Pages - Menu

Pages

22, మార్చి 2020, ఆదివారం

మకరరాశిలో శని, కుజ, గురువులు - రాబోయే రెండు నెలలలో ఏం జరుగుతుంది?

మరో రెండుగంటల్లో అంగారకుడు మరకరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ ఇప్పటికే శనీశ్వరుడున్నాడు. ఈ రాశి అంగారకునికి ఉచ్చస్థితినిస్తుంది. ఇది విధ్వంసయోగం లేదా దుర్ఘటనాయోగం అనబడుతుంది. ఈ పేర్లు జ్యోతిష్య గ్రంధాలలో లేవు. నేనే పెట్టాను.

ఈ యోగాలు చాలా రకాలైన ప్రమాదాలను ముఖ్యంగా ప్రకృతి ప్రమాదాలను కలిగిస్తాయి. ఆ తరువాత కొన్నాళ్ళకు గురువు అదే మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనిని దృఢకర్మయోగం అంటారు. ఈ పేరుకూడా నేనే డిజైన్ చేశాను. మకరరాశి ఈయనకు నీచస్థితి గనుక ఇదీ చెడునే చేస్తుంది. మొత్తమ్మీద శనీశ్వరుడు, అంగారకుడు గురువు కలసి కొన్నాళ్ళు మకరరాశిలో సంచరిస్తారు. ఆయా సమయాలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రమాదాలు, చావులు, విధ్వంసాలు జరుగుతాయి. ఆ టైం స్లాట్స్ ఇక్కడ ఇస్తున్నాను.

అసలే కరోనా వైరస్ మనకు చుక్కలు చూపిస్తోంది. రాబోయే రెండు నెలల్లో దాని విధ్వంసం ఊహాతీతంగా ఉంటుంది. జాగ్రత్త పడండి మరి !
----------------------------------------
అంగారకుని మకర రాశి సంచారం:--- మార్చి 22 నుండి మే 5 వరకు
గురువు మకరరాశి సంచారం:--- మార్చి 30 నుండి జూన్ 30 వరకు
ఈ సమయంలో అమావాస్యలు:--- మార్చి 24, ఏప్రిల్ 22
పౌర్ణములు:--- ఏప్రిల్ 7, మే 7
----------------------------------------
ఈ టైం స్లాట్స్ లో జరుగబోయే దుర్ఘటనలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
1. అగ్నిప్రమాదాలు, ఫేక్టరీలలో ప్రమాదాలు, అగ్ని/రసాయనిక ప్రమాదాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, డ్యాములు కూలడాలు, రైళ్ళు, రోడ్డు, విమాన ప్రమాదాలు.

2. మతగురువుల మరణాలు, వారిమీద దాడులు, కేసులు, వారి రహస్య కలాపాలు బయటపడటం, మతపరమైన అల్లర్లు, దేవాలయాలలో మతసంస్థలలో ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు, టెర్రరిస్ట్ దాడులు.

3. వ్యక్తిగత జీవితాలలో -- చిన్నాపెద్దా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అనారోగ్యాలు, సర్జరీలు, అకాల మరణాలు.

