Pages - Menu

Pages

13, నవంబర్ 2020, శుక్రవారం

Online Sri Vidya - 2

ఆ తర్వాత పదిరోజులదాకా రవి మళ్ళీ ఫోన్ చెయ్యలేదు. నేనూ తనకి ఫోన్ చేసి అడగలేదు. మనవాడు అంతటితో ఆగడని, ఏదో ఒకటి చేస్తాడని నాకు తెలుసు గనుక నేనూ గమ్మునున్నాను.

నేనూహించినట్లుగానే మళ్ళీ ఒకరోజున ఫోన్ మోగింది.

'ఏమైందో తెలుసా ఈ మధ్యకాలంలో?' అడిగాడు రవి.

' కొంపతీసి పోయాడా ఏంటి కరోనా దెబ్బకి?' అడిగా.

'ఛీ ఛీ, అంతమాటనకు. బ్రతికే ఉన్నాడు. ఆన్లైన్ లో దీక్షకూడా ఇచ్చాడు నాకు' అన్నాడు.

'శుభం, అయితే, పెద్దమనిషి వయ్యావన్నమాట' అన్నా నవ్వుతూ.

'ఇప్పుడు కొత్తగా అయ్యేదేముంది? నన్నుచూసి చాలా మందయ్యారు పెద్దమనుషులు' అన్నాడు తనూ నవ్వుతూ.

'సరే ఏం జరిగిందో చెప్పుము?' అన్నా.

తను చెప్పడం మొదలెట్టాడు.

'నాలాగా ఆయన్ను సంప్రదించిన ఒక అరవైమందికి ఆన్లైన్ లో దీక్షనిచ్చాడు మొన్ననే. ఒక్కొక్కరం ఆరువేలు కట్టాం'

'భలే ఉందే ఈ బిజినెస్! అంటే ఒక్కరోజులో అతని ఆదాయం మూడులక్షల అరవైవేలన్న మాట' అన్నా నేను.

'అవును. చెప్పేది విను. మధ్యలో డిస్టర్బ్ చెయ్యకు. అందరం స్కైప్ మీటింగ్ లో కలిశాం. మాలో కొందరు ఇండియానుంచి, మరి కొందరు అమెరికా నుంచి, ఇంకా రకారకాల దేశాల నుంచి ఉన్నారు. అయితే అందరూ ఇండియన్సే. మొదటి రోజు ఏం నేర్పించాడో తెలుసా?' అడిగాడు.

'నువ్వేగా మాట్లాడొద్దన్నావ్? మళ్ళీ ప్రశ్నలేంటి?' అన్నా.

'సరే విను. పసుపుముద్దతో గణపతిబొమ్మ చెయ్యడం నేర్పించాడు ముందుగా.' అన్నాడు. 

నవ్వుతో పొలమారింది నాకు. నవ్వి నవ్వి తమాయించుకుని 'మంచిదేలే. నేర్చుకో. అలాంటివి నేర్పుకుంటే, రిటైరయ్యాక ఖాళీగా ఉండకుండా, పౌరోహిత్యం చేసుకోవచ్చు. ఆ తర్వాత తమలపాకులలో వక్కలు పెట్టడం, దీపారాధన కుందులలో నూనె పొయ్యడం, వత్తులు వెలిగించడం, నేర్పించి చివరాఖరికి తద్దినాలు పెట్టడం నేర్పించి ఇదే శ్రీవిద్య అంటాడేమో చూస్కో మరి? ' అన్నా.

'అలాగే ఉంది చూడబోతే' అన్నాడు తనూ నవ్వుతూ.

'మరి నీ ర్యాంక్ ఏంటో చెప్పావా?' అడిగా.

తను కలెక్టర్ కంటే పై ర్యాంక్ లో ఉన్నాడు ప్రస్తుతం. అదీగాక ప్రస్తుతం పవర్లో ఉన్న ఒక సెంట్రల్ మినిష్టర్ గారికి తను చాలా దగ్గరి బంధువు అవుతాడు.

'దానికే వస్తున్నా. పరిచయాల కార్యక్రమం మొదలైంది. అందరం పరిచయం చేసుకున్నాం. ఒకాయన కేసి ఆర్ ప్రభుత్వంలో ఒక మంత్రిగారికి పీయే. నేనేమో ఇది. అందుకని మా ఇద్దరి బయోడేటా వినగానే వాళ్ళ మైండ్ బ్లాంకైంది. మా ఇద్దరికీ స్పెషల్ ట్రీట్మెంట్ మొదలైపోయింది.' అన్నాడు.

