Pages - Menu

Pages

30, జూన్ 2020, మంగళవారం

సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం - జ్యోతిష్య పరిశీలన

'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అని ఆత్రేయగారనుకుంటా వ్రాసింది. కానీ అది నిజం కాకపోవచ్చు. పోయినంత మాత్రాన అందరూ మంచోళ్ళు కారు. ఉన్నంతమాత్రాన చెడ్డవాళ్లూ కారు. అసలు ఉండటానికీ/పోవడానికి మంచితనానికి/చెడ్డదనానికీ  సంబంధం లేదుగాక లేదు. ఆయుస్సు ఉంటే ఉంటారు లేకపోతే పోతారు. సరే ఈ గోలంతా ఎందుకుగాని, సుశాంత్ సింగ్ జాతకం చూద్దాం.

ఇతను 21-1-1986 న పాట్నాలో పుట్టాడు. జాతకాన్ని ప్రక్కనే చూడవచ్చు. జనన సమయం రాత్రి 2. 15 అంటున్నారు. అలా అయితే వృశ్చికలగ్నం అవుతుంది. జైమినిమహర్షి ఇచ్చిన సూత్రం ప్రకారం తృతీయంలో పాపగ్రహాలున్నా, తృతీయానికి పాపగ్రహసంబంధం ఉన్నా, ఆత్మహత్యగాని బలవన్మరణం గాని జరుగుతుంది. ఎందుకంటే తృతీయం ఆయుస్థానం గనుక, పాపగ్రహసంబంధం వల్ల ఆయుష్షు దెబ్బతింటుంది.

ఇతని జాతకంలో చంద్రుడు నవమాధిపతిగా ఉఛ్చస్థితిలో ఉన్నాడు. పైగా పౌర్ణమికి దగ్గరగా వెళుతున్నాడు. కనుక ఇతనిది చాలా మంచి మనసని, సున్నితమైన మనసని అనిపిస్తున్నది. అయితే, ఇదే యోగం వల్ల, ఉద్రేకంలో తొందరపాటు పనులు చేసే స్వభావం కూడా ఉందని తెలుస్తున్నది.

లగ్నంలో శని ఉండటం ఈ లగ్నానికి మంచిది కాదు. శని చాలాబలమైన దృష్టితో చంద్రుడిని చూస్తున్నాడు. ఈ యోగం వల్ల తేలికగా డిప్రెషన్ లో పడటం, దురదృష్టం వెంటాడటం జరుగుతుంది.

ఇతని జాతకంలో ఆయుర్భావమైన తృతీయం బాగా దెబ్బ తిన్నది. కారణం? నీచగురువు, దశమాధిపతి అయిన సూర్యుడు శత్రుస్థానంలో ఉండటం, అందమైన అమ్మాయిలకు సినిమా స్టార్లకు కారకుడైన శుక్రుడు తీవ్రఅస్తంగతుడై ఉండటం కారణాలు. వెరసి ఈ ముగ్గురూ పాపగ్రహాలే అయ్యారు. వారి మీద శత్రుస్థానంలో చాలా కోపంగా ఉన్న శనిదృష్టి ఉన్నది. కనుక తృతీయం బాగా చెడిపోయింది.  అంటే,ఆయుష్షు దెబ్బ తిన్నది. కనుకనే 34 ఏళ్లకే బలవంతంగా చనిపోయాడు. 

'మందమాందిభ్యాం జలోద్భన్దనాదిభిః' - 'లగ్నంనుంచి గాని, కారకాంశనుంచి గాని, తృతీయంలో, శని, మాంది ఉంటే నీటిలో మునిగిగాని, ఉరితోగాని మరణిస్తాడు' - అన్న జైమినిమహర్షి సూత్రం మళ్ళీ నిజమైంది. ఈ జాతకంలో తృతీయంలో శనిమాందులు లేరు, కానీ శని యొక్క బలమైన చెడుదృష్టి తృతీయం మీద ఉన్నది. ఇంతకు ముందు జియా ఖాన్ జాతకం లోను, రంగనాధ్ జాతకం లోను, ఉదయ్ కిరణ్ జాతకం లోను ఈ యోగాలను చర్చించాను. కావలసినవారు పాతపోస్టులు చూడండి.

పంచమాధిపతి గురువు ప్రేమవ్యవహారాలకు సూచకుడు. విక్రమస్థానంలో ఇతని నీచస్థితి మంచిది కాదు. దశమాధిపతి అయిన రవితో, శుక్రుని అస్తంగత్వంతో కలసి, వృత్తిపరంగా పరిచయమైన అందగత్తెలతో ప్రేమజీవితం విఫలం అవుతుందని ఇది సూచిస్తుంది.

లగ్నాధిపతి కుజుడు ద్వాదశంలో శుక్రుని సూచిస్తున్న కేతువుతో కలసి ఉండటం వల్ల, సినిమా స్టార్స్ తో రొమాన్స్ దెబ్బతిని, హఠాత్ చెడుసంఘటనలకు దారి తీస్తుందని సూచన ఉంది. కుజుడు శుక్రస్థానంలో ఉండటం, అది ద్వాదశస్థానం  అవ్వడం గమనించాలి.

నిలకడ లేని మనసు

అసలే కోతి, ఆపైన కల్లుత్రాగింది, ఆపైన ఇంకేదో అయింది అన్నట్లు, అసలే ఉఛ్చచంద్రుడు, దానిమీద దోషి అయిన శనిదృష్టి, మకరం నుంచి నీచగురువు దృష్టి పడ్డాయి. దానితో బాటు రవిదృష్టి, అస్తంగతుడైన శుక్రుని దృష్టి పడ్డాయి. ద్వాదశం నుంచి కుజుని అష్టమ దృష్టి పడింది. దానితోబాటు కేతువు దృష్టి పడింది. చంద్రుని మీద ఇన్ని దృష్టులు ఉండటం, అతని మనసును ఊపిపారేస్తుంది. చాలా అల్లకల్లోలానికి గురి చేస్తుంది. ఇతను ఖచ్చితంగా డిప్రెషన్ లో పడ్డాడు.     

ఈ జాతకంలో చెడు యోగాలు
  • బాగా దెబ్బ తిన్న తృతీయం.
  • ఆయుస్థానంలో నీచగురువు స్థితి.
  • శుక్రుని అస్తంగత్వం
  • ఆత్మకారకుడైన బుధుని పాపార్గళం. 
  • ఉఛ్చచంద్రుని మీద శనిదృష్టి, మకరం నుంచి మూడు గ్రహాల దృష్టులు.
  • ద్వాదశంలో కేతు కుజులు.

దశలు

జూన్ 14 న ఇతను చనిపోయాడు. ఆ రోజున ఇతనికి రాహు - చంద్ర - శుక్రదశ నడిచింది. రాహువు లగ్నాధిపతి అయిన కుజుడిని సూచిస్తూ ఆరవఇంట్లో శత్రుస్థానంలో ఉన్నాడు. అంటే, తనకు తానే శత్రువు అవుతాడని లేదా రాక్షసుల్లాంటి భయంకరమైన శత్రువులుంటారని సూచన ఉన్నది. కుజరాహుసంయోగం రాక్షసత్వమే. చంద్రుని బలహీన డోలాయమాన పరిస్థితిని పైన వివరించాను. అదీగాక చంద్రుడు మారకస్థానంలో ఉన్నాడు. బలమైన నవమాధిపతిగా అధికారంలో ఉన్న బలమైన పెద్దవారిని సూచిస్తున్నాడు. లగ్నాత్ సప్తమంలో ఉండటం వారితో విరోధాన్ని సూచిస్తుంది. 

రాహుచంద్రులు కలిస్తే గ్రహణం అవుతుంది. దీనిని పిశాచగ్రస్తయోగమంటారు. అంటే, మనస్సు బాగా చెదిరిపోతుంది. పిచ్చిపిచ్చిగా ఉంటుంది. ఏం చేస్తున్నారో వారికే తెలియదు. బాగా కృంగిపోతారు.

