నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

28, ఏప్రిల్ 2020, మంగళవారం

'యోగతత్త్వోపనిషత్' తెలుగు 'ఈ-పుస్తకం' నేడు విడుదలైంది

అధర్వణ వేదంలోనూ, కృష్ణయజుర్వేదంలోనూ లభిస్తున్న 'యోగతత్త్వోపనిషత్' అనే ఈ ఉపనిషత్తు యోగసాంప్రదాయం గురించి విస్తృతంగా చర్చించింది. అందుకని, శంకరజయంతి సందర్భంగా ఈ పుస్తకాన్ని నా వ్యాఖ్యానంతో విడుదల చేస్తున్నాము.

ఈ రెండు ఉపనిషత్తులలోనూ, చర్చించిన విషయాన్ని బట్టీ, వాడిన భాషను బట్టీ, అధర్వణవేదంలో ఉన్న ఉపనిషత్తు ప్రాచీనమైనదిగా కనిపిస్తున్నది. కృష్ణయజుర్వేదంలోని ఉపనిషత్తులో మధ్యయుగాల నాటి వైష్ణవభావములు కొంచం కలిసి కన్పిస్తున్నాయి. అంతేగాక, హఠయోగ ప్రామాణిక గ్రంధముల నుండి కొన్ని శ్లోకములను సంగ్రహించి దీనిలో కలిపినట్లుగా కనిపిస్తున్నది. మధ్యయుగాలలో,  హఠయోగ విధానాలు అనేక యోగ తంత్ర గ్రంధములలో కలసిపోయాయి. అదే వరుస ఈ ఉపనిషత్తులో కూడా కనిపిస్తుంది.

అయితే, తనవైన కొన్ని ప్రత్యేక యోగవిధానములను ఈ ఉపనిషత్తు ఉపదేశిస్తున్నది. అధర్వణవేదంలో అయితే, ప్రాచీనకాలపు ఓంకారసాధన దర్శనమిస్తున్నది. యజుర్వేదభాగంలో, 'పంచభూతధారణ' అనే ప్రత్యేక యోగక్రియ కనిపిస్తున్నది. ఈ విధంగా ఈ ఉపనిషత్తుకు తనవైన కొన్ని ప్రత్యేకతలున్నాయి.

ఈ ఏడాది మా పంచవటి పబ్లికేషన్స్ నుండి వెలువడుతున్న ఆరవ పుస్తకం ఇది. ఈ నెలలో వెలువడుతున్న ఐదో పుస్తకం. కరోనా పుణ్యమాని ఈ నెలలో అయిదు ఉన్నత భావధార కలిగిన పుస్తకాలు వ్రాశాను.

ఈ పుస్తకం వ్రాయడంలో ఎంతగానో సహాయపడిన నా శ్రీమతికి, నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ లకు, నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా తెలుగు ఇంగ్లీషులలో వస్తుంది.