నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, మే 2020, శుక్రవారం

కాలజ్ఞానం - 30

నిన్నా ఇవాళా రేపూ ఎల్లుండీ - అనవసరంగా మనస్సులు పాడవడం, మాట తేడాలు రావడం,  గొడవలు జరగడం, అన్నిచోట్లా జరుగుతాయి. మానవసంబంధాలు దెబ్బతింటాయి. చిలికి చిలికి గాలివానలు అవుతాయి. మనస్పర్ధలు వస్తాయి. సంయమనం అవసరం.

కంప్యూటర్లు పాడవడం, మొబైల్స్ క్రింద పడి పగిలిపోవడం, లేదా గీతలు పడటం జరుగుతాయి. నెట్ వర్క్ సమస్యలు తలెత్తుతాయి. జాగ్రత్త అవసరం.

ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వాటిల్లో అనుకోని చికాకులు తలెత్తుతాయి. ముందు చూపు అవసరం.
read more " కాలజ్ఞానం - 30 "

17, మే 2020, ఆదివారం

'గోరక్ష సంహిత' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది.


సిద్ధయోగసాంప్రదాయంలో పరమగురువైన గోరక్షనాధుడు వెయ్యిసంవత్సరాల క్రితం రచించిన 'గోరక్షసంహిత' నా వ్యాఖ్యానంతో నేడు విడుదలైంది. ఈ పుస్తకం, 'గోరక్షశతకం', 'గోరక్షయోగశాస్త్రమ'న్న రెండు గ్రంథముల సమాహారం. ఈయనకే గోరఖ్ నాధుడని పేరున్నది. ఈయన మత్స్యేంద్రనాధుని శిష్యుడు, మత్స్యేంద్రనాధుడు సాక్షాత్తు పరమశివుని శిష్యుడు. వీరిది శుద్ధమైన కౌలయోగ సిద్ధమార్గం. నాధయోగులందరూ పరమశివభక్తులు. ఎన్నో అమానుషములైన యోగసిద్ధులు కల్గిన తపశ్శక్తిసంపన్నులు. కొన్ని గ్రంధములలో మత్స్యేంద్రనాధుడు తనను తాను ఉమాశంకర పుత్రుడనని చెప్పుకున్నాడు. గోరక్షనాధుడు 10 వ శతాబ్దంలో బెంగాల్, అస్సామ్ ప్రాంతాలలో నివసించినట్లు ఆధారాలున్నాయి.

వీరి సాంప్రదాయం బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములనుండి నేపాల్, బంగ్లాదేశ్ లలో కూడా వ్యాపించి ఉన్నది. దక్షిణాదిన కర్ణాటకరాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్నది. తెలుగురాష్ట్రాలలో వేమనయోగి, వీరబ్రహ్మంగారు, ఎందఱో యోగులు, బైరాగులు, గోసాయిలు వీరి మార్గానుసారులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సిద్ధులగుట్టలో వీరు తపస్సు చేసిన ప్రాంతం ఉన్నది. ప్రాచీనకాలంలో రాజా భర్తృహరి, రాజా గోపీచంద్రదేవుడు మొదలైన మహారాజులు వీరి శిష్యులై, రాజ్యాన్ని త్యజించి యోగులైనారు. ముస్లిం సూఫీ యోగులు వీరిమార్గాన్ని అనుసరించారు. చక్రవర్తి అక్బర్, కబీర్ మొదలైనవారు ఈ మార్గమును భక్తితో అనుసరించారు. కబీర్, గోరఖ్ నాధులు కలుసుకున్నట్లు కొన్ని గాధలున్నాయి. కబీర్ తన పద్యాలలో గోరఖనాధుని ప్రశంసించాడు. సిక్కుల గురుగ్రంధసాహెబ్ లో వీరిని భక్తితో స్మరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వీరి బోధలకు లోనుగాని ప్రాంతం మనదేశంలో లేదు.  

బ్రహ్మంగారి యోగమార్గంలోను, తారక, అమనస్క, హఠ, రాజయోగాది సాధనామార్గములలోనూ వీరి బోధలు అంతర్లీనంగా ఉంటాయి. లింగమూర్తి గురుమూర్తి పంతులుగారు రచించిన 'సీతారామాంజనేయ సంవాదం'లో వీరి బోధలు స్పష్టంగా మనకు దర్శనమిస్తాయి.

నాధయోగులు కులమతాలకు, ఆస్తీ అంతస్తులకు ఏమాత్రమూ విలువనివ్వలేదు. యోగసాధనకు, వివేకవైరాగ్యములకు, జ్ఞానసిద్దికీ వీరు ప్రాముఖ్యతనిచ్చారు. వీరి బోధలు సమాజంలోని అన్ని కులాలనూ ప్రభావితం చేశాయి. ఎందరికో సత్యమైన యోగమార్గమును చూపించాయి.

మన తెలుగురాష్ట్రాలలో మొదటినుంచీ యోగులు ఎక్కువ. నలభైరోజుల చవకబారు దీక్షలూ, వ్యాపారభక్తీ ఇప్పుడు మన సమాజంలో ఎక్కువయ్యాయిగాని, వేలఏళ్లనుంచీ మనం యోగమార్గాన్ని అనుసరించినవారమే. రెండువేల ఏళ్ళక్రితమే బౌద్ధాన్ని తెలుగునేల ఎంతో ఆదరించింది. ఆ తర్వాత వచ్చిన సిద్ధయోగమార్గాన్ని కూడా అక్కునజేర్చుకుంది. దీనికి తార్కాణంగా అనేక పల్లెలలో ఈనాటికీ యోగసాంప్రదాయములు మినుకుమినుకుమంటూ మనకు కన్పిస్తాయి. ఇవి ముఖ్యంగా తెలంగాణలోని అనేక జిల్లాలలోను, ఆంధ్రాలోని కడప, ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలలోనూ ఎక్కువగా ఉన్నట్టు మనం చూడవచ్చు.

అద్భుతమైన ఈ యోగగ్రంధాన్ని మా సంస్థనుండి విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. యోగసాధకులకు ఈ గ్రంధం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చదువరులకు నాదొక్క సలహా ! పుస్తకాలు చదివి మీ అంతట మీరు యోగసాధనలు చెయ్యకండి. యోగసాధనామార్గంలో గురూపదేశం తప్పనిసరి అన్న విషయం మరచిపోకండి.