ఇతనికి శుక్రుడు పూర్తిగా అస్తంగతుడైనాడు. శుక్రునితో కలసి ఉన్న సూర్యుడు వృత్తిస్థానానికి అధిపతిగా సినిమాఫీల్డ్ ను సూచిస్తున్నాడు. అంతేగాక పెద్దవారికి, అధికారంలో ఉన్నవారికి రవి సూచకుడు. తృతీయం కమ్యూనికేషన్ కు సూచిక గనుక నీచగురువు అక్కడే ఉన్నాడు గనుక, వారితో వచ్చిన మాటతేడాలను రవి సూచిస్తున్నాడు. శుక్రుడేమో అమ్మాయిల గొడవలను సూచిస్తున్నాడు.

సినిమాఫీల్డ్ లో ఉండే లుకలుకలు తెలియనివారెవరు? వాటిలో పడి ఎంతోమంది కళాకారులు ప్రాణాలు కోల్పోయారు. అదొక భయంకరమైన రొచ్చుగుంట. అందులోనూ బాలీవుడ్ అంతా మాఫియా కనుసన్నలలో నడుస్తుంది. వారిమాటలు వినకపోయినా, డబ్బుదగ్గర తేడాలు వచ్చినా ఏదైనా జరుగవచ్చు. ప్రాణాలంటే మాఫియాకు పెద్ద లెక్క కాదు.

ఇతను స్కిజోఫ్రీనియాతో బాధపడుతున్నాడని, ఇతనికి ఏవేవో మాటలు వినిపిస్తున్నాయని, భ్రమలకు గురౌతున్నాడని మహేష్ భట్ అన్నాడని రియా చక్రవర్తి చెప్పిందట. పర్వీన్ బాబీ కూడా ఇలాగే చేసేదని, "ఆమెను త్వరగా వదిలించుకో లేకపోతే నువ్వూ అయిపోతావ్" అని ఉప్పులూరి గోపాలకృష్ణమూర్తి అనబడే యూజీ తనతో చెప్పాడని మహేష్ భట్ అన్నాడు. యూజీ సలహా విని పర్వీన్ బాబీని మహేష్ భట్ వదిలించుకోవడమూ, ఆ తర్వాత డిప్రెషన్ కు గురైన ఆమె డ్రగ్స్ కి, త్రాగుడుకి అలవాటు పడి అనుమానాస్పద పరిస్థితులలో చనిపోవడమూ పాతతరంవారికి తెలిసినకధే. అయితే, పర్వీన్ బాబీకి, సుశాంత్ సింగ్ కీ పోలికలున్నట్లు కనిపిస్తుంది.

ఇతని మరణం వెనుక బాలీవుడ్ లోని కొన్ని పెద్ద తలకాయలున్నాయని అంటున్నారు. వాళ్లింకా బ్రతికే ఉన్నారు. అందుకని, మన పాలసీ ప్రకారం అప్పుడే వాళ్ళ జాతకాలు చూడటం మంచిది కాదు. మరికొన్నాళ్ళాగుదాం !

ఏదేమైనా, సెన్సిటివ్ జాతకాలలో 33 వ ఏడు గండకాలం అంటారు. ఇతనిది సెన్సిటివ్ జాతకమే. సుశాంత్ సింగ్ ఆకారం అబ్బాయిది గానీ, ఇతని మనసు అమ్మాయికంటే సున్నితమైనది. ఇతను కూడా అదే వయసులో చనిపోవడం చూస్తుంటే, కొన్ని కొన్ని నమ్మకాలు నిజమేనేమో అనిపిస్తుంది.

ఇది సహజమరణం కాదన్నది వాస్తవం.

29, జూన్ 2020, సోమవారం

గురువు గారి ధనూరాశి ప్రవేశం - ఒక అయిదు నెలల పాటు

మార్చ్ 30 నుంచి మకరంలో ఉన్న గురువు వక్రీకరిస్తూ రేపు  ధనుస్సులోకి రాబోతున్నాడు. మార్చ్ 30 నుంచి ఇప్పటివరకూ జరిగిన, జరుగుతున్న, సంఘటనలు చూస్తున్నారు కదా ! మానవజీవితం ఎంతగా అస్తవ్యస్తం కావాలో అంతగా అయింది.

'కరోనా కరోనా' అంటూ ఎవరెంత మొత్తుకున్నా, పోయే ప్రాణాలు పోతూనే ఉన్నా, జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ ఏదీ మానుకోలేదు. ఇంకా చెప్పాలంటే అన్నీ జోరుగా సాగుతూనే ఉన్నాయి.

శక్తి ఉన్నవాడు రక్తిలో ఊగుతున్నాడు. అది లేనివాడు భక్తిలో జోగుతున్నాడు. రెండూ ఒద్దనుకున్నవాడు మత్తులో తూగుతున్నాడు. ఉక్రోషం పట్టలేనివాడు పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడు. వెరసి అన్నీ జరిగిపోతున్నాయి.

ఆస్పత్రులు మాత్రం 'నో వేకెన్సీ' బోర్డులు పెడుతున్నాయి. 'పోతున్నా టాటా' అంటూ చివరిక్షణాలను కూడా వీడియో తీసి యూట్యూబులలో పెడుతున్నారు. అయినా ఎవడూ లెక్కచేయడం లేదు. హోటళ్లు, షాపులు, బజ్జీలబండ్లు, టీ అంగళ్ళు, బారుషాపులు, అన్నీ యధాప్రకారం నడుస్తున్నాయి. ఉండేవాడు ఉంటున్నాడు, పోయేవాడు పోతున్నాడు. ఇది గత మూడునెలల నుంచీ ఉన్న ట్రెండ్.

ఈ ట్రెండ్ ఇప్పుడు మారబోతున్నది. నేను కరోనా గురించి, సామాజికజీవనం గురించి చెప్పబోవడం లేదు. చెప్పడం వేస్ట్ గనుక. వ్యక్తిగతమానవ జీవితాలగురించే చెప్పబోతున్నాను. ఒక్క విషయం మాత్రం కరెక్ట్, రాబోయే అయిదునెలలలో కరోనా విశ్వరూపం చూడబోతున్నాం మనం,
--------------------------------------------------------
గత రెండురోజులనుండీ మనుషుల జీవితాలలో మార్పులు వస్తున్నట్లు మీరు గమనించవచ్చు. ముఖ్యంగా, ఇంతకు ముందు లేని సంఘటనలు ఇప్పుడు జరగడం, పాత మిత్రులు మళ్ళీ  మాట్లాడటం, కలవడం, మెసేజిలు ఫోన్లు చెయ్యడం గమనించవచ్చు. కొత్త వెంచర్లు, కొత్త ప్రయత్నాలు మొదలవడం చూడవచ్చు.

ముఖ్యంగా మిధున ధనూరాశుల వారికి ఈ మార్పు కొత్త పరిణామాలను తీసుకొస్తుంది. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి రివర్స్ అవుతుంది. ధనూరాశి వారికి బలం పెరుగుతుంది. మిధునరాశి వారికి టెన్షన్ పెరుగుతుంది.

మీనరాశివారికి ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువౌతుంది. ఇంటి పరిస్థితులు దారిలో పడతాయి. స్థిరాస్తులు కొనాలని ప్రయత్నాలు చేస్తారు. కన్యారాశివారికి ఇంట్లో గత మూడు నెలలుగా ఏడిపిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే, ఉద్యోగాలలో చికాకులు ఎక్కువౌతాయి.

కుంభరాశి, సింహరాశి వారికి పాతస్నేహితులు దగ్గరౌతారు. ప్రేమవ్యవహారాలు బలపడతాయి.

మేషరాశివారికి ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. దూరప్రయాణాలు మొదలౌతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. తులారాశివారికి దగ్గర ప్రయాణాలు మొదలౌతాయి. సోదరులకు మంచికాలం మొదలౌతుంది. మతరంగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు.

కర్కాటకరాశివారికి పనిఒత్తిడి ఎక్కువౌతుంది. రోగాలు తిరగబెడతాయి. శత్రువులు పెరుగుతారు. మకరరాశివారికి చికాకులు, కష్టాలు, నష్టాలు పెరుగుతాయి.

వృషభ, వృశ్చికరాశులవారు మాట దూకుడు వల్ల నష్టపోతారు. దీర్ఘరోగాలు మళ్ళీ తిరగబెడతాయి.

