Pages - Menu

Pages

16, ఏప్రిల్ 2020, గురువారం

శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి? Vision 2020

'శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి?' అనేదే నా సాధనామార్గంలో నేను బోధించే అంశాలలో ఒక ముఖ్యమైన అంశం.

మనలో ప్రతివారికీ శాపాలున్నాయి. ఉంటాయి. కొంతమందికి ఆరోగ్యపరంగా ఉంటాయి. మరికొంతమందికి కుటుంబపరంగా ఉంటాయి. ఇంకొంతమందికి డబ్బుపరంగా ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఇవి ఉంటాయి. శాపాలు లేనిదే ఎవడూ ఈ భూమ్మీదకు రాడు. ఆ శాపాలను తొలగించుకునే మార్గాలు కూడా వాటి పక్కనే ఉంటాయి. అయితే, మన అహంకారం వల్ల, మొండితనం వల్ల, నాకేంటి? అనుకోవడం వల్ల ఆ మార్గాలను మనం అందిపుచ్చుకోలేక అఘోరిస్తుంటాం. ఆయా శాపాలతోనే బాధపడుతూ ఉంటాం గాని వాటిని పోగొట్టుకునే పనులు మాత్రం ఎప్పటికీ చెయ్యం. ఏ మనిషి జీవితమైనా ఇలాగే నడుస్తూ ఉంటుంది. ఇలాగే ముగుస్తుంది కూడా. అది సామాన్యుడి జీవితమైనా అసామాన్యుడినని అనుకునే వాడి జీవితమైనా చివరకు ఇలాగే ముగుస్తుంది.

ఈ ధోరణిని ఎలా మార్చుకోవాలి? మనకున్న శాపాలను ఎలా పోగొట్టుకోవాలి? అనేది నేను నేర్పించే అంశాలలో అతి ప్రధానమైన అంశం.

ఈ విషయాన్ని అలా ఉంచితే, దీనికీ Vision 2020 కీ ఏమిటి సంబంధం అంటే, ఉంది అంటాను. నేను చెబుతున్నది రాజకీయంగా నాయకులు చెప్పే Vision 2020 గురించి కాదు. నా విజన్ గురించి.

ప్రస్తుతం మనందరం కరోనా బాధితులం. హౌస్ అరెస్ట్ అయ్యాము. ఏమి చెయ్యాలో తెలీక ఇరవై నాలుగ్గంటలూ టీవీ చూస్తున్న అర్భకజీవులు కోట్లల్లో మన దేశంలో ఉన్నారు. పొద్దున్న లేచిన దగ్గరనుంచీ రాత్రి పడుకోబోయే దాకా నెట్లో కాలం గడుపుతున్న అల్పజీవులు మళ్ళీ కోట్లలో ఉన్నారు. నా దృష్టిలో వీరందరూ ఒక గమ్యం లేకుండా గాలికి పోతున్న గాలిపటాలు.

ఇప్పుడు విషయం లోకొస్తున్నాను.

నిన్న మా పుస్తకాల ప్రింటర్స్ కి ఫోన్ చేసాను 'ఏం చేస్తున్నారు?' అంటూ.

అదీ ఇదీ మాట్లాడాక 'మీరేం చేస్తున్నారు?' అని ఆయనడిగాడు.

'పెద్దగా తేడా ఏమీ లేదు. ఇంతకు ముందు ఏం చేస్తున్నానో ఇప్పుడూ అదే చేస్తున్నాను. కాకపోతే ఇంకా తీవ్రస్థాయిలో చేస్తున్నాను.' అని చెప్పాను.

'పుస్తకాలు ఏమైనా వ్రాస్తున్నారా/' అడిగాడాయన.

'నేను పుస్తకాలు వ్రాయడం వింత ఏముంది? అది చిన్నప్పటి మాట, ఇప్పుడు నా శిష్యుల చేత కూడా వ్రాయిస్తున్నాను. మంచి మంచి పుస్తకాలు వాళ్ళు కూడా వ్రాస్తున్నారు' అని చెప్పాను.

'వాళ్ళు సరే సార్, మీరు కనీసం ఒకటైనా వ్రాశారా ఈ లాక్ డౌన్ సమయంలో?' అడిగాడాయన.

'మీ ప్రెస్సు ఎప్పుడు తెరుస్తున్నారు?' అడిగాను.

'ఏమో తెలీదు. ఈ లాక్ డౌన్ ఎత్తేశాక తెరుస్తాం' అన్నాడు. 

'సరే, తెరిచాక రెడీగా ఉండండి. ఒక 20 పుస్తకాలు ప్రింట్ చెయ్యవలసి ఉంటుంది' అన్నాను.

'అవతల్నించి 'దబ్బు' మని ఎవరో పడిపోయిన శబ్దం వినిపించింది.

నవ్వుకుంటూ 'మెల్లిగా లేవండి' అన్నాను.

'ఆ. లేచాగాని, నిజంగా అన్ని రాశారా?' అడిగాడు.

'వ్రాస్తున్నా. అన్నీ ఒకేసారి ముందుకు సాగుతున్నాయి. కొన్ని అయిపోయాయి. కొన్ని అయిపోవస్తున్నాయి. కొన్ని మొదట్లో ఉన్నాయి. కానీ 2020 లో 20 పుస్తకాలు విడుదల చేస్తాను, ప్రస్తుతానికి ఇదీ నా విజన్' అన్నా.

'మీకంత లీజర్ టైం ఎలా ఉంటుంది? టీవీ చూడ్డానికే మాకు టైం సరిపోవడం లేదు' అడిగాడాయన.

'మీకు లేని లీజర్ నాకేమీ ఉండదు. కానీ నాదగ్గర ఒక లేజర్ ఉంది. అదేంటంటే నన్ను నడిపించే ఒక శక్తి. నా ఫెవరెట్ కొటేషన్ చెప్తా వినండి. ఇది నాదే. చాలాసార్లు దీనిని చెబుతూ ఉంటా. 'అడుక్కునే వాడికైనా అమెరికా ప్రెసిడెంట్ కైనా ఉండేది అవే 24 గంటలే' అనేదే ఆ కొటేషన్. టైం మేనేజిమెంట్ తెలిస్తే అన్నీ చెయ్యవచ్చు. అది తెలీకపోతే నిద్ర లేచేసరికే మధ్యాన్నం 12 అవుతుంది. అలాంటివాళ్ళు జీవితంలో ఏమీ సాధించలేరు. అదీ సంగతి' అన్నా.

'ఇంతకీ ఏ సబ్జెక్ట్ మీద వ్రాస్తున్నారు? అడిగాడాయన.

'వేరే ఏ సబ్జెక్టూ ఉండదు. ఆధ్యాత్మికం తప్ప వేరేదీ నేను వ్రాయను. అయితే మధ్య మధ్యలో కొన్ని జ్యోతిష్య పుస్తకాలు వ్రాస్తూ ఉంటాను. అయితే వాటిల్లో కూడా అంతిమంగా ఉండేది ఆధ్యాత్మికమే అనుకోండి' అన్నాను. 

' సరే సార్ ! ప్రెస్ తెరిచాక ఫోన్ చేస్తా' అని ఫోన్ పెట్టేశాడాయన.

ఆ 20 పుస్తకాల పరంపరలోనుంచి, ఒకటి రెండు రోజులలో రిలీజ్ కాబోతున్న మొదటి 'ఈ - బుక్' గురించి ఆలోచిస్తూ నేనూ ఫోన్ పెట్టేశాను.

శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలో అర్థమైందా మరి ?