నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

6, జనవరి 2021, బుధవారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (తిరుగుప్రయాణం - రామతీర్ధం కబుర్లు)

జనవరి ఒకటో తేదీ పొద్దున్నే లేచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. ఉదయం ఎనిమిదికిన్నరకి గోండియాలో బయల్దేరి పదిన్నరకు నాగపూర్ చేరుకున్నాం. అక్కడ ఇంకో రైలు మారి అందులో సెటిలయ్యాక, సహచరులలో ఒకాయన చాలా ఆవేశపడుతూ మాటలు మొదలు పెట్టాడు.

'సార్ !  న్యూస్ చూచారా? రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేశారట. విగ్రహం తల దగ్గర్లోనే ఉన్న చెరువులో దొరికిందట' అన్నాడు.

గతంలో నేను విజయనగరం వెళ్ళినపుడు రామతీర్ధం ఆలయాన్ని దర్శించాను. అందుకని ఆ ఆలయం నాకు గుర్తుంది.

'ఎప్పుడు జరిగింది/?' అడిగాను.

'మూడ్రోజులైంది'

'గురువు నీచస్థితిలో ఉన్నపుడు ఇలాంటివి జరగక ఇంకేం జరుగుతాయి? మతపరమైన గొడవలు, సంఘటనలు జరుగుతాయని ముందే అనుకున్నాం కదా. జరుగుతున్నాయి' అన్నాను.

'దారుణం సార్ ! ఎవరూ మాట్లాడటం లేదు' అని బాధపడ్డాడు.

'ఎవరూ అంటే?' అడిగాను.

'అంటే, నాయకులు గాని, స్వామీజీలు గాని' అన్నాడు.

'మాట్లాడరు. అదంతే. అందరికీ కావలసింది డబ్బు అధికారం మాత్రమే. దేవుడు ఎవరికీ అక్కర్లేదని నేనెప్పటినుంచో చెబుతున్నాను. దేవుడనేది మనిషి ఆడుతున్న ఒక నాటకం. అవసరం మేరకు వాడిని వాడుకుంటారు. తర్వాత అంతే, వదిలేస్తారు. అవసరమే అసలైన దేవుడని మహనీయులు ఎప్పుడో చెప్పారు. గురువు ప్రస్తుతం నీచస్థితిలో ఉన్నాడు. గురువులూ అంతే ఉన్నారు. ఇంకేం జరుగుతుంది ఇంతకన్నా?' అన్నాను.

'మరీ ఇంత ఘోరమా?' అంటూ చాలాసేపు వాపోతూ వచ్చాడు సహచరుడు.

'చూడు నాయన. ఆంధ్రా తెలంగాణాలు విడిపోయినప్పుడే చెప్పా, ఆంధ్రా పని అయిపోయిందని. అప్పుడే ఏమైంది? ఇంకొక్క ఐదేళ్లు ఆగు. ఆంధ్రా పరిస్థితి  ఎలా ఉంటుందో చూద్దువుగాని. రాముడంటే ధర్మానికి ప్రతిరూపం. ధర్మదేవత.  అలాంటి రాముడి విగ్రహం ధ్వంసం అయిందంటే ఆ రాష్ట్రానికి అది మంచికి కాదు. ఆంధ్రా పాడైపోతుంది. దానికే ఇవి సూచనలు' అన్నాను.

'ఏ విధంగా నాశనం అవుతుంది?' అడిగాడు.

'ఏముంది? కరోనా లాంటి వైరస్ చాలదా? భూమ్మీద ఉన్న కోటానుకోట్ల వైరస్ లలో కరోనా చాలా చిన్నది. నిజం చెప్పాలంటే, వైరస్ ల మధ్యన మనం బ్రతుకుతున్నాం. అవి మన  బయటా ఉన్నాయి. మన లోపలా ఉన్నాయి. అంతటా ఉన్నాయి. అందులో ఒకటి కళ్ళు తెరిచిందంటే చాలు. లక్షలలో జనం రాలిపోతారు. అహంకారం, మదం తలకెక్కితే అదే జరుగుతుంది. అన్నీ తన చేతుల్లో ఉన్నాయని మనిషి అనుకుంటాడు. కానీ అది నిజంకాదు. జస్ట్ వెయిట్ అండ్ సీ' అన్నాను.

'కానీ ధర్మరక్షకులైన గురువులు స్వామీజీలు కిమ్మనకుండా ఉండటం బాధగా ఉంది' అన్నాడు.

నవ్వాను.

'వాళ్ళెక్కడున్నారసలు? ఈ స్వామీజీలందరూ ఏదో ఒక నాయకుడికి ఏజంట్లు. లేదా బాగా డబ్బున్న వ్యాపారస్తుల ఏజంట్లు. నాయకుల వ్యాపారాలు నాయకులవి. స్వాముల వ్యాపారాలు స్వాములవి. దేవుడెలా పోతే వారికెందుకు? వాళ్ళ పైరవీలు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ధర్మరక్షకులని అనుకోవడం మన భ్రమ' అన్నాను.

