Pages - Menu

Pages

14, ఆగస్టు 2020, శుక్రవారం

'ఇలాంటి మొగుళ్ళు కూడా ఉంటారా?' - ప్రశ్నశాస్త్రం

10-8-2020 శనివారం ఉదయం 11. 30 కి ఒక ఫోనొచ్చింది.

'నమస్తే అండి సత్యనారాయణ శర్మగారేనా?' అడిగిందొక మహిళాస్వరం.

'అవును' అన్నా ముక్తసరిగా. ఆడవాళ్ళ ఫోనంటేనే నాకు భయమూ, చిరాకూ రెండూ ఒకేసారి కలుగుతాయి. ఎందుకంటే, వారిలో విషయం ఉండకపోగా అనవసరమైన నస మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే చిరాకు కలిగిస్తుంది. సోది చెప్పకుండా సూటిగా విషయం మాట్లాడే ఆడవాళ్లను చాలా తక్కువమందిని ఇప్పటిదాకా చూచాను. ఆఫ్ కోర్స్ ! వాళ్ళ అవసరం ఉన్నపుడు మాత్రం చాలా సూటిగానే మాట్లాడతారనుకోండి. అది వేరే విషయం !

'నా పేరు హేమలత. ఫలానా వాళ్ళు మిమ్మల్ని రిఫర్ చేశారు' అంది.

'అలాగా. చెప్పండి ఎందుకు ఫోన్ చేశారు?' అడిగా.

'నేనొక సమస్యలో ఉన్నాను. ప్రశ్న చూస్తారని అడగడానికి ఫోన్ చేశా' అన్నదామె.

రిఫర్ చేసినాయన నా క్లోజ్ ఫ్రెండ్ కనుక వెంటనే ఎదురుగా ఉన్న లాప్ టాప్ తెరిచి ప్రశ్నచక్రం వేశా. తులాలగ్నం అయింది. చంద్రుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని సూటిగా చూస్తున్నాడు.

'మీ వివాహజీవితం గురించి మీరు అడగాలనుకుంటున్నారు' అన్నాను.

'నిజమే. అదే నా సమస్య' అందామె.

సప్తమాధిపతి కుజుడు ఆరో ఇంట్లో ఉన్నవిషయాన్ని, సుఖస్థానంలో శని ఉన్న విషయాన్ని గమనిస్తూ 'మీ ఆయనకు మీకూ గొడవలు. మీకు సంసారసుఖం లేదు' అన్నాను.

'నిజమే. కానీ ఆ గొడవలు ఎందుకో చెబితే మీరు ఆశ్చర్యపోతారు' అందామె.

అంటే, మామూలు సమస్య కాదన్నమాట. అంతగా చెప్పలేని సమస్యలేముంటాయా? అని ఒక్క క్షణకాలం పాటు ఆలోచించాను.

భర్తను సూచించే కుజునినుండి అతని మనస్సుకు సూచిక అయిన నాలుగో ఇంట్లో ఉఛ్చరాహువు శుక్రుడు ఉండటాన్ని గమనించాను. ఈ యోగం ప్రకారం వివాహేతర సంబంధాన్ని మొగుడే ప్రోత్సహిస్తూ ఉండాలి. కానీ ఈ విషయాన్ని ఎలా అడగడం? బాగోదేమో అని సంశయిస్తూ ఉండగా -'తన స్నేహితులతో బెడ్ పంచుకోమని మా ఆయన పోరు పెడుతున్నాడు. ఈ విషయాన్ని చెప్పినా ఎవరూ నమ్మరు' అందామె.

'ఓరి దేవుడో?' అని తెగ ఆశ్చర్యమేసింది. వాళ్ళాయన వృత్తి ఏంటా అని గమనించాను. కుజుని నుండి దశమంలో ఉఛ్చకేతువు గురువు ఉన్నారు. గురువు వక్రీస్తూ వృశ్చికంలోకి పోతున్నాడు. శని వక్రీస్తూ ధనుస్సులోకి వచ్చి కేతువును కలుస్తున్నాడు. దశమాన్ని ఉఛ్చరాహువు శుక్రుడు చూస్తున్నారు. అంటే, పైకి నీతులు చెబుతూ లోలోపల అనైతికపు పనులు చేసే రంగమన్నమాట. అదేమై ఉంటుంది? రాహుశుక్రులు సహజతృతీయమైన మిధునంలో ఉంటూ సినిమా ఫీల్డ్ ని సూచిస్తున్నారు.

'మీ ఆయనది సినిమా ఫీల్డా?' అడిగాను.

'అవును. మా ఆయన ఫలానా' అని చెప్పిందామె.

నాకు మతిపోయినంత పనైంది.

'ఎందుకలా?' అడిగాను ఆమెనోటినుంచి విందామని.

'బిజినెస్ ప్రొమోషన్ కోసం, కొత్త కొత్త సినిమా ఛాన్సులకోసం, తన ఫ్రెండ్స్ దగ్గర, కొంతమంది నిర్మాతల దగ్గర పడుకోమని గొడవ చేస్తున్నాడు. భరించలేక విడాకులు కోరుతున్నాను' అందామె.

