నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

8, జూన్ 2020, సోమవారం

నాతో వస్తావా నేస్తం?

నాతో వస్తావా నేస్తం?
నక్షత్రాల వీధుల్లో
నడుస్తూ మాట్లాడుకుందాం

నాతో వస్తావా నేస్తం?
నిత్యత్వపు జలపాతాల్లో
తడిసిపోతూ నవ్వుకుందాం

నాతో వస్తావా నేస్తం?
చావులేని సరస్సు నీళ్ళలో
ఈతకొడుతూ ఆడుకుందాం

నాతో వస్తావా నేస్తం?
విశ్వపు అంచుల వింతసీమలలో
విహంగాల్లా ఎగిరిపోదాం

నాతో వస్తావా నేస్తం?
మన ఉనికినే మరచిపోయి
మంచుముద్దల్లా కరిగిపోదాం

నాతో వస్తావా నేస్తం?
ఈ లోకపు నిమ్నత్వాలను మరచి
మనోజ్ఞసీమలలో మాయమౌదాం

నాతో వస్తావా నేస్తం?
అతీతలోకాల అడవిబాటల్లో
దారితప్పి తిరుగుతుందాం

నాతో వస్తావా నేస్తం?
స్వర్లోకపు గులాబీ తోటల్లో
మధుసేవతో మత్తెక్కిపోదాం

నాతో వస్తావా నేస్తం?
ఉనికే లేని శూన్యంలో
నాదపు అలలపై తేలిపోదాం

నాతో వస్తావా నేస్తం?
కాలపు కట్టుబాట్లను దాటి
కాంతి సముద్రంలో కరిగిపోదాం

నాతో వస్తావా నేస్తం?
కష్టాలూ కన్నీళ్ళూ లేని
వెలుగుదారుల్లో పరుగు తీద్దాం

నాతో వస్తావా నేస్తం?
జనన మరణాలను అధిగమించి
వెలుగు పుంజాలై నిలిచిపోదాం

నాతో వస్తావా నేస్తం?
నువ్వూ నేనూ లేని
అనంతశూన్యంలో ఒక్కటౌదాం...