నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

16, డిసెంబర్ 2020, బుధవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 38 (నమ్మకం - పునాదులు - దారి)

మొన్న వారాంతంలో జిల్లెళ్ళమూడి సందర్శనం, 'వైద్యజ్యోతిష్యం' పుస్తకం విడుదల జరిగాయి.

దానికోసం, రాత్రి పదకొండుకు హైదరాబాద్ లో రైలెక్కి, ఉదయం ఆరింటికల్లా బాపట్లలో దిగాము. సిద్ధంగా ఉన్న కారులో ఇరవై నిముషాలలో జిల్లెళ్ళమూడిలోని ఇంటికి చేరుకున్నాము. ఇంకా తెల్లవారలేదు. దారిలో పొలాలన్నీ పొగమంచుతో నిండి ఉన్నాయి. జిల్లెళ్ళమూడి చేరుకునేసరికి, రాత్రే అక్కడకు చేరుకున్న మూర్తి దంపతులు, ఇల్లంతా సర్ది శుభ్రం చేసి, మాకోసం వేచిచూస్తూ సిద్ధంగా ఉన్నారు.

కాలకృత్యాలు తీర్చుకుని పాలు సేవించి, డాబామీదకెక్కి నీరెండలో పచార్లు మొదలుపెట్టాము. చుట్టూ పొలాలు, చల్లని వాతావరణం, నీరెండ - వెరసి వాతావరణం చాలా హాయిగా ఉంది. అక్కడివాళ్లు 'చలి' అంటున్నారు గాని, హైదరాబాద్ చలికి రెండేళ్ళనుంచీ అలవాటుపడిన మాకు ఏమీ చలి అనిపించలేదు.

అనేక విషయాల మీద సంభాషణలు జరిగాయి. మాటల మధ్యలో మూర్తి ఇలా అన్నాడు.

'ఏది జరిగినా ఏమీ ఆలోచించకుండా, మారు మాట్లాడకుండా గురువును అనుసరించడమే అత్యుత్తమమని, సాధనామార్గంలో అదే చివరిమాటని నాకనిపిస్తోంది'.

'ఎందుకలా అనిపిస్తోంది నీకు?' అడిగాను.

'జారిపోతున్న వాళ్ళని చూస్తుంటే అలా అనిపిస్తున్నది. వాళ్ళందరూ వారివారి మనసులలో ఒక అజెండా పెట్టుకుని మిమ్మల్ని అనుసరిస్తున్నామని అనుకుంటూ, లేదా, ఇతరులని అలా భ్రమింపజేస్తూ కొంతకాలం మీతో ఉంటున్నారు. కొన్నాళ్ళకు వాళ్ళ ఊహలు నెరవేరకపోయేసరికి, ఏవేవో కుంటిసాకులు చెప్పి జారిపోతున్నారు. ఈలోపల మీ విలువైన సమయం వృధా అవుతున్నది. వాళ్ళకూ ఏమీ దొరకడం లేదు. దీనికంతటికీ మూలకారణం ఇదేనని గమనిస్తుంటే అనిపిస్తున్నది'  అన్నాడు మూర్తి.

నేనిలా చెప్పాను.

'అవును. దానిని మించిన సాధన లేదు. చేయగలిగితే అందులోనే అంతా దొరుకుతుంది. కానీ మాటలు చెప్పడం సులభం. చేయడం అతి కష్టం. అనుక్షణం నీ మనసే నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. అది సరియైన దారే అని మాయ కమ్ముతుంది. అక్కడే నువ్వు నిలబడాలి. లేకపోతే సాధనామార్గం నుంచి పడిపోతావు. ఇక వృధా అయిన సమయం సంగతంటావా? అలాంటిదేమీ లేదు. దానినుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకోగలిగితే, జీవితంలో ఏదీ వృధా కాదు! అంతరికమార్గంలో మనం ఎదిగే విధానం అలాగే ఉంటుంది. ఒక విధంగా చూస్తే, ఈ భూమ్మీద ప్రతివాడి సమయమూ వృధా అవడం తప్ప ఇంకేముంది? అదికాదు. నాతో నడవడానికి అందరికీ అవకాశం ఇస్తాను. పట్టుదల ఉంటే నడవవచ్చు. మధ్యలో మనసు చేసే మాయలకు పడిపోతే అది వారిష్టం. నా తప్పేమీ ఉండదు. నాకు కలిగే నష్టమూ ఏమీ లేదు. నష్టపోయేది వాళ్ళే. 