'ఆ పనికోసం కాల్ గాళ్స్  చాలామంది ఉంటారు. పెళ్ళాన్ని పడుకోబెట్టాల్సిన పనేముంది?' అడిగాను.

'కాల్ గాళ్స్ వాళ్లకూ తెలుసు. మా ఆయన వాళ్లకు చెప్పక్కర్లేదు. హీరోయిన్స్ కంటే అందంగా పుట్టడం నా ఖర్మ' అందామె.

'మంచిపని, గో ఎహెడ్. మీకు సపోర్ట్ గా పేరెంట్స్ లేరా?' అన్నాను.

'మా నాన్న ఒక ఉన్నతాధికారి. కానీ రెండేళ్లక్రితం చనిపోయారు. అంతేకాదు అప్పటినుంచీ మా మామగారు మా అమ్మను వేధిస్తున్నాడు' అన్నదామె.

నా తల గిర్రున తిరిగింది.

'నేను విన్నది నిజమేనా?' అని అనుమానంగా మళ్ళీ చార్ట్ లోకి తలదూర్చాను.

కుజునినుంచి దశమాధిపతి గురువు, ఈమె భర్త తండ్రిని, అంటే మామగారిని సూచిస్తాడు. శుక్రునినుంచి నాలుగో అధిపతి బుధుడు ఈమె తల్లిని సూచిస్తాడు. గురువు వక్రించి వృశ్చికంలోకి వచ్చి, కోణదృష్టితో బుధుడిని చూస్తున్నాడు. గురువు మీద రాహుశుక్రుల దృష్టి ఉంటూ ఆమె చెబుతున్నది నిజమే అని సూచిస్తున్నది.

'బాబోయ్!' అనుకున్నా.

'మీ మామగారు మీ అమ్మకు వరసకు అన్నయ్య అవుతాడు కదమ్మా?' అడిగాను.

'అవునండి. అమ్మ ఆయనతో అదే అంటే, 'ఈ ఫీల్డ్ లో అలాంటి  వరసలేవీ ఉండవు. మీ అమ్మాయిని మావాడు చెప్పినట్లు వినమను. నువ్వు నేను చెప్పినట్లు విను' అని ఫోర్స్ చేస్తున్నాడు' అందామె.

'మరి మీరేం అనుకుంటున్నారు' అడిగాను.

'ఆ ఇంటిని వదిలి బయటకు వచ్చేశాను. అమ్మ దగ్గర ఉంటున్నాను. మంచి లాయర్ దగ్గర డైవోర్స్ కి కేస్ ఫైల్ చేశాను. గెలుస్తామా? ఎన్నాళ్ళు పడుతుంది?' అడిగింది.

దశలు గమనించాను. ప్రస్తుతం కేతువు - రాహువు - రవి నడుస్తోంది. ఇప్పుడు పని జరగదు. భవిష్యత్ దశలను గమనిస్తూ "2021 జనవరి - మార్చి మధ్యలో మీ పని జరుగుతుంది, నువ్వు కేసు గెలుస్తావు. ధైర్యంగా ఉండు. పోరాడు." అని చెప్పాను.

'థాంక్స్' అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది.

నాలో ఆలోచనా తరంగాలు మొదలయ్యాయి.

'ఇలాంటి మొగుళ్ళు, ఇలాంటి మామలు కూడా ఉంటారా? ఏమో? భార్యే అలా చెబుతున్నపుడు నమ్మకుండా ఎలా ఉండగలం? అందులోనూ సినిమా ఫీల్డ్ లో ఉన్నంత రొచ్చు ఇంకెక్కడా ఉండదన్నది అందరికీ తెలిసినదే, నిజమే కావచ్చు' అనుకున్నా.

'ఈ భూమ్మీద మనం బ్రతికేది నాలుగురోజులు. ఇక్కడ మన బ్రతుకే శాశ్వతం కాదు. అందులో డబ్బనేది అసలే శాశ్వతం కాదు. వీటికోసం ఇంత దిగజారాలా? పైగా ప్రతిరోజూ కరోనాతో ఎంతోమంది పోతున్నారని వింటున్నాం. మనకు తెలిసినవాళ్ళే చాలామంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కూడా ఇంత ఛండాలమా?' అనిపించింది.

మనకనిపిస్తే ఏముపయోగం? వాళ్ళకనిపించాలి కదా? వాళ్లకు అవే ముఖ్యంగా కన్పిస్తున్నాయి మరి ! మనమేం చెయ్యగలం? ఈ ప్రపంచంలో ఎవరు చెబితే ఎవరు వింటారు గనుక? ఎవరి ఖర్మ వారిది. అంతే.

ఆలోచన ఆపి నా పనిలో నేను పడ్డాను.

కథకంచికి మనం మన పనిలోకి.

(వ్యక్తిగతకారణాల రీత్యా పేర్లు, కధనం మార్చడం జరిగింది. కధనం మారినా, కధ నిజమైనదే !)