'అంతేగా మరి? లోకమంతా డబ్బు చుట్టూ పవర్ చుట్టూ గిరగిరా తిరుగుతోంది. వాటి ముందు అమ్మవారైనా బలాదూరే' అన్నాను.

'అదేంటి అంతమాటనేశావ్?' అడిగాడు.

'మరేంటి చెప్పు? అమ్మవారితో డైరెక్ట్ గా మాట్లాడతాడని ప్రచారాలు. ఆయనేమో మీ వివరాలు విని మిమ్మల్ని కాకా పడుతున్నాడు. ఇంకేమనాలి మరి?' అన్నాను.

'అవున్లే. అలాగే ఉంది. అందుకేనేమో మా వివరాలు విన్నాక  - 'చూశారా అమ్మవారి దయ ! నాకు ఇన్ కంటాక్స్ ఇష్యూస్ ఉన్నాయి. అందుకని మినిస్టర్ లెవల్లో ఉన్న మీ ఇద్దరినీ నా దగ్గరికి తెచ్చింది అమ్మవారు' అన్నాడు. మేమేం మాట్లాడలేదు. పరిచయాలయ్యాక స్వామీజీ భార్య లైన్లో కొచ్చి, అందరం డబ్బులు కట్టామా లేదా తీరికగా లెక్క చూసుకుంది' అన్నాడు.

నాకు మళ్ళీ నవ్వుతో పొలమారింది.

'అదేంటి స్వామీజీకి భార్యా? ఇదేంటి కొత్తగా వింటున్నాను' అన్నా.

'అంత ఆశ్చర్యపోకు. ఇంకా చాలా ఉంది కధ. స్వామీజీ మంచి జోకులు కూడా పేలుస్తాడు. అంటే, మంచి జోకులని తననుకుంటాడుగాని, ఆవేమో కుళ్ళుజోకులు, ఇలా డబ్బులు లెక్క చూసుకుంటుపుడు, ఒకామె అమరికా నుంచి లైన్లో ఉంది. ఆమె ఒళ్ళో ఒక చిన్న బాబున్నాడు. ఆమెని చూచి స్వామీజీ ' ఏంటమ్మ ! ఒకరికని ఆరువేలు కట్టి, మీ అబ్బాయిని కూడా తెచ్చావా దీక్షకి? ఆ బేబీకి కూడా డబ్బులు కట్టావా మరి, హాఫ్ టికెట్ కింద మూడువేలు?' అంటూ కుళ్ళు జోకు పేల్చాడు' అన్నాడు.

'నవ్వావా ఆ జోకుకి?' అడిగా.

'నవ్వొకటి? ఏడుపు మొదలైంది ఎందుకు డబ్బులు కట్టానా అని" అన్నాడు.

'అప్పుడే ఏమైంది? ముందుంది నీకు ముసళ్ళపండగ. మొత్తం ఒక ఇరవైలక్షలదాకా వదిల్తే గాని నిన్ను వదలడు చూడు' అన్నా.

'అంత వెంకట్రావులాగా కనిపిస్తున్నానా నేను?' అన్నాడు.

'అబ్బే అంతమాట నేనేందుకంటాను గాని, తర్వాత ఏం నేర్పాడు? అడిగా.

'గణపతిపూజ నేర్పి, లక్ష్మీగణపతి మంత్రం చెప్పి, ఒక నలభైరోజులపాటు ఆ మంత్రంతో గణపతికి తర్పణాలు వదలమని చెప్పాడు. అలా చేస్తే కుండలిని రైజ్ అవుతుందట' అన్నాడు

'ఎవరికి గణపతికా? నీకా?' అడిగా సీరియస్ గా గొంతు పెట్టి.

'అదే మరి ! నీ జోకులు ! ఆ విధంగా తర్పణాలు నేర్చుకున్నాను' అన్నాడు.

'తర్పణాలు కూడా నేర్చుకున్నావా? మా నాయనే ! ఆ తర్వాత పిండప్రదానం ఉంటుందేమో ఖర్మ? ఇదా శ్రీవిద్య అంటే? అసలు తనకైందా కుండలిని రైజ్?' అడిగా నేను నవ్వుతూ.

'ఏమో నాకు తెలీదు' అన్నాడు తను.

'అసలీయన స్వామీజీ ఎలా అయ్యాడు? ఎవరి దగ్గర సన్యాసం తీసుకున్నాడు? తీసుకుంటే పెళ్ళాం ఎందుకుంది? తీసుకోకపోతే మీరు స్వామీజీ అని ఎలా పిలుస్తున్నారు?' ప్రశ్నలు సంధించా నేను.

'ఏమో అవన్నీ నాకు తెలీదు, మాకు మంత్రాలు కావాలి. ఆయన ఉపదేశిస్తున్నాడు. అందుకని వెళుతున్నాం' అన్నాడు.

తనలా అంటుంటే నాకు 'గాలిస్వామి' గుర్తొచ్చాడు. ఈ గాలిస్వామికి చాలామంది భక్తగణం ఉన్నారు. ఆయన ముఖం చూస్తే మోషన్ అయ్యి ఆర్నెల్లు అయిన ఫేస్ కనబడుతుంది. ఈయన భక్తులలో ఒకడి కూతురికి ఏదో తీరని జబ్బు చేసిందట. ఆమెను ఒక గదిలో ఉంచారు. ఎక్కడో వేరే చోట ఉన్న ఈ స్వామి, ఒకరోజు రాత్రి గాలిరూపంలో ఈమె గదిలోకి వచ్చి ఏదో చేశాడట. ఆ తర్వాత ఆ పిల్లకి రోగం తగ్గిపోయిందట. ఈ కధని ఒక మూఢభక్తుడు నాకు చెప్పాడు. నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. ఇలాంటి దొంగలందరూ స్వాములంటూ పేర్లు పెట్టుకుని సొసైటీని మోసం చేస్తున్నారు.

అసలీ గోలంతా, సత్యసాయిబాబా పోయాక మొదలైంది. అప్పుడేర్పడిన ఖాళీని పూరించడానికి పుట్టగొడుగులలాగా ఎక్కడపడితే అక్కడ ఛోటాబాబాలు వెలిశారు. వాళ్ళలో కొందరిని హవాలాకోసం రాజకీయనాయకులే పుట్టించారు. కొందరిని కులసంఘాలు పుట్టించాయి. స్వామీజీలకు కులాలకు ఏమిటి సంబంధమని మీకు హనుమానం రావచ్చు. ఇనుకోండి మరి !

కొన్ని కులాలలో ఆధ్యాత్మికత అస్సలుండదు పాపం. వాళ్ళకు తెలిసిన ఆధ్యాత్మికత అంతా కూడా గుళ్ళు, గోపురాలు, పూజలు, మొక్కులు ఇంతవరకే. వాళ్ళలో ఎవరైనా రెండు పుస్తకాలు చదివి ధ్యానం, కుండలినీ, ఆత్మసాక్షాత్కారం వంటి నాలుగుమాటలు నేర్చుకుంటే చాలు - 'అబ్బ1 మనలో ఇలాంటోడు ఇప్పటిదాకా లేడు, వీడిని మనం ప్రోమోట్ చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం' - అంటూ కొందరు కులగులగాళ్ళు బయలుదేరతారు ! వాళ్ళకి తోడుగా ఎవడో ఒక రాజకీయనాయకుడుంటాడు. అందరూ కలసి ఆధ్యాత్మికవ్యాపారం పెట్టి, లోకాన్ని మోసం చేస్తూ ఉంటారు. గొర్రెలు మోసపోతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న స్వామీజీలలో చాలామంది ఇలాంటి ఫ్రాడ్ గాళ్లే.

అయితే, ఎల్లకాలం జనాన్ని మోసం చేయడం కుదరదు కదా ! అందుకని వాళ్ళలో చాలామంది కాలగమనంలో చప్పబడిపోయారు. వాళ్ళలో ఒకాయనైతే తాగితాగి లివర్ ఫెయిలై చచ్చేపోయాడు. కులస్వామీజీలు, రాజకీయస్వామీజీల హవా నడుస్తోందిప్పుడు. కలికాలమంటే ఇదేగా మరి !

అమెరికాలో ఉండే ఒకామె, ఇలాగే పనీపాటా లేక, ధ్యానమంటూ ఏదో కొన్నేళ్లపాటు చేసి ఏకంగా ఒక పుస్తకమే రాసింది. ఆమెకు ఆత్మలు, దేవతలు కనిపిస్తారట. వాళ్ళాయన ఆఫీసుకి వెళ్ళగానే సాక్షాత్తూ అమ్మవారే ప్రత్యక్షమై పక్కన కూర్చుని, మళ్ళీ వాళ్ళాయన ఆఫీసునుంచి వచ్చేవరకూ కబుర్లు చెబుతూ ఉంటుందట. అమెరికాలో పనీపాటా లేకుండా ఇంట్లో ఉండే ఆడాళ్ళకి ఇలాంటి భ్రమలతో కూడిన పిచ్చిఎక్కే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉంటాయి., హైదరాబాద్ లో జరిగిన ఆ పుస్తకం ప్రారంభోత్సవానికి రమ్మని నాకూ మెయిల్ ఇచ్చింది. మళ్ళీ నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. 'నువ్వు భ్రమల్లో ఉన్నావు. నువ్వు అనుకుంటున్నవి ఆధ్యాత్మిక అనుభవాలు కావు. అవి భ్రమలు. నీకు సైకియాట్రీ ట్రీట్మెంట్ కావాలి. త్వరలో నీకు పిచ్చిపుట్టడం  ఖాయం' అని చెప్పి నేనా ఫంక్షన్ కి పోలేదు.