భక్తి, శరణాగతి, ప్రపత్తి అనే మాటలకు అర్ధం ఏమిటి చెప్పు? నువ్వు చెప్పినది అదే. మనమందరం ఈ మాటలను తరచుగా వింటాం. చెబుతాం. కానీ ఆచరణలో ఎవ్వరికీ ఇవి సాధ్యం కావు. ఎందుకంటే, అహం అనేది అణగడం చాలా కష్టం. అది ఎన్నో రూపాలు ధరించి నిన్ను మాయచేస్తుంది. ఆ మాయకూడా ఎలా ఉంటుందంటే అది మాయ అని నీకనిపించదు. నువ్వు చేస్తున్నది కరెక్టే అని నీకు అనిపించేలా నీ అహమే నిన్ను తప్పుదారి పట్టిస్తుంది. అక్కడే అందరూ జారిపోతూ ఉంటారు.

నువ్వు చెప్పినట్లుగా ఉండగలిగితే ఇక మారుమాట లేనేలేదు. అలాంటి శిష్యుడికి సమస్తం అరచేతిలోకి వచ్చి నిలుస్తుంది. దేవతలు అతన్ని వెతుక్కుంటూ వస్తారు. కానీ అలా ఎంతమంది అహాన్ని చంపుకుని సాధనామార్గంలో నడవగలరు? కోటికి ఒకరు కూడా ఉండరు. కనుక అవి ఉత్తమాటలుగానే మిగిలిపోతాయి. అయ్యప్ప భక్తులు పాటలు పాడుతారు చూడు 'శరణం శరణం' అంటూ అరుస్తూ. అలాంటి జీవంలేని డొల్లపదాలే అవి'.

గుడికి వెళ్ళే సమయం అవడంతో ఆ సంభాషణ అలా ముగిసింది.

క్రిందకు దిగివచ్చి, అందరం కలసి అమ్మ ఆలయానికి బయల్దేరాము. దారిలో వసుంధరక్కయ్య ఇంటికి వెళ్ళి, అక్కయ్యను పలకరించి కాసేపు కూర్చున్నాము. జిల్లెళ్ళమూడి వచ్చి రెండేళ్ళు కావడంతో, అక్కడకూచుని గతస్మృతులన్నీ మళ్ళీ గుర్తుచేసుకున్నాము. తరువాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని, పుస్తకం విడుదల చేసి, వెనక్కు వచ్చేశాము. ఆ తరువాత మేడమీద అమ్మ గదికి వెళ్ళి అక్కడ కాసేపు కూచుని, అన్నపూర్ణాలయంలో భోజనం చేసి ఇంటికి వెళ్ళి సాయంత్రం దాకా విశ్రాంతి తీసుకున్నాము.

సాయంత్రం నేనూ మూర్తీ కలసి జిల్లెళ్ళమూడి గ్రామంలో ఉన్న నాలుగుబజార్లూ కాలినడకన సర్వే చేశాము. అమ్మ ఆలయం వెనుకగా అప్పికట్ల వెళ్ళేవైపు దారిలో వెళితే పొలాలు వచ్చాయి. అక్కడ కాసేపు నిలబడి సాయంకాలపు గాలిని నీరెండను ఆస్వాదించి ఊరి చివరగా ఉన్న వీధిలోనుంచి అమ్మ ఆలయం చుట్టూ తిరిగి మన ఇంటిదగ్గరకు వద్దామని చూస్తే అక్కడనుంచి దారి కనిపించలేదు. మళ్ళీ వచ్చిన దారినే వెనక్కు వెళదామా అని ఆలోచిస్తూ అక్కడే నిలబడి ఉండగా, ఇద్దరు ఆడవాళ్ళు పొలం పనులు చేసుకుని, కొడవళ్లు,  ఖాళీ చేసిన భోజనం క్యారియర్లు పట్టుకుని ఇళ్లకు వస్తూ కనిపించారు. వారిని దారి అడిగాము.

