Pages - Menu

Pages

31, ఆగస్టు 2020, సోమవారం

'యోగ యాజ్ఞవల్క్యము' E Book నేడు విడుదలైంది




మా 'పంచవటి పబ్లికేషన్స్' నుంచి 'యోగ యాజ్ఞవల్క్యము' అనబడే ఇంకొక మహత్తరమైన యోగశాస్త్రగ్రంధమును ప్రచురిస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మొత్తం 504 శ్లోకములలో ప్రాచీన యోగశాస్త్రమును వివరించిన ఈ గ్రంథం దాదాపుగా రెండువేల సంవత్సరముల క్రిందటిది. ప్రాచీనమైన ఈ గ్రంథంలో వైదిక సాంప్రదాయానుసారమైన యోగమార్గం వివరింపబడి గోచరిస్తున్నది. వేదకాలపు మహర్షియైన యాజ్ఞవల్క్యఋషి తన సతీమణియైన బ్రహ్మవాదిని గార్గికి చేసిన బోధగా ఈ గ్రంథం చెప్పబడింది.

యాజ్ఞవల్క్యఋషి మహాతపస్సంపన్నుడు, ద్రష్ట, శాపానుగ్రహ సమర్థత కలిగిన అతిప్రాచీన వైదికఋషులలో ఒకరు. ఈయన బుద్ధునికంటే దాదాపు 400 సంవత్సరములు ముందటివాడని భావిస్తున్నారు. శుక్లయజుర్వేదము, శతపథబ్రాహ్మణము, బృహదారణ్యకోపనిషత్తు వంటి అనేక చోట్ల ఈయన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. ఉపనిషత్తులలో చెప్పబడిన అద్వైతభావనను అతిప్రాచీనకాలంలో ఈయనే మొదటిసారిగా లోకానికి బోధించినట్లు భావిస్తున్నారు. వైదికసంప్రదాయములను, యోగమార్గముతో మేళవించే ప్రయత్నాన్ని మొదటగా ఈయన చేశారు. ఈయనకు గార్గీ వాచక్నవి, మైత్రేయి అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరూ కూడా మహాసాధ్వులు. భర్తవలెనే తపస్సంపన్నులు. అంత ప్రాచీనకాలంలో కూడా బ్రహ్మవాదినులైన స్త్రీలు శాస్త్రాధ్యయనము మరియు తపస్సులను చేసేవారని, పండితసభలలో, ఋషిసభలలో కూర్చుని గహనములైన వేదాంతసిద్ధాంతములను ఋషులతో తర్కబద్ధంగా వాదించేవారని మనకు వీరి చరిత్రల వల్ల తెలుస్తున్నది.

ఈ గ్రంథం పన్నెండు అధ్యాయములతో నిండి ఉన్నది. వీనిలో, వైదికధర్మమార్గము, దాని విధులతోబాటు, వర్ణాశ్రమధర్మములు, అష్టాంగయోగము మరియు దాని విభాగములైన, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు, తంత్రసాధనయైన కుండలినీయోగము మొదలైనవి ఒక్కొక్కటి సవివరముగా చెప్పబడినాయి. ఆధ్యాత్మికమార్గంలో జ్ఞాన, కర్మ, యోగముల ప్రాముఖ్యతను వివరించిన యాజ్ఞవల్క్యులు, విధిపూర్వకంగా చేయవలసిన వైదికనిత్యకర్మలను చేస్తూనే, అష్టాంగయోగమును కూడా ఆచరించాలని బోధిస్తారు.


ఈ ప్రాచీనగ్రంథములోని భావములను, విధానములను, తరువాతి కాలమునకు చెందిన యోగోపనిషత్తులు, హఠయోగప్రదీపిక, ఘేరండసంహిత మొదలైన ఇతరగ్రంథములు స్వీకరించాయి. గాయత్రీమహామంత్రముతోను, ఓంకారము తోను చేయబడే వైదికప్రాణాయామము, అశ్వినీదేవతలు చెప్పిన మర్మస్థాన ప్రత్యాహారము, అగస్త్యమహర్షి ప్రణీతమైన ప్రత్యాహారము, సగుణ నిర్గుణ ధ్యానములు ఈ గ్రంథముయొక్క ప్రత్యేకతలు.


వైదికధర్మమార్గమును, అష్టాంగయోగమును, తంత్రమును సమన్వయం చేయాలన్న ప్రయత్నం ఈ గ్రంథం లో మనకు గోచరిస్తుంది. యోగాభిమానులకు ఈ ప్రాచీనగ్రంథం ఎంతో ఉత్తేజాన్ని కలిగించి, వారిని దైవమార్గంలో ముందుకు నడిపిస్తుందని ఆశిస్తున్నాను.


యధావిధిగా ఈ గ్రంధం కూడా google play books నుంచి లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.