. మీమీ మతవేషాలతో గ్రహాలను మీరు మోసం చెయ్యలేరు.

నిజంగా పనిచేసే రెమేడీలు నేను చెబుతా వినండి. చేతనైతే ఆచరించండి.

1. స్వార్ధం తగ్గించుకుని పక్కవాడికి కొంచం సాయం చెయ్యండి. దానికోసం మీరు కొంత నష్టపొండి. అదే మీకు పరిహారం అవుతుంది. సాయం చెయ్యడం అంటే యూట్యూబు లింకులు, వాట్సప్ మెసేజీలు షేర్ చెయ్యడం కాదు. మీది కొంత మానుకుని పక్కవాడికి కొంత సాయం చెయ్యాలి. అదికూడా ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. అదీ అసలైన రెమెడీ అంటే !

2. కుట్రలు కుత్రంత్రాలు మానుకొని, సరళంగా సూటిగా బ్రతకడం కనీసం ఇప్పుడైనా మొదలుపెట్టండి.

3. దురుసుగా మాట్లాడటం, ఎదుటి మనిషిని నొప్పించడం మానుకోండి. ఎంతసేపూ మీమీ అవసరాల గురించి మాత్రమే ఆలోచించడం మానుకుని కొంత పక్కవాడి గురించి కూడా నిజాయితీగా ఆలోచించండి.

4. విలాసాలు, దుబారాలు తగ్గించుకుని నిరాడంబరంగా బ్రతకడం నేర్చుకోండి. మొత్తం మనమే తిందాం అన్న దురాశకు బానిసలై స్టోర్స్ అరలన్నీ మీరొక్కరే ఖాళీ చేసి మీమీ ఇళ్ళు వస్తువులతో డంప్ చెయ్యకండి.

5. మీరు కష్టపడి సంపాదించిన దానిలో కొంత దానం చెయ్యండి.  ఆ దానంకూడా పాత్రత ఉన్న వారికి ఇవ్వండి. అపాత్రులకు దానం చేసి ఇంకా పాపం మూటగట్టుకోకండి.

6. నిజాయితీగా బ్రతకడం, ప్రేమను హృదయంలో నింపుకోడవం, నలుగురితో మంచిగా ఉండటం నేర్చుకోండి.

ఇవే అసలైన రెమేడీలు, మిమ్మల్ని గ్రహప్రభావం నుంచి కాపాడే రెమేడీలు ఇవే. ఇవి కాకుండా, ఇవి చెయ్యకుండా, మీరు ఇంకెన్నెన్ని కుప్పిగంతులు వేసినా అవన్నీ పరమవృధా పనులని గ్రహించండి. ఆ కుప్పిగంతులు ఏవేవో ఈ క్రింద ఇస్తున్నాను చూడండి.

కుప్పిగంతు రెమేడీలు
-----------------------
1. ఫలానా రోజు ఫలానా దేవుడికి ఫలానా పూజ చెయ్యండి.
2. ఫలానా తీర్దాలు తీసుకోండి, ఫలానా బొట్లు పెట్టుకోండి, ఫలానా దీపాలు వెలిగించండి, ఫలానా దిక్కుకు తిరిగి పూజలు చెయ్యండి.
3. ఫలానా గుళ్ళూ గోపురాలూ దర్శించండి. అక్కడ ఆ పరిహారాలు చేయించండి. ఇక్కడ ఈ హోమాలు యజ్ఞాలు చేయించండి.
4. ఫలానా రాళ్ళు రప్పలు పెట్టుకోండి, ఫలానా రంగు గుడ్డలు ధరించండి. ఫలానా తాయెత్తులు యంత్రాలు కట్టుకోండి.

పైన వ్రాసిన కుప్పిగంతు రెమెడీలు, ప్రచండమైన గ్రహప్రభావం ముందు ఎందుకూ పనిచేయ్యవని బాగా గుర్తుంచుకోండి. మీరు చేసే దొంగపూజల వల్ల గ్రహప్రభావం ఏమాత్రం తప్పదు. మీ ఖర్మా తప్పదు. దొంగజ్యోతిష్కులు చెప్పే మాటలు నమ్మకండి.