వాళ్ళలో వకామె ' ఇక్కడ ఈ తుప్పలలోనుంచి దారి ఉన్నది. కానీ కప్పడిపోయింది. మేమూ అటే వెళుతున్నాము. మాతో రండి' అన్నది నడుస్తూ.

వాళ్ళని అనుసరించి ఆ రాళ్లలో, బురదలో, తుప్పలలో నడుస్తూ కొద్దిదూరం వచ్చేసరికి దారి కనిపించింది. ఇళ్లమధ్యగా నడుస్తూ వచ్చి, ఆంజనేయస్వామి ఆలయం దగ్గరకు వచ్చి చేరాము. వాళ్ళు వాళ్ళ దారిన వెళ్లిపోయారు. మేము ఏదో మాట్లాడుకుంటూ అక్కడే కాసేపు నిలబడ్డాము.

అక్కడ ఇళ్ళు, ప్రహరీ గోడలు కొంచం నేలలోకి క్రుంగినట్లు కనిపిస్తున్నాయి. ఎవరో భక్తులు అక్కడ ఉండటానికి కొన్ని ఇళ్ళను చెదురుమదురుగా కట్టించుకున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు లాగుంది. అందుకే ఎక్కువభాగం ఇళ్ళు తాళాలు వేసి ఉన్నాయి. వాటిని చూపిస్తూ ఇలా అడిగాను.

'ఎందుకు మూర్తి అవలా క్రుంగిపోయి ఉన్నాయి?'

'నల్లరేగడి నేల కదా గురువుగారు ! అందుకే, పునాదులు గట్టిగా లోతుగా లేకపోతే కొంతకాలానికి గోడలు క్రుంగుతాయి' అన్నాడు మూర్తి.

'అర్ధమైందా మరి? సాధనామార్గంలో కూడా అంతే. పునాదులు గట్టిగా ఉండాలి. లేకపోతే సాధన అనేది ఎక్కువకాలం సాగదు. అప్పుడు మన ఆధ్యాత్మికసౌధం కూడా క్రుంగుతుంది. ఏంటా పునాదులు? దారంటే సరియైన అవగాహన, శ్రద్ధ, గురువంటే నమ్మకం, నడిచే ఓపిక ఇవీ పునాదులు. వీటిలో లోపం ఉన్నపుడు నీ ఇల్లు నేలలోకి క్రుంగిపోతుంది. పొద్దున నువ్వడిగింది ఇదే.

