నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

11, జనవరి 2021, సోమవారం

2020 లో పంచవటిలో ఏం జరిగింది?

ఆధ్యాత్మిక జీవితానికి ఉన్న  విచిత్రలక్షణమేమంటే దానికి జనంతో పని ఉందనుకుంటే ఉంటుంది, ఉండదనుకుంటే ఉండదు.  ఎవరున్నా లేకున్నా పని జరుగుతుంది. దీనిలో బాహ్యప్రపంచంలో కంటే అంతః ప్రపంచంలో జరిగే పనే ఎక్కువగా ఉంటుంది. అది నలుగురికీ కనిపించే పని కాదు. కనుక నిజమైన ఆధ్యాత్మికతను ఎరిగినవారికి ప్రపంచం ఎలా ఉన్నా ఎలా పోయినా ఏమీ ఇబ్బంది ఉండదు. వారి లోకం వేరు. వారి ప్రపంచం వేరు. వారి పని వేరు.

కరోనా కారుణ్యం

2020 లో మామూలు లోకాన్ని కరోనా అతలాకుతలం చేసింది. పంచవటిలో కూడా రిట్రీట్స్ ఆగిపోయాయి. అందరం కలసి గ్రూప్ సాధన చేసినది లేదు. కానీ ఎవరి సాధన వారికి సాగుతూనే ఉన్నది. అంతరికమార్గంలో ఎవరి శ్రద్ధను బట్టి ఎవరి అర్హతను బట్టి వారు పురోగమిస్తూనే ఉన్నారు.  అవి లేనివాళ్లు జారిపోతూనే ఉన్నారు. సాధనామార్గంలో వారివారికి వ్యక్తిగతంగా సూచనలను ఇస్తూనే ఉన్నాను.

గ్రంథరచన

వేసవిలో వచ్చిన తీరిక సమయాన్ని ఉపయోగించుకుని ఈ ఏడాది 20 పైగా మంచిమంచి పుస్తకాలను వ్రాశాను. ఇవన్నీ పంచవటిలో మేము చేసే సాధనామార్గాన్ని స్థూలంగా వివరించే ప్రాచీన ప్రామాణికగ్రంధాలు. నా మార్గం నా కపోలకల్పితం కాదు. ఇది ప్రాచీనమైనది మాత్రమే గాక వేదోపనిషత్తుల ప్రామాణికత దీనికి ఉన్నది. అసలు సిసలైన సనాతనయోగమార్గాన్నే నేను చిన్నప్పటినుంచీ ఆచరించాను. అర్హులైనవారికి ఇప్పుడు బోధిస్తున్నాను. నా దారికి సంబంధించిన ప్రామాణికగ్రంధాలకు ఈ 'కరోనా' సమయంలో వ్యాఖ్యానం వ్రాశాను.  గత పదేళ్లలో ఎన్నడూ వ్రాయనన్ని పుస్తకాలను 2020 లో వ్రాయడం జరిగింది.

అవి -

1. మహాస్మృతిప్రస్థానసూత్రము

2. Journey to Infinite Mindfulness 

3. Medical Astrology (/With One hundred case studies)

4. యోగకుండలినీ ఉపనిషత్

5. యోగతారావళి 

6. శాండిల్యోపనిషత్ 

7. యోగతత్త్వోపనిషత్ 

8. నాదబిందూపనిషత్ 

9. యోగశిఖోపనిషత్

10. ధ్యానబిందూపనిషత్ 

11. గోరక్ష సంహిత 

12. వరాహోపనిషత్

13. సిద్ధసిద్ధాన్త పధ్ధతి

14. ఆరు యోగోపనిషత్తులు

(హంస, అమృతబిందు, అమృతనాద, మండలబ్రాహ్మణ, త్రిశిఖిబ్రాహ్మణ, బ్రహ్మవిద్య   ఉపనిషత్తులు)

15. యోగయాజ్ఞవల్క్యము 

16. వైద్యజ్యోతిష్యం - మొదటి భాగం (నూరు ఉదాహరణ జాతకములతో)

