నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

19, మార్చి 2020, గురువారం

ఆధ్యాత్మిక వైరస్

ఎన్నో శతాబ్దాల క్రితం
నాకొక వైరస్ సోకింది
అప్పటినుంచీ దానినంటిద్దామని
చూస్తున్నా ఎవరికైనా

చాలామంది బడాయిలు పోయారు
నీ వైరస్ మాకిష్టం అంటూ
అంటిస్తా రమ్మంటే భయపడి
ఒకటే పరుగు తీస్తున్నారు

నాతో చేతులు కలిపినా
గ్లోవ్స్ వేసుకునే కలిపారు
నా కౌగిట్లోకి వచ్చినా
స్పేస్ సూట్లోనే వచ్చారు

ముఖానికి మాస్కులతో
నా ఇంటికి వచ్చారు
నెరవేరని టాస్కుల కోసం
నన్ను వద్దనుకున్నారు

నాతో చేతులు కలిపి
హ్యాండ్ వాష్ వాడుకున్నారు
నాటకానికి నన్ను హత్తుకుని
తర్వాత స్నానాలు చేశారు

నీతో వస్తాం అన్నవాళ్లు
నాలుగడుగుల తర్వాత
హటాత్తుగా నన్నొదిలేసి
పరిగెత్తి పారిపోయారు

బ్రతుకు మీద అంత తీపుంటే
నాతో రావాలని ఆశెందుకు?
మాయమయ్యే ధైర్యం లేకుంటే
నా ఇంట్లోకి అడుగెందుకు?

మగతనం లేకుంటే
మగువ మీద ఆశెందుకు?
తెగువనేది రాకుంటే
తనను దాటి చూపెందుకు?

మరణం నీడ నాకిష్టం
కానీ నేనెప్పుడూ బ్రతికే ఉంటాను
చావంటే మీకు భయం
కానీ మీరు నిత్యం చస్తున్నారు

చస్తూ బ్రతకడం నా కళ
బ్రతుకుతూ చావడం మీ ఖర్మ
చీకట్లో వెలుగును నేను
పగటిపూట నీడలు మీరు

మీకెందుకు నా స్నేహం?
నాకెందుకు మీ సహవాసం?
వైరస్ ఫ్రీగా కావాలంటే
అది కుదరని బేరసారం

అన్ని పరిష్కారాలూ లోపలున్న
అలవిగాని సమస్యని నేను
అమితమైన వెలుగును నింపుకున్న
అంతుబట్టని చీకటిని నేను

నడిరోడ్డులో నిలబడున్నా
నా వైరస్ మీకిస్తా రమ్మని
నన్నెవరూ నమ్మడం లేదు
వెలలేని వైరస్ కు విలువ లేదని

వైరస్ ని కూడా కొనుక్కుంటార్రా?
వెకిలి దరిద్రుల్లారా
పైరసీ బ్రతుకులెందుకురా?
నకిలీ ఆత్మల్లారా

వెలుగును విరజిమ్ముతూ పిలుస్తున్నా
నా చీకటిని మీకిస్తా రమ్మని
నా వైపెవరూ చూడడం లేదు
నాటకాల కళ్ళు పోతాయని

చీకటి లేనిదే వెలుగెలా వస్తుందిరా?
దద్దమ్మల్లారా
ఏడవలేనివాళ్ళు ఎలా నవ్వుతార్రా?
పెద్దమ్మల్లారా

ఇన్ని శతాబ్దాలుగా
ఈ వైరస్ నాలో ఉంది
కానీ నాకు చావు లేదు
ఏంటీ రహస్యం?

ఎన్నో జన్మలుగా
మీలో ఏ వైరసూ లేదు
కానీ మీరు రోజూ చస్తున్నారు
ఏంటీ విచిత్రం?

నాకే షాపూ లేదు
నడిరోడ్డు మీదే నా బేరం
నా వైరస్ ని కొనాలంటే
నువ్వు నగ్నంగా రావాలి

నాకే డబ్బూ వద్దు
నువ్వే నాక్కావాలి
నీకే జబ్బూ రాదు
నువ్వు మాయం కావాలి

నాతో వచ్చే ధైర్యం నీకుందా?
నీ ఇంటిని నీవు వదిలెయ్యాలి
నాతో నడిచే తెగింపు నీకుందా?
నీ ఒంటిని నీవు మర్చిపోవాలి

అప్పుడు నీకు తెలుస్తుంది
నాకే వైరసూ లేదని
అప్పుడే నీకర్ధమౌతుంది
నీ వైరసులన్నీ పోయాయని

మరి సిద్ధమేనా?
నాలా మారి నాతో కలసి
నడవడానికి?
నాలో కరిగి నేనుగా వెలిగి
నవ్వడానికి?