Pages - Menu

Pages

8, మే 2020, శుక్రవారం

Birth chart of T. Krishnamacharya, Father of modern Yoga

నేడు 'అష్టాంగయోగా' అంటే అందరికీ తెలుసు. 'అయ్యంగార్ యోగా' అంటే తెలుసు. ఇంద్రాదేవి యోగా అంటే మీకు తెలియకపోయినా యూరప్ అంతటా తెలుసు. నేటి జనానికి బాబా రాందేవ్ తప్ప ఇంకెవరూ తెలియకపోవచ్చు. యోగేంద్రగారి  పేరును, స్వామి కువలయానందగారి పేరును మీలో చాలామంది విని ఉండకపోవచ్చు. కానీ, అష్టాంగయోగాకైనా, అయ్యంగార్ యోగాకైనా, ఇంద్రాదేవి యోగాకైనా ఒక మూలం ఉంది. ఒక్క గృహస్థయోగి దగ్గరే వీళ్ళందరూ యోగాభ్యాసాన్ని నేర్చుకున్నారు. నవీనకాలంలో 'యోగా' ను పునరుజ్జీవింపజేసి, దానిని అమితంగా ప్రభావితం చేసి, నేడు యోగా అనేది ప్రపంచంలోని అన్ని దేశాలలో అభ్యసించబడటానికి కారకులలో అతిముఖ్యుడు తిరుమలై కృష్ణమాచార్య. ఆయనే వీరి గురువు. ఈనాడు ప్రపంచం మొత్తం మీద ఇంటింటిలో యోగాభ్యాసం చేస్తున్నారంటే దానికి ఈయనే కారకుడు. ఈయన సరిగ్గా 101 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికారు. సంకల్పంతో గుండెను రెండు నిముషాలపాటు కొట్టుకోకుండా ఆపడంవంటి మనం నమ్మలేని అద్భుతాలను చేసి చూపారు. యోగాభ్యాసమహిమను లోకానికి చాటిచెప్పారు. ఈయన్ను మనం మరచిపోకూడదు. ఈయన జాతకాన్ని పరిశీలిద్దాం.

ఈయన 18-11-1888 నాడు కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. 5 సంవత్సరాల చిన్న వయసులో తన తండ్రిగారిదగ్గర యోగాభ్యాసంలో ఓనమాలు దిద్దుకున్నారు. అప్పుడే పతంజలియోగసూత్రాలను అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. ఈరోజులలో 5 ఏళ్ల పిల్లలు ఎంత అల్లరి చిల్లరిగా, అసహ్యంగా, వెధవల్లాగా ఉంటున్నారో చూస్తే, ఆరోజులలో సాంప్రదాయ కుటుంబాలలో పిల్లలను చిన్నప్పటి నుంచే ఎలా పెంచేవారో అర్ధమౌతుంది. ఆ పిల్లల జీన్స్ కూడా అలాగే ఉండేవి. చెబితే వినేవారు. ఒక క్రమశిక్షణలో ఉండేవారు. శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. తల్లిదండ్రుల అడుగుజాడలలో నడిచేవారు.

ఆఫ్కోర్స్ ! నేటిపిల్లలు కూడా వారివారి తల్లిదండ్రుల అడుగుజాడలలోనే నడుస్తున్నారనుకోండి. వాళ్ళెటు పోతున్నారో వాళ్లకూ తెలియదు. వీళ్ళు ఎలా పెరుగుతున్నారో వీళ్లకూ తెలియదు. 'యధా తల్లిందండ్రులు తధా పిల్లలు' ! వేపచెట్టుకు తియ్యని మామిడిపండ్లు ఎలా కాస్తాయి మరి?

నేడు 50, 60  ఏళ్ళొచ్చిన గాడిదలకు కూడా పతంజలి యోగసూత్రాలంటే ఏమిటో తెలియదు. కానీ కృష్ణమాచార్యగారు 5 ఏళ్ల వయసులో వాటిని అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. అదీ ఆయనకూ మనకూ తేడా ! చరిత్ర సృష్టించేవారి జీవితాలు మొదటినుంచీ విభిన్నంగానే ఉంటాయి మరి !

