Pages - Menu

Pages

13, జూన్ 2020, శనివారం

21-6-2020 సూర్యగ్రహణం ఫలితాలు

21-6-2020 ఆదివారంనాడు అమావాస్య ఛాయలో సూర్యగ్రహణం రాబోతున్నది. దాదాపుగా ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకూ ఉంటుంది. మిట్టమధ్యాన్నం సమయంలో మంచిపట్టులో ఉంటుంది.

ఆదివారం, అమావాస్య, సూర్యగ్రహణం కావడంతో సాధనాపరంగా ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మంత్ర, తంత్రసాధనలు చేసేవారికి ఈరోజు చాలామంచి సిద్ధికారకమైన రోజు. అదీగాక, జూన్ 21 న పగలు అతిపెద్దదిగా ఉంటుంది. సమ్మర్ సోల్ స్టైస్ ఈ రోజున మొదలౌతుంది. అందుకనే మన ప్రధానమంత్రి మోడీగారు ఈరోజును International Yoga Day గా నిశ్చయించారు. ఇది యోగపరమైన ప్రాధాన్యత.

ఇప్పుడు మన జీవితాల పైన దీని ఫలితాలను చూద్దాం.

వ్యక్తిగత జాతకాలలో
---------------------
మానవాళికి పట్టిన తుప్పును ఈ గ్రహణం మళ్ళీ ఇంకోసారి వదిలించబోతున్నది.

ఈ గ్రహణం వల్ల బాగా చెదిరిపోయేది మిథునరాశి/లగ్నం వారు, అందులోనూ మృగశిరా నక్షత్రజాతకులు తీవ్రంగా ప్రభావితులౌతారు. అదే విధంగా, ధనూరాశి/లగ్నం వారు. వీళ్ళిద్దరిపైనా ఈ గ్రహణప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, ఈ ఏడాది ఆఖరువరకూ దీని చెడుఫలితాలను వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఈ ప్రభావం భర్త/భార్య, కుటుంబ/వ్యాపార రంగాలలో ఉంటుంది. కనుక జాగ్రత్త పడండి.

కుంభలగ్నం/రాశివారికి సంతానం, ప్రేమ, వ్యాపారరంగాలలో తీవ్రమైన సమస్యలు ఉంటాయి. జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలచుకుంటే మాత్రం అద్భుతమైన అనుభవం వారికి ఆరోజున కలుగుతుంది. సింహరాశి/లగ్నం వారికి కూడా అంతే.

మీనరాశి/లగ్నం వారికి - ఇంట్లో తీవ్రమైన చికాకులు తలెత్తుతాయి. విద్య, వాహనం, మనశ్శాంతి - ఈ రంగాలు బాగా దెబ్బతింటాయి.

కన్యారాశి/లగ్నం వారికి - వృత్తి, వ్యాపారం, జీవనాధారం రంగాలలో తీవ్రమైన ఒడుదుడుకులు, ఆశాభంగాలు ఉంటాయి. తండ్రి మరణించవచ్చు. లేదా ప్రమాదాలకు, రోగాలకు గురికావచ్చు. ఇంటిలో పరిస్థితి కూడా చాలా చేదుగా ఉంటుంది.

తులారాశి/లగ్నం వారికి - దూరప్రాంతాలలో చిక్కుకుపోవడం వల్ల నష్టం కలుగుతుంది. వీరికి కూడా తండ్రి గతించవచ్చు. లేదా ప్రమాదాలకు, రోగాలకు గురికావచ్చు. మేషలగ్నం/రాశి వారికి కూడా అంతే. ఆధ్యాత్మికంగా జీవితాన్ని చూచేవారికి మాత్రం ఈ గ్రహణం వల్ల చాలా మంచి అనుభవాలు కలుగుతాయి.

వృషభరాశి/లగ్నం వారికి - మాటదూకుడు వల్ల నష్టపోతారు. డబ్బు సమస్యలు కలుగుతాయి. నష్టాలు చవిచూస్తారు. పాత దీర్ఘరోగాలు మళ్ళీ ఉద్రేకిస్తాయి. పెద్దలకు ప్రమాదాలు రాసిపెట్టి ఉన్నాయి. జాగ్రత్తపడాలి. వృశ్చికరాశి/లగ్నం వారికి కూడా అంతే.

దేశ జాతకాలలో
-----------------

ఈ గ్రహణ ప్రభావం అమెరికా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మిడిల్ ఈస్ట్ మీద కూడా బాగా తీవ్రంగా ఉంటుంది. అమెరికాకు ధైర్యం బాగా సన్నగిల్లుతుంది. ఇతరదేశాలను ప్రాధేయపడవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. ప్రజలలో అసంతృప్తి, ఆందోళన, అసహనాలు బాగా పెరుగుతాయి.

అన్నిచోట్లా కరోనా కేసులు మళ్ళీ తిరగబెడతాయి. మళ్ళీ లాక్ డౌన్ పెట్టవలసినంతగా కేసులు పెరుగుతాయి. అయితే, ఈ వైరస్ కు మందు కనుక్కోబడుతుంది. దానితో, అనేకనెలలుగా మానవజాతిని వణికించిన వైరస్ కథ ఒక కొలిక్కి వస్తుంది. అప్పటివరకూ మానవాళికి గడ్డుకాలమే.

ఇండియా, చైనా, పాకిస్తాన్, ఆఫ్రికాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది కదా మనకేం కాదులే అని మిగతా దేశాలవారు అనుకోకండి. ఇది కనిపించని దేశాలలో కూడా దీని ప్రభావం ఉంటుంది. కనిపించే దేశాలలో బాగా ఎక్కువగా ఉంటె, మిగతా చోట్ల కొంచం తక్కువగా ఉంటుంది. అంతే.

ఈ ఫలితాలన్నీ డిసెంబర్ వరకూ కొనసాగుతాయి. జాగ్రత్త పడండి మరి.