మీమీ జీవితాలు స్వచ్చంగా శుద్ధంగా లేకుండా, మీరు ఎన్ని మతవేషాలు వేసినా అవి పనిచెయ్యవు. గుర్తుంచుకోండి.

గ్లోబల్ కర్మ అనుభవించే సమయం వచ్చేసింది. కనుక పైన చెప్పిన దొంగ మత వేషాలు ఎన్నెన్ని మీరు వేసినా మీమీ ఖర్మను తప్పించుకోలేరు. నేను చెప్పిన అసలైన రెమేడీలు పాటిస్తే మాత్రమే మీరు బయటపడతారు. లేకుంటే మీమీ ఖర్మలు అనుభవించడం ఖాయం ! డబ్బున్నవారైనా, పేదవారైనా, అధికారులైనా, బికారులైనా ఎవరైనా సరే దీనిని తప్పుకోలేరు. ఎవరి స్క్రిప్ట్ వారికుంటుంది. ఎవరి శిక్షలు వారికుంటాయి. కనీసం ఈ సమయంలోనైనా మనుషులుగా ప్రవర్తించడం మొదలుపెట్టండి.

నిజం నేను చెబుతున్నాను.

తరువాత మీ ఇష్టం !

20, మార్చి 2020, శుక్రవారం

Good Fryday

ఆలస్యంగానైనా తనున్నానని
చట్టం నిరూపించుకుంది
అబలలను కాటేసే మృగాలకు
ఇక్కడ చోటులేదని చాటిచెప్పింది

న్యాయం లేటైతే
అది న్యాయమే కాదంటుంది
న్యాయశాస్త్రం
కానీ ఆ లేటు ఎంత లేటో
అదెక్కడా చెప్పదు

ఏడేళ్ళు పట్టింది
ఒకమ్మాయికి
న్యాయం జరగడానికి
పవిత్ర భారతావనిలో

ఈ ఏడేళ్ళలో జరిగాయి
ఇంకో ఏడేళ్ళ ఘోరాలు
ఎన్నేళ్ళు పడుతుందో మరి?
అన్నిటికీ న్యాయం జరగాలంటే

మన దేశంలో ఊరికొక
నిర్భయ ఉంది
ఒకరికంటే ఎక్కువే ఉన్నారు
కొన్ని ఊర్లలో

ఈ శిక్ష పడటంలో ఎంతో ఉంది
సోషల్ మీడియా పాత్ర
ఇలాగే ముందుకు సాగాలి
జనఘోష యాత్ర

రాక్షసులు చచ్చిన ఈ రోజు
నిజమైన Good Friday
ఇలాంటి చీడ పురుగులను
Fry చేసి పారేసే Good Fryday

అందుకే నేనంటాను
ఈరోజు అసలైన Good Fryday అని
అంతేకాదు ప్రతిరోజూ
ఇలాంటి Good Fryday నే కావాలని

19, మార్చి 2020, గురువారం

జై కరోనా పెద్దమ్మా !

ఈ ప్రపంచానికి కొత్త దేవత
కరోనా మాత !
ఎందుకో తెలుసా నాయనలారా?

ప్రవక్తలొచ్చారు పోయారు
ఎవరూ వాళ్ళ మాట వినలేదు
సంస్కర్తలొచ్చారు పోయారు
ఎవరూ వాళ్ళ గోడు పట్టించుకోలేదు

మతాలు వెలిశాయి
మనిషి వ్యాపారంగా మారాయి
దేవుళ్ళు పుట్టారు
అంగళ్ళలో బొమ్మలయ్యారు

మంచి చెబితే ఎవరూ వినలేదు
పద్ధతులు నేర్పితే ఎవరికీ లెక్కేలేదు
ఒద్దురా బాబూ అంటే ఎవరూ ఆగలేదు
ఇలా ఉండాల్రా అంటే ఎవరూ తల తిప్పలేదు

ఇలా సాగింది ప్రపంచ నాటకం
కళ్ళున్నవాళ్ళు చూశారు చూశారు
ఎంతో బాధ పడ్డారు
దేవుడిని ఇలా ప్రార్దించారు

దునియా సబ్ ఖరాబ్ హోగయా
కుచ్ తో కరోనా....కుచ్ తో కరోనా
దేవుడు చిరునవ్వు నవ్వాడు
అప్పుడొచ్చింది కరోనా మాత !