కృష్ణమాచార్యగారి చిన్నవయసులోనే ఆయన తండ్రిగారు గతించారు. కానీ పిల్లవానికి మంచి నైతికమైన, ఆధ్యాత్మికమైన పునాదులు వేసి ఆయన పోయారు. నేటి తల్లిదండ్రులు ఆస్తులు, డబ్బులు ఇఛ్చి పిల్లలను నైతికతా ఆధ్యాత్మికత లేని గాడిదల్లాగా తయారుచేసి, అన్నిరకాల వేషాలూ నేర్పి మరీ పోతున్నారు. అదీ వారికీ వీరికీ తేడా !

నిన్న లాక్ డౌన్ సమయంలో బార్లు తెరిస్తే, హైదరాబాద్ లో టీనేజీ ఆడపిల్లలు బాహాటంగా క్యూలో నిలబడి మరీ లిక్కర్ బాక్సులు కొనుక్కుని వాటిని మోసుకుని ఇంటికి తీసుకుపోతున్నారు. ఇదీ నేటి తల్లిదండ్రుల పెంపకం తీరు !

ప్రాచీన వైష్ణవసాధువు నాధముని తమ వంశంలోని వాడని కృష్ణమాచార్యగారితో వారి నాన్నగారు చెప్పారట. నాధముని అనే ఆయన వైష్ణవసాంప్రదాయంలో ప్రసిద్ధుడు. ఈయన క్రీ. శ. 823 - 951 మధ్యలో జీవించాడు. అంటే ఇప్పటికి 1200 ఏళ్ళక్రితంవాడు. అప్పట్లో ఆయన 128 ఏళ్ళు బ్రతికాడు. నాధమునిని మొట్టమొదటి వైష్ణవ ఆచార్యునిగా నేటికీ ఆ సాంప్రదాయంలో గౌరవిస్తారు. నాలాయిర దివ్యప్రబంధాన్ని ఆయన సంకలనం చెయ్యడమే గాక, 'యోగరహస్యం' అనే యోగగ్రంధాన్ని ఆయన వ్రాశాడని అంటారు. అంటే, యోగశాస్త్రంలో ఆయన చెయ్యితిరిగిన వాడనేగా అర్ధం ! ఈ నాదమునిగారి సమాధి తమిళనాడులోని ఆళ్వార్ తిరునగరి అనేచోట ఉన్నది. 16 ఏళ్ల కుర్రవానిగా ఉన్నప్పుడు కృష్ణమాచార్యగారు ఈ సమాధి దర్శనానికి అక్కడకు వెళ్లారు.

కృష్ణమాచార్యగారు రెండు కధలు చెప్పేవారు. అందులో ఒకటి నాధముని దర్శనం. రెండు వైస్రాయ్ పర్మిట్ తీసుకుని హిమాలయాలలోని కైలాస పర్వత ప్రాంతాలలో రామ్మోహనబ్రహ్మచారిగారి శిష్యరికం. చాలామంది వీటిని ఆయన ఊహలుగా కొట్టిపారేస్తున్నారు గాని ఆయన అబద్దాలు చెబుతాడంటే నమ్మలేం. అవి నిజంగా జరిగాయో లేదో చెప్పడానికి ఆయన మాటలు తప్ప ఆధారాలు లేవు.

సరే, ఆ సమాధిదగ్గర ఒక ముసలాయన కనిపించి, దగ్గరలో ఉన్న మామిడితోటలోకి వెళ్ళమని కృష్ణమాచార్యకు చెప్పాడు. ఆ తోటలోకి వెళ్లేసరికి, ప్రయాణబడలికతో, దాహంతో, నీరసించి ఉన్న కృష్ణమాచార్య స్పృహతప్పి పడిపోయాడు. ఆయన స్పృహ వచ్చేసరికి ముగ్గురు ఆచార్యులను ఆయన దర్శిస్తాడు. అందులో నాదముని ఒకరు. ఆయన కాళ్ళపైన పడి నమస్కారం చేసి, ఉపదేశంకోసం ప్రార్ధించగా, తాను 1200 ఏళ్ల క్రితం వ్రాసిన 'యోగరహస్యం' నుంచి అనేక శ్లోకాలను రెండు మూడు గంటలసేపు నాధముని, కృష్ణమాచార్యకు ఉపదేశిస్తాడు. ఇదంతా కృష్ణమాచార్య గారే తర్వాతికాలంలో తన శిష్యులకు చెప్పారు.