17. పతంజలి మహర్షి విరచిత యోగసూత్రములు

18. Yoga Sutras of Sage Patanjali

19. Yoga Taravali

20. Musings (360 insightful articles on our Spiritual Path)

పంచవటి సంస్కరణ

నవంబర్ వరకూ మా పుస్తకాలు (ఈ బుక్స్  కానీ, ప్రింట్ బుక్స్ కానీ), pustakam. org అనే సైట్ నుంచి లభించేవి. ఆ సైట్ అర్ధాంతరంగా మూతపడటంతో ఆ ప్రాసెస్ అంతటినీ మళ్ళీ మార్చవలసి వచ్చింది. పంచవటి సభ్యులందరి సహకారంతో ఆ పనిని అతి తక్కువకాలంలో పూర్తిచేసి  మా ఈ బుక్స్ ని google play books ద్వారాను, ప్రింట్ బుక్స్ ని Amazon ద్వారాను అందించగలిగాం. దీనికొరకు చక్కని టీమ్ వర్క్ చేసిన శిష్యులనందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ప్రతి ఎదురుదెబ్బనూ ఒక మెట్టుగా మలచుకొని ఇంకా ఎత్తుకు ఎక్కాలనే నా సూత్రాన్ని ఈ విధంగా ఆచరణలో పెట్టాం.

Satya Jyotish అనే జ్యోతిష్య సాఫ్ట్ వేర్ మాత్రం ఆపివేస్తున్నాం.  ఇప్పటికే అనేక  సాఫ్ట్ వేర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. We don't want to reinvent the wheel. కనుక దానిని మళ్ళీ తయారుచేయడం జరుగదు.

పంచవటిలో కొత్త సెక్రటరీలను, కొత్తకమిటీని ఎన్నుకోవడం జరిగింది. తత్ఫలితంగా ఇప్పటివరకూ ఆగిపోయి ఉన్న పనులు శరవేగంతో ముందుకు కదులుతున్నాయి.

'పంచవటి' అనేది ఎంతో నిజాయితీతో, శ్రద్ధతో నాతో నడిచేవారికోసమే గాని, తద్విరుద్ధమైన నడవడికలు గలవారికోసం కాదని మళ్ళీ మనవిచేస్తున్నాను. నాకు రాశి కంటే వాసి ముఖ్యం. మందికంటే మనసు ముఖ్యం. సరియైన మనస్సున్నవాళ్ళు ఒక్కరైనా నాకు చాలు.

ప్రక్షాళన 

అందుకని, చాలాకాలంగా మౌనంగా  ఉన్నవారిని, నా మార్గంలో సాధన చెయ్యనివారిని,  నా భావాలను అందుకోలేక, ఆచరించలేక, విముఖులుగా ఉన్నవారిని, సరదాగా చేరిన ప్రేక్షకులను, మానసికస్థిరత్వం లేనివారిని, పంచవటిలో నుంచి తొలగించడం జరిగింది. మరికొందరు వారంతట వారే నిష్క్రమించారు. వారెవ్వరినీ తిరిగి వెనక్కు తీసుకోవడం జరిగేపని కాదని బ్లాగుముఖంగా తెలియజేస్తున్నాను.

శాపాన్ని వరంగా మార్చుకోవడం

>కరోనా బయటకు రానివ్వకపోతే 20  పైగా పుస్తకాలను వ్రాశాను.

>పంచవటిలో ఎదురైన అడ్డంకులను కలసికట్టుగా అధిగమించాం.

>ఇష్టంలేనివారిని పంచవటి నుంచి తొలగించడం ద్వారా బరువు తగ్గించుకున్నాం. తద్వారా ఇంకా వేగంగా ముందుకు పోగలుగుతున్నాం.

>నిజాయితీ ఉన్నవారిని మాత్రమే నాతో ఉండనివ్వడం ద్వారా పైస్థాయికి చెందిన యోగరహస్యాలను వారికి బోధించి, యోగంలోని ఉన్నతస్థాయిలలో వారిని నడిపించగలుగుతున్నాను.

నేను చేస్తున్నదానినే చెబుతున్నాను. చెప్పినదానిని చేసి చూపిస్తున్నాను. ఈ కోణంలో చూచినపుడు, 'శాపాన్ని వరంగా ఎలా మార్చుకోవాలి?' అనే నా సూత్రం 2020 లో ఈ విధంగా అన్నిరకాలుగా సాకారమైంది.