'అంతేనా? మనమేం చేయలేమా?' ఆక్రోశించాడు.

'ముందు నీ కులాన్ని దాటి ఆలోచించు. నీది ఫలానా కులం కదా. ఆ కులపు నాయకుడి పార్టీ అంటే నీకిష్టం. వాడు చేసేది మంచైనా చెడైనా నీనకవసరం. మనోడైతే చాలు నీకు. ఇదే ఆంధ్రాకు పట్టిన దరిద్రం. కులం, డబ్బు, అవినీతి, ఏదో రకంగా అధికారంలో ఉండాలి - ఈ నాలుగే ఆంధ్రా సర్వనాశనం కావడానికి కారణాలు. హిందువులలో ఐకమత్యం మొదట్నుంచీ లేదు. ఉంటే, వెయ్యేళ్లపాటు ప్రపంచంలోని ప్రతిజాతీ వచ్చి మనల్నెలా దోచుకుంటారు? మనలోనే కొంతమంది దొంగలున్నారు. స్వలాభం కోసం మన గుట్లు బయటివాళ్లకు చెప్పిన ద్రోహులు మనలోనే ఉన్నారు. నేడు వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువైంది. వాళ్లకు స్వలాభమే ముఖ్యం. దేశం ఏమైపోయినా వారికనవసరం.  ఈలోపల విదేశీమతాలైన క్రైస్తవం, ఇస్లాంల జాతరొకటి. మన సమాజంలోని లొసుగులను వాడుకుని వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు.  మనవాళ్లకు ధర్మనిష్ఠ చాలాచాలా తక్కువ. డబ్బుకు తేలికగా అమ్ముడుపోతారు. మతం మారుతారు. దీనిని అడ్డుకోవాల్సిన స్వామీజీలు చేతగానివాళ్ళయ్యారు. పంచాయితీలు, పైరవీలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కలియుగమంటే ఇదే. ముందుముందు ఇది ఇంకా ఘోరం అవుతుంది. ముందుముందు కొన్నికొన్ని రాష్ట్రాలకు రాష్ట్రాలే మతాలు మారిపోతాయి, సెవన్ సిస్టర్స్ లాగా. అపుడు సివిల్ వార్ తప్పదు. ఈ సంగతి నేను చెప్పడం లేదు. మేధావులకందరికీ ఈ విషయం తెలుసు. 32 ఏళ్ళక్రితం ఒక ఐఏఎస్ మేధావి నాతో ఈ మాటన్నాడు' అన్నాను.

'మనమేం చేయలేమా?' మళ్ళీ అడిగాడు.

'చెయ్యగలం. నేనిలా బెర్తుమీద పడుకునే ఉంటాను. నువ్వు మాత్రం రైల్లోంచి దూకు. ప్రస్తుతానికి మనం చెయ్యగలిగిన పని ఇదే' అన్నాను నవ్వుతూ.

'ఈ టైం లో  కూడా మీ జోకులేంటి సార్ ?' అన్నాడు

'మరేం చేయమంటావ్ చెప్పు? ప్రజలూ, నాయకులూ, స్వామీజీలూ అందరూ దొంగలైతే మనమేం చేయగలం చెప్పు' అన్నాను.

'ఏదో ఒకటిచెయ్యాలి కదా?'  వదిలేటట్టు లేడు.

వదలకుండా రెట్టిస్తుంటే నాకు మండింది.

'ఏంటి చేసేది? అది లా అండ్ ఆర్డర్ సమస్య. పట్టుకోడానికి పోలీసులున్నారు. వారిపైన అధికారులున్నారు. ప్రజలెన్నుకున్న నాయకులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. రాజ్యాంగం ఉంది. సెంటర్లో 'జై శ్రీరామ్' అనే ప్రభుత్వం ఉంది. వాళ్ళెవరూ మాట్లాడకపోతే చైతన్యం లేని స్వార్ధపరుడైన సామాన్యుడు ఏం చెయ్యగలడు చెప్పు' అడిగాను.

'ఏంటో ఏమీ అర్ధం కావడంలేదు. నేనూ ఇవాళే చూచాను న్యూస్. మూడ్రోజులనుంచీ  మన తిరుగుడులో పడి ఏం జరుగుతోందో తెలీడం లేదు' అని వాపోయాడు.

'నువ్వు చాలా నయం. నేను చూడు. పేపర్ చదవను. టీవీ చూడను. మొబైల్ న్యూస్ చూడను. ప్రపంచం ఏమైపోయినా పట్టించుకోను. ఇప్పుడు కూడా నువ్వు చెబితేనే కదా నాకు తెలిసింది? ఒక విషయం చెబుతా విను. ముందు తెలిసినా, వెనుక తెలిసినా నువ్వేమీ చెయ్యలేవు. కాలం ఒక్కటే దీనిని పరిష్కారం చేయగలుగుతుంది. సమాజం అంతలా కుళ్లిపోయింది. అధర్మం పెరