Pages - Menu

Pages

7, సెప్టెంబర్ 2020, సోమవారం

Ma Anand Sheela - జాతక పరిశీలన - 2

ఇప్పుడు  ఈమె జాతకాన్ని సంస్కరించి జనన సమయాన్ని రాబడదాం. నేను చేయబోయే విశ్లేషణ జ్యోతిష్య విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా కష్టమైన సమగ్రమైన విశ్లేషణ. పైపైన జ్యోతిష్యం వచ్చిన వాళ్లకు అర్ధం కాదు. జాగ్రత్తగా గమనించండి.

జీవితంలో కొన్ని సంఘటనలు తెలిసిన వాళ్ళకు, అంటే కొంచం పెద్ద అయినవాళ్లకు జననకాల విశ్లేషణ చేసే విధానం వేరుగా ఉంటుంది. జనన సమయాన్ని రికార్డ్ చేయకపోతే, చిన్నప్పుడే దానిని రాబట్టే విధానం వేరుగా ఉంటుంది. రెండూ శాస్త్రసమ్మతమైనవే. ఇందులో మొదటిదాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నాను.

వర్గచక్రాలనేవి భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అద్భుతమైన ఉపకరణాలు. వాటిని వాడి జనన సమయం తెలియని వారి జాతకంలో దానిని ఎలా బయటకు తియ్యవచ్చో ఇప్పుడు చూడండి.

వికీ పీడియా ప్రకారం,  ఆరుగురు సంతానంలో  షీలా చిన్నది. కనుక ఆమెది వృషభ, కర్కాటక, వృశ్చిక, మీన లగ్నాలలో ఏదో ఒకటి అవ్వాలి. 5, 7, 9 భావాలను బట్టి ఆమె మనస్తత్వం, ఆమె గురువు, ఆమె ప్రేమవ్యవహారాలు, పెళ్లిళ్లు వీటన్నిటికీ ఈ నాలుగు లగ్నాలు మాత్రమే సరిపోతాయి..

     

 

28 - 12 - 1949 న రేవతి నక్షత్రం ఉన్నది. అందులోని నాలుగు పాదాలు ఈ లగ్నాలను కలిగి ఉన్నాయి.-

రేవతి  - 2 : 4.08 - 6.23 వృశ్చిక లగ్నం

రేవతి - 3: 11.51 - 13.21 మీన లగ్నం

రేవతి - 3: 15.03 - 17.01 వృషభ లగ్నం

రేవతి - 4: 19.13 - 21.28 కర్కాటక లగ్నం

దాదాపు 17 గంటల వ్యవధిలో ఈ నాలుగు లగ్నాలు ఒక్కొక్కటి దాదాపు రెండు గంటలపాటు ఉంటాయి. వాటిల్లో నుంచి సరియైన లగ్నాన్ని, జనన సమయాన్ని మనం రాబట్టాలి.

రేవతి - 2

ఇది 4.08 - 6.13 మధ్యలో వృశ్చిక లగ్నంతో ఉన్నది. నవాంశలో చంద్రుడు మకరం ఉంటూ, రాశి తుల్య నవాంశ పద్దతిలో అక్కడున్న మూడు గ్రహాలను ఆవరిస్తున్నాడు. మకరరాశి చాలా మొండి మనస్తత్వాన్నిస్తుంది. వీళ్ళు ఓటమిని అంగీకరించే మనుషులు కారు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ చివరకు విజయాన్ని సాధిస్తారు.

ద్వాదశాంశలో చంద్రుడు వృశ్చికరాశిలో నీచలో ఉన్నాడు. 4.31 - 4.41 మధ్యలో మకర లగ్నం ఉదయిస్తోంది. నీచ శుక్రుడు నవమంలో ఉంటూ నీచ గురువును సూచిస్తున్నాడు. కనుక జనన సమయం ఈ మధ్యలోనే ఉండాలి.


