నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

24, డిసెంబర్ 2020, గురువారం

కొద్దిమంది...

లోకంలో అందరూ దేవుడిని ఆరాధిస్తున్నారు 

కానీ దేవుడు ఎవరికీ కనిపించడం లేదు 

లోకానికి తెలిసిన దేవుడు 'భయం' ఒక్కటే

అందుకే... 

నిజమైన దేవుడు అందరికోసం కాదు

అతడు కొద్దిమంది కోసం మాత్రమే


భూమ్మీద అందరూ ప్రేమకోసం తపిస్తున్నారు

కానీ ప్రేమ ఎవరికీ దక్కడం లేదు

లోకానికి తెలిసిన ప్రేమ 'స్వార్ధం' మాత్రమే

కనుకనే...

నిజమైన ప్రేమ అందరికోసం కాదు

అది కొద్దిమంది కోసం మాత్రమే


ప్రపంచంలో అందరూ దేనికోసమో వెదుకుతున్నారు

కానీ అది ఎవరికీ చిక్కడం లేదు

లోకానికి తెలిసిన గమ్యం 'సుఖం' మాత్రమే

అందుకే...

నిజమైన సుఖం అందరికీ అందదు

అది కొద్దిమంది కోసం మాత్రమే


సమాజంలో అందరూ అన్నీ తెలుసనుకుంటున్నారు 

కానీ శాంతి ఎవరి దగ్గరా కనపడటం లేదు

లోకానికి తెలిసిన జ్ఞానం 'గర్వం' మాత్రమే

కనుకనే... 

నిజమైన జ్ఞానం అందరికోసం కాదు

అది కొద్దిమంది కోసం మాత్రమే


అందరూ సమానమే అని అందరూ చెబుతున్నారు

కానీ ఏ ఇద్దరికీ ఇక్కడ పడటం లేదు

మనుషులకు తెలిసిన 'సమానత్వం' మాటల్లో మాత్రమే 

అందుకే... 

అసలైన సమానత్వం అందరికోసం కాదు

అది కొద్దిమంది కోసం మాత్రమే.. 


కొద్దిమంది నన్ను కలసి ఇలా అన్నారు

మీరు చెబుతున్న కొద్దిమంది మేమే కదూ?

వారిని చూస్తూ ఇలా అన్నాను

కాదు.... 

నేను చెబుతున్నది మీలాంటి కొద్దిమందికోసం కాదు

అది 'కొద్దిమంది' కోసం మాత్రమే...