జాగ్రత్త పడండి మరి !

23, జూన్ 2020, మంగళవారం

'సిద్ధసిద్ధాంత పధ్ధతి' తెలుగు 'ఈ బుక్' విడుదలైంది



సిద్ధయోగ సాంప్రదాయానికి పరమగురువైన గోరక్షనాధుడు రచించిన ఈ గ్రంధం వెయ్యి సంవత్సరాల నాటిది. ఇందులో అద్వైతము, గురుతత్త్వము,  తంత్రమార్గము, యోగసాధనా రహస్యములే గాక సిద్ధ యోగ సాంప్రదాయమునకు చెందిన ప్రాచీన భావనలు, దానియొక్క ప్రత్యేకమైన  సాధనా విధానములు వివరించ బడినాయి. సిద్ధుల జీవన్ముక్తికి ప్రతీకగా భావింపబడే 'అవధూతస్థితి' వివరంగా చెప్పబడింది. ఈనాడు శక్తిలేని  కుహనాగురువులు కూడా 'శక్తిపాతం' ఇస్తున్నామని చెబుతూ  ఎక్కడబడితే అక్కడ మేమంటూ  తయారౌతున్నారు.  సిద్ధమార్గంలో  కలిగే అసలైన శక్తిపాతం ఎలా ఉంటుందో ఈ గ్రంధంలో స్పష్టంగా చెప్పబడింది. 

మానవజీవితానికి పరిపూర్ణత ఎలా వస్తుంది? దానికి ఏమేం చెయ్యాలి? అనేది మాత్రమే గాక, సృష్టి ఏ విధమైన ప్రణాళికతో జరిగింది అనే విషయాన్ని బ్రహ్మాండం నుండి పిండాండం వరకూ కూలంకషంగా వివరించడం జరిగింది.

‘పంచవటి’ నుండి మరొక్క మహత్తరమైన వేదాంత - యోగగ్రంథమును నా వ్యాఖ్యానముతో వెలువరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. ఇది 2020 లో ఇప్పటివరకూ మా సంస్థ నుండి వచ్చిన 13 వ పుస్తకం. లాక్ డౌన్ సయంలో వచ్చిన 11 వ పుస్తకం. మా తక్కిన గ్రంథముల వలెనే ఇది కూడా ముముక్షువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసం.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.ఎప్పటిలాగే, ఇది కూడా google play books నుండి లభిస్తుంది. కొద్ది రోజులలో తెలుగు, ఇంగ్లీషులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

13, జూన్ 2020, శనివారం

21-6-2020 సూర్యగ్రహణం ఫలితాలు

21-6-2020 ఆదివారంనాడు అమావాస్య ఛాయలో సూర్యగ్రహణం రాబోతున్నది. దాదాపుగా ఉదయం 9 నుంచి సాయంత్రం 3 వరకూ ఉంటుంది. మిట్టమధ్యాన్నం సమయంలో మంచిపట్టులో ఉంటుంది.

ఆదివారం, అమావాస్య, సూర్యగ్రహణం కావడంతో సాధనాపరంగా ఈ రోజుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. మంత్ర, తంత్రసాధనలు చేసేవారికి ఈరోజు చాలామంచి సిద్ధికారకమైన రోజు. అదీగాక, జూన్ 21 న పగలు అతిపెద్దదిగా ఉంటుంది. సమ్మర్ సోల్ స్టైస్ ఈ రోజున మొదలౌతుంది. అందుకనే మన ప్రధానమంత్రి మోడీగారు ఈరోజును International Yoga Day గా నిశ్చయించారు. ఇది యోగపరమైన ప్రాధాన్యత.

ఇప్పుడు మన జీవితాల పైన దీని ఫలితాలను చూద్దాం.

వ్యక్తిగత జాతకాలలో
---------------------
మానవాళికి పట్టిన తుప్పును ఈ గ్రహణం మళ్ళీ ఇంకోసారి వదిలించబోతున్నది.

ఈ గ్రహణం వల్ల బాగా చెదిరిపోయేది మిథునరాశి/లగ్నం వారు, అందులోనూ మృగశిరా నక్షత్రజాతకులు తీవ్రంగా ప్రభావితులౌతారు. అదే విధంగా, ధనూరాశి/లగ్నం వారు. వీళ్ళిద్దరిపైనా ఈ గ్రహణప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే, ఈ ఏడాది ఆఖరువరకూ దీని చెడుఫలితాలను వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. ఈ ప్రభావం భర్త/భార్య, కుటుంబ/వ్యాపార రంగాలలో ఉంటుంది. కనుక జాగ్రత్త పడండి.

కుంభలగ్నం/రాశివారికి సంతానం, ప్రేమ, వ్యాపారరంగాలలో తీవ్రమైన సమస్యలు ఉంటాయి. జీవితాన్ని ఆధ్యాత్మికంగా మలచుకుంటే మాత్రం అద్భుతమైన అనుభవం వారికి ఆరోజున కలుగుతుంది. సింహరాశి/లగ్నం వారికి కూడా అంతే.

మీనరాశి/లగ్నం వారికి - ఇంట్లో తీవ్రమైన చికాకులు తలెత్తుతాయి. విద్య, వాహనం, మనశ్శాంతి - ఈ రంగాలు బాగా దెబ్బతింటాయి.

కన్యారాశి/లగ్నం వారికి - వృత్తి, వ్యాపారం, జీవనాధారం రంగాలలో తీవ్రమైన ఒడుదుడుకులు, ఆశాభంగాలు ఉంటాయి. తండ్రి మరణించవచ్చు. లేదా ప్రమాదాలకు, రోగాలకు గురికావచ్చు. ఇంటిలో పరిస్థితి కూడా చాలా చేదుగా ఉంటుంది.

తులారాశి/లగ్నం వారికి - దూరప్రాంతాలలో చిక్కుకుపోవడం వల్ల నష్టం కలుగుతుంది. వీరికి కూడా తండ్రి గతించవచ్చు. లేదా ప్రమాదాలకు, రోగాలకు గురికావచ్చు. మేషలగ్నం/రాశి వారికి కూడా అంతే. ఆధ్యాత్మికంగా జీవితాన్ని చూచేవారికి మాత్రం ఈ గ్రహణం వల్ల చాలా మంచి అనుభవాలు కలుగుతాయి.

వృషభరాశి/లగ్నం వారికి - మాటదూకుడు వల్ల నష్టపోతారు. డబ్బు సమస్యలు కలుగుతాయి. నష్టాలు చవిచూస్తారు. పాత దీర్ఘరోగాలు మళ్ళీ ఉద్రేకిస్తాయి. పెద్దలకు ప్రమాదాలు రాసిపెట్టి ఉన్నాయి. జాగ్రత్తపడాలి. వృశ్చికరాశి/లగ్నం వారికి కూడా అంతే.

దేశ జాతకాలలో
-----------------

ఈ గ్రహణ ప్రభావం అమెరికా మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మిడిల్ ఈస్ట్ మీద కూడా బాగా తీవ్రంగా ఉంటుంది. అమెరికాకు ధైర్యం బాగా సన్నగిల్లుతుంది. ఇతరదేశాలను ప్రాధేయపడవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. ప్రజలలో అసంతృప్తి, ఆందోళన, అసహనాలు బాగా పెరుగుతాయి.

అన్నిచోట్లా కరోనా కేసులు మళ్ళీ తిరగబెడతాయి. మళ్ళీ లాక్ డౌన్ పెట్టవలసినంతగా కేసులు పెరుగుతాయి. అయితే, ఈ వైరస్ కు మందు కనుక్కోబడుతుంది. దానితో, అనేకనెలలుగా మానవజాతిని వణికించిన వైరస్ కథ ఒక కొలిక్కి వస్తుంది. అప్పటివరకూ మానవాళికి గడ్డుకాలమే.

ఇండియా, చైనా, పాకిస్తాన్, ఆఫ్రికాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది కదా మనకేం కాదులే అని మిగతా దేశాలవారు అనుకోకండి. ఇది కనిపించని దేశాలలో కూడా దీని ప్రభావం ఉంటుంది. కనిపించే దేశాలలో బాగా ఎక్కువగా ఉంటె, మిగతా చోట్ల కొంచం తక్కువగా ఉంటుంది. అంతే.