నవాంశలో 4.37 వరకూ సింహ లగ్నం ఉన్నది. తరువాత కన్యాలగ్నం ఉదయిస్తోంది. ఈమె జీవితానికి సింహ లగ్నమే సరిపోతుంది.  ఎందుకని? అక్కడనుంచి అయితేనే గురువు నవమంలో ఉన్నాడు గనుక. నీచ రాహువు బుద్ధిస్థానంలో ఉన్నాడు గనుక. 4 భావాధిపతిగా మనస్సును సూచిస్తున్న క కుట్రలకు కుతంత్రాలకు కారణమైన 8 లో ఉన్నాడు గనుక. కనుక జనన సమయం 4.31 నుండి 4.37 మధ్యలో ఉండి ఉండాలి.


త్రింశాంశ చక్రం మనస్తత్వాన్ని స్పష్టంగా సూచిస్తుంది. చంద్రుడు మకరంలో శుక్రునితో కలసి ఉంటూ ఈమె జీవితాన్ని సరిగానే చూపిస్తున్నాడు. మకరంలో ఉన్న శుక్రుడు జాతకుడికి సంప్రదాయ విరుద్ధమైన నడవడికనూ, ఒక విధమైన విచ్చలవిడి జీవితాన్ని ఇస్తాడు. లగ్నం కన్య అవుతూ ఈమె తన జీవితంలో చాలా భాగం ఒంటరిగానే ఉండవలసిన పరిస్థితిని చూపుతున్నది. లగ్నంలో ఉన్న కుజుడు సమస్యలకు లొంగని తెలివైన మొండి మనస్తత్వాన్నిస్తున్నాడు.

ఇంకా సూక్ష్మంగా వెళ్ళడానికి షష్ట్యంశ సహాయం తీసుకోవాలి. 4.40 నుండి 4.41 వరకూ మకరలగ్నమే ఉదయిస్తూ నవమంలో నీచ శుక్రునితో, పంచమ లాభస్థానాలలో ఉచ్చరాహు కేతువులతో కలసి ఉన్నది.

నవమ నీచశుక్రుడు ఓషోని సూచిస్తున్నాడు. పంచమ ఉచ్చ రాహువు నేరపూరిత మనస్తత్వాన్నీ ఒకటి కంటే ఎక్కువ ప్రేమ వ్యవహారాలనూ సూచిస్తున్నాడు. 


అష్టోత్తరాంశ చక్రంలో 4.41 వృశ్చిక లగ్నం అవుతూ ఈమె జీవితాన్ని ఇంకా స్పష్టంగా చూపిస్తున్నది. ఎలా? 9 వ అధిపతి చంద్రుడు 3 లో ఉంటూ 9 ని చూస్తున్నాడు. పంచమంలో కేతువు రహస్య ప్లానులను ఇస్తున్నాడు. 6 లో ఉన్న 10 వ అధిపతి ఉచ్చ సూర్యుడు విపరీతమైన అధికారాన్నిస్తున్నాడు. కనుక ఈమె జనన సమయం 4.41 AM అవుతున్నది.

దశను పరిశీలిస్తే బుధ -శుక్ర -రాహు దశ అవుతూ, ఈమె జనన గతిని చూపిస్త్తున్నది. కనుక ఈ విశ్లేషణ ప్రకారం 4.41 ఈమె జనన సమయం అవుతున్నది.



రేవతి - 3

ఈ నక్షత్రపాదంలో చంద్రుడు కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశివారు నిస్వార్ధదానగుణం కలిగి ఉంటారు. సాయపడే తత్త్వం వీరికి పుట్టుకతో వస్తుంది. నా ఉద్దేశ్యం ప్రకారం తన గురువైన ఓషోని ఈమె నిజంగానే మనస్పూర్తిగానే ప్రేమించింది. ఈ మధ్య ఇండియాకు వచ్చినపుడు కరణ్ జోహార్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా 'నాకిప్పటికీ ఓషో అంటే గౌరవమే' అంది. షీలా ఆరిగాన్ వదిలి పారిపోయినప్పుడు ఓషో ఆమెను నానా బూతులు తిట్టాడు.అయినా సరే షీలా ఆయనను ఒక్కమాట అనలేదు. ఈ కోణంలో ఓషో కంటే షీలా మంచిదని అనిపిస్తుంది.

ద్వాదశాంశలో చూస్తే, కుంభ లగ్నం ఈమె జీవితాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందని అనిపిస్తుంది.  నవమంలో రాహువు ఉంటూ ఉచ్చశనిని సూచిస్తున్నాడు. ఈ యోగం ఒక శక్తివంతుడైన అదే సమయంలో దుర్మార్గుడైన గురువును సూచిస్తుంది. నవమాదిపతి శుక్రుడు అష్టమంలో నీచలో ఉంటూ గురువు వల్ల ఈమె జీవితంలో జరిగే గొప్ప నష్టాన్ని చూపిస్తున్నాడు. కుజుడు చంద్రుడు ఏకాదశంలో ఉంటూ శని గురువుల చేత చూడబడుతూ ఆమె పైన ఉన్న అన్నలను అక్కలకు సూచికలుగా ఉన్నారు. కనుక 13.15 నుండి 13.22 వరకు ఉన్న కుంభలగ్నం ఇక్కడ సరిపోతున్నది.

మనస్తత్వాన్ని సూచించే త్రింశాంశలో వృశ్చికలగ్నం ఉదయిస్తోంది. ద్వాదశంలో ఉచ్చశని అనేక మందిని రహస్యకుట్రలతో ముంచడాన్నిస్తాడు. సప్తమంలో బుధుడు ఉంటూ తెలివైన విరోధులను చూపుతున్నాడు. మకరంలో తృతీయంలో ఉన్న చంద్రుడు శుక్రుడు నవమాన్ని చూస్తూ ఒకరి కంటే ఎక్కువమందితో సంబంధాలున్న గురువును ఇస్తున్నారు. 12 లో ఉన్న ఉచ్చ శని సామాన్య జనాన్ని హింస పెట్టడాన్ని సూచిస్తున్నాడు.


షష్ట్యంశ చక్రంలో 13. 19 మరియు 13. 20 లు ఈమె జీవితానికి సరియైన సూచికలుగా ఉన్నాయి. నవమంలో నీచ శుక్రుడు ఉంటూ, నీచుడైన సెక్స్ గురువును చూపిస్తున్నాడు.  

పంచమంలో ఉచ్చ స్థితిలో ఉన్న రాహువు శుక్రునికి కారకుడుగా ఒకటిని మించి ప్రేమ వ్యవహారాలను సెక్స్ సంబంధాలను చూపుతున్నాడు. చతుర్ధంలోని బుధుడు చంద్రుడు ఈమె జీవితంలోని ఒడుదుడుకులకు కష్టాలకు గొడవలకు కారకులౌతున్నారు.

ఇంకా లోతుగా వెళ్లి అష్టోత్తరాంశను చూస్తే 13.19 సరిగ్గా సరిపోతున్నది. తృతీయంలో నీచ గురువుంటూ నవమంలో ఉన్న బుధుని చూస్తూ, ఒక తెలివైన చెడ్డ గురువు చేతిలో ఈమె మోసపోతుందని చెబుతున్నాడు.

ఈ సమయానికి బుధ - రాహు - గురుదశ నడిచింది. రాహువు లగ్నంలో ఉన్నాడు. ఇది గురు చండాలయోగం. గత జన్మనించి వచ్చిన గురుశాపం ఇది. బుధుడు నీచ గురువు కర్మస్థానమైన తృతీయాన్ని, ప్రేమవ్యవహారాలను సూచించే పంచమాన్ని, వివాహాలకు కారకమైన సప్తమాన్ని చూస్తున్నారు.

రేవతి - 3

15.03 నుంచి 17.01 మధ్యలో వృషభలగ్నం ఉదయిస్తోంది.

దీనిలో చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి వచ్చి ఉన్నాడు. దీని ఫలితాన్ని పైన వివరించాను కనుక మళ్ళీ చెప్పనవసరం లేదు. 15.40 నుంచి 15.52 మధ్య ఉన్న సమయం ఈమె జీవితాన్ని చాలా సరిగా చూపిస్తున్నది. ఎందుకంటే నీచ రాహువు నవమంలో ఉంటూ, గురువుకు కారకుడౌతూ గురుచండాల యోగాన్నిస్తూ ఒక దుర్మార్గుడైన గురువును సూచిస్తున్నాడు.

ద్వాదశాంశను చూస్తే, 15.40 నుండి 15.48 వరకు కన్యా లగ్నం ఉదయిస్తూ, నవమాది పతి అయిన నీచ శుక్రునితో కూడి ఉన్నది. ఆ తరువాత తులాలగ్నం అవుతున్నది. 9 లో 12 వ అధిపతి అయిన సూర్యుడు ఉంటూ, రహస్య కార్యకలాపాలున్న గురువునిస్తున్నాడు. 10 లో గురు శనులుంటూ అమెరికాకు సంబంధం ఉన్నట్టి బలమైన పూర్వకర్మను చూపుతున్నారు. కనుక ద్వాదశాంశను బట్టి జనన సమయం 15.40 నుండి 15.48 మధ్యలో ఉంటుంది.

త్రింశాంశను చూద్దాం. 15.40 నుంచి15.46 మధ్యలో కన్యా లగ్నం ఉన్నది. 15.47 మరియు 15.48 లలో మీనలగ్నం అవుతున్నది. ఈ రెంటిలో మీన లగ్నమే సరిపోతుంది. దీనినుంచి నీచ చంద్రుడు నవమంలో ఉంటూ ఒక రహస్య కుట్రలు చేసే ఒక నీచగురువు నిస్తున్నాడు. రాహువు గురువులు లగ్నంలో ఉండటం భయంకరమైన గురుచండాల యోగం. కనుక ఈ చక్రం మనకు 15.47 మరియు 15.48 అనే రెండు సమయాలనిస్తున్నది.

ఇప్పుడు షష్ట్యంశకు వద్దాం. ఈ రెండు సమయాలకూ ఇది వృషభ లగ్నాన్నే చూపిస్తున్నది. కనుక ఇంకా లోతుకు పోవాలి.

అష్టోత్తరాంశను చూస్తే, 15.47 వృశ్చిక లగ్నమౌతున్నది. త్రుతీయంలో నీచ గురువుంటూ నవమాన్ని చూస్తున్నాడు. ఓషోని సరిగా సూచిస్తున్నాడు. 15.48 అయితే లగ్నం ధనుస్సు అవుతూ ఈమె జీవితాన్ని సరిగా చూపలేకపోతోంది.  కనుక 15.47 అనేది ఈమె జనన సమయం అవుతూన్నది. 

ఈ సమయంలో బుధ - రాహు - శుక్రదశ నడుస్తూ ఈమె జీవిత గమనాన్ని చాలా సరిగ్గా చూపిస్తున్నది.




రేవతి - 4

ఈ నక్షత్ర పాదంలో కర్కాటక లగ్నం 19.13 నుంచి 21.28 వరకూ ఉదయిస్తున్నది.

ద్వాదశాంశ ప్రకారం మకర లగ్నం 20.22 నుండి 20.30 వరకూ ఉన్నది. నవమంలో నీచ గురువుంటూ మళ్ళీ ఓషో ఎలాంటివాడో చూపిస్తున్నాడు. 9 వ అధిపతి బుధుడు లగ్నంలోకి వచ్చి ఈమె జీవితం మీద ఉన్న బలమైన గురు ప్రభావాన్ని సూచిస్తున్నాడు.
4/10 ఇరుసులో ఉన్న రాహు కేతువులు స్వదేశంలోనూ విదేశంలోనూ అపజయాలనిస్తున్నారు. 6 లో ఉన్న గురు శనులు గురువుతో ఇతర శిష్యులతో, సామాన్య జనంతో విరోధాన్నిచ్చారు. 

ఒక్కసారి వెనక్కు వచ్చి నవాంశ ను గమనిస్తే, 20.28 వరకూ వృశ్చిక లగ్నమని, తరువాత రెండు నిముషాలలో అది ధనుర్లగ్నం అవుతున్నదని చూడవచ్చు. ఈ రెంటిలో ఈమె జీవితానికి వృశ్చికలగ్నమే సరిగ్గా సరిపోతున్నది. ఎందుకని? 2/8 ఇరుసులోని నీచ రాహు కేతువులు వివాహ జీవితాన్ని పాడుచేశాయి. 5 లో ఉన్న కుజ చంద్రులు మొండి మనస్తత్వాన్నిచ్చాయి. 6 లోని గురువు గురువుతో శతృత్వాన్నిచ్చాడు. కనుక నవాంశను బట్టి ఈమె జనన సమయం 20.22 నుండి 20.28 మధ్యలో ఉంటుంది.

