Pages - Menu

Pages

10, జూన్ 2020, బుధవారం

'వరాహోపనిషత్' తెలుగు 'ఈ పుస్తకం' నేడు విడుదలైంది


శుక్లయజుర్వేదాన్తర్గతమైన 'వరాహోపనిషత్' అనబడే  అద్భుతమైన  గ్రంధాన్ని 'ఈ-బుక్' గా నా వ్యాఖ్యానంతో ఈరోజున విడుదల చేస్తున్నాము. ఇది కూడా యోగోపనిషత్తులలో ఒకటి. లాక్ డౌన్ సమయంలో మా సంస్థనుంచి విడుదలైన పదవపుస్తకం ఇది. ఈ సంవత్సరంలో చూచుకుంటే ఇప్పటిదాకా విడుదలైన 12 వ పుస్తకం.

దీనిలో 5 అధ్యాయములు, 247 శ్లోకములున్నాయి. బ్రహ్మమానసపుత్రుడైన ఋభుమహర్షి చేసిన తపస్సు గురించి, ఆయన పొందిన బ్రహ్మజ్ఞానమును గురించి, పులస్త్యబ్రహ్మ కుమారుడైన నిదాఘునికి ఆయన గురువై జ్ఞానబోధ చేసిన వృత్తాంతమంతా ఈ ఉపనిషత్తులో ఉన్నది గనుక ఇది అతి ప్రాచీనమైనదే గాని, బాగా తరువాతి కాలంలో గ్రంథస్థం చేయబడినదని అర్థమౌతున్నది. దీనిలోని అనేక విషయములు దాదాపు రెండువేల సంవత్సరముల నాటివి. కానీ ఇది వ్రాయబడినది మాత్రం దాదాపుగా 13 శతాబ్దం ప్రాంతమని పండితుల అభిప్రాయం.

ఈ గ్రంధం యొక్క మొదటి మూడు అధ్యాయములలో ఋభుమహాముని తపోవృత్తాంతము, ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వరాహస్వామి చేసిన జ్ఞానబోధ కనిపిస్తాయి. నాలుగు అయిదు అధ్యాయములలో ఋభుమహాముని తన శిష్యుడైన నిదాఘునకు చేసిన బోధ గోచరిస్తుంది. అయిదవ అధ్యాయం పూర్తిగా యోగపరమైన విషయములతో నిండి యున్నది. దీనిలో మంత్ర, లయ, హఠయోగములు చెప్పబడినాయి. 

తత్త్వసిద్ధాంతమును, అద్వైతవేదాంతమును, బ్రహ్మవిద్యను, ఆత్మజ్ఞానమును, జీవన్ముక్తలక్షణములను, జ్ఞానభూమికలను, యోగశాస్త్రమును ఒక్క చోటకు తేవాలన్న ప్రయత్నం ఈ గ్రంథంలో కనిపిస్తున్నది. యోగవాశిష్టంనుంచి, శంకరాద్వైతం నుంచి, యోగతంత్ర గ్రంధముల నుంచి ఎన్నో విషయములు ఇందులో ఒకేచోట మనకు కనిపిస్తాయి.

‘పంచవటి’ నుండి మరొక్క మహత్తరమైన వేదాంత - యోగ గ్రంథమును నా వ్యాఖ్యానముతో వెలువరుస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మా తక్కిన గ్రంథముల వలెనే ఇదికూడా ముముక్షువులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా విశ్వాసం.

యధావిధిగా ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నా శ్రీమతి సరళాదేవి, శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలిత, శిష్యులు రాజు, ప్రవీణ్ లు ఎంతో సహాయం చేశారు. వారికి నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఎప్పటిలాగే, ఇది కూడా google play books నుండి లభిస్తుంది. కొద్ది రోజులలో తెలుగు, ఇంగ్లీషులలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.