యోగ-తంత్ర-వేదాంతసమ్మిళితమైన మా సాధనామార్గంలో వీరి ఉపదేశములు ఎన్నో కలగలసి ఉంటాయి. అందుకనే వీరి బోధలను తెలుగులో నా వ్యాఖ్యానంతో ప్రచురించాలని సంకల్పించాను. దాని ఫలితమే ఈ పుస్తకం. 2020 లో మా సంస్థనుండి వస్తున్న 11 వ పుస్తకం మరియు లాక్ డౌన్ సమయంలో వస్తున్న 9 వ పుస్తకమిది.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఎప్పటిలాగే google play books నుండి లభిస్తుంది. లాక్ డౌన్ అయిపోయాక ఇంగ్లీషు, తెలుగులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
read more " 'గోరక్ష సంహిత' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది. "

13, మే 2020, బుధవారం

'ధ్యానబిందూపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది.


సామవేదాన్తర్గతమైన 'ధ్యానబిందూపనిషత్' ను నా వ్యాఖ్యానంతో నేడు విడుదల చేస్తున్నాము. 2020 లో మా నుంచి వస్తున్న పదవ పుస్తకమిది. లాక్ డౌన్ సమయంలో వస్తున్న ఎనిమిదో పుస్తకం. ఈ పది పుస్తకాలనూ ఇంగ్లీషులోకి అనువదించే ప్రయత్నాలు మొదలయ్యాయి. నా శిష్యులు ఆ పనిమీద ఉన్నారు. కనుక, నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2020 లో ఇరవై పుస్తకాలను రిలీజ్ చెయ్యడం అయిపోతున్నట్లే. 

ఇదింకా 'మే' నే కాబట్టి మిగిలిన ఏడునెలల్లో ఇవిగాక ఇంకొక పదిపుస్తకాలు రిలీజ్ అవడమూ, అవన్నీ ఇంగ్లీష్ లోకి తర్జుమా కావడమూ జరుగుతుంది. వెరసి 2020 లో మొత్తం నలభై పుస్తకాలను రిలీజ్ చేస్తున్నాం.

రెండేళ్ళక్రితం శ్రీశైలంలో జరిగిన రిట్రీట్లో అనుకుంటా 'త్వరలో నేను 100 పుస్తకాలు వ్రాస్తాను' అని యధాలాపంగా అన్నాను. ఈ ఏడాది చివరకు మా సంస్థనుండి 60 పుస్తకాలు విడుదల అవుతాయి. యధాలాపంగా అన్న మాట ఈ విధంగా నిజం అవుతోంది. నిజమైన ఆధ్యాత్మికతను లోకానికి బోధించే మన మతంలోని ప్రాచీన ప్రామాణికగ్రంధముల ఆవిష్కరణను ఈవిధంగా చెయ్యగలుగుతున్నాము.

పేరుకు తగినట్లే, ఈ ఉపనిషత్తు ధ్యానమునకు ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తున్నది. యధావిధిగా ఇందులో కూడా షట్చక్రములు, బంధములు, ప్రాణాయామక్రియలు,  గ్రంధిభేదనం, ఓంకారనాదోపాసన, నాడీచక్రం, హృదయపద్మంలో ఆత్మ సంచారంతో ఏయే భావములు ఎప్పుడు పుడుతూ ఉంటాయి? జాగ్రత్ స్వప్న సుషుప్తి, తురీయ, తురీయాతీత స్థితులను ఆత్మ ఎలా అందుకుంటుంది? ఆత్మసాక్షాత్కారం, బ్రహ్మానుభవం మొదలైన విషయములు వివరించబడి వాటికి దారులు సూచింపబడినాయి.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఎప్పటిలాగే google play books నుండి లభిస్తుంది. లాక్ డౌన్ అయిపోయాక ఇంగ్లీషు, తెలుగులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.
read more " 'ధ్యానబిందూపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది. "

9, మే 2020, శనివారం

'యోగశిఖోపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది.


బుద్ధపూర్ణిమ సందర్భంగా పంచవటి పబ్లికేషన్స్ నుండి మా క్రొత్త పుస్తకం కృష్ణ యజుర్వేదాన్తర్గత 'యోగశిఖోపనిషత్' ను, నా వ్యాఖ్యానంతో,  నేడు విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఒకరోజు ఆలస్యమైంది. సందర్భం మాత్రం అదే. బుద్ధపూర్ణిమకు నా జీవితంలో ఒక ప్రాముఖ్యత ఉన్నది. అది ఈనాటిది కాదు. నా చిన్నప్పటినుంచీ ఆ రోజున ఒక క్రొత్తపనిని, ఒక మంచిపనిని ప్రారంభిస్తూ వస్తున్నాను. పోయినేడాది ఇదే రోజున జిల్లెళ్ళమూడిలో అమ్మ పాదముల దగ్గర 'ధర్మపదం' పుస్తకాన్ని విడుదల చేశాం. ఈ బుద్ధపూర్ణిమకు హైదరాబాద్ నుంచి 'యోగశిఖోపనిషత్' ను విడుదల చేస్తున్నాను.

యోగోపనిషత్తులలో ఇది అగ్రగణ్యమైనది. అందుకే దీనికి 'యోగశిఖ' అనే పేరు వచ్చింది. భగవద్గీతకూ దీనికీ పోలికలున్నాయి. భగవద్గీత ఎలాగైతే తన పద్దెనిమిది అధ్యాయములలో పద్దెనిమిది విభిన్నములైన సాధనామార్గములను వివరించిందో, అదే విధంగా, ఈ గ్రంధంకూడా తన ఆరు అధ్యాయములలో ఆరు సాధనామార్గములను చెప్పింది. సిద్ధయోగమునకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిన ఈ గ్రంధం, కుండలినీయోగమును, అద్వైతసాంప్రదాయమును, యోగసాధనలోని అనేక అంశములను ఒకేచోట వివరించే ప్రయత్నాన్ని చేసింది. అందుకనే ఈ గ్రంధం యోగశాస్త్రములలో తలమానికమని పండితుల అభిప్రాయం.

ఈ గ్రంధం ఇప్పటిది కాదు. రెండువేల ఏళ్ళ క్రితం వ్రాయబడిన గ్రంథమిది. దీనికి నేను వ్యాఖ్యానం వ్రాయగలగడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, నా గురుదేవుల అనుగ్రహం.