త్రింశాంశను గమనిద్దాం. 20.22 నుండి 20.28 వరకూ ఇక్కడ మీనలగ్నమే ఉదయిస్తూ బలమైన గురుచండాలయోగాన్ని కలిగి ఉంటున్నది. నవమంలో నీచ చంద్రుడు మళ్ళీ నీచ గురువును చూపిస్తున్నాడు. 8 లో ఉచ్చశని వల్ల లోకాపవాదం వచ్చింది. విలన్ గా ముద్ర వేయబడింది. అయితే, మిగతా విషయాల కోసం ఇంకా లోతులకు వెళ్ళాలి.

షష్ట్యంశ లోకి వెళదాం. 20.22 మరియు 20.23 రెండూ మకర లగ్నమే అవుతున్నది. నీచ శుక్రుడు నవమంలో ఉంటూ ఒక సెక్స్ గురువును చూపిస్తున్నాడు. శుక్ర క్షేత్రమైన పంచమంలో ఉన్న రాహువు బుధుడు ఒకటి కంటే ఎక్కువ ప్రేమ వ్యవహారాలను, పెళ్ళిళ్ళను చూపిస్తున్నారు. శుభ పాపార్గళం పట్టిన లగ్నం ఎటూ తేలని జీవితాన్ని చూపిస్తోంది.

అష్టోత్తరాంశను చూద్దాం. ఇందులో 20.22 అనేది వృషభ లగ్నాన్ని ఇస్తున్నది. నవమలో నీచ గురువున్నాడు. సరిగా సరిపోయింది. 3 లో కుజ చంద్రులు దురుసు మాటను, 4 లో రవి రాహువులు సుఖం లేని జీవితాన్ని, 5 లో శని బుధులు తెలివైన బాధక గురువును ఇచ్చారు. 

ఈ సమయానికి జననకాల దశగా బుధ శని శని దశ నడుస్తున్నది. ఈ దశ ఈమె యొక్క మూడు పెళ్ళిళ్ళను, ప్రేమ వ్యవహారాలను, ఈమెకున్న శాపాలను, వేదనలను, గురువువల్ల పడే బాధలను చూపిస్తున్నది.


ఇప్పటి వరకూ మనం చేసిన విశ్లేషణను బట్టి మనకు నాలుగు సమయాలు వచ్చాయి. వీటిని మనం చిత్రిక పట్టాలి. అవి :

1. 4.41 AM

2. 13.19 PM

3. 15.47 PM

4. 20.22 PM

షీలా జీవితంలో జరిగిన సంఘనలతో ఈ సమయాలను పోల్చి చూచి వీటిలో ఏది సరియైనదో నిర్ణయించాలి. వాటిలో ఓషో మరణం ముఖ్యమైన సంఘటన. ఓషో 1990 జనవరి 19వ తేదీన అనుమానాస్చపద పరిస్థితులలో పూనాలో చనిపోయాడు.

జనన సమయ పరీక్ష

4.41 గంటల జాతకం వృశ్చిక లగ్నం - మీనరాశి

ఆ రోజున రవి- చంద్ర - బుధదశ నడిచింది. సూర్యుడికి గురువుకి సంబంధం లేదు. నీచచంద్రుడు నవమాధి పతిగా ఉంటూ నీచ గురువును సూచిస్తున్నాడు. బుధుడు నవమానికి పన్నెండులో ఉంటూ గురువు చావును సరిగానే చూపిస్తున్నాడు.

13.19 గంటల జాతకం మీనలగ్నం మీనరాశి 

ఓషో చనిపోయిన రోజున ఈ జాతకానికి చంద్ర - చంద్ర - చంద్రదశ నడిచింది. నవమాదిపతి అయిన కుజినిచేత చూడబటటం తప్ప చంద్రునికి గురువు మరణంతో సూటి సంబంధం లేదు. కనుక ఈ సమయం సరిపోదు.

