Pages - Menu

Pages

6, ఏప్రిల్ 2020, సోమవారం

కరోనా కతలు - 5 (బెమ్మంగారెప్పుడో చెప్పారు)

ప్రపంచవ్యాప్తంగా జనాలలో, ముఖ్యంగా మన భారతీయులలో, ఇంకా ముఖ్యంగా మన తెలుగోళ్లలో ఒక పెద్ద రోగముంది. అదేంటంటే - ఏదైనా జరిగినప్పుడు 'అదుగో పలానాయన ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పాడు' అంటూ గోల మొదలుపెడతారు. ఇంకా ముదుర్లయితే 'ఇలా జరుగుతుందని నేను ఎప్పుడో చెప్పాను' అంటారు. ఆఫ్ కోర్స్ అలాంటి ముదుర్లలో నేనూ ఒకడిననుకోండి !

వెస్ట్ లో అయితే నోస్ట్రాడెమస్ అనేవాడు వ్రాసిన క్వార్ట్రైన్స్  అనే పద్యాలను ఉటంకిస్తూ తెగ రాస్తారు. అదే మనమైతే ఒకాయన్ని హఠాత్తుగా లేపి కూచోబెడతాం. ఇన్నాళ్లూ ఆయన ఎక్కడ నిద్రపోతున్నాడో మాత్రం మనకనవసరం. మన బిజినెస్ కి పనికొచ్చినంత వరకే కదా ఎవడైనా !

ఇంతకీ ఆయన పేరేమిటో తెలుసా - బెమ్మం గారు. 

మనకేం జరిగినా ఆయన కాలజ్ఞానం నుంచి తవ్వకాలు జరిపి, ఆ మార్మిక పద్యాలను బూజు దులిపి, ఇప్పటి సంఘటనలకు అతికి, ఊదరగొడతారు మనవాళ్ళు. పాపం బెమ్మంగారి గురించి మిగతా ప్రపంచానికి ఏమీ తెలీదు గనుక ఆయన బ్రతికిపోయాడు. లేకపోతే ఎప్పుడో చచ్చి ఉండేవాడు మూడోసారి.  అంటే, సిద్దయ్య కోసం ఒకసారి సమాధి లోనుంచి బయటకు వచ్చాడులే అందుకే మూడోసారి అంటున్నా !

ఒకవేళ బెమ్మంగారి పద్యాలలో మనకు పనికొచ్చే సమాచారం ఏమీ దొరకకపోతే, మనమే కొన్ని పద్యాలు రాసేసి అవి ఆయనే రాశాడని చెప్పేద్దాం. ఎలా ఉంది ఐడియా? అన్ని పద్యాలు ఎవడు రాస్తాడు అనుకుంటున్నారా? ఆఫ్టరాల్ నేనే ఇప్పటికి 5000 పద్యాలు రాశాను. బాగా చెయ్యి తిరిగిన పండితులకి అదొక లెక్కా? కావాలంటే ఇప్పుడే రాస్తా చూడండి !

ఆ || భారతమును మోది బాలించు వేళలో
తంపు ఏలుచుండ దెల్లవారి
కరుణ యొకటి బుట్టి కష్టంబు దెచ్చురా
కాళికాంబ ! హంస కాళికాంబ !

అంటే, బెమ్మంగారు ఈ మకుటంతో కాళికాంబ శతకం అనే ఒక శతకం రాశార్లే. అందుకే అదే మకుటాన్ని వాడానన్నమాట. ఎలా ఉంది బెమ్మంగారు కరోనా గురించి "ఎప్పుడో" వ్రాసిన పద్యం? అయినా, ఎన్ని పద్యాలు చదివినా మనకి బుద్ధి మాత్రం రాదుకదా? అది వేరే సంగతి అనుకోండి !

ఇంకొంతమంది ఇంకో అడుగేసి, మిగతా ప్రాచీనగ్రంధాలను కూడా జల్లెడబట్టి, వాటిలోంచి మరికొన్ని నగ్నసత్యాలను తవ్వి తీస్తారు. ఏ నగ్నత్వాన్నీ ఎవడూ ఎక్కువసేపు భరించలేడు గనుక, వీటిని కూడా అందరూ హర్షించరు. అలాంటి వాటిల్లో ఒకటి ఈ మధ్యనే జరిగింది. 