ఈ ఏడాది మా సంస్థనుండి వస్తున్న తొమ్మిదో పుస్తకమిది. లాక్ డౌన్ సమయంలో వస్తున్న ఏడవ పుస్తకం.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఎప్పటిలాగే google play books నుండి లభిస్తుంది. లాక్ డౌన్ అయిపోయాక ఇంగ్లీషు, తెలుగులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

read more " 'యోగశిఖోపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది. "

Birth time rectification of Sri T. Krishnamacharya, Father of modern Yoga

ఈయన 18-11-1888 నాడు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో జన్మించారు.  జననసమయం తెలియదు గనుక మన పద్ధతులలో విశ్లేషణ చేద్దాం.

ఉదయం 11. 57 వరకూ మేషరాశిలో ఉన్న చంద్రుడు ఆ తర్వాత వృషభ రాశికి మారాడు. ఆ రోజున ఈ క్రింది నక్షత్రాలు ఉన్నాయి.


భరణి - 4 ఉదయం 7. 30 వరకూ
కృత్తిక - 1 మధ్యాన్నం 11 . 57 వరకూ
ఇంతవరకూ మేషరాశిలో చంద్రుడున్నాడు. ఇక్కడనుంచి వృషభానికి మారాడు.
కృత్తిక - 2 సాయంత్రం 5. 30 వరకూ
కృత్తిక - 3 రాత్రి 11. 30 వరకూ

ఉదయమైనా, సాయంత్రమైనా శనియే ఆత్మకారకుడవుతున్నాడు. ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకూ చంద్రుడు అవుతున్నాడు. ఆ సమయంలో కారకాంశ ధనుస్సు అవుతున్నది. ఈయనది స్థూలశరీరం కాదు. ధనుర్లగ్నం వారు పెద్ద వయసులో బాగా ఊబకాయులు అవుతారు. ఈయన కాదు గనుక, 101 ఏళ్ల వయసులో కూడా ఈయన చాలా గట్టిగా ఉన్నాడు కనుకా ఈయనది ధనుర్నవాంశ కాదని నా ఉద్దేశ్యం. కనుక ఈయన ఆత్మకారకుడు చంద్రుడు కాడు శనియే. కనుక ఈయన జననం ఉదయం 9. 30 లోపైనా అయ్యుండాలి లేదా 11. 57 తర్వాతైనా అయ్యుండాలిగాని ఆ మధ్యలో మాత్రం కాదు. ముందైతే మేషరాశి, తర్వాత అయితే వృషభరాశి అవుతుంది.

మేషరాశిలో అయితే కర్కాటకరాశిలో ఉన్న శపితయోగం వల్ల గృహసౌఖ్యం కరువౌతుంది. వృషభమైతే విపరీతమైన పట్టుదల వస్తుంది. రెండోదే కరెక్టు గనుక, అలాంటి పట్టుదల లేకుంటే హఠయోగమును సాధించలేడు కనుకా, చంద్రుడు వృషభరాశిలోనే ఉన్నాడని ఊహిస్తున్నాను. అదీగాక, వృషభంలో చంద్రునికి ఉఛ్ఛత్వం ఉన్నది. చంద్రుడు మాతృకారకుడు గనుక తల్లివైపునుంచి అదృష్టమూ, ఆధ్యాత్మికచింతనా అబ్బుతాయి. ఆధ్యాత్మికం ఎప్పుడైనా తల్లివైపునుంచే ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ విధంగా చూచినా ఈయనది వృషభరాశియేనని తెలుస్తున్నది.

వృషభంలోకి వచ్చేవరకూ ఆత్మకారకుడుగా ఉన్న చంద్రుడు అక్కడికి రాగానే దారాకారకుడవుతాడు. అంటే, చంద్రుని ఉఛ్ఛత్వం వల్ల భార్యవైపునుంచి అదృష్టం కలుగుతుంది.  కానీ డిగ్రీల పరంగా బలహీనుడు గనుక వెంటనే రాదు. కాలక్రమేణా అదృష్టం పెరుగుతుంది. భార్యనుంచే గాక భార్యవైపు బంధువులనుంచి కూడా వస్తుంది. ఈయన జీవితంలో సరిగ్గా అదే జరిగింది. పెళ్లి తర్వాత నిదానంగా ఈయనకు అదృష్టం పెరుగుతూ వచ్చింది. అంతేగాక, బావమరిది అయిన బీకేఎస్ అయ్యంగార్ ద్వారా ఈయనకు ప్రపంచప్రఖ్యాతి కలిగింది. ఒక్కసారి కూడా  భారతదేశం వదలి బయటకుపోని ఈయన పేరును ఇప్పుడు కనీసం నూరుదేశాలలో యోగాభిమానులు తలచుకుంటున్నారు. 

చంద్రుడు దారాకారకునిగా సాయంత్రం 7 గంటలవరకూ ఉన్నాడు. అంటే, ఈయన జన్మించినది మధ్యాహ్నం 11.57 నుండి సాయంత్రం 7 లోపని తేలుతోంది. ఈ మధ్యలో మకరం నుంచి వృషభం వరకూ లగ్నములు గడిచాయి.

ఇప్పుడు ఈయన జీవితంలోని కొన్ని సంఘటనలను గమనిద్దాం.

1925 లో అంటే 36 ఏళ్ల వయసులో ఈయన వివాహం చేసుకున్నారు. అంటే, వివాహం ఆలస్యమైనట్లే లెక్క. కనుక వివాహభావాలతో శనికి సంబంధం ఉండాలి. అంటే, లగ్నం మకరం గాని, మేషంగానీ అయ్యుండాలి. అంటే, ఈయన పుట్టినది, 11.30 నుంచి 12.26 లోపుగాని  లేదా 15.50 నుంచి 17. 30 లోపు అయ్యుండాలి.

1926 లో మైసూరు మహారాజు శ్రీకృష్ణరాజ ఒడయార్ ఈయన పాండిత్యాన్ని, యోగశక్తిని చూచి, ఈయన అభిమాని అయ్యాడు. తన ఆస్థానంలో విద్వాన్ పదవినిచ్చి ఆదరించాడు. ఆ సంవత్సరంలో శని తులలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. మకరానికైతే, దశమంలో ఉంటూ పదవీయోగాన్నిస్తాడు. మేషానికైతే సప్తమంలో ఉంటూ వివాహ, వ్యాపారాదులలో మేలు చేస్తాడు. కనుక మకరలగ్నమే సరిపోతుంది. అంటే, ఈయన జన్మించిన టైం స్లాట్ మధ్యాన్నం 11.57  నుండి 12.26 లోపన్నమాట.