15.47 గంటల జాతకం వృషభలగ్నం మీనరాశి

ఆ రోజున చంద్ర - రాహు - రాహుదశ నడిచింది. నవమమైన మకరం నుండి చంద్రుడు రాహువు తృతీయంలో ఉంటూ ఆయుస్శును పాడుచేస్తున్నారు. చంద్రురుడు మారకుడు. నవమాదిపతి అయిన శని నుండి చంద్రుడు రాహువు ఇద్ద్దరూ 8 ఇంటిలో ఉంటూ గురువు చావును సూచిస్తున్నారు. కనుక ఈ సమయం కరెక్ట్ గా సరిపోతున్నది. 

20.22 గంటల జాతకం కటకలగ్నం మీనరాశి

ఆ రోజున చంద్ర - శని - శనిదశ నడిచింది. ఇది మానసిక వేదనను ఇస్తుంది. శని 8 వ అధిపతి అవుతూ 9 కి 12 గా గురువు చావును సూచిస్తున్నాడు. చంద్రుడు ఆయుస్సును  సూచించే మూడవ ఇంటిలో ఉన్నాడు. శని నాశనాన్నిచ్చే 8 వ ఇంటిలో ఉన్నాడు. చంద్రుడు శని ఇద్దరూ షష్టాష్టకంలో ఉన్నారు.

1965/66 లో ఉన్నత చదువుల కోసం షీలా అమెరికాకు వెళ్ళింది.

20.22 - శుక్ర - చంద్రదశ నడిచింది. శుక్రుడు 4 అవ అధిపతిగా విద్యనిస్తాడు. చంద్రుడు లగ్నాదిపతిగా 9 లో ఉంటూ విదేశ గమనాన్నిచ్చాడు.

15.47 - శుక్ర శుక్ర దశ. లగ్నాధిపతి అయిన శుక్రుడు 9 లో ఉంటూ విదేశీయాత్రనిచ్చాడు.

1981 లో ఓషోకి సెక్రటరీ అయింది. అమెరికాకు వెళ్లారు.

15.47 - శుక్ర - కేతుదశ. కేతువు ఉచ్చబుధునికి కారకుడు. తెలివైన కుట్రను చూపిస్తున్నాడు. భూకారకుడైన కుజునితో ఉంటూ అమెరికాలో భూమి కొనుగోలును చూపుతూన్నాడు. 

20.22 - రవి - రాహు దశ. ఈ సంఘటనను చూపడం లేదు.

1984 నుంచి 85 - ఆరిగాన్ లో గొడవలు - కుట్రలు

20.22 - రవి దశలో బుధ, కేతు శుక్ర దశలు. రవి 6 లో ఉండటం వల్ల గొడవలు ఉంటాయి. కానీ నేరాలు ఘోరాల సూచన లేదు. 

15.47 - రవి దశలో గురు, శని అంతర్దశలు. రవి 8 లో రహస్య కుట్రలిస్తాడు. 9 లో ఉన్న గురువు గురువును సూచిస్తాడు. శని 9 అధిపతిగా బాధకుడు. గురువు చేతిలో కీలుబొమ్మగా మారి నానా నేరాలు చెయ్యడం సూచన ఉన్నది. కనుక  15.47 బాగా సరిపోతున్నది. 

13 Sept 1985 న ఈమె ఓషోని వదిలేసి యూరప్ కి పారిపోయింది.

15.47 chart - రవి - శని - శుక్రదశ నడిచింది. రవి 8 లో ఉంటూ గురువును వదిలెయ్యడం చూపుతున్నాడు. 9 వ అధిపతి అయిన శని బాధకుడు, గురువు వల్ల బాధలను సూచిస్తున్నాడు. లగ్నాధిపతి 9 లో ఉంటూ విదేశాలకు పోవడాన్నిస్తున్నాడు. ఈ సమయం మళ్ళీ సరిపోతున్నది.

పై విశ్లేషణను బట్టి, 28.12.1949 న 15.47 అనేది ఆమె ఖచితమైన జనన సమయంగా నేను భావిస్తున్నాను. 

