నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

29, జూన్ 2020, సోమవారం

గురువు గారి ధనూరాశి ప్రవేశం - ఒక అయిదు నెలల పాటు

మార్చ్ 30 నుంచి మకరంలో ఉన్న గురువు వక్రీకరిస్తూ రేపు  ధనుస్సులోకి రాబోతున్నాడు. మార్చ్ 30 నుంచి ఇప్పటివరకూ జరిగిన, జరుగుతున్న, సంఘటనలు చూస్తున్నారు కదా ! మానవజీవితం ఎంతగా అస్తవ్యస్తం కావాలో అంతగా అయింది.

'కరోనా కరోనా' అంటూ ఎవరెంత మొత్తుకున్నా, పోయే ప్రాణాలు పోతూనే ఉన్నా, జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. ఎవరూ ఏదీ మానుకోలేదు. ఇంకా చెప్పాలంటే అన్నీ జోరుగా సాగుతూనే ఉన్నాయి.

శక్తి ఉన్నవాడు రక్తిలో ఊగుతున్నాడు. అది లేనివాడు భక్తిలో జోగుతున్నాడు. రెండూ ఒద్దనుకున్నవాడు మత్తులో తూగుతున్నాడు. ఉక్రోషం పట్టలేనివాడు పిచ్చిపిచ్చిగా వాగుతున్నాడు. వెరసి అన్నీ జరిగిపోతున్నాయి.

ఆస్పత్రులు మాత్రం 'నో వేకెన్సీ' బోర్డులు పెడుతున్నాయి. 'పోతున్నా టాటా' అంటూ చివరిక్షణాలను కూడా వీడియో తీసి యూట్యూబులలో పెడుతున్నారు. అయినా ఎవడూ లెక్కచేయడం లేదు. హోటళ్లు, షాపులు, బజ్జీలబండ్లు, టీ అంగళ్ళు, బారుషాపులు, అన్నీ యధాప్రకారం నడుస్తున్నాయి. ఉండేవాడు ఉంటున్నాడు, పోయేవాడు పోతున్నాడు. ఇది గత మూడునెలల నుంచీ ఉన్న ట్రెండ్.

ఈ ట్రెండ్ ఇప్పుడు మారబోతున్నది. నేను కరోనా గురించి, సామాజికజీవనం గురించి చెప్పబోవడం లేదు. చెప్పడం వేస్ట్ గనుక. వ్యక్తిగతమానవ జీవితాలగురించే చెప్పబోతున్నాను. ఒక్క విషయం మాత్రం కరెక్ట్, రాబోయే అయిదునెలలలో కరోనా విశ్వరూపం చూడబోతున్నాం మనం,
--------------------------------------------------------
గత రెండురోజులనుండీ మనుషుల జీవితాలలో మార్పులు వస్తున్నట్లు మీరు గమనించవచ్చు. ముఖ్యంగా, ఇంతకు ముందు లేని సంఘటనలు ఇప్పుడు జరగడం, పాత మిత్రులు మళ్ళీ  మాట్లాడటం, కలవడం, మెసేజిలు ఫోన్లు చెయ్యడం గమనించవచ్చు. కొత్త వెంచర్లు, కొత్త ప్రయత్నాలు మొదలవడం చూడవచ్చు.

ముఖ్యంగా మిధున ధనూరాశుల వారికి ఈ మార్పు కొత్త పరిణామాలను తీసుకొస్తుంది. ఇప్పటివరకూ ఉన్న పరిస్థితి రివర్స్ అవుతుంది. ధనూరాశి వారికి బలం పెరుగుతుంది. మిధునరాశి వారికి టెన్షన్ పెరుగుతుంది.

మీనరాశివారికి ఉద్యోగాలలో ఒత్తిడి ఎక్కువౌతుంది. ఇంటి పరిస్థితులు దారిలో పడతాయి. స్థిరాస్తులు కొనాలని ప్రయత్నాలు చేస్తారు. కన్యారాశివారికి ఇంట్లో గత మూడు నెలలుగా ఏడిపిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అయితే, ఉద్యోగాలలో చికాకులు ఎక్కువౌతాయి.

కుంభరాశి, సింహరాశి వారికి పాతస్నేహితులు దగ్గరౌతారు. ప్రేమవ్యవహారాలు బలపడతాయి.

మేషరాశివారికి ఆధ్యాత్మికచింతన ఎక్కువౌతుంది. దూరప్రయాణాలు మొదలౌతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. తులారాశివారికి దగ్గర ప్రయాణాలు మొదలౌతాయి. సోదరులకు మంచికాలం మొదలౌతుంది. మతరంగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు.

కర్కాటకరాశివారికి పనిఒత్తిడి ఎక్కువౌతుంది. రోగాలు తిరగబెడతాయి. శత్రువులు పెరుగుతారు. మకరరాశివారికి చికాకులు, కష్టాలు, నష్టాలు పెరుగుతాయి.

వృషభ, వృశ్చికరాశులవారు మాట దూకుడు వల్ల నష్టపోతారు. దీర్ఘరోగాలు మళ్ళీ తిరగబెడతాయి.

జాగ్రత్త పడండి మరి !