నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

31, జులై 2020, శుక్రవారం

"ఆరు యోగోపనిషత్తులు 'ఈ-బుక్' విడుదలైంది


'పంచవటి పబ్లికేషన్సు' నుండి 'ఆరు యోగోపనిషత్తులు' అనే ఇంకొక మహత్తరమైన గ్రంధమును 'ఈ- బుక్' గా నేడు విడుదల చేస్తున్నాము.  ఇందులో హంసోపనిషత్, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్ అనబడే ఆరు యోగోపనిషత్తులకు నా వ్యాఖ్యానమును మీరు చదువవచ్చు. వీటిలో హంసోపనిషత్, త్రిశిఖి బ్రాహ్మణోపనిషత్, మండల బ్రాహ్మణోపనిషత్తులు శుక్లయజుర్వేదమునకు  చెందినవి కాగా, అమృతబిందూపనిషత్, అమృతనాదోపనిషత్, బ్రహ్మవిద్యోపనిషత్తులు కృష్ణయజుర్వేదమునకు చెందినవి
.

యధావిధిగా వీటన్నిటిలో అనేక రకములైన వైదికసాంప్రదాయబద్ధమైన యోగసాధనావిధానములు చెప్పబడినవి. మంత్ర, లయ, హఠ, రాజయోగములు, సృష్టిక్రమము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తస్థితి మొదలైన సంగతులు వివరించబడినవి.

ఈ పుస్తకంతో యోగోపనిషత్తుల వ్యాఖ్యాన పరంపర అయిపోతున్నది. ఇప్పటివరకూ 15 యోగోపనిషత్తులపైన నా వ్యాఖ్యానమును ప్రచురించాను. 30 ఏళ్ల క్రితం నా గురువులలో ఒకరైన నందానందస్వామివారు ఆదోనిలో నాతో అనిన మాటను నిజం చేశాను.

ఇకపైన రాబోయే మా గ్రంధములలో, యోగసాంప్రదాయమునకే చెందిన ఇతర ప్రాచీన ప్రామాణికగ్రంధములకు నా అనువాదమును వ్యాఖ్యానమును మీరు చదువవచ్చు. మా తరువాత పుస్తకంగా 'యోగయాజ్ఞవల్క్యము' రాబోతున్నదని చెప్పడానికి సంతోషిస్తూ ఈ లోపల ఈ ఆరు యోగోపనిషత్తులను చదివి వేదోపనిషత్తులలో యోగమును గురించి ఏమి చెప్పబడిందో గ్రహించి ఆనందించని ముముక్షువులైన చదువరులను కోరుతున్నాను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో ఎంతో సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, శిష్యురాళ్ళు అఖిల, లలితలకు, పుస్తకంలోని బొమ్మలను వేసి ఇచ్చిన చిత్రకారిణి డా || నిఖిలకు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ కు, నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

ఈ పుస్తకం కూడా త్వరలో ఇంగ్లీషు, తెలుగులలో  ప్రింట్ పుస్తకంగా వస్తుంది.