దేవుడిని నమ్మనివాళ్ళు
అకస్మాత్తుగా మహా భక్తులయ్యారు
నీతి లేదనే వాళ్ళు, హటాత్తుగా
మహా నీతిపరులయ్యారు

పార్టీలు పబ్బాలు అని తిరిగేవాళ్ళు
ఇల్లే కదలడం లేదు
తాగుళ్ళూ తందనాలూ అనేవాళ్ళు
నీళ్ళు కూడా త్రాగడం లేదు

అంటూ సొంటూ లేదనేవాళ్ళు
అరవైసార్లు చేతులు కడుగుతున్నారు
సెంటు చాల్లే స్నానం వద్దు అనేవాళ్ళు
కుంటుకుంటూ స్నానాలు చేస్తున్నారు

అంటరానితనం మహాపాపం అనేవాళ్ళు
అయినవాళ్ళనే తాకడం లేదు
మనుషులంతా ఒక్కటేనని అరిచేవాళ్ళు
మరో మనిషికి ఆరడుగుల్లో ఉంటున్నారు

భాయీ భాయీ అంటూ వాటేసుకునేవాళ్ళు
బాబోయ్ బాబోయ్ అంటూ పారిపోతున్నారు
దగ్గేవాడినీ తుమ్మేవాడినీ వదిలేసి
దిక్కులకొకరు పరిగెత్తుతున్నారు

ప్రేయసీ ప్రియులు దూరంనుంచే
సరసాలు సాగిస్తున్నారు
భార్యాభర్తలు వేర్వేరు మంచాల్లో
నీరసంగా శయనిస్తున్నారు

పోపుని ప్రభువే కాపాడలేదు
తిరుపతి క్యూలో అసలు జనమే లేరు
షిరిడీ చిన్నబోయింది
ఖొమైనీకి కోరింతదగ్గు పట్టుకుంది
పీఠాధిపతులు పీటల కింద దాక్కుంటున్నారు

అల్లా అడ్రసు అసలే లేదు
యెహోవా ఎక్కడున్నాడో ఎవరికీ తెలీదు
ఇండియా దేవుళ్ళందరూ ఇష్టానుసారం పారిపోయారు
కరోనా మాతే ఇప్పుడందరి దేవత !

గుళ్ళూ మసీదులూ చర్చిలూ
అన్నీ అర్జెంటుగా మూతపడ్డాయి
వ్యాపారాలూ వ్యవహారాలూ హరీమన్నాయి
మానవ సంబంధాలన్నీ మనుగడ కోల్పోతున్నాయి

గుళ్ళలో తీర్ధప్రసాదాలు
గుంభనంగా మాయమయ్యాయి
చర్చిల్లో మసీదుల్లో ప్రార్ధనా సమావేశాలు
చల్లచల్లగా సర్దుకున్నాయి

అధికారుల దర్పం పారిపోయింది
ధనికుల డబ్బు పనికిరాకుండా పోయింది
రాజుకీ పేదకీ తేడా ఉన్నట్టుండి మాయమైంది
నిజమైన సమానత్వం రాత్రికి రాత్రే వెల్లివిరిసింది

కరోనాకి రూపం లేదు
అది పెద్ద ప్రవక్త కూడా కాదు
దానికొక ఫిలాసఫీ అంటూ లేదు
అదేమీ టీవీల్లోకొచ్చి ఉపన్యాసాలివ్వదు

కరోనా కులాన్నీ చూడదు మతాన్నీ చూడదు
కుళ్ళురాజకీయాలు దానికసలే తెలీదు
బీదా గొప్పా తారతమ్యమే దానిలో లేదు
రికమెండేషన్ దానితో అసలే పనిచెయ్యదు
గీత దాటితే కోత కోసి వాత పెట్టి
మోత మోగించడం మాత్రమే దానికి తెలుసు