ఈ ఫలితాలన్నీ డిసెంబర్ వరకూ కొనసాగుతాయి. జాగ్రత్త పడండి మరి.

11, జూన్ 2020, గురువారం

అసలైన శ్రీవిద్య - అమ్మకానికి !

ఈ టైటిల్ చూసి నేనుకూడా కిరాణాషాపు తెరిచానని అనుకోకండి. నేనలాంటి పనిని ఈ జన్మకే కాదు, ముందుజన్మలంటూ ఉంటే, అప్పుడు కూడా చెయ్యను.

నా బ్లాగు చదివిన అనేకమంది నాకు మెయిల్స్ ఇస్తూ ఉంటారు. చాలా రోజులనుంచీ బ్లాగులో నా ఫోన్ నంబర్ తీసేశాను. కనుక ఫోన్ కాల్స్ తగ్గాయి. కానీ నా పుస్తకాలలో అది ఉంటుంది. దానిని చూచి చాలామంది నాకు ఫోన్లు కూడా చేస్తూ ఉంటారు. నా పుస్తకాల మీద వారివారి అభిప్రాయాలను చెబుతూ ఉంటారు. నా అదృష్టం బాగుండి ఇప్పటిదాకా అందరూ మంచిగానే వారి భావాలను వెల్లడిస్తున్నారు. ఆఫ్కోర్స్ వేరేరకంగా చెప్పినా - నా దారిలో నేను పోతూ ఉంటానుగాని - ఎవరినీ పట్టించుకోననుకోండి. అది వేరే సంగతి !

మొన్నీ మధ్యన ఒకామె 'శ్రీవిద్యా రహస్యం' చదివి నాకు ఫోన్ చేసింది. పుస్తకం ఎంత బాగున్నదీ, దానిని చదివి తానెంత ముగ్దురాలైపోయిందీ, అసలైన శ్రీవిద్య అంటే ఏంటో తెలియజెప్పే పుస్తకం చివరాఖరికి తనకు దొరికినందుకు ఎంత సంబరపడిందీ వివరంగా చెప్పుకొచ్చింది. చివరగా ఆమె ఇలా అంది.

'ఈ మధ్యన ఆన్లైన్ లో ఎన్నో చూస్తున్నామండి ! ఆన్లైన్ లో అసలైన శ్రీవిద్య నేర్పిస్తారంట ! మొదట్లో గణపతి మంత్రం ఇస్తారంట ! దానికి సింపుల్ గా 6000 కట్టాలంట ! ఆ తర్వాత వరసగా ఇంకా ఏవేవో మంత్రాలిస్తారంట ! తేపతేపకీ 6000 కట్టాలంట ! డబ్బులకు సమస్య కాదు. నిజంగా అమ్మవారిని చేరుకునే దారి చూపిస్తే ఎంతైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ! కానీ, వాళ్ళు అడుక్కునే తీరు, దీక్షలకు, మంత్రాలకు 'ఇంత' అంటూ రేట్లు పెట్టడం చూస్తె 'ఛీ' అనిపించింది' అన్నది.

నవ్వొచ్చింది. జాలేసింది. పిచ్చిలోకాన్ని, పిచ్చిజనాన్ని చూస్తుంటే ఇవి రెండేగా మనకు కలిగేది !

ఒళ్ళుతో సహా అన్నీ అమ్ముకుంటోంది మానవజాతి. ఇప్పుడు దేవుడిని కూడా అమ్మడం మొదలైందన్నమాట ! ఆఫ్కోర్స్ కొత్తగా మొదలైనది ఏమీ లేదనుకోండి. ఎప్పటినుంచో ఉంది. దైవదర్శనానికి టికెట్ పెట్టినప్పటి నుంచే మతానికి దరిద్రం మొదలైంది. ఇప్పుడు ఉపదేశాలు, మంత్రాలు, దీక్షలు కూడా వ్యాపారంగా మారాయన్న మాట !

Authentic Sri Vidya Online - అనే పదాలు ఇప్పుడు నెట్లో ఎక్కడ చూచినా కనిపిస్తున్నాయి. గణపతి మంత్రం కొనుక్కుంటే బాలామంత్రం ఫ్రీ. 'షోడశీ' మంత్రం కొనుక్కుంటే 'మహాషోడశి ఫ్రీ', చివరికి నా మహాపాదుకలు నీ నెత్తిన పెట్టడం ఫ్రీ ! ఇదీ వరస !

'అన్నీ అమ్ముకుంటూ చివరకు అమ్మని కూడా అమ్ముకుంటున్నారట్రా వెధవల్లారా ! ఏది చేసుకున్నా బ్రతకచ్చు కదా? ఇంతకు దిగజారాలా?' అనిపించింది.

అసలైన శ్రీవిద్య మంత్రాలలో లేదు. తంత్రాలలో లేదు. అదేంటో నా పుస్తకంలో స్పష్టంగా వివరించాను. మంత్రాలు తంత్రాలు మొదటి మెట్లు. LKG, UKG లాంటివి. అసలైన శ్రీవిద్య చాలా సింపుల్. దానికి డబ్బుతో పనే లేదు. నీ మనసుతో నీ హృదయంతో నీ ఆత్మతోనే దానికి పని !

ఉపదేశం, దీక్ష, సాధన - వీటికీ డబ్బుకీ ఎప్పుడూ లింకు పెట్టకూడదు. అది చాలా నీచమైన పని. దానికంటే పడుపువృత్తి చేసుకోవడం చాలా బెటర్. ఈ మాటను నేను చెప్పడం లేదు. అనేక తంత్ర గ్రందాలలోనే క్లియర్ గా వ్రాసుంది. అవేంటో సంస్కృతం నుంచి అచ్చతెలుగులోకి నేను అనువాదం చేసి వ్రాస్తే చదవడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. ఓపికుంటే మీరే నెట్లో వెతుక్కోండి. అన్నీ దొరుకుతాయి.

దైవాన్ని చేరాలని ఆర్తితో, ఆవేదనతో, ఒక దారికోసం వెదుకుతూ, దారిచూపగల ఒక వ్యక్తిని చేరుకుంటే, దానికి డబ్బుతో లింక్ పెట్టడం, హేయాతిహేయమైన పని. గురుశిష్యులమధ్యన డబ్బు అనేది అసలు రానే కూడదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, శిష్యులని ఇంట్లో ఉంచుకుని, తిండి పెట్టి, ఎదురు డబ్బులు బట్టలు ఇచ్చి, సొంతమనుషుల్లాగా చూసుకుంటూ మరీ విద్య నేర్పాలి. దీనిలో కులాన్ని మతాన్ని, ఇంక దేనినీ చూడకూడదు. అదీ అసలైన గురుత్వమంటే ! అదీ అసలైన వైదికధర్మమంటే ! అసలైన శక్తికలిగిన ప్రాచీన ఋషులందరూ ఇదే చేశారు.

'మీ మార్గంలో సాధన చెయ్యాలంటే మాకుండవలసిన అర్హత ఏమిటి?' అని చాలామంది నన్ను గతంలో అడిగారు. ఇప్పుడూ అడుగుతూ ఉంటారు. వారందరికీ జిల్లెళ్లమూడి అమ్మగారి మాటను చెబుతూ ఉంటాను.

అమ్మ ఇలా అనేవారు- 'తినడానికి వేరే అర్హతలెందుకు నాన్నా? ఆకలే దానికి అర్హత'.

అదే పంధాలో నడుస్తూ నేను కూడా ఇదే చెబుతాను.

'సాధన చెయ్యడానికి తపనే అర్హత. 'సాధన చెయ్యాలి, ఎలాగైనా ఈ జన్మలోనే దైవాన్ని చేరుకోవాలి' అన్న తపన ఒక్కటే సాధన చెయ్యడానికి అర్హత. మిగతావేవీ అక్కర్లేదు. అవసరం లేదు'.