ఈ సమయానికి ఉన్న వృషభ లగ్న జాతకం ఈమె జీవితంలో అన్ని సంఘటనలను సరిగ్గా చూపిస్తున్నది. మచ్చుకి ఈ క్రింది విషయాలు గమనించండి.

  • 11 వ భావం నుండి ఈమె అయిదుమంది అన్నలు అక్కలు సరిపోతున్నారు.
  • 9 లో ఉన్న నీచ గురువు ఈమె తండ్రిని సూచిస్తున్నాడు. ఆయనొక మహానుభావుడు. 16 ఏళ్ళ వయసులో కూతురిని అమెరికాకు పంపిస్తూ - 'నీకు మొదట తారసపడిన స్నేహితుడిని తొందరపడి పెళ్లి చేసుకోకు. కొంతమందితో సెక్స్ ఎంజాయ్ చేయి. ఆ తరువాత వారిలో నీకు బాగా నచ్చిన ఎవడో ఒకడిని ఎంచుకో' - అన్న జ్ఞానబోధ చేసిన మహా గొప్ప తండ్రి.
  • 9 లోని నీచ గురువు, ఈమె గురువైన ఓషోని కూడా సూచిస్తాడు. ఈమె చేత అడ్డమైన పనులన్నీ చేయించిన ఓషో, చివరకి తను తెలివిగా తప్పుకున్నాడు. ఈమెను జైలు పాలు చేశాడు.
  • 4 లో శని శత్రుస్థాన స్థితి వల్ల సంసార సౌఖ్యం ఉండదు. సుఖం ఉండదు. శాంతీ ఉండదు.
  • 5 లో కుజ కేతువుల వల్ల మహా మొండి మనస్తత్త్వం, చావు తెలివీ ఉంటాయి.
  • లగ్నాధిపతి శుక్రుడు 9 లో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల జీవితమంతా విదేశాలలో నివాసం ఉంటుంది.
  • ఈ జాతకం ఈమె యొక్క గట్టి మనస్సుని కూడా కరెక్ట్ గా చూపిస్తున్నది. నా ఉద్దేశ్యంలో, ఇంకొక ఆడపిల్ల అయితే ఇన్ని కష్టాలను, అది కూడా విదేశాలలో ఉంటూ, ఒంటరిగా తట్టుకునేదే కాదు. వృషభలగ్న జాతకులు అలాంటి వారే. ఎన్ని కష్టాలనైనా తట్టుకుని ధైర్యంగా నిలబడతారు.

ఓషోని వదిలేసి షీలా చాలా మంచిపని చేసిందని నా ఉద్దేశం. ఈమె జీవితాన్ని ఓషో పూర్తిగా భ్రష్టు పట్టించాడు. ఒకవేళ ఇంకా ఇంకా ఓషోతోనే ఉండి ఉన్నట్లయితే ఈమె జీవితం ఇంకా సర్వనాశనం అయిపోయి ఉండేది.

ఓషో ఈమెను నానా బూతులు తిట్టినా ఈమె తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అక్కడే ఈమె ఔన్నత్యము, ఓషోపట్ల ఈమెకున్న గౌరవము బయటపడుతున్నాయి. మొదట లక్ష్మిని, తర్వాత షీలాను, ఆ తర్వాత హాస్యను తన స్వార్ధానికి  వాడుకోబట్టే చివరకు ఓషో హత్య చేయబడ్డాడు. అంతేకాదు, ఆయన ప్రేమికురాలు సేవకురాలు అయిన వివేక్ కూడా చంపబడింది. అవన్నీ ఇంకోసారి చూద్దాం.

ప్రస్తుతం ఈమెకు రాహు దశ జరుగుతున్నది. లాభస్థానంలో ఉన్న రాహువు, గోచారంలో లాభంలో ఉన్న శని ఈమెను మళ్ళీ భారతదేశానికి తెచ్చారు. ఈమె జీవితం మీద సినిమాలు తీయిస్తున్నారు. ఇప్కపుడామెకు 70 ఏళ్ళు వచ్చాయి. కనీసం ఇప్పుడైనా ఈమె జీవితంలో సంతోషం నిండాలని కోరుకుందాం !