Pages - Menu

Pages

11, డిసెంబర్ 2020, శుక్రవారం

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...

అంతులేని ఎడారిలో

తెల్లవారని చీకటిరాత్రిలో

ఒంటరిపయనం సాగిస్తున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


ఈ లోకపు విపణివీధిలో 

బేరం ఎరుగని బేలవుగా

నిర్ధనురాలవై నిలిచావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


మోసం నిండిన లోకంలో

కపటం నిండిన కన్నులని చూచి

భయంతో వణుకుతున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


కామం తప్ప తెలియని సంఘంలో

ప్రేమను కోరుకుంటూ అమాయకంగా

దిక్కులు చూస్తూ నిలబడ్డావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


స్వార్ధం నిండిన మనుషులతో

తప్పక సహజీవనం సాగిస్తూ

తల్లడిల్లుతున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


వసంతమెరుగని తోటల్లో

వయారమొలికే గులాబీ కోసం

యుగాలుగా ఎదురుచూస్తున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


మృగాలు తిరిగే అడవుల్లో

దిగాలు పడుతూ దారులు మరచి

తిరిగి తిరిగి విసిగిపోయావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


గుళ్ళూ గోపురాల నగరంలో

ఆచారాల కృత్రిమ వీధులలో

అంతు తెలియక నిలుచున్నావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...


మతాల ముసుగుల నీడలలో

దైవం వెలుగును కనలేక

దారితప్పిపోయావా చెలీ?

భయపడకు..నేనున్నా నీకు తోడుగా...