ఆధ్యాత్మికత అనేది వ్యాపారం కాదు. కాకూడదు. దానిని వ్యాపారంగా మార్చాలని ప్రయత్నించేవాళ్ళు చాలా నష్టపోతారు. వాళ్ళ సాధ్యం కాదు. ప్రపంచంలో దేనితోనైనా వ్యాపారం చెయ్యవచ్చేమోగాని, ఆధ్యాత్మికతతో మాత్రం కాదు. లాంగ్ రన్ లో ఇది చాలా దెబ్బ కొడుతుంది. వాళ్ళ కుటుంబాలు ఎక్కి రావు. 

కొంతమందికి అనుమానం రావచ్చు. మీరు కూడా పుస్తకాలు రాస్తున్నారు. వాటికి వెల పెట్టారు కదా? అని. పుస్తకాల ప్రచురణ వేరు. దానికి ఖర్చు అవుతుంది. అందుకని వాటికి వెల పెట్టాం. అదికూడా చాలా తక్కువగా నిర్ణయించాం. వాటిమీద డబ్బు సంపాదించాలని పుస్తకాలు వ్రాయడం లేదు. అతి కొద్ది మార్జిన్ తో మా పుస్తకాలకు వెల నిర్ణయిస్తున్నాం. అసలైన ఆధ్యాత్మికవిజ్ఞానాన్ని లోకానికి తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతో పుస్తకాలు వ్రాస్తున్నాను గాని, పిచ్చిపిచ్చి పురాణకధలు చెప్పి జనం దగ్గర డబ్బులు గుంజడానికి కాదు.

మా పుస్తకాన్ని చదివిన ఒక అమెరికన్ మా వెబ్ సైట్ లో ఈ విధంగా కామెంట్ చేశాడు - 'పీనట్స్ లాంటి రేటుకు ఎంతో విలువైన సమాచారం మీ పుస్తకంలో ఉన్నది'. మా పుస్తకాలతో పోలిస్తే ఎందుకూ పనికిరాని పుస్తకాలు 45 డాలర్స్ కి అమ్ముతుంటే మేము మా పుస్తకాలను 2 డాలర్స్ కి అమ్ముతున్నాం. అర్ధమైందా?

కనుక పుస్తకాల ప్రచురణకూ, ఉపదేశాలకూ సంబంధం లేదు. 'పుస్తకం ప్రింట్ చెయ్యాలంటే ఖర్చు అవుతుంది. మంత్రోపదేశమో ఇంకేదో చెయ్యాలంటే ఏం ఖర్చు అవుతుంది? ఆర్థికంగా నీకు ఖర్చయ్యేదేముంది దాంట్లో?' అందుకే నా మార్గంలో నేనిచ్చే దీక్షలకు ఒక్క పైసా కూడా ఎవరిదగ్గరా తీసుకోను. నిజాయితీ, త్రికరణశుద్ధి, మంచిహృదయం, సాధనలో తపన - ఒక మనిషిలో ఇవే నేను చూచే లక్షణాలు. కోటీశ్వరుడైనా, కూలివాడైనా నా మార్గంలో ఒకటే. ఇంకా చెప్పాలంటే, పై లక్షణాలు కనిపిస్తే కూలివాడిని కూడా దగ్గరకు తీసుకుంటాను. అవి లేకపోతే కోటీశ్వరుడిని కూడా దగ్గరకు రానివ్వను.

బీచ్ లో పడి పొర్లినా మనకెంత ఇసుక అంటుకోవాలో అంతే అంటుకుంటుంది. దేవుడిని అమ్ముకుని కూడా డబ్బు సంపాదించాలా? దానికంటే చావడం మేలు. ధూ !

నల్లప్రాణం విలువ 20 డాలర్లు

ఈ వార్త పాతదే. గత నెల 25 న అమెరికాలో జరిగింది. కానీ దీని ప్రాముఖ్యత కొత్తది. నిజంగా కొత్తదా? అంటే అదీ ఇదమిద్ధంగా చెప్పలేం. మానవసమాజం అంత పాతది. ఎందుకంటే, మనిషి భూమ్మీద పుట్టిననాటినుండీ అసూయ ఉంది, ద్వేషం ఉంది, కోపం ఉంది, అధికారం చేతిలో ఉంటే దాని దుర్వినియోగం ఉంది, బలహీనులపైన జులుం చెలాయించడం ఉంది, దానిని సమర్ధించుకోవడం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని కాలాలలో ఉన్నాయి, అన్ని దేశాలలో ఉన్నాయి. అయితే, చాలా అభివృద్ధి చెందిన దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇలాంటి సంఘటనలు ఈనాడు జరగడం ఆ సమాజపు డొల్లతనాన్ని స్పష్టంగా చూపిస్తున్నది.

సమాజం నిజంగా చాలా ఉన్నతమైన భావాలు కలిగినదై ఉండటం వేరు. ఏం జరిగినా, 'అబ్బే ఏం లేదు' అంటూ దానిని చాపక్రింద దాచిపెట్టి 'మేం చాలా అభివృద్ధి చెందాం' అని గప్పాలు కొట్టుకోవడం వేరు. ఇలా దాచిపెట్టడం, వాళ్లకు కావలసినదే బయటకు చూపించుకోవడం చైనాలో సర్వసాధారణం. ఇప్పుడు అదే చైనా పుణ్యమాని భూగోళమంతా వణికి చస్తున్నది. అమెరికాలో కూడా ఇది సహజమే. ముఖ్యంగా ఒక నేరాన్ని తెల్లవాడు చేస్తే ఒక శిక్ష, నల్లవాడు చేస్తే ఇంకో శిక్ష అక్కడ ఉంటుంది. పైకి ఉన్నట్లుగా కనిపించకపోయినా, లోలోపల తేడాలుంటాయి. పైకి అంతా సమానమే అని చెప్పినా, ఎక్కడికక్కడ రేసిజం ఛాయలు కనిపిస్తూనే ఉంటాయి.

ఇండియాలో కులవ్యవస్థ ఉందని అన్ని దేశాలూ విమర్శిస్తాయి. మరి 'రేసిజం' అన్న పదానికి అర్ధం చెప్పమని వాటిని అడిగితే కనపడకుండా పారిపోతాయి. లేదా కల్లబొల్లి కబుర్లు చెప్పడం మొదలుపెడతాయి. రేసిజమూ కులవ్యవస్థా  రెండూ వాటి బాహ్యవికాసరూపంలో వేర్వేరు కావచ్చు. కానీ మూలాల్లో రెండూ ఒకటే. 'ఒక మనిషి మనలాగా లేకపోతే వాడిని దూరం పెట్టు' అన్నదే వాటి మూలసూత్రం. ఇది జంతున్యాయం గాని మానవన్యాయం కాదు. కానీ మనుషులూ జంతువులేగా? 'మనిషి ఒక సామాజిక నాగరిక జంతువు' - అంతే. బయటకు ఎంతో తెల్లగా, మంచిగా, నాగరికంగా కనిపించవచ్చు. కానీ లోలోపల జంతువే. ఈ సత్యాన్ని మానసికశాస్త్రం ఎప్పుడో ఒప్పుకుంది.

గత నెల 25 న జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లవాడిని మినియాపోలిస్ పోలీసులు హత్య చేశారు. అతనితో వాళ్ళు ప్రవర్తించిన తీరు చాలా పాశవికంగా ఉంది. చాలా దారుణంగా ఉంది. అమెరికా మొత్తం నిరసనలు వెల్లువెత్తేలా  చేసింది.

'కప్ ఫుడ్స్' షాపులో సిగరెట్లు కొనడానికి అతనిచ్చిన 20 డాలర్ల నోటు దొంగదే కావచ్చు. కానీ ఆ దొంగనోటును ప్రింట్ చేసింది అతను కాదు. ఆ వ్యవస్థను పట్టుకోవాలి. అతన్ని చంపితే ఏం వస్తుంది? మన దేశంలో, నోట్ల రద్దుకు ముందు చూస్తే, 500 రూపాయల నోట్లన్నీ దొంగవే. ప్రతివాడి జేబులోనూ దొంగనోట్లే అప్పుడు ఉండేవి. ఇక ఆరకంగా అందరినీ చంపుతూ పోతే ఇప్పటికి మన దేశ జనాభా ఏ 10 కోట్లకో పడిపోయి ఉండేది.