4. దీర్ఘరోగాలతో బాధలు పడుతున్నవారికీ, కేన్సర్, ఎయిడ్స్ వంటి అసాధ్యరోగాలున్నవారికీ ఈ సమయంలో పరలోకప్రయాణానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఏయే లగ్నాలకు రాశులకు ఏయే రంగాలలో ఇబ్బంది కలుగుతుంది?
-------------------------------------------------------------------------
మేషరాశి - ఉద్యోగం, చదువు, ఇల్లు.
వృషభరాశి - దూరప్రాంతాలు, కమ్యూనికేషన్, తండ్రి, పెద్దలు.
మిథునరాశి - వీరు ఎక్కువగా ఈ ప్రభావానికి గురౌతారు. మాట, దీర్ఘరోగాలు, మానసిక వ్యధ ఏరియాలలో వీరికి చెడు జరుగుతుంది.
కర్కాటక రాశి - వీరు కూడా ఎక్కువగా దెబ్బ తింటారు. భార్య/భర్త ఆరోగ్యం, కుటుంబ, వ్యాపార సంబంధాలు.
సింహరాశి - వీరు కూడా ఎక్కువగానే దెబ్బ తింటారు. ఆరోగ్యం, వృత్తి.
కన్యారాశి - సంతానం, వ్యాపారం, షేర్ మార్కెట్, ప్రేమ, రోగాలు,
తులారాశి - ఆరోగ్యం, ఇల్లు, చదువు, ఉద్యోగం.
వృశ్చికం -  కమ్యూనికేషన్, తమ్ముళ్ళు/చెల్లెళ్ళు, తండ్రి, తల్లి, పెద్దలు.
ధనుస్సు - వీరు కూడా ఎక్కువగా దెబ్బలు తింటారు. మాట, దీర్ఘరోగాలు, నష్టాలు.
మకరరాశి - వీరు కూడా ఎక్కువగా దెబ్బ తింటారు. ఆరోగ్యం, ఉద్యోగం, మానవసంబంధాలు, భార్య/భర్త.
కుంభరాశి - వీరు కూడా బాగా ప్రభావితం అవుతారు. నష్టాలు, అనారోగ్యాలు, కష్టాలు, యాక్సిడెంట్లు.
మీనరాశి - రోగాలు, నష్టాలు, అన్నలు/అక్కలు, బిజినెస్.

మొత్తం మీద -  ముఖ్యంగా మకర, కర్కాటక రాశులు ఆ తర్వాత మిథున, సింహ, ధనూ, కుంభరాశులు ఎక్కువగా ఈ ప్రభావాలు చవిచూస్తారు. 
-------------------------------------------------------------
టీవీలలో యూట్యూబులలో తెలిసీ తెలియని జ్యోతిష్కులు అనేక రెమెడీలు చెబుతున్నారు. అవేవీ పనిచెయ్యవు. పనిచేసినాయని మీకనిపిస్తే అది మీ జాతకంలో ఉన్న మంచియోగాల వల్లనేగాని ఈ రెమేడీలు పనిచేసి కాదు. భ్రమించకండి. మీమీ మతవేషాలతో గ్రహాలను మీరు మోసం చెయ్యలేరు.

నిజంగా పనిచేసే రెమేడీలు నేను చెబుతా వినండి. చేతనైతే ఆచరించండి.

1. స్వార్ధం తగ్గించుకుని పక్కవాడికి కొంచం సాయం చెయ్యండి. దానికోసం మీరు కొంత నష్టపొండి. అదే మీకు పరిహారం అవుతుంది. సాయం చెయ్యడం అంటే యూట్యూబు లింకులు, వాట్సప్ మెసేజీలు షేర్ చెయ్యడం కాదు. మీది కొంత మానుకుని పక్కవాడికి కొంత సాయం చెయ్యాలి. అదికూడా ఫలితాన్ని ఆశించకుండా చెయ్యాలి. అదీ అసలైన రెమెడీ అంటే !

2. కుట్రలు కుత్రంత్రాలు మానుకొని, సరళంగా సూటిగా బ్రతకడం కనీసం ఇప్పుడైనా మొదలుపెట్టండి.

3. దురుసుగా మాట్లాడటం, ఎదుటి మనిషిని నొప్పించడం మానుకోండి. ఎంతసేపూ మీమీ అవసరాల గురించి మాత్రమే ఆలోచించడం మానుకుని కొంత పక్కవాడి గురించి కూడా నిజాయితీగా ఆలోచించండి.