ఈ అనుభవం తర్వాత, సంస్కృతాన్ని, సంగీతాన్ని, న్యాయతర్క శాస్త్రాలనూ నేర్చుకున్నప్పటికీ యోగశాస్త్రం యొక్క లోతులు తెలుసుకోవాలన్న తపన తీరక వెదుకుతున్న కృష్ణమాచార్యకు టిబెట్ లోని కైలాసపర్వత ప్రాంతాలలో రామ్మోహనబ్రహ్మచారి అనే గురువు లభిస్తాడు. ఏడేళ్లపాటు ఈయన శిష్యునిగా ఉంటూ ఆసనాలను, ప్రాణాయామాలను నేర్చుకోవడమే గాక, గుండెను 2 నిముషాల పాటు ఎలా ఆపాలి? ఫుల్ స్పీడులో ఉన్న కారును రెండు చేతులలో పట్టి ఎలా ఆపాలి? పళ్లతో పట్టి పెద్దపెద్ద బరువులను ఎలా ఎత్తాలి? మొదలైన రహస్యాలను ఆయనదగ్గర నేర్చుకుని మళ్ళీ తన ఊరికి వచ్చేశాడు.

తన జీవితాన్ని యోగాకే అంకితం చెయ్యాలని నిశ్చయించుకున్న ఆయన ఏ ఉద్యోగమూ చెయ్యలేదు. కటిక దరిద్రాన్ని అనుభవించాడు. గురువు కిచ్చిన మాట ప్రకారం పెళ్లి చేసుకున్నాడు. తర్వాతకాలంలో ప్రపంచప్రఖ్యాత యోగాగురువు B.K.S. Ayyangar చెల్లెలే ఈయన భార్య. అప్పట్లో ఆ కుటుంబం ఎంత దరిద్రంలో ఉండేదంటే, భార్య చీరలో ఒక ముక్కను చించి గోచీగా ధరించి ఉండేవాడు ఆయన. మూడ్రోజులకు ఒకసారి మాత్రమే వాళ్ళింట్లో భోజనం చేసేవారు. అదీ వాళ్ళ కుటుంబ ఆర్ధికపరిస్థితి. అలాంటి పరిస్థితిలో 1920 ప్రాంతాలలో దేశమంతా తిరుగుతూ యోగాను ప్రచారం చేస్తూ, ప్రదర్శనలిస్తూ, జీవనాన్ని సాగించాడు. అప్పటి ప్రదర్శనలలో అనేక కష్టమైన ఆసనాలను వేసి చూపించడమే గాక, రెండునిముషాల పాటు తన నాడిని గుండెను ఆపేసేవాడు. ఈ విధంగా ఎన్నో స్టేజి ప్రదర్శనలిచ్చాడు. 1931 లో మైసూరు సంస్కృతకళాశాలలో ఆచార్యునిగా ఉద్యోగం వచ్చింది. అప్పటినుండీ ఆయన ఆర్ధికకష్టాలు దూరమయ్యాయి.

మైసూరు మహారాజుగారు యోగాభిమాని. సంస్కృతాన్ని, ప్రాచీనవిద్యలను, సంగీతం, నాట్యంవంటి లలితకళలను పోషించే దాతృత్వం అప్పటిరాజులలో ఉండేది. ఆయన కృష్ణమాచార్యగారి శిష్యుడైనాడు. ఆ తర్వాత యోగాభ్యాసాన్ని కొనసాగిస్తూనే దానిలోనూ ఆయుర్వేదంలోనూ అమోఘమైన పరిశోధనలు చేశాడు కృష్ణమాచార్య. రోగాలను తగ్గించడంలో యోగాన్ని ఆయుర్వేదాన్ని కలిపి ఆయన పరిశోధన చేశాడు.

అప్పట్లో ఆడవారికి, ఇతరకులాల వారికి యోగా నేర్పేవారు కారు. కృష్ణమాచార్యగారు ఈ అలవాటును నిరసించారు. అన్ని కులాలకూ, ఆడవారికీ యోగా నేర్పడం ఆయన 1930 ల లోనే మొదలుపెట్టాడు. మన ఆడవారికి మాత్రమే గాక, విదేశీయులకు కూడా ఆయన యోగా నేర్పాడు. ఆయన పక్కా సాంప్రదాయ బ్రాహ్మణుడైనా, ఎంతో నవీనభావాలతో ఉండేవాడు. ప్రాచీనతా, నవీనతా ఆయనలో కలగలసి ఉండేవి.