యోగవాసిష్ఠం అనే ప్రాచీనగ్రంధంలో 'కర్కటికా వృత్తాంతము' అనే అధ్యాయం ఒకటుంటుంది. ఇది నేను 15 ఏళ్ల వయసులో చదివాను. అందులో, హిమాలయాలలో ఉండే కర్కటి అనే ఒక రాక్షసి బ్రహ్మవరాన్ని పొంది మానవాళిని తినడానికి ఒక చిన్నపురుగు రూపంలో వఛ్చి జనాన్ని చంపుతూ ఉంటుంది. ఆ కథను అప్పట్లోనే కొందరు ప్రబుద్ధులు అప్పటి మహమ్మారి అయిన కేన్సర్ కి ముడిపెట్టి కధలు అల్లారు. వాళ్లకూ ఒక లాజిక్ ఉంది. అప్పట్లో నేనూ అది చదివి తెగ హాశ్చర్యపోయాను.

అదేంటంటే - కర్కటి అంటే కర్కాటకం కదా? ఇంగిలీషులో రాశిచక్రంలోని 'కేన్సర్' అదే కదా. కనుక యోగవాశిష్ఠంలో వశిష్ఠుడు శిష్టంగా రాసింది ఇప్పుడు మనకొస్తున్న కేన్సర్ గురించేనని కొంతమంది అప్పట్లోనే అప్పుడున్న మీడియాలో తెగరాశారు. అవన్నీ పాత రోజులు. ఇప్పుడు కేన్సర్ మనకు వక్కపొడి అయిపొయింది. ఇప్పుడు నడుస్తోంది కరోనా టైమ్స్. కనుక మళ్ళీ కర్కటికా వృత్తాన్తమును బయటకు తీసి 'కరోనా గురించే వశిష్ఠుడు రాసింది' అంటున్నారు. ఇప్పుడు కేన్సరూ కరోనా రెండూ టైటిల్ కోసం కొట్టుకుచస్తుంటే మనం చికెన్ కబాబ్స్ చీకుతూ తమాషా చూడాలా? బాబోయ్ ఒద్దులే. చికెన్ తింటే మళ్ళీ కరోనా నేనున్నా అంటూ మీదకొస్తుందంట. ఏమ్ చేస్తాం? హైదరాబాద్ లో ఉంటున్నా పారడైజ్ బిరియానీ తినే అదృష్టం పట్టలేదు ఇప్పటిదాకా ! ముందు నా జాతకం చూసుకోవాలి.

ఈ కరోనా కర్కటి వీడియో ఈ మధ్యనే ఒక వీరేశలింగం నాకు పంపించాడు. కంగారుపడకండి ఆయనెప్పుడు బ్రతికొచ్చాడా అని. సంఘాన్ని బాగుచెయ్యాలని, ఎవేర్నెస్ పెంచాలని, "షేర్ చేసుకోవాలని" చూసేవాళ్ళని నేనలాగే పిలుస్తాను. పోనీ మీకభ్యంతరం అయితే పేరు మారుస్తాను. వీరేశలింగం వద్దంటే ఏదో ఒక బోడిలింగం అని పెట్టుకుందాం ప్రస్తుతానికి. ఏం బాలేదా? దీనికంటే మొదటిదే బాగుందా? పోనీ అలాగే పిలుచుకోండి కాసేపు నాదేం పోయింది?

సరే ఆ వీడియో కాసేపు చూడగానే విషయం నాకర్ధమైంది. వెంటనే ఎమ్ జరిగిందో మీరు ఊహించగలరు కదూ. దీనికి పెద్ద ఆస్ట్రాలజీ అస్త్రాలు తెలీనక్కరలేదు. వీడియో డిలీట్, సెండర్ బ్లాక్. అదీసంగతి !

ఇదంతా ఉపోద్ఘాతమన్నమాట. ఇప్పుడు అసలు విషయం లోకొద్దాం.

బెమ్మంగారైనా, నోసుపొడుగు నోస్ట్రడెమస్ అయినా, లేకపోతే వశిష్టులవారు విశిష్టంగా చెప్పినా ఎవరెన్ని చెప్పినా నేనొకటి చెబుతాను. సరే వాళ్ళందరూ చెప్పారు. దానివల్ల మనకేం ఒరిగింది? నేనూ అయిదేళ్ల నుంచీ చెబుతున్నాను. "ఒరే బాబూ, ప్రకృతిని పాడు చెయ్యకండిరా, మీ బ్రతుకులనీ మనసులని పాడు చేసుకోకండిరా, చేటుకాలం ముందుంది, చస్తార్రా" అంటూ కొన్ని వందల పోస్టులు తెలుగులోనూ ఇంగిలీషులోనూ తెగ రాశాను. టైం స్లాట్స్ కూడా చెప్పాను. ఎవడు విన్నాడు? అయినా నా పిచ్చిగానీ బెమ్మం గారికే ఇక్కడ దిక్కు లేదు. ఇక మనమాట ఎవడు వింటాడు? పైగా ఆయనకున్నట్టు మనకేమీ శక్తులు లేకపాయె ! ఎలా మరి?