4. విలాసాలు, దుబారాలు తగ్గించుకుని నిరాడంబరంగా బ్రతకడం నేర్చుకోండి. మొత్తం మనమే తిందాం అన్న దురాశకు బానిసలై స్టోర్స్ అరలన్నీ మీరొక్కరే ఖాళీ చేసి మీమీ ఇళ్ళు వస్తువులతో డంప్ చెయ్యకండి.

5. మీరు కష్టపడి సంపాదించిన దానిలో కొంత దానం చెయ్యండి.  ఆ దానంకూడా పాత్రత ఉన్న వారికి ఇవ్వండి. అపాత్రులకు దానం చేసి ఇంకా పాపం మూటగట్టుకోకండి.

6. నిజాయితీగా బ్రతకడం, ప్రేమను హృదయంలో నింపుకోడవం, నలుగురితో మంచిగా ఉండటం నేర్చుకోండి.

ఇవే అసలైన రెమేడీలు, మిమ్మల్ని గ్రహప్రభావం నుంచి కాపాడే రెమేడీలు ఇవే. ఇవి కాకుండా, ఇవి చెయ్యకుండా, మీరు ఇంకెన్నెన్ని కుప్పిగంతులు వేసినా అవన్నీ పరమవృధా పనులని గ్రహించండి. ఆ కుప్పిగంతులు ఏవేవో ఈ క్రింద ఇస్తున్నాను చూడండి.

కుప్పిగంతు రెమేడీలు
-----------------------
1. ఫలానా రోజు ఫలానా దేవుడికి ఫలానా పూజ చెయ్యండి.
2. ఫలానా తీర్దాలు తీసుకోండి, ఫలానా బొట్లు పెట్టుకోండి, ఫలానా దీపాలు వెలిగించండి, ఫలానా దిక్కుకు తిరిగి పూజలు చెయ్యండి.
3. ఫలానా గుళ్ళూ గోపురాలూ దర్శించండి. అక్కడ ఆ పరిహారాలు చేయించండి. ఇక్కడ ఈ హోమాలు యజ్ఞాలు చేయించండి.
4. ఫలానా రాళ్ళు రప్పలు పెట్టుకోండి, ఫలానా రంగు గుడ్డలు ధరించండి. ఫలానా తాయెత్తులు యంత్రాలు కట్టుకోండి.

పైన వ్రాసిన కుప్పిగంతు రెమెడీలు, ప్రచండమైన గ్రహప్రభావం ముందు ఎందుకూ పనిచేయ్యవని బాగా గుర్తుంచుకోండి. మీరు చేసే దొంగపూజల వల్ల గ్రహప్రభావం ఏమాత్రం తప్పదు. మీ ఖర్మా తప్పదు. దొంగజ్యోతిష్కులు చెప్పే మాటలు నమ్మకండి.

మీమీ జీవితాలు స్వచ్చంగా శుద్ధంగా లేకుండా, మీరు ఎన్ని మతవేషాలు వేసినా అవి పనిచెయ్యవు. గుర్తుంచుకోండి.

గ్లోబల్ కర్మ అనుభవించే సమయం వచ్చేసింది. కనుక పైన చెప్పిన దొంగ మత వేషాలు ఎన్నెన్ని మీరు వేసినా మీమీ ఖర్మను తప్పించుకోలేరు. నేను చెప్పిన అసలైన రెమేడీలు పాటిస్తే మాత్రమే మీరు బయటపడతారు. లేకుంటే మీమీ ఖర్మలు అనుభవించడం ఖాయం ! డబ్బున్నవారైనా, పేదవారైనా, అధికారులైనా, బికారులైనా ఎవరైనా సరే దీనిని తప్పుకోలేరు. ఎవరి స్క్రిప్ట్ వారికుంటుంది. ఎవరి శిక్షలు వారికుంటాయి. కనీసం ఈ సమయంలోనైనా మనుషులుగా ప్రవర్తించడం మొదలుపెట్టండి.

నిజం నేను చెబుతున్నాను.

తరువాత మీ ఇష్టం !