అందుకే అందరూ దానికి దణ్ణం పెట్టి
బుద్ధిగా క్యూలో నించుంటున్నారు
అందరూ మంచివాళ్లయ్యారు
మంచిగా ప్రవర్తిస్తున్నారు

ఎవరూ బోధించకుండానే
శాకాహారులౌతున్నారు
ఎవరూ నేర్పకుండానే
దుబారా తగ్గిస్తున్నారు

అమ్మా బాబూ అంటే ఎవడూ వినడు
కాల్చి వాత పెడితేనే
కళ్ళు తెరుచుకుంటాయి మనిషికి
ఈ మాత్రం తెలీదూ ప్రకృతికి?

కరోనా మాత దెబ్బకి
మూతపడని బిజినెస్ లేదు
దెబ్బతినని ఇల్లు లేదు
తెరుచుకోని కళ్ళూ లేవు

పాతకాలంలో అమ్మ పోసేది
జాతరలు చేసి పొంగళ్ళు ఎత్తేవాళ్ళు
ఇప్పుడు కరోనా పెద్దమ్మ సోకుతుందని
నాటకాలు మానేసి బుద్ధిగా ఉంటున్నారు

ప్రస్తుతం మనందరం ఒకటే చెయ్యాలి
అర్జెంటుగా కరోనా పెద్దమ్మకి గుడి కట్టాలి
ఆమె ఎక్కడికీ పోకుండా మనతోనే ఉండాలి
ప్రపంచ జనాభా మాత్రం సగానికి తగ్గాలి

అప్పుడైనా మనిషి మనిషిగా ఉంటాడేమో?
అప్పుడైనా అవసరానికీ విలాసాలకూ
అంతరం మనిషికి అర్ధమౌతుందేమో?
మంచీ మర్యాదా భయమూ భక్తీ
మానవమృగాలలో అప్పుడైనా మేల్కొంటాయేమో?

కరోనా ఎక్కడికీ పోకూడదు ఇక్కడే ఉండాలి
ప్రతి సీజన్ లోనూ మనల్ని ఇలాగే కరుణిస్తూ
దారి తప్పుతున్న వాళ్ళని ఇలాగే కాటేస్తూ
విచ్చలవిడి తనాన్ని ఎక్కడికక్కడ కబళిస్తూ

కరోనా కాళిక అవతారం
జరగాలి మానవ సంహారం
తగ్గాలి అనవసర భూభారం
అప్పుడే జరుగుతుంది
మనిషి మనిషికీ ప్రకృతికీ చేస్తున్న
తప్పులకు పరిహారం

ఆధ్యాత్మిక వైరస్

ఎన్నో శతాబ్దాల క్రితం
నాకొక వైరస్ సోకింది
అప్పటినుంచీ దానినంటిద్దామని
చూస్తున్నా ఎవరికైనా

చాలామంది బడాయిలు పోయారు
నీ వైరస్ మాకిష్టం అంటూ
అంటిస్తా రమ్మంటే భయపడి
ఒకటే పరుగు తీస్తున్నారు

నాతో చేతులు కలిపినా
గ్లోవ్స్ వేసుకునే కలిపారు
నా కౌగిట్లోకి వచ్చినా
స్పేస్ సూట్లోనే వచ్చారు

ముఖానికి మాస్కులతో
నా ఇంటికి వచ్చారు
నెరవేరని టాస్కుల కోసం
నన్ను వద్దనుకున్నారు

నాతో చేతులు కలిపి
హ్యాండ్ వాష్ వాడుకున్నారు
నాటకానికి నన్ను హత్తుకుని
తర్వాత స్నానాలు చేశారు

నీతో వస్తాం అన్నవాళ్లు
నాలుగడుగుల తర్వాత
హటాత్తుగా నన్నొదిలేసి
పరిగెత్తి పారిపోయారు

బ్రతుకు మీద అంత తీపుంటే
నాతో రావాలని ఆశెందుకు?
మాయమయ్యే ధైర్యం లేకుంటే
నా ఇంట్లోకి అడుగెందుకు?