1940 లో మైసూరు మహారాజు మరణించడంతో ఈయనకు మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. క్రొత్త మహారాజు చామరాజేంద్ర ఒడయార్ కు యోగామీద అంత ఇష్టం లేదు. కనుక పాత రాజుగారిలాగా యోగవిద్యావ్యాప్తికి ఈయన సహాయం చెయ్యలేదు, ప్రోత్సహించలేదు. ఆ సమయంలో శని మేషంలో నీచలో ఉన్నాడు. మకరలగ్నమైతే, శని సుఖస్థానాన్ని పాడుచేస్తూ, దశమాన్ని చూస్తూ ఉద్యోగాన్ని కూడా పాడుచేస్తాడు గనుక సరిగ్గా సరిపోతుంది. కనుక ఈ సంఘటన కూడా మకరలగ్నమునే బలపరుస్తోంది.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మహారాజులు సంస్థానాలు రద్దయ్యాయి. మైసూరు యోగశాల కూడా మూతపడింది. అందుకని ఈయన 1950 నుంచి 1952 మధ్యలో బెంగుళూరుకు మారి చివరకు మద్రాసు చేరుకున్నారు. ఇది ఈయన జీవితంలో మరొక ఘట్టం. ఈ సమయంలో శని మకరానికి అష్టమంలోనూ నవమంలోనూ సంచరించాడు. 1950 లో అష్టమంలో శత్రుస్థానంలో ఉన్నపుడు మైసూరు యోగశాల మూతపడింది. 1952 లో నవమంలో మిత్రక్షేత్రమైన కన్యకు వచ్చినపుడు మద్రాసులోని వివేకానందకాలేజీలో ఉద్యోగం వచ్చి అక్కడకు మకాం మార్చారు. కనుక ఈ సంఘటనలు కూడా మకరలగ్నానికే సరిపోతున్నాయి.

ఈయనకు 96 ఏళ్ల వయసులో అంటే 1984 ప్రాంతంలో తుంటి ఎముక విరిగింది. ఆ సమయంలో వక్ర శని, వక్ర కుజుడు తులలో ఉన్నారు. అంటే నవమమైన కన్యలోకి వస్తారు. ఇది దుర్ఘటనాయోగం గనుక, నవమం తుంటి గనుక, ఆ సమయంలో ఈయనకు తుంటి ఎముక విరిగింది. ఈ సంఘటన కూడా మకరలగ్నానికే సరిపోతుంది. అంటే, జననసమయం మధ్యాన్నం 11.57  నుండి 12.26 లోపన్నమాట.

మకరలగ్నజాతకులకు జీవితం చాలా కష్టాలతో గడుస్తుంది. ఏటికి ఎదురీతలాగా ఉంటుంది వారి జీవితం. కానీ స్వయంశక్తితో ఎదిగిన సంతృప్తి వారికి ఉంటుంది. మొదట్లో ఎన్ని కష్టాలు పడినా, మొండిగా ఎదురీది, జీవితం చివరకు వాళ్ళు హిమాలయ శిఖరాల్లాగా నిలుస్తారు. ఈయన జీవితం కూడా ఇలాగే నడిచింది పైగా పంచమంలో ఉఛ్చచంద్రుని వల్ల ప్రపంచప్రఖ్యాతి గాంచిన శిష్యులూ, పుత్రులూ ఉంటారు.

కాబట్టి ఈయనది మకరలగ్నమేనని నేను నిర్ధారిస్తున్నాను.

ఇప్పుడు ఇంకా సూక్ష్మంగా పరిశీలించి ఖచ్చితమైన జనన సమయాన్ని రాబడదాం. మకరలగ్నంలోని తొమ్మిది నవాంశలలో ఈయనది కన్యానవాంశ అవుతుంది. ఎందుకంటే, 11.58 తరువాత 12. 26 లోపు మూడే నవాంశలు ఉంటాయి. అవి  కర్కాటక, సింహ, కన్యా నవాంశలు. కన్య అయితేనే ఈయన జీవితంలోని అంశములు సరిపోతున్నాయి. అదంతా ఇక నేను వివరించను. జ్యోతిష్యశాస్త్రాభిమానులు, విద్యార్థులకు హోమ్ వర్క్ లా వదిలేస్తున్నాను. ఈ నిశ్చయానికి నేనెలా వచ్చానో మీరే కనుక్కోండి.

అలా అయినప్పుడు, ఈయన జననసమయం ఇంకా కుదించబడి, మధ్యాన్నం 12.15 నుంచి 12.26 మధ్యలోకి వస్తుంది. ఈ టైం స్లాట్ లో ఈయన పుట్టినది 12. 23 నిముషములకు అని నేను చెబుతున్నాను. ఎలా అనేది చెప్పను. మీరే కనుక్కోవాలి.

ఈ సమయాన్ని బట్టి ఆయన చనిపోయిన 28-2-1989 నాడు శుక్ర - శుక్ర - గురు - శుక్ర - శుక్రదశ నడిచింది. శుక్ర గురువులిద్దరే ఈ దశానాధులు. శుక్రుడు ద్వాదశంలో బాధకస్థానాధిపతితో కలసి ఉంటూ ఆస్పత్రిని మరణాన్ని సూచిస్తున్నాడు. గురువు ద్వాదశాధిపతిగా బాధకస్థానంలో అష్టమాధిపతి అయిన సూర్యునితో కలసి ఉంటూ మళ్ళీ మరణాన్ని సూచిస్తున్నాడు. కనుక సరిగ్గా సరిపోయింది.

కనుక ఈయన జననసమయం మధ్యాహ్నం 12.23 అని జననకాల సంస్కరణ చేశాను. ఆ సమయానికి కృత్తికానక్షత్రం రెండవపాదం నడుస్తున్నది.

ఇప్పుడు దశలను సంఘటనలను గమనిద్దాం.

1925 లో వివాహం - అప్పుడు రాహు - చంద్రదశ నడిచింది. రాహువు సప్తమంలో చంద్రుని సూచిస్తున్నాడు. చంద్రుడు సప్తమాధిపతి, దారా కారకుడు. సరిగా సరిపోయింది. 

