నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

9, మే 2020, శనివారం

'యోగశిఖోపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది.


బుద్ధపూర్ణిమ సందర్భంగా పంచవటి పబ్లికేషన్స్ నుండి మా క్రొత్త పుస్తకం కృష్ణ యజుర్వేదాన్తర్గత 'యోగశిఖోపనిషత్' ను, నా వ్యాఖ్యానంతో,  నేడు విడుదల చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. కాకపోతే ఒకరోజు ఆలస్యమైంది. సందర్భం మాత్రం అదే. బుద్ధపూర్ణిమకు నా జీవితంలో ఒక ప్రాముఖ్యత ఉన్నది. అది ఈనాటిది కాదు. నా చిన్నప్పటినుంచీ ఆ రోజున ఒక క్రొత్తపనిని, ఒక మంచిపనిని ప్రారంభిస్తూ వస్తున్నాను. పోయినేడాది ఇదే రోజున జిల్లెళ్ళమూడిలో అమ్మ పాదముల దగ్గర 'ధర్మపదం' పుస్తకాన్ని విడుదల చేశాం. ఈ బుద్ధపూర్ణిమకు హైదరాబాద్ నుంచి 'యోగశిఖోపనిషత్' ను విడుదల చేస్తున్నాను.

యోగోపనిషత్తులలో ఇది అగ్రగణ్యమైనది. అందుకే దీనికి 'యోగశిఖ' అనే పేరు వచ్చింది. భగవద్గీతకూ దీనికీ పోలికలున్నాయి. భగవద్గీత ఎలాగైతే తన పద్దెనిమిది అధ్యాయములలో పద్దెనిమిది విభిన్నములైన సాధనామార్గములను వివరించిందో, అదే విధంగా, ఈ గ్రంధంకూడా తన ఆరు అధ్యాయములలో ఆరు సాధనామార్గములను చెప్పింది. సిద్ధయోగమునకు ఎక్కువ ప్రాధాన్యత నిచ్చిన ఈ గ్రంధం, కుండలినీయోగమును, అద్వైతసాంప్రదాయమును, యోగసాధనలోని అనేక అంశములను ఒకేచోట వివరించే ప్రయత్నాన్ని చేసింది. అందుకనే ఈ గ్రంధం యోగశాస్త్రములలో తలమానికమని పండితుల అభిప్రాయం.

ఈ గ్రంధం ఇప్పటిది కాదు. రెండువేల ఏళ్ళ క్రితం వ్రాయబడిన గ్రంథమిది. దీనికి నేను వ్యాఖ్యానం వ్రాయగలగడం నా అదృష్టం, పూర్వజన్మ సుకృతం, నా గురుదేవుల అనుగ్రహం.

ఈ ఏడాది మా సంస్థనుండి వస్తున్న తొమ్మిదో పుస్తకమిది. లాక్ డౌన్ సమయంలో వస్తున్న ఏడవ పుస్తకం.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఎప్పటిలాగే google play books నుండి లభిస్తుంది. లాక్ డౌన్ అయిపోయాక ఇంగ్లీషు, తెలుగులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.