జార్జ్ ఫ్లాయిడ్ కు పాత నేరచరిత్ర ఉండి ఉండవచ్చు. అంతమాత్రాన ఆ విధంగా అతన్ని ఒక జంతువులాగా చంపడం అవసరమా? ఈ సంఘటనలో అతనేమీ పోలీసులతో ఫైట్ చెయ్యలేదు. పోలీసులకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. చంపడానికి వారికి హక్కు లేదు. మనిషిని జంతువులాగా ట్రీట్ చెయ్యడానికి వారికి హక్కు లేదు. మనిషి ఆరడుగులున్నా, ఎంత బలంగా ఉన్నా, అతనికీ నాడీకేంద్రాలుంటాయి, సున్నితమైన భాగాలుంటాయి. మెడ అనేది ఒక సున్నితమైన జాయింట్. అది ఎక్కువ బరువును ఎక్కువసేపు భరించలేదు. అందులోనూ ఒక కోణంలో అయితే అస్సలు భరించలేదు. వీరవిద్యలలో అనుభవం ఉన్నవారికి ఈ విషయం బాగా తెలుసు. మరి అతనితో ఆ పోలీసులు అంత క్రూరంగా ప్రవర్తించడం ఎంత దారుణం? దానిని పోలీసు యూనియన్లు సమర్ధించడమూ, ఏదో కంటితుడుపు చర్య తీసుకున్నామని చూపడమూ అన్నీ డ్రామాలే. నలుగురు పోలీసులు కలసి నడిరోడ్డుమీద ఒక మనిషిని చంపడమే అది !

సోషల్ మీడియా అనేది ఒకటి ఉండటమూ, ఎంతోమంది అక్కడున్న పౌరులు ఈ సంఘటనను వీడియో తీసి యూ ట్యూబ్ లోనూ ఇంకా ఇతర సోషల్ మీడియాలలోనూ పెట్టడమూ, పోలీసులను ఇరకాటంలో పెట్టాయి. సోషల్ మీడియా లేకుంటే, దీనిని ఒక సాధారణ సంఘటనగా చిత్రీకరించి ఎప్పుడో కేసును మూసేసి ఉండేవారు. సోషల్ మీడియా పుణ్యమాని చచ్చినట్లు చర్య తీసుకోవలసిన పరిస్థితి వచ్చింది. పోలీసు వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా సోషల్ మీడియా మళ్ళీ గెలిచింది. నేటి ప్రపంచంలో సోషల్ మీడియా ఎంత శక్తివంతమైన ఆయుధమో ఈ సంఘటన నిరూపిస్తున్నది. మన చేతిలోని మొబైల్ ఫోనూ, దాని కెమెరా ఈ రెండూ ఎంత శక్తివంతములైన ఆయుధాలో ఈ సంఘటన మళ్ళీ నిరూపిస్తున్నది. 

'తెల్లవారి ఆధిపత్యం' అనే భావన ఎంత ప్రమాదకరమో, 'పోలీసు జులుం' అనేది కూడా అంతే ప్రమాదకరం. దురదృష్టవశాత్తూ అమెరికాలో ఇవి రెండూ బాగా ఎక్కువే. అన్ని రాష్ట్రాలలో కాకపోవచ్చు. కొన్నింటిలో బాగా ఎక్కువ. అందరిలోనూ రేసిజం ఉండకపోవచ్చు. కానీ తెల్లవాళ్ళలో చాలామందిలో ఇది ఉంది. రెండుసార్లు అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా ఈ పోకడలు అక్కడి సమాజంలో గమనించాను. తెల్లతోలు కాకపోతే చాలు, వాళ్ళ ట్రీట్మెంట్ చాలా తేడాగా ఉంటుంది. 'అసలు వీడెందుకు ఇక్కడికొచ్చాడు?' అన్నట్లు చూస్తారు. అందరు తెల్లవాళ్లూ దుర్మార్గులని, అందరు నల్లవాళ్ళూ మంచివారనీ నేననడం లేదు. జార్జ్ ఫ్లాయిడ్ అంతిమయాత్రలో పాల్గొన్న అనేకమంది తెల్లవాళ్లే దీనికి ఉదాహరణ. కులం, మతం, రంగు, దేశాలతో సంబంధం లేకుండా మంచీచెడూ ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కానీ అంత చిన్ననేరానికి అతన్ని అలా చంపడం దారుణాతి దారుణం. అమెరికాలో నల్లవారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందొ చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ !

మినియాపోలిస్ మేయర్ 'జాకబ్ ఫ్రే' మాటల్లో చెప్పాలంటే - 'నల్లవాడిగా అమెరికాలో ఉండటం అంటే మరణశిక్ష కాకూడదు. అయిదునిముషాలపాటు ఒక తెల్లపోలీస్ ఆఫీసర్ ఒక నల్లవాడి గొంతుమీద మోకాలు పెట్టి అదిమిపట్టిన వీడియో మనం చూచాం. ఎవరైనా సహాయం కోసం అరుస్తుంటే, మనం సాయం చెయ్యాలి. మానవత్వం అనే తన అత్యంత ప్రాధమికబాధ్యతను ఈ పోలీస్ ఆఫీసర్ మరచిపోయాడు'.

రెండ్రోజుల తర్వాత ఆయన ఇంకా ఇలా అన్నాడు ' కలర్డ్ పీపుల్, ముఖ్యంగా నల్లవాళ్ళు, ఇదే పోలీస్ ఆఫీసర్ చేసిన పని చేసుంటే, ఈపాటికి జైల్లో ఉండేవారు'.

ఫ్లాయిడ్ మరణం ఒక హత్యేనని ఆయనన్నాడు. 'నాకు ఊపిరి అందడం లేదు. నన్ను చంపకండి, ప్లీజ్ కాపాడండి' అంటూ ఫ్లాయిడ్ దాదాపు అయిదు నిముషాలు అడుగుతూనే ఉన్నాడు. చివరలో వాళ్ళమ్మను తలచుకుంటూ 'అమ్మా అమ్మా' అని పిలిచిన తీరు చూస్తె ఎవరికైనా కళ్ళలో నీళ్ళు తిరగడం ఖాయం. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ కు ఏ మాత్రమూ జాలి కలగలేదు. అతనికే కాదు. అతనితో ఉన్న మిగతా ముగ్గురు పోలీసులకు కూడా కలగలేదు. చుట్టూ మూగిన పౌరులు ' అతను చనిపోతున్నాడు. ఆపండి' అంటూ బ్రతిమిలాడినా వాళ్ళు వినలేదు. రాక్షసత్వానికి పరాకాష్ట !

ఈ సంఘటన మీద స్పందిస్తూ నిన్నామొన్నటి అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ తన ప్రెస్ రిలీజ్ లో ఇలా అన్నాడు ' అమెరికాలోని చాలా పొడుగైన అన్యాయాల, విషాదాల చరిత్రచిట్టాలో ఇది కొంగ్రొత్త సంఘటన. అమెరికాలోని దాదాపు అన్ని రంగాలలోనూ 'ఒకడు ఎలా ట్రీట్ చెయ్యబడతాడు' అనడానికి, అతడి 'రంగు' అనేది కారణం కావడం చాలా బాధాకరం'.

ఈ మాటన్నది నిన్నా మొన్నటి అమెరికా ప్రెసిడెంట్ అన్న విషయం గుర్తుంటే, అమెరికాలో రేసిజం ఎంత స్థాయిలో ఉందో అర్ధమౌతుంది.

ఆ రోజున గ్రహస్థితులను ఒక్కసారి చూద్దాం.

మకరంలో గురుశనుల వక్రస్థితి, వాళ్ళిద్దరూ బాగా దగ్గరగా ఉండటం ఒక విషయం. ఇది మేక్రోస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా జరిగే ఘోరాలకు సూచిక. మిధునంలో రాహువు, బుధుడు, చంద్రుడు ఆ రోజున దగ్గరగా కలవడం మైక్రోస్థాయి సంఘటనలను సూచిస్తుంది. వీరిలో రాహువు బుధుడు బాగా దగ్గరగా ఉంటూ బుద్ధిలేనితనాన్ని సూచిస్తున్నారు. చంద్రుడు సున్నా డిగ్రీలలో ఉంటూ మైండ్ లేని చర్యలను సూచిస్తున్నాడు. మిధునం అమెరికాకు సూచిక అని జ్యోతిష్య విద్యార్ధులకందరికీ తెలిసిన విషయమే. ఇంకేం కావాలి? మొత్తం బొమ్మ అంతా చాలా స్పష్టంగా ఉన్నది.