జెనియా లబంస్కయా అనే రష్యన్ వనిత ఈయన దగ్గర ఎన్నో ఏళ్ళు యోగా నేర్చికుని తర్వాత 'ఇంద్రాదేవి' అని పేరు మార్చుకుంది. ఈమె యూరోప్ లో అనేక యోగాస్కూళ్లను స్థాపించింది. స్వయంగా తానూ 102 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఏప్రిల్ 2002 లో చనిపోయింది. 1947 లో అమెరికాలోని హాలీవుడ్ లో ఈమె మొదటి యోగా స్కూల్ ను ప్రారంభించింది. తర్వాత కాలంలో లాటిన్ అమెరికా అంతటా ఈమె యోగా స్కూళ్ళు స్థాపించింది. 'ఫస్ట్ లేడీ ఆఫ్ యోగా' అని ఈమెకు బిరుదు.

ఈయన శిష్యులలో పట్టాభి జాయిస్, బీకేఎస్ అయ్యంగార్లు ముఖ్యులు. పట్టాభిగారు మైసూర్లో 'అష్టాంగయోగా' సంస్థను స్థాపించాడు. నేటికీ అది బ్రహ్మాండంగా నడుస్తోంది. బీకేఎస్ గారు 'అయ్యంగార్ యోగా'ను స్థాపించాడు. అది పూనా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బ్రాంచిలతో నడుస్తోంది. పట్టాభి జాయిస్ గారు 94 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి మే 2009 లో చనిపోయారు. బీకేఎస్ అయ్యంగార్ గారు 96 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఆగస్టు 2014 లో చనిపోయారు. ఈ శిష్యుల ద్వారా కృష్ణమాచార్యగారి యోగా ప్రపంచమంతటా నేడు వ్యాపించింది.

తినడానికి తిండి లేకపోయినా, రోజుకు పది పన్నెండు గంటలు యోగాభ్యాసం చేసేవాడంటే, మరి అలాంటి మనుషులే కారణజన్ములౌతారు, ప్రపంచాన్ని కదిలిస్తారుగాని, సోఫాలోంచి లేవలేని స్థితిలో పందుల్లాగా దానిలోనే పడుకుని, ఆన్లైన్ లో పిజ్జాలు ఆర్డర్ చేసి తింటూ, కోక్ తాగుతూ టీవీ చూచే నేటి అర్భకులు ముప్పై ఏళ్లకే బీపీలు, సుగర్లు, కేన్సర్లు, హార్ట్ ఎటాక్ లు తెచ్చుకుని, ఏభైకే కాటికి పోతున్నారంటే పోరూ మరి ?

ప్రపంచం మొత్తం నేడు మన యోగాను చేస్తోంది. వేలాదిమంది యూరోపియన్స్లు, అమెరికన్లు నేడు యోగాగురువులుగా తయారౌతున్నారు. మనం మాత్రం వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడి, అర్భకులుగా తయారౌతూ, నానా చెత్తా తింటూ, మందులు మింగుతూ, నానా రోగాలతో అల్లాడుతూ, నాలుగడుగులు వేయాలంటే రొప్పుతూ, మన సంస్కృతి అంటే ఏమిటో తెలీక, మన మతమంటే, ధర్మమంటే తెలీక, అందులో ఎన్ని విలువైనవి ఉన్నాయో తెలీక, బ్రతుకుతూ చస్తూ ఉందాం. సరేనా?

రేపటిదాకా ఈ యూట్యూబ్ వీడియో చూస్తూ గుడ్లు తేలేస్తూ ఉండండి. ఇది తీసినప్పుడు కృష్ణమాచార్య గారికి 50 ఏళ్ళని, దీనిని తీసినది 1938 లో నని గుర్తుంచుకుని ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=8XF4sCV6aUY&t=394s 


ఆ తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఇందులో బీకెఎస్ అయ్యంగార్ గారి అభ్యాసాన్ని కూడా చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=LUvOuik-g4c

ఈ వీడియోలు చూచాక సిగ్గేస్తోందా? 'ఛీ! నా బ్రతుకు' అనిపిస్తోందా? అనిపించనివ్వండి. ఒక పద్ధతీ పాడూ లేకుండా బ్రతుకుతుంటే అలాగే అనిపిస్తుంది మరి !   

(వచ్చే పోస్ట్ లో కృష్ణమాచార్య గారి జాతక విశ్లేషణ)