మగతనం లేకుంటే
మగువ మీద ఆశెందుకు?
తెగువనేది రాకుంటే
తనను దాటి చూపెందుకు?

మరణం నీడ నాకిష్టం
కానీ నేనెప్పుడూ బ్రతికే ఉంటాను
చావంటే మీకు భయం
కానీ మీరు నిత్యం చస్తున్నారు

చస్తూ బ్రతకడం నా కళ
బ్రతుకుతూ చావడం మీ ఖర్మ
చీకట్లో వెలుగును నేను
పగటిపూట నీడలు మీరు

మీకెందుకు నా స్నేహం?
నాకెందుకు మీ సహవాసం?
వైరస్ ఫ్రీగా కావాలంటే
అది కుదరని బేరసారం

అన్ని పరిష్కారాలూ లోపలున్న
అలవిగాని సమస్యని నేను
అమితమైన వెలుగును నింపుకున్న
అంతుబట్టని చీకటిని నేను

నడిరోడ్డులో నిలబడున్నా
నా వైరస్ మీకిస్తా రమ్మని
నన్నెవరూ నమ్మడం లేదు
వెలలేని వైరస్ కు విలువ లేదని

వైరస్ ని కూడా కొనుక్కుంటార్రా?
వెకిలి దరిద్రుల్లారా
పైరసీ బ్రతుకులెందుకురా?
నకిలీ ఆత్మల్లారా

వెలుగును విరజిమ్ముతూ పిలుస్తున్నా
నా చీకటిని మీకిస్తా రమ్మని
నా వైపెవరూ చూడడం లేదు
నాటకాల కళ్ళు పోతాయని

చీకటి లేనిదే వెలుగెలా వస్తుందిరా?
దద్దమ్మల్లారా
ఏడవలేనివాళ్ళు ఎలా నవ్వుతార్రా?
పెద్దమ్మల్లారా

ఇన్ని శతాబ్దాలుగా
ఈ వైరస్ నాలో ఉంది
కానీ నాకు చావు లేదు
ఏంటీ రహస్యం?

ఎన్నో జన్మలుగా
మీలో ఏ వైరసూ లేదు
కానీ మీరు రోజూ చస్తున్నారు
ఏంటీ విచిత్రం?

నాకే షాపూ లేదు
నడిరోడ్డు మీదే నా బేరం
నా వైరస్ ని కొనాలంటే
నువ్వు నగ్నంగా రావాలి

నాకే డబ్బూ వద్దు
నువ్వే నాక్కావాలి
నీకే జబ్బూ రాదు
నువ్వు మాయం కావాలి

నాతో వచ్చే ధైర్యం నీకుందా?
నీ ఇంటిని నీవు వదిలెయ్యాలి
నాతో నడిచే తెగింపు నీకుందా?
నీ ఒంటిని నీవు మర్చిపోవాలి

అప్పుడు నీకు తెలుస్తుంది
నాకే వైరసూ లేదని
అప్పుడే నీకర్ధమౌతుంది
నీ వైరసులన్నీ పోయాయని

మరి సిద్ధమేనా?
నాలా మారి నాతో కలసి
నడవడానికి?
నాలో కరిగి నేనుగా వెలిగి
నవ్వడానికి?

15, మార్చి 2020, ఆదివారం

కరోనా వైరస్ - లక్షణాలు - హోమియో మందులు - కొన్ని నిజాలు

కరోనా వైరస్ గురించి అనేక వదంతులు, పుకార్లు, నిజాలు ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కలగాపులగంగా ఉండటంతో, వీటిలో ఏవి నిజం? ఎంతవరకూ నిజం? అనేది మాత్రం ఎవరికీ ఖచ్చితంగా తెలియడం లేదు. అందరూ 'ఆర్సినికం ఆల్బం' మందును మాత్రం పప్పుల్లాగా వాడుతున్నారు. ఇది మాత్రం శుద్ధతప్పు.