ఈ సంఘటన జరిగాక, సోషల్ మీడియాలో ఇండియన్ ఒకాయన ఇలా వ్రాశాడు.

'నేను మూన్నెల్ల క్రితం అమెరికాలో ఉన్నాను. అక్కడ ఏదో కొని 50 డాలర్ల నోటు ఇచ్చాను. చిల్లరగా నాకు ఒక 10 డాలర్ నోటు, ఒక 20 డాలర్ నోటు వచ్చాయి. వాటితో ఇండియాకు వచ్చిన నేను, ఇక్కడ వాటిని మన కరెన్సీలోకి మార్చుకుందామని ప్రయత్నిస్తే, ఆ 20 నోటు నకిలీదని కౌంటర్లో అన్నారు. దానిని గనుక అమెరికాలో మార్చినట్లయితే నా గతి ఏమై ఉండేదో తలచుకుంటే నాకు ఒణుకు పుడుతోంది'.

నిజమే ! అతని అదృష్టం బాగుంది గనుక ఇండియా కొచ్చాక దానిని రూపాయలలోకి మారుద్దామని ప్రయత్నించాడు. లేకుంటే జార్జ్ ఫ్లాయిడ్ కంటే ముందే ఇతను శవమై ఉండేవాడు. ఆఫ్ కోర్స్ ! అందరికీ అలా జరగదనుకోండి. కానీ చెప్పలేం. ఖర్మ బాలేనప్పుడు ఏదైనా జరుగవచ్చు.

మొత్తం మీద నల్లవాడిగా పుట్టడమూ, అమెరికాలో ఉండటమూ, ధనికుడు కాకపోవడమూ, జార్జ్ ఫ్లాయిడ్ కొంప ముంచాయి. బానిసత్వాన్ని అబ్రహాం లింకన్ ఎప్పుడో రద్దు చేశాడు. కానీ తెల్లవాళ్ళ మనసులలో అదింకా కొనసాగుతున్నట్లే ఉంది చూస్తుంటే !

10, జూన్ 2020, బుధవారం

'వరాహోపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది


శుక్లయజుర్వేదాన్తర్గతమైన 'వరాహోపనిషత్' అనబడే  అద్భుతమైన  గ్రంధాన్ని 'ఈ-బుక్' గా నా వ్యాఖ్యానంతో ఈరోజున విడుదల చేస్తున్నాము. ఇది కూడా యోగోపనిషత్తులలో ఒకటి. లాక్ డౌన్ సమయంలో మా సంస్థనుంచి విడుదలైన పదవపుస్తకం ఇది. ఈ సంవత్సరంలో చూచుకుంటే ఇప్పటిదాకా విడుదలైన 12 వ పుస్తకం.

దీనిలో 5 అధ్యాయములు, 247 శ్లోకములున్నాయి. బ్రహ్మమానసపుత్రుడైన ఋభుమహర్షి చేసిన తపస్సు గురించి, ఆయన పొందిన బ్రహ్మజ్ఞానమును గురించి, పులస్త్యబ్రహ్మ కుమారుడైన నిదాఘునికి ఆయన గురువై జ్ఞానబోధ చేసిన వృత్తాంతమంతా ఈ ఉపనిషత్తులో ఉన్నది గనుక ఇది అతి ప్రాచీనమైనదే గాని, బాగా తరువాతి కాలంలో గ్రంథస్థం చేయబడినదని అర్థమౌతున్నది. దీనిలోని అనేక విషయములు దాదాపు రెండువేల సంవత్సరముల నాటివి. కానీ ఇది వ్రాయబడినది మాత్రం దాదాపుగా 13 శతాబ్దం ప్రాంతమని పండితుల అభిప్రాయం.

ఈ గ్రంధం యొక్క మొదటి మూడు అధ్యాయములలో ఋభుమహాముని తపోవృత్తాంతము, ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వరాహస్వామి చేసిన జ్ఞానబోధ కనిపిస్తాయి. నాలుగు అయిదు అధ్యాయములలో ఋభుమహాముని తన శిష్యుడైన నిదాఘునకు చేసిన బోధ గోచరిస్తుంది. అయిదవ అధ్యాయం పూర్తిగా యోగపరమైన విషయములతో నిండి యున్నది. దీనిలో మంత్ర, లయ, హఠయోగములు చెప్పబడినాయి. 

తత్త్వసిద్ధాంతమును, అద్వైతవేదాంతమును, బ్రహ్మవిద్యను, ఆత్మజ్ఞానమును, జీవన్ముక్తలక్షణములను, జ్ఞానభూమికలను, యోగశాస్త్రమును ఒక్క చోటకు తేవాలన్న ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తున్నది. యోగవాశిష్టంనుంచి, శంకరాద్వైతం నుంచి, యోగతంత్ర గ్రంధముల నుంచి ఎన్నో విషయములు ఇందులో ఒకేచోట మనకు కనిపిస్తాయి.

‘పంచవటి’ నుండి మరొక్క మహత్తరమైన వేదాంత - యోగ గ్రంథమును నా వ్యాఖ్యానముతో వెలువరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మా తక్కిన గ్రంథముల వలెనే ఇదికూడా ముముక్షువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసం.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఎప్పటిలాగే, ఇది కూడా google play books నుండి లభిస్తుంది. కొద్ది రోజులలో తెలుగు, ఇంగ్లీషులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

8, జూన్ 2020, సోమవారం

మిత్రులారా....

మిత్రులారా.... 
గుళ్ళకు రమ్మని నన్ను పిలవకండి
పానశాలలో పవిత్రత ముందు
గుడి చాలా అపవిత్రంగా కనిపిస్తోంది

మిత్రులారా....
మతవేషాలు వెయ్యమని నన్ను అడక్కండి
నగ్నత్వం అలవాటైన నాకు
మడిపంచెలు మహాకంపు కొడుతున్నాయి

మిత్రులారా....
పూజలు చెయ్యమని నాకు చెప్పకండి
సాకీధ్యానంలో తన్మయుడినైన నాకు
పరధ్యానం కూడా పరధ్యానమే అవుతోంది

మిత్రులారా....
ఎప్పటివో ప్రసాదాలు నాకు పెట్టకండి
నిత్యనూతన మధువును త్రాగే నాకు
ప్రసాదాలు పాచిబట్టి కనిపిస్తున్నాయి

మిత్రులారా....
నేను నాసిరకం నాస్తికుడినని అనుకోకండి
నా సాకీ ముగ్ధసౌందర్యం ముందు
నాస్తికుల అస్థిపంజరాలు నవ్వు పుట్టిస్తున్నాయి

మిత్రులారా....
నా దారిన నన్ను వదిలెయ్యండి
అవస్థలు పడుతూ కూడా మీరు చేరలేని అంచులకు
ఆకాశమార్గాన పయనిస్తూ ఎప్పుడో చేరుకున్నాను...

సాకీ నా దేవత
మధువే నా అమృతం
నేనుండేదే స్వర్గం
మరి నేనెవర్ని?
మిత్రులారా....

నీ సమక్షంలో...

ఒకరోజు నాతో సాకీ ఇలా అంది

'నా మనస్సు చాలా చంచలం.
నాకెన్నో సందేహాలున్నాయి.
కానీ నీ సమక్షంలో అవేవీ గుర్తుకు రావు.
ఎందుకిలా?'

నేనిలా చెప్పాను.

'నా మనస్సు చాలా గట్టిది.
నాకే సందేహాలూ లేవు.
కానీ నీ సమక్షంలో నేనే లేకుండా పోతుంటాను.
ఎందుకిలా?'

ఉన్నట్టుండి నిశ్శబ్దం ఆవరించింది.

పడిన పాత్రనుంచి మధువు పారుతోంది.

కాలపు చినుకులు...

వర్షం ఆగకుండా పడుతూనే ఉంది
మధుశాలలో ఒక్కడినే కూచుని
బయట కారుతున్న కాలపు చినుకుల్ని
గాజు కిటికీలోంచి చూస్తున్నా

మధువు నరాలలోకి జారుతూ
మనసు మంటల్ని మాయం చేస్తోంది
సాకీ ఎదురుగా కూచుని
నా  కళ్ళలోని శూన్యాన్ని చూస్తోంది

'ఏం చూస్తున్నావ్ నా కళ్ళలో?'
అన్నాను మధువు త్రాగుతూ.
'నువ్వేం చూస్తున్నావ్ వర్షంలో?'
అంది మత్తుగా నవ్వుతూ.

'వర్షంలో నిన్నే చూస్తున్నా'
అన్నా మౌనంగా.
'నీ కళ్ళలో నన్నే చూస్తున్నా'
అంది తనూ మౌనంగా.

వర్షం పడుతూనే ఉంది....

ముసురు పట్టిన ఉదయం

ముసురు పట్టిన ఉదయం
ఆగుతూ పడుతున్న వర్షం
పానశాలలో తనూ నేనూ
నిద్రలో జోగుతున్న ఊరు
మత్తులో తూగుతున్న నేను

తను పోస్తోంది
నేను త్రాగుతున్నా
చీకటి పడింది
తనూ లేదు నేనూ లేను
నిండిన పానపాత్ర

త్రాగింది నేను
మత్తెక్కింది తనకు
పానశాల మూసే వేళకు
ఊరే మాయమైంది...

నాతో నడవాలంటే....

నాతో అడుగు కదపాలంటే
నాలా నడిచే ఓర్పు నీకుండాలి
నాతో గొంతు కలపాలంటే
నాలా పాడే నేర్పు నీకుండాలి

నా వెంట రావాలంటే
నీ మనసును వదిలెయ్యాలి
నా జంట ఉండాలంటే
నీ ఉనికినే విస్మరించాలి

నా తోడుగా అవ్వాలంటే
నీ ఆస్తులను కాల్చివెయ్యాలి
నా మేడపైకి ఎక్కాలంటే
అంతస్తులను కూల్చివెయ్యాలి

నాతో కలసి నవ్వాలంటే
నవ్వునూ ఏడుపునూ ఒకేలా చూడాలి
నాలా నీవూ అవ్వాలంటే
పువ్వునీ నిప్పునీ ఒకేలా తాకాలి

నాతో నడవాలంటే
ముళ్ళను హర్షంతో భరించాలి
నాలో తడవాలంటే
నువ్వే వర్షంగా మారాలి

నా స్నేహం కావాలంటే
నిన్ను మరచి నాలా అయిపోవాలి
నాతో ఎప్పుడూ ఉండాలంటే
నువ్వు మరిగి నాలో కరిగిపోవాలి

నాతో వస్తావా నేస్తం?

నాతో వస్తావా నేస్తం?
నక్షత్రాల వీధుల్లో
నడుస్తూ మాట్లాడుకుందాం

నాతో వస్తావా నేస్తం?
నిత్యత్వపు జలపాతాల్లో
తడిసిపోతూ నవ్వుకుందాం

నాతో వస్తావా నేస్తం?
చావులేని సరస్సు నీళ్ళలో
ఈతకొడుతూ ఆడుకుందాం

నాతో వస్తావా నేస్తం?
విశ్వపు అంచుల వింతసీమలలో
విహంగాల్లా ఎగిరిపోదాం

నాతో వస్తావా నేస్తం?
మన ఉనికినే మరచిపోయి
మంచుముద్దల్లా కరిగిపోదాం

నాతో వస్తావా నేస్తం?
ఈ లోకపు నిమ్నత్వాలను మరచి
మనోజ్ఞసీమలలో మాయమౌదాం

నాతో వస్తావా నేస్తం?
అతీతలోకాల అడవిబాటల్లో
దారితప్పి తిరుగుతుందాం

నాతో వస్తావా నేస్తం?
స్వర్లోకపు గులాబీ తోటల్లో
మధుసేవతో మత్తెక్కిపోదాం

నాతో వస్తావా నేస్తం?
ఉనికే లేని శూన్యంలో
నాదపు అలలపై తేలిపోదాం

నాతో వస్తావా నేస్తం?
కాలపు కట్టుబాట్లను దాటి
కాంతి సముద్రంలో కరిగిపోదాం

నాతో వస్తావా నేస్తం?
కష్టాలూ కన్నీళ్ళూ లేని
వెలుగుదారుల్లో పరుగు తీద్దాం

నాతో వస్తావా నేస్తం?
జనన మరణాలను అధిగమించి
వెలుగు పుంజాలై నిలిచిపోదాం

నాతో వస్తావా నేస్తం?
నువ్వూ నేనూ లేని
అనంతశూన్యంలో ఒక్కటౌదాం...

7, జూన్ 2020, ఆదివారం

చీకటి ప్రేయసి...

ప్రతిరోజూ చీకటి పడగానే
చీకటిలో చీకటిగా మారి
చిరకాలపు విశ్వంలోకి
చివ్వుమంటూ ఎగిరిపోతాను

దీపాల వెలుగులకు దూరంగా
అస్తిత్వపు ఆరాటాలకతీతంగా
అంతులేని చీకటి సముద్రంలో
అలనై కలనై కరిగిపోతాను

చుక్కల లోకాలను మీరిపోతూ
వెలుగుల తీరాలకు దూరమౌతూ
కళ్ళు కనిపించని కటిక చీకట్లో
నేనే లేకుండా మాయమౌతాను

సడిలేని శూన్యపు అలలపైన
తడిబారిన కన్నుల నీటితో
నన్నే ధ్యానిస్తున్న నా ప్రేయసి
ఆత్మలో ఆత్మగా చేరిపోతాను

సృష్టి ఉందో లేదో ఎవరికి తెలుసు?
మేమంటూ ఉంటే కదా అసలు?
ఎంతకాలం అలా అంటారా?
కాలం ఉంటే కదా అసలు?

5, జూన్ 2020, శుక్రవారం

చంద్రగ్రహణం - జూన్ 2020

ఈ రోజు పౌర్ణమి. నేటి రాత్రి 11 నుండి 2.30 వరకూ బలహీనమైన చంద్రగ్రహణం రాబోతున్నది. గ్రహణం బలహీనమైనదైనప్పటికీ , చంద్రుడు ఈ సమయంలో నీచస్థితిలో ఉంటాడు గనుక దీని ఫలితాలు మనస్సు మీద ఎక్కువగా ఉంటాయి. రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారికి ఈ సమయం అటూఇటూ అవుతుంది.

పౌర్ణమిఛాయ మొన్నటినుండే మొదలైంది. రేపు, ఎల్లుండి కూడా ఉంటుంది. ఈ పౌర్ణమి వృషభం, వృశ్చికరాశులలో జరుగుతుంది. కనుక ఈ రాశులు/లగ్నాలవారు బాగా ప్రభావితం అవుతారు. వీరు చాలా చెదిరిపోతారు. మానసికంగా డిప్రెషన్ లో పడతారు.

వీరి తర్వాత మానసికంగా బాగా చెదిరిపోయేది మకర, కర్కాటక రాశుల/లగ్నాలవారు. వీరంతా సంయమనం పాటించాలి.

కుంభ, సింహరాశుల/లగ్నాలవారు ఇంటా బయటా ఇబ్బందులు పడతారు. మీన, కన్యారాశులు/లగ్నాలవారు ఆత్మపరిశీలన చేసుకుని  సమయాన్ని ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించుకుంటే చాలా బాగుంటుంది.

మిధున, దనూరాశుల/లగ్నాలవారు అనవసరంగా గొడవలు/శత్రుత్వాలను పెంచుకుని ఇబ్బంది పడతారు.

మేష, తులారాశులవారు ఇంటిలో గొడవలతో, మాట పట్టింపులతో, డబ్బు ఇబ్బందులతో బాధలు పడతారు. వీరు కూడా జాగ్రత్తగా ఆత్మనిగ్రహంతో ఉండాలి.