నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

17, మే 2020, ఆదివారం

'గోరక్ష సంహిత' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది.


సిద్ధయోగసాంప్రదాయంలో పరమగురువైన గోరక్షనాధుడు వెయ్యిసంవత్సరాల క్రితం రచించిన 'గోరక్షసంహిత' నా వ్యాఖ్యానంతో నేడు విడుదలైంది. ఈ పుస్తకం, 'గోరక్షశతకం', 'గోరక్షయోగశాస్త్రమ'న్న రెండు గ్రంథముల సమాహారం. ఈయనకే గోరఖ్ నాధుడని పేరున్నది. ఈయన మత్స్యేంద్రనాధుని శిష్యుడు, మత్స్యేంద్రనాధుడు సాక్షాత్తు పరమశివుని శిష్యుడు. వీరిది శుద్ధమైన కౌలయోగ సిద్ధమార్గం. నాధయోగులందరూ పరమశివభక్తులు. ఎన్నో అమానుషములైన యోగసిద్ధులు కల్గిన తపశ్శక్తిసంపన్నులు. కొన్ని గ్రంధములలో మత్స్యేంద్రనాధుడు తనను తాను ఉమాశంకర పుత్రుడనని చెప్పుకున్నాడు. గోరక్షనాధుడు 10 వ శతాబ్దంలో బెంగాల్, అస్సామ్ ప్రాంతాలలో నివసించినట్లు ఆధారాలున్నాయి.

వీరి సాంప్రదాయం బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రములనుండి నేపాల్, బంగ్లాదేశ్ లలో కూడా వ్యాపించి ఉన్నది. దక్షిణాదిన కర్ణాటకరాష్ట్రంలో ప్రాచుర్యంలో ఉన్నది. తెలుగురాష్ట్రాలలో వేమనయోగి, వీరబ్రహ్మంగారు, ఎందఱో యోగులు, బైరాగులు, గోసాయిలు వీరి మార్గానుసారులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని సిద్ధులగుట్టలో వీరు తపస్సు చేసిన ప్రాంతం ఉన్నది. ప్రాచీనకాలంలో రాజా భర్తృహరి, రాజా గోపీచంద్రదేవుడు మొదలైన మహారాజులు వీరి శిష్యులై, రాజ్యాన్ని త్యజించి యోగులైనారు. ముస్లిం సూఫీ యోగులు వీరిమార్గాన్ని అనుసరించారు. చక్రవర్తి అక్బర్, కబీర్ మొదలైనవారు ఈ మార్గమును భక్తితో అనుసరించారు. కబీర్, గోరఖ్ నాధులు కలుసుకున్నట్లు కొన్ని గాధలున్నాయి. కబీర్ తన పద్యాలలో గోరఖనాధుని ప్రశంసించాడు. సిక్కుల గురుగ్రంధసాహెబ్ లో వీరిని భక్తితో స్మరించారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ వీరి బోధలకు లోనుగాని ప్రాంతం మనదేశంలో లేదు.  

బ్రహ్మంగారి యోగమార్గంలోను, తారక, అమనస్క, హఠ, రాజయోగాది సాధనామార్గములలోనూ వీరి బోధలు అంతర్లీనంగా ఉంటాయి. లింగమూర్తి గురుమూర్తి పంతులుగారు రచించిన 'సీతారామాంజనేయ సంవాదం'లో వీరి బోధలు స్పష్టంగా మనకు దర్శనమిస్తాయి.

నాధయోగులు కులమతాలకు, ఆస్తీ అంతస్తులకు ఏమాత్రమూ విలువనివ్వలేదు. యోగసాధనకు, వివేకవైరాగ్యములకు, జ్ఞానసిద్దికీ వీరు ప్రాముఖ్యతనిచ్చారు. వీరి బోధలు సమాజంలోని అన్ని కులాలనూ ప్రభావితం చేశాయి. ఎందరికో సత్యమైన యోగమార్గమును చూపించాయి.

మన తెలుగురాష్ట్రాలలో మొదటినుంచీ యోగులు ఎక్కువ. నలభైరోజుల చవకబారు దీక్షలూ, వ్యాపారభక్తీ ఇప్పుడు మన సమాజంలో ఎక్కువయ్యాయిగాని, వేలఏళ్లనుంచీ మనం యోగమార్గాన్ని అనుసరించినవారమే. రెండువేల ఏళ్ళక్రితమే బౌద్ధాన్ని తెలుగునేల ఎంతో ఆదరించింది. ఆ తర్వాత వచ్చిన సిద్ధయోగమార్గాన్ని కూడా అక్కునజేర్చుకుంది. దీనికి తార్కాణంగా అనేక పల్లెలలో ఈనాటికీ యోగసాంప్రదాయములు మినుకుమినుకుమంటూ మనకు కన్పిస్తాయి. ఇవి ముఖ్యంగా తెలంగాణలోని అనేక జిల్లాలలోను, ఆంధ్రాలోని కడప, ప్రకాశం, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలలోనూ ఎక్కువగా ఉన్నట్టు మనం చూడవచ్చు.

అద్భుతమైన ఈ యోగగ్రంధాన్ని మా సంస్థనుండి విడుదల చేస్తున్నందుకు సంతోషిస్తున్నాం. యోగసాధకులకు ఈ గ్రంధం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ చదువరులకు నాదొక్క సలహా ! పుస్తకాలు చదివి మీ అంతట మీరు యోగసాధనలు చెయ్యకండి. యోగసాధనామార్గంలో గురూపదేశం తప్పనిసరి అన్న విషయం మరచిపోకండి.

యోగ-తంత్ర-వేదాంతసమ్మిళితమైన మా సాధనామార్గంలో వీరి ఉపదేశములు ఎన్నో కలగలసి ఉంటాయి. అందుకనే వీరి బోధలను తెలుగులో నా వ్యాఖ్యానంతో ప్రచురించాలని సంకల్పించాను. దాని ఫలితమే ఈ పుస్తకం. 2020 లో మా సంస్థనుండి వస్తున్న 11 వ పుస్తకం మరియు లాక్ డౌన్ సమయంలో వస్తున్న 9 వ పుస్తకమిది.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా ఎప్పటిలాగే google play books నుండి లభిస్తుంది. లాక్ డౌన్ అయిపోయాక ఇంగ్లీషు, తెలుగులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.