కరోనా లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా లేవు. చైనాలో కనిపిస్తున్న లక్షణాలు ఇరాన్ లో లేవు. ఇరాన్ లో ఉన్న లక్షణాలు ఇటలీలో లేవు. ఇటలీలో ఉన్న లక్షణాలు ఇండియాలో లేవు. ప్రతి దేశానికీ ప్రతి ప్రాంతానికీ ఈ వ్యాధి మొదలయ్యే తీరులో, పెరుగుదలలో, కొన్ని భేదాలున్నాయి. అలాంటప్పుడు ఒకే హోమియో మందు అన్నిచోట్ల ఒకే విధంగా ఈ వ్యాధికి పనిచెయ్యదు.

అదే విధంగా, వ్యాధి మొదలయ్యాక, అందరిలోనూ ఒకే విధంగా ఇది ముదరదు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ముదురుతోంది. అప్పుడు కనిపించే లక్షణాలు కూడా భిన్నంగా ఉంటున్నాయి. కనుక ఈ వ్యాధి అన్ని స్టేజిల లోనూ ఒకే మందు పనిచెయ్యదు. ఆ స్టేజిలోని లక్షణాలను బట్టి రకరకాల మందులు వాడవలసి వస్తుంది.

ఇప్పటివరకూ నేను చూచిన మంచి ఆర్టికల్స్ లో ప్రఖ్యాత హోమియో వైద్యుడు డా || మనీష్ భాటియా వ్రాసిన ఈ పోస్ట్, కరోనా వైరస్ లక్షణాల మీదా, దానికి వాడవలసిన హోమియో మందుల మీదా చాలా ఖచ్చితమైన భావాలను ప్రతిబింబిస్తోంది.

చదవండి. నిజానిజాలు తెలుసుకోండి.

8, మార్చి 2020, ఆదివారం

'మహాస్మృతి ప్రస్థాన సూత్రము' ప్రింట్ బుక్ ఈ రోజు రిలీజైంది

బుద్ధ భగవానుని ఉపదేశమైన విపశ్యాన ధ్యానం మీద మా లేటెస్ట్ పుస్తకం 'మహాస్మృతి ప్రస్థాన సూత్రము' ప్రింట్ బుక్ ఈరోజు రిలీజైంది. ఇంతకు ముందు దీనిని ఈ-బుక్ గా రిలీజ్ చేశాము. ఈరోజున ప్రింట్ బుక్ విడుదల చేశాము. హైదరాబాద్ లోని మా నివాసంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది.

యధావిధిగా ఈ ప్రింట్ పుస్తకం కూడా google play books నుంచే లభిస్తుంది. అదేవిధంగా, త్వరలోనే మా క్రొత్త పుస్తకం Medical Astrology - Part 1 విడుదల అవుతుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను.





1, మార్చి 2020, ఆదివారం

మా ఇంగ్లీష్ E Book 'Journey to Infinite Mindfulness' ఈ రోజు విడుదలైంది

ఈరోజున మా క్రొత్త ఇంగ్లీష్ 'ఈ - పుస్తకం' - 'Journey to Infinite Mindfulness' విడుదల చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది ఇంతకు ముందు విడుదలైన మా  తెలుగు పుస్తకం 'మహాస్మృతిప్రస్థాన సూత్రము' కు ఇంగ్లీషు అనువాదం.

ఈ పుస్తకాన్ని అనువాదం చెయ్యడంలో ఎంతో సహాయపడిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీలు చక్కగా డిజైన్ చేసిన నా శిష్యుడు ప్రవీణ్ కు కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకంకోసం ఎంతో ఎదురుచూచిన తెలుగురాని నా శిష్యులకు, నా ఇంగ్లీష్ పుస్తకాలని ఇష్టపడే అంతర్జాతీయ పాఠకులకు కృతజ్ఞతలు.

బుద్ధుని ధ్యానమార్గమైన విపశ్యాన ధ్యానము పైన ఇది సాధికారిక గ్రంధం. నాదైన శైలిలో బుద్ధుని బోధనలకు ఈ పుస్తకంలో వివరణను ఇచ్చాను.

యధావిధిగా ఈ పుస్తకం కూడా Google play books నుంచి లభిస్తుంది.