చిన్నప్పుడే తండ్రి మరణించాడు. అది చంద్రదశలో జరిగింది. దశమం నుంచి చంద్రుడు అష్టమంలో ఉచ్ఛస్థితిలో ఉంటూ తండ్రిమరణాన్ని సూచిస్తున్నాడు. కనుక సరిపోయింది.

1926-1940 ఈయన మైసూరు మహారాజు ఆదరణతో ఉన్నాడు. ఆ సమయంలో ఈయనకు దాదాపుగా గురుమహర్దశ నడిచింది. లాభస్థానంలో సూర్యునితో కలసి ఉచ్చచంద్రునిచేత చూడబడుతున్న గురువు, రాజమూలకమైన లాభాన్నిచ్చాడు.

ఆ తర్వాత గురు-కుజ, గురు- రాహు ఛిద్రదశలలో యోగశాల మూతపడింది. ఇదికూడా సరిగ్గా సరిపోయింది.

1950 - 52 మధ్యలో బెంగుళూరు, మద్రాసులకు మార్పు. అప్పుడు శని-కేతు, శని - శుక్రదశలు నడిచాయి. మొదటిదశలో, కేతువు విడదీస్తాడు గనుక ఉన్నఊరినుంచి బయటకు వెళ్ళవలసి వచ్చింది. రెండవదశలో కాళిదాసు సూత్రం నిజమై రాజుకు కూడా అడుక్కునే స్థితి పట్టింది. కానీ చివరకు మద్రాసులో ఉద్యోగం వచ్చింది.

1984 లో తుంటి ఎముక విరిగినప్పుడు ఈయనకు కేతు - రాహుదశ నడిచింది. ఇది జీవితంలో పెనుమార్పుకు శ్రీకారం చుడుతుందని ఎన్నో సార్లు నేను వ్రాశాను, చెప్పాను. అదే జరిగింది. ఆ తర్వాత ఆయన మంచానికి, కుర్చీకి అంకితం అయ్యాడనే చెప్పాలి.

ఈ విధంగా సంస్కరింపబడిన సమయంతో జీవితసంఘటనలు సరిగ్గా సరిపోతున్నందున నేను చేసిన సంస్కరణ సరియైనదేనని నమ్ముతున్నాను.
read more " Birth time rectification of Sri T. Krishnamacharya, Father of modern Yoga "

8, మే 2020, శుక్రవారం

Birth chart of T. Krishnamacharya, Father of modern Yoga

నేడు 'అష్టాంగయోగా' అంటే అందరికీ తెలుసు. 'అయ్యంగార్ యోగా' అంటే తెలుసు. ఇంద్రాదేవి యోగా అంటే మీకు తెలియకపోయినా యూరప్ అంతటా తెలుసు. నేటి జనానికి బాబా రాందేవ్ తప్ప ఇంకెవరూ తెలియకపోవచ్చు. యోగేంద్రగారి  పేరును, స్వామి కువలయానందగారి పేరును మీలో చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ, అష్టాంగయోగాకైనా, అయ్యంగార్ యోగాకైనా, ఇంద్రాదేవి యోగాకైనా ఒక మూలం ఉంది. ఒక్క గృహస్థయోగి దగ్గరే వీళ్ళందరూ యోగాభ్యాసాన్ని నేర్చుకున్నారు. నవీనకాలంలో 'యోగా' ను పునరుజ్జీవింపజేసి, దానిని అమితంగా ప్రభావితం చేసి, నేడు యోగా అనేది ప్రపంచంలోని అన్ని దేశాలలో అభ్యసించబడటానికి కారకులలో అతిముఖ్యుడు తిరుమలై కృష్ణమాచార్య. ఆయనే వీరి గురువు. ఈనాడు ప్రపంచం మొత్తం మీద ఇంటింటిలో యోగాభ్యాసం చేస్తున్నారంటే దానికి ఈయనే కారకుడు. ఈయన సరిగ్గా 101 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికారు. సంకల్పంతో గుండెను రెండు నిముషాలపాటు కొట్టుకోకుండా ఆపడంవంటి మనం నమ్మలేని అద్భుతాలను చేసి చూపారు. యోగాభ్యాసమహిమను లోకానికి చాటిచెప్పారు. ఈయన్ను మనం మరచిపోకూడదు. ఈయన జాతకాన్ని పరిశీలిద్దాం.

ఈయన 18-11-1888 నాడు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 5 సంవత్సరాల చిన్న వయసులో తన తండ్రిగారిదగ్గర యోగాభ్యాసంలో ఓనమాలు దిద్దుకున్నారు. అప్పుడే పతంజలియోగసూత్రాలను అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. ఈరోజులలో 5 ఏళ్ల పిల్లలు ఎంత అల్లరి చిల్లరిగా, అసహ్యంగా, వెధవల్లాగా ఉంటున్నారో చూస్తే, ఆరోజులలో సాంప్రదాయ కుటుంబాలలో పిల్లలను చిన్నప్పటి నుంచే ఎలా పెంచేవారో అర్ధమౌతుంది. ఆ పిల్లల జీన్స్ కూడా అలాగే ఉండేవి. చెబితే వినేవారు. ఒక క్రమశిక్షణలో ఉండేవారు. శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. తల్లిదండ్రుల అడుగుజాడలలో నడిచేవారు.

ఆఫ్కోర్స్ ! నేటిపిల్లలు కూడా వారివారి తల్లిదండ్రుల అడుగుజాడలలోనే నడుస్తున్నారనుకోండి. వాళ్ళెటు పోతున్నారో వాళ్లకూ తెలియదు. వీళ్ళు ఎలా పెరుగుతున్నారో వీళ్లకూ తెలియదు. 'యధా తల్లిందండ్రులు తధా పిల్లలు' ! వేపచెట్టుకు తియ్యని మామిడిపండ్లు ఎలా కాస్తాయి మరి?

నేడు 50, 60  ఏళ్ళొచ్చిన గాడిదలకు కూడా పతంజలి యోగసూత్రాలంటే ఏమిటో తెలియదు. కానీ కృష్ణమాచార్యగారు 5 ఏళ్ల వయసులో వాటిని అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. అదీ ఆయనకూ మనకూ తేడా ! చరిత్ర సృష్టించేవారి జీవితాలు మొదటినుంచీ విభిన్నంగానే ఉంటాయి మరి !