ఆధ్యాత్మిక లోకంలో ఇలాంటివి ఎన్ని మాయలో !

గాలిస్వామి భక్తులు కొందరు నన్ను పరీక్ష చేద్దామని గతంలో నా దగ్గరకి వచ్చారు.

ఏం కావాలని వారిని అడిగాను.

'మాకు ఆత్మసాక్షాత్కారం కావాలి' అని వాళ్ళు తెలివిగా జవాబు చెప్పారు.

వాళ్ళని చూస్తే ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసే ముఖాలలాగా నాకనిపించలేదు. రియల్ ఎస్టేట్ మాఫియా లాగా ఉన్నారు.

'అది చాలా చిన్న పని. నా మార్గంలో ఆత్మసాక్షాత్కారం చాలా తేలికగా వస్తుంది' అని వాళ్ళతో సిన్సియర్ గానే చెప్పాను. కానీ వాళ్ళు నన్ను నమ్మలేదు. నమ్మడానికి నా దగ్గర వేషంలేదు కదా మరి? మందీమార్బలం, మహిమలు కూడా లేకపాయె ! చూట్టానికి వాళ్ళకంటే సాదాసీదాగా ఉంటిని. నన్నెలా నమ్మగలరు వాళ్ళు? కనుక మళ్ళీ తిరిగి చూస్తే ఒట్టు !

'అతనిదగ్గరేమీ సరుకు లేదు. మనలాంటోడే. కాకపోతే కాస్త ఇంగ్లీషు బాగా మాట్లాడగలడు, ఏవో నాలుగు పుస్తకాలు చదివాడు, రెండు పుస్తకాలు రాశాడు. అంతే' -- అని గాలిస్వామికి నాగురించి చెప్పి ఉంటారు.

ఈ గాలి(మలబద్ధక)బాబా వుంకొక భక్తుడికి ఒక కూతురుంది. ఆ కూతురు తన క్లాస్ మేట్ ని ప్రేమించింది. ఆ అబ్బాయిది తెలంగాణా. అమ్మాయిది ఆంధ్రా. ఇంతలో అమ్మాయికి ఒక కెనడా సంబంధం వచ్చింది. తెలంగాణా అబ్బాయి పాపం నిజంగానే ఈ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరూ డాక్టర్లే. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చు. కానీ వీళ్ళ ప్రేమ గాలిమలబద్ధకబాబాకి నచ్చలేదు. 'తెలంగాణా అబ్బాయి వద్దు. కెనడా సంబంధం చెయ్యి. వాళ్ళనూ నా భక్తులను చెయ్యి. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు బాగా గుంజుతాను' అని బాబా చెప్పాడు. ఇప్పుడా అమ్మాయి కూడా మనసు మార్చుకుని కెనడా వైపు మొగ్గుతోంది. ఇవీ బాబాల భాగోతాలు !

వీళ్ళున్నది ఆధ్యాత్మికత నేర్పడానికా? లేకపోతే కుటుంబపంచాయితీలు చెయ్యడానికా? ఓ అయాం సారీ ! నేర్పాలంటే, ముందుగా వాళ్లకు తెలియాలిగా ? ఈ పాయింట్ మర్చే పోయాను సుమీ !

ఈ గాలిబాబా దగ్గర పెద్ద సబ్జెక్ట్ కూడా ఏమీ లేదు. ఏదేదో సొల్లు వాగుతూ ఉంటాడు. పిచ్చిజనం నమ్ముతూ ఉంటారు  ఇతని కులం వాళ్ళందరూ కలసి ఇతన్నొక గురువుగా ప్రోమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి కులగోల ఎక్కువగా సాగుతోంది.

ఇలాంటి గాలిబాబాలు, ధూళిబాబాలు అనేకమంది కాకమ్మకబుర్లు చెబుతూ జనాన్ని పిచ్చోళ్లని చేస్తున్నారు. అలాంటివాళ్ళలో ఈ ఆన్లైన్ శ్రీవిద్యస్వామి కూడా ఒకడని నాకనిపించింది.

అదంతా గుర్తు చేసుకుంటూ ' తర్వాతేమైంది చెప్పు' అడిగాను.

చెప్పడం సాగించాడు రవి.

(ఇంకా ఉంది)