ఇంతకీ నేను చివరాఖరికి చెప్పేదేమంటే, ముందు ముందు ఏదో జరుగుతుందని వాళ్ళు చెప్పిన పద్యాలూ శ్లోకాలూ తవ్వి తీసి ఊదరగొట్టడం కాదు మనం చెయ్యవలసింది. ఆ పద్యాల పక్కనే, మనం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెబుతూ రాసిన పద్యాలూ శ్లోకాలూ కూడా ఉంటాయి. వాటిని కూడా చూడండి కాస్త. ఎలా బ్రతికితే ఇలాంటి విపత్తులు రాకుండా ఉంటాయో కూడా వాళ్ళు చెప్పారు. వాటినీ కాస్త తలకెక్కించుకొండి, మీకు తలంటూ ఉంటే? లేకపోతే ఏదో ఒకరోజున తలంటు పోస్తుంది ప్రకృతి.

బెమ్మమ్ గారు ఈరోజు మనకు మహనీయుడైనాడు. ఆయన బ్రతికున్న రోజుల్లో ఆయన ఒక సామాన్యకంసాలి మాత్రమే. వేమన ఈనాడు మనకు గొప్పవాడయ్యాడు. ఆయన బ్రతికున్న రోజులలో ఎవడూ ఆయన్ను పట్టించుకోలేదు. పైగా పిచ్చొడంటూ రాళ్లతో కొట్టారు. ఏదో బంగారం చేసే విద్య ఆయనకు తెలుసు కాబట్టి, పైగా మన రెడ్డిగారే కాబట్టి, కొండవీటిరాజులు కొన్నాళ్లు ఆయన్ను ఆదరించి దగ్గరుంచుకుని బంగారం చేయించుకున్నారని అంటారు. లేకపోతే ఆయన పిచ్చి పద్యాలెవడికి కావాలి?

ఏదేమైనా, ఎదురుగా ఉన్నవాళ్ళు ఎప్పుడూ మనకు కనిపించరు. ఎందుకంటే మన ఎదురుగా ఉన్న మనలాంటి మనిషిని గొప్పవాడని ఒప్పుకోవాలంటే మన అహం చాలా ఘట్టిఘా అడ్డొస్తుంది మరి ! అందుకే పోయినోళ్ళు చెప్పినవే మనం తవ్వితీసి వాళ్ళ పేరును వాడుకుని ఆ తర్వాత వాళ్ళను విసిరి అవతల పారేస్తాంగాని మన ఎదురుగా ఉండి మన చెవుల్లో ఘోషపెడుతున్న వారిని మాత్రం డోర్ మ్యాట్ లాగా తొక్కి పారేస్తాం. ఇదీ మన విజ్ఞత ! మనం మానవులం ! భలే ఉంది కదూ !

బెమ్మంగారైనా వేమన అయినా ఇప్పటికీ కొన్ని కులాలకు సొత్తుగా మారిపోయి ఉన్నారు. వాళ్ళ యూనివర్సల్ అప్పీల్ అనేది  Ph.D లకే పరిమితం అయి కూచుంది. ఇకపోతే మనం ఎలా బ్రతకాలో వాళ్ళు చెప్పిన మాటలు మాత్రం మనకనవసరం ! అయినా మనం ఎలా బ్రతకాలో వాళ్లెవరు చెప్పడానికి? కరోనా ఎప్పుడొస్తుందో చెప్పమనండి చాలు ! దానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుని ఆ కొద్దిరోజులు ఇంట్లో కూచుంటాం. ఆ తర్వాత మళ్ళీ పైలా పచ్చీస్ అంతే !

అయినా ఒకళ్ళు చెప్పాలా ? మన బ్రతుకులు చూస్తుంటే మనకు తెలీడం లేదూ ముందు ముందు మునుగుతామని? తెలిసినా ఈ పరుగు ఆపలేమని? పోయి పోయి ఎక్కడో చావక తప్పదని ?

ఈ మానవాళిని ఎవడూ మార్చలేడు. వీళ్ళింతే !