అంతేకాదు. ఇందాక మనకు దారి చూపించిన ఆడవాళ్ళే మనకు గురువులు. గుర్తు చూపించేవాడే గురువని కదా అమ్మ మాట. కనుక మనకు గుర్తు చూపించినవారు మన గురువులు. దారికోసం నీలో నిజమైన తపన ఉన్నపుడు దారి చూపేవాడు నీకు తప్పకుండా తారసపడతాడు. వాడిని అనుసరించి నీవు నడవాలి. ఊరకే మాటలు చెబితే కుదరదు. మనం గనుక, వాళ్లమీద అనుమానంతో, 'వాళ్ళ దగ్గర కొడవళ్లున్నాయి, చీకటి పడిపోయింది, ఈ దారి మంచిది కాదు, బురదగా ఉంది, ముళ్ళున్నాయి. వద్దులే' ఇలా అనుకుంటూ మధ్యలోనే ఆగిపోయి ఉంటే, మనం ఇక్కడకు చేరేవాళ్ళం కాదు. లేదా, 'ఏం నడుస్తాంలే, ఏదో ఒక బండి రాకపోతుందా అదెక్కి పోదాం' అనుకుంటూ ఆగిపోయినా కూడా అంతే. ఇక్కడికి రాలేం. పొద్దున నీకు కలిగిన సందేహానికి ఇవే ప్రత్యక్ష ఋజువులు. ఈ విధంగా, చూడగలిగే చూపు ఉంటే, అనుక్షణం నీకు దారి కనపడుతూనే ఉంటుంది. దారి ఎక్కడో వేరే చోట ఉండదు. నీ పక్కనే ఉంటుంది. అనుక్షణం ఎక్కడికక్కడే, నీతోనే, నీలోనే ఉంటుంది. కానీ చూచే దృష్టి నీకు ఉండాలి. అనుసరించే తెగువా, పట్టుదలా, శ్రద్దా ఉండాలి. నీ మనసు చెబుతున్న ప్రతిదానినీ నువ్వు నమ్మి, దాని దారిలోకి పోతే ఇంతే సంగతులు. జారిపోతావు. లేదంటే నిలబడతావు. అదీ సంగతి'. అని ముగించాను.

ప్రపంచంలో అందరూ ఏదో ఒక దేవుడిని నమ్ముతారు. ఆధ్యాత్మికమార్గంలో ఉన్నామని భ్రమపడుతూ ఉంటారు. కానీ అదంతా ఉత్త భ్రమ. నిజమైన ఆధ్యాత్మికమార్గం అతి కొద్దిమందికి మాత్రమే అందుతుంది. అందరికీ అది అందదు. ఆ మార్గంలో ఎక్కడా ఆగకుండా నడిచేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఒక పదిమంది ఉంటారు. అంతే ! మిగతా అందరూ ఉత్తమాటలే గాని, నిజమైన దారీ దొరుకదు. నిజమైన నడకా ఉండదు. ప్రపంచమంతా మాయతో కప్పబడి ఉన్నది. మనుషులందరూ భ్రమల్లోనే ఉన్నారు. ఈ ఊబిలోనుంచి బయటపడటం అందరికీ సాధ్యం కాదు.

చివరగా మూర్తీతో ఇలా చెప్పాను.

'మనతో నడిచేవాళ్ళు నిజంగా మనతో నడుస్తున్నారని భ్రమపడకు. వాళ్ళ వాళ్ళ మనసులు చెప్పినట్లు నడుస్తున్నారు. మనతో ఉంటూ, మనల్ని ఊరకే చూస్తున్నారు. అందుకే ఎక్కడో ఒకచోట రాలిపోతున్నారు. అందుకే నేనంటాను, 'మనకు చూసేవాళ్ళు వద్దు, చేసేవాళ్ళు కావాలి' అని. మన సంస్థ తాటాకుమంటలాగా గప్పుమని వెలగదు. మనకు పేరుప్రఖ్యాతులూ అక్కర్లేదు. అవి మనకు రావు కూడా. మనం ఈ లోకంలో ఎప్పటికీ మైనారిటీ గానే ఉంటాము. అజ్ఞాతంగానే మిగులుతాము. అలాగే ఉండాలి కూడా. ఎందుకంటే, క్రిందనేల మీద లక్షలాది జనం తిరుగుతూ ఉంటారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కేవాళ్ళు ఒక్కరో ఇద్దరో ఉంటారు. వాళ్ళు ఎంతో ఎత్తులో ఉంటారు. కానీ ఒంటరిగానే ఉంటారు. ఇదీ అంతే'.    

అలా మాట్లాడుకుంటూ ఆ గ్రుడ్డిదీపాల వెలుతురులో నడుస్తూ మెల్లిగా ఇంటికి చేరుకున్నాము.

( ఇంకా ఉంది)