కృష్ణమాచార్యగారి చిన్నవయసులోనే ఆయన తండ్రిగారు గతించారు. కానీ పిల్లవానికి మంచి నైతికమైన, ఆధ్యాత్మికమైన పునాదులు వేసి ఆయన పోయారు. నేటి తల్లిదండ్రులు ఆస్తులు, డబ్బులు ఇఛ్చి పిల్లలను నైతికతా ఆధ్యాత్మికత లేని గాడిదల్లాగా తయారుచేసి, అన్నిరకాల వేషాలూ నేర్పి మరీ పోతున్నారు. అదీ వారికీ వీరికీ తేడా !

నిన్న లాక్ డౌన్ సమయంలో బార్లు తెరిస్తే, హైదరాబాద్ లో టీనేజీ ఆడపిల్లలు బాహాటంగా క్యూలో నిలబడి మరీ లిక్కర్ బాక్సులు కొనుక్కుని వాటిని మోసుకుని ఇంటికి తీసుకుపోతున్నారు. ఇదీ నేటి తల్లిదండ్రుల పెంపకం తీరు !

ప్రాచీన వైష్ణవసాధువు నాధముని తమ వంశంలోని వాడని కృష్ణమాచార్యగారితో వారి నాన్నగారు చెప్పారట. నాధముని అనే ఆయన వైష్ణవసాంప్రదాయంలో ప్రసిద్ధుడు. ఈయన క్రీ. శ. 823 - 951 మధ్యలో జీవించాడు. అంటే ఇప్పటికి 1200 ఏళ్ళక్రితంవాడు. అప్పట్లో ఆయన 128 ఏళ్ళు బ్రతికాడు. నాధమునిని మొట్టమొదటి వైష్ణవ ఆచార్యునిగా నేటికీ ఆ సాంప్రదాయంలో గౌరవిస్తారు. నాలాయిర దివ్యప్రబంధాన్ని ఆయన సంకలనం చెయ్యడమే గాక, 'యోగరహస్యం' అనే యోగగ్రంధాన్ని ఆయన వ్రాశాడని అంటారు. అంటే, యోగశాస్త్రంలో ఆయన చెయ్యితిరిగిన వాడనేగా అర్ధం ! ఈ నాదమునిగారి సమాధి తమిళనాడులోని ఆళ్వార్ తిరునగరి అనేచోట ఉన్నది. 16 ఏళ్ల కుర్రవానిగా ఉన్నప్పుడు కృష్ణమాచార్యగారు ఈ సమాధి దర్శనానికి అక్కడకు వెళ్లారు.

కృష్ణమాచార్యగారు రెండు కధలు చెప్పేవారు. అందులో ఒకటి నాధముని దర్శనం. రెండు వైస్రాయ్ పర్మిట్ తీసుకుని హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతాలలో రామ్మోహనబ్రహ్మచారిగారి శిష్యరికం. చాలామంది వీటిని ఆయన ఊహలుగా కొట్టిపారేస్తున్నారు గాని ఆయన అబద్దాలు చెబుతాడంటే నమ్మలేం. అవి నిజంగా జరిగాయో లేదో చెప్పడానికి ఆయన మాటలు తప్ప ఆధారాలు లేవు.

సరే, ఆ సమాధిదగ్గర ఒక ముసలాయన కనిపించి, దగ్గరలో ఉన్న మామిడితోటలోకి వెళ్ళమని కృష్ణమాచార్యకు చెప్పాడు. ఆ తోటలోకి వెళ్లేసరికి, ప్రయాణబడలికతో, దాహంతో, నీరసించి ఉన్న కృష్ణమాచార్య స్పృహతప్పి పడిపోయాడు. ఆయన స్పృహ వచ్చేసరికి ముగ్గురు ఆచార్యులను ఆయన దర్శిస్తాడు. అందులో నాదముని ఒకరు. ఆయన కాళ్ళపైన పడి నమస్కారం చేసి, ఉపదేశంకోసం ప్రార్ధించగా, తాను 1200 ఏళ్ల క్రితం వ్రాసిన 'యోగరహస్యం' నుంచి అనేక శ్లోకాలను రెండు మూడు గంటలసేపు నాధముని, కృష్ణమాచార్యకు ఉపదేశిస్తాడు. ఇదంతా కృష్ణమాచార్య గారే తర్వాతికాలంలో తన శిష్యులకు చెప్పారు.

ఈ అనుభవం తర్వాత, సంస్కృతాన్ని, సంగీతాన్ని, న్యాయతర్క శాస్త్రాలనూ నేర్చుకున్నప్పటికీ యోగశాస్త్రం యొక్క లోతులు తెలుసుకోవాలన్న తపన తీరక వెదుకుతున్న కృష్ణమాచార్యకు టిబెట్ లోని కైలాసపర్వత ప్రాంతాలలో రామ్మోహనబ్రహ్మచారి అనే గురువు లభిస్తాడు. ఏడేళ్లపాటు ఈయన శిష్యునిగా ఉంటూ ఆసనాలను, ప్రాణాయామాలను నేర్చుకోవడమే గాక, గుండెను 2 నిముషాల పాటు ఎలా ఆపాలి? ఫుల్ స్పీడులో ఉన్న కారును రెండు చేతులలో పట్టి ఎలా ఆపాలి? పళ్లతో పట్టి పెద్దపెద్ద బరువులను ఎలా ఎత్తాలి? మొదలైన రహస్యాలను ఆయనదగ్గర నేర్చుకుని మళ్ళీ తన ఊరికి వచ్చేశాడు.

తన జీవితాన్ని యోగాకే అంకితం చెయ్యాలని నిశ్చయించుకున్న ఆయన ఏ ఉద్యోగమూ చెయ్యలేదు. కటిక దరిద్రాన్ని అనుభవించాడు. గురువు కిచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. తర్వాతకాలంలో ప్రపంచప్రఖ్యాత యోగాగురువు B.K.S. Ayyangar చెల్లెలే ఈయన భార్య. అప్పట్లో ఆ కుటుంబం ఎంత దరిద్రంలో ఉండేదంటే, భార్య చీరలో ఒక ముక్కను చించి గోచీగా ధరించి ఉండేవాడు ఆయన. మూడ్రోజులకు ఒకసారి మాత్రమే వాళ్ళింట్లో భోజనం చేసేవారు. అదీ వాళ్ళ కుటుంబ ఆర్ధికపరిస్థితి. అలాంటి పరిస్థితిలో 1920 ప్రాంతాలలో దేశమంతా తిరుగుతూ యోగాను ప్రచారం చేస్తూ, ప్రదర్శనలిస్తూ, జీవనాన్ని సాగించాడు. అప్పటి ప్రదర్శనలలో అనేక కష్టమైన ఆసనాలను వేసి చూపించడమే గాక, రెండునిముషాల పాటు తన నాడిని గుండెను ఆపేసేవాడు. ఈ విధంగా ఎన్నో స్టేజి ప్రదర్శనలిచ్చాడు. 1931 లో మైసూరు సంస్కృతకళాశాలలో ఆచార్యునిగా ఉద్యోగం వచ్చింది. అప్పటినుండీ ఆయన ఆర్ధికకష్టాలు దూరమయ్యాయి.

మైసూరు మహారాజుగారు యోగాభిమాని. సంస్కృతాన్ని, ప్రాచీనవిద్యలను, సంగీతం, నాట్యంవంటి లలితకళలను పోషించే దాతృత్వం అప్పటిరాజులలో ఉండేది. ఆయన కృష్ణమాచార్యగారి శిష్యుడైనాడు. ఆ తర్వాత యోగాభ్యాసాన్ని కొనసాగిస్తూనే దానిలోనూ ఆయుర్వేదంలోనూ అమోఘమైన పరిశోధనలు చేశాడు కృష్ణమాచార్య. రోగాలను తగ్గించడంలో యోగాన్ని ఆయుర్వేదాన్ని కలిపి ఆయన పరిశోధన చేశాడు.

అప్పట్లో ఆడవారికి, ఇతరకులాల వారికి యోగా నేర్పేవారు కారు. కృష్ణమాచార్యగారు ఈ అలవాటును నిరసించారు. అన్ని కులాలకూ, ఆడవారికీ యోగా నేర్పడం ఆయన 1930 ల లోనే మొదలుపెట్టాడు. మన ఆడవారికి మాత్రమే గాక, విదేశీయులకు కూడా ఆయన యోగా నేర్పాడు. ఆయన పక్కా సాంప్రదాయ బ్రాహ్మణుడైనా, ఎంతో నవీనభావాలతో ఉండేవాడు. ప్రాచీనతా, నవీనతా ఆయనలో కలగలసి ఉండేవి.

జెనియా లబంస్కయా అనే రష్యన్ వనిత ఈయన దగ్గర ఎన్నో ఏళ్ళు యోగా నేర్చికుని తర్వాత 'ఇంద్రాదేవి' అని పేరు మార్చుకుంది. ఈమె యూరోప్ లో అనేక యోగాస్కూళ్లను స్థాపించింది. స్వయంగా తానూ 102 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఏప్రిల్ 2002 లో చనిపోయింది. 1947 లో అమెరికాలోని హాలీవుడ్ లో ఈమె మొదటి యోగా స్కూల్ ను ప్రారంభించింది. తర్వాత కాలంలో లాటిన్ అమెరికా అంతటా ఈమె యోగా స్కూళ్ళు స్థాపించింది. 'ఫస్ట్ లేడీ ఆఫ్ యోగా' అని ఈమెకు బిరుదు.

ఈయన శిష్యులలో పట్టాభి జాయిస్, బీకేఎస్ అయ్యంగార్లు ముఖ్యులు. పట్టాభిగారు మైసూర్లో 'అష్టాంగయోగా' సంస్థను స్థాపించాడు. నేటికీ అది బ్రహ్మాండంగా నడుస్తోంది. బీకేఎస్ గారు 'అయ్యంగార్ యోగా'ను స్థాపించాడు. అది పూనా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్రాంచిలతో నడుస్తోంది. పట్టాభి జాయిస్ గారు 94 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి మే 2009 లో చనిపోయారు. బీకేఎస్ అయ్యంగార్ గారు 96 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఆగస్టు 2014 లో చనిపోయారు. ఈ శిష్యుల ద్వారా కృష్ణమాచార్యగారి యోగా ప్రపంచమంతటా నేడు వ్యాపించింది.

తినడానికి తిండి లేకపోయినా, రోజుకు పది పన్నెండు గంటలు యోగాభ్యాసం చేసేవాడంటే, మరి అలాంటి మనుషులే కారణజన్ములౌతారు, ప్రపంచాన్ని కదిలిస్తారుగాని, సోఫాలోంచి లేవలేని స్థితిలో పందుల్లాగా దానిలోనే పడుకుని, ఆన్లైన్ లో పిజ్జాలు ఆర్డర్ చేసి తింటూ, కోక్ తాగుతూ టీవీ చూచే నేటి అర్భకులు ముప్పై ఏళ్లకే బీపీలు, సుగర్లు, కేన్సర్లు, హార్ట్ ఎటాక్ లు తెచ్చుకుని, ఏభైకే కాటికి పోతున్నారంటే పోరూ మరి ?

ప్రపంచం మొత్తం నేడు మన యోగాను చేస్తోంది. వేలాదిమంది యూరోపియన్స్లు, అమెరికన్లు నేడు యోగాగురువులుగా తయారౌతున్నారు. మనం మాత్రం వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడి, అర్భకులుగా తయారౌతూ, నానా చెత్తా తింటూ, మందులు మింగుతూ, నానా రోగాలతో అల్లాడుతూ, నాలుగడుగులు వేయాలంటే రొప్పుతూ, మన సంస్కృతి అంటే ఏమిటో తెలీక, మన మతమంటే, ధర్మమంటే తెలీక, అందులో ఎన్ని విలువైనవి ఉన్నాయో తెలీక, బ్రతుకుతూ చస్తూ ఉందాం. సరేనా?

రేపటిదాకా ఈ యూట్యూబ్ వీడియో చూస్తూ గుడ్లు తేలేస్తూ ఉండండి. ఇది తీసినప్పుడు కృష్ణమాచార్య గారికి 50 ఏళ్ళని, దీనిని తీసినది 1938 లో నని గుర్తుంచుకుని ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=8XF4sCV6aUY&t=394s 


ఆ తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఇందులో బీకెఎస్ అయ్యంగార్ గారి అభ్యాసాన్ని కూడా చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=LUvOuik-g4c

ఈ వీడియోలు చూచాక సిగ్గేస్తోందా? 'ఛీ! నా బ్రతుకు' అనిపిస్తోందా? అనిపించనివ్వండి. ఒక పద్ధతీ పాడూ లేకుండా బ్రతుకుతుంటే అలాగే అనిపిస్తుంది మరి !   

(వచ్చే పోస్ట్ లో కృష్ణమాచార్య గారి జాతక విశ్లేషణ)
read more " Birth chart of T. Krishnamacharya, Father of modern Yoga "

మే 2020 పౌర్ణమి ప్రభావం - మరికొన్ని సంఘటనలు


నిన్నరాత్రినుంచి ఇప్పటిలోపు ఇదే పౌర్ణమిప్రభావం మరికొన్ని  విషాదసంఘటనలను సృష్టించింది.

ఛత్తీస్ ఘడ్ ప్రమాదం :
నిన్న రాత్రి రాయఘడ్ జిల్లాలో ఒక పేపర్ మిల్ లో మీథేన్ వాయువు లీకై, టాంకును శుభ్రం చేస్తున్న ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ముగ్గురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

తమిళనాడులో NLC లో ప్రమాదం:
కడలూరులో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ లో బాయిలర్ పేలి ఏడుగురు గాయపడ్డారు.

ఔరంగాబాద్ లో రైలుక్రింద 15 మంది కూలీల మరణం:
రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో గదేజల్గావ్  స్టేషన్ దగ్గర పట్టాలమీద నిద్రపోతున్న లేబర్ మీద నుంచి పెట్రోల్/డీజిల్ వాగన్లతో పోతున్న రైలు దూసుకుపోగా చనిపోయారు.

అమావాస్య, పౌర్ణమి ప్రభావాలు మనుషుల మీద ఉంటాయంటారా? ఉండవంటారా?
read more " మే 2020 పౌర్ణమి ప్రభావం - మరికొన్ని సంఘటనలు "

7, మే 2020, గురువారం

మే 2020 పౌర్ణమి ప్రభావం - విశాఖ గ్యాస్ లీకేజి

ఈరోజు పౌర్ణమి. ఆఫ్ కోర్స్ బుద్ధపౌర్ణమి. కానీ అనుకోని విలయం విశాఖ ప్రజలను కాటేసింది. తెల్లవారు ఝాము 3 గంటల ప్రాంతంలో LG Polymers అనే కంపెనీ నుంచి Styrene అనే వాయువు లీకైంది. క్షణాలలో అయిదు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు ఊపిరందక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతోందో అర్ధంకాక రోడ్లమీదకు పరుగెత్తుకొచ్చారు. స్పృహలు తప్పి పడిపోయారు. ఇప్పటికి 11 మంది చనిపోయారని, 5000 మంది ఊపిరి ఇబ్బందులతో అస్వస్థులై ఉన్నారని అంటున్నారు. ఇది 1984 లో జరిగిన భోపాల్ గ్యాస్ ట్రాజెడీని గుర్తుకు తెస్తోంది.

అసలే కరోనా దెబ్బతో అల్లాడుతున్న ప్రజలకు, ప్రభుత్వానికి ఇదొక ఉపరి తలనొప్పి. అయితే, ఇది ఖచ్చితంగా పౌర్ణమి ఘడియలలో జరగడం వింతగా లేదూ? ఒక్కసారి  22-3-2020 న నేను వ్రాసిన పోస్ట్ చూడండి. 

పౌర్ణమి ఏప్రిల్ 7, మే 7 తేదీలలో వస్తుంది అని వ్రాస్తూ ఈ టైం స్లాట్స్ లో జరుగబోయే దుర్ఘటనలు ఈ క్రింది విధంగా ఉంటాయన్నాను.

"అగ్నిప్రమాదాలు, ఫేక్టరీలలో ప్రమాదాలు, అగ్ని/రసాయనిక ప్రమాదాలు"

ఈరోజు మే 7 వ తేదీ. మరి జరిగిందా లేదా? మానవులమీద గ్రహప్రభావం ఉందంటారా లేదంటారా?

ఇప్పుడు ఒక్కసారి గ్రహకుండలిని పరిశీలిద్దాం.

తెల్లవారుఝామున 3.15 కి విశాఖలో మీనరాశి ఉదయిస్తున్నది. ఆ సమయానికి వేసిన కుండలిని పైన ఇచ్చాను చూడండి. లగ్నం దారుణంగా ఇరువైపులా వరుసగా 2,3,4,10,11,12 భావాలతో ఆర్గళానికి గురైంది. లగ్న డిగ్రీలకు చాలా దగ్గరగా దుర్ఘటనలకు కారకుడైన మాంది ఉన్నాడు.  చంద్రుడు ఏకాకిగ్రహంగా ఉన్నాడు. ఇది చాలా చెడుసమయమని నా పోస్టులు క్రమం తప్పకుండా చదివేవారికి వేరే చెప్పనవసరం లేదనుకుంటాను.

అయితే, విశాఖపట్నంలోనే ఎందుకు జరిగింది? ఆ కొంతమందికే ఎందుకు జరిగింది? ఆ కొద్దిమందే ఎందుకు చనిపోయారు? ఆ కొద్దిమందే ఎందుకు అస్వస్థులైనారు? వాళ్ళ ఇంటి అడ్రసులతో సహా మీరు ముందే ఎందుకు చెప్పలేదు? మొదలైన కొన్ని మంచిప్రశ్నలూ కొన్ని చొప్పదంటు ప్రశ్నలూ మీరడుగుతారని నాకు తెలుసు. మీరడిగే ప్రతి ప్రశ్నకూ నేను జవాబులు చెప్పనని కూడా మీకు బాగా తెలుసు. అలాంటి లోతైన వివరాలు నా క్లోజ్ శిష్యులతోనే నేను చర్చిస్తానని కూడా మీకు ఇంకా బాగా తెలుసు కదూ !

సరే ఈ చర్చలన్నీ ప్రస్తుతానికి ఆపి బాధితులకోసం ప్రార్ధిద్దాం. చేతనైతే చేతనైనంత సహాయం చేద్దాం. ఓకేనా? ఆ పనిమీదుందండి మరి !
read more " మే 2020 పౌర్ణమి ప్రభావం - విశాఖ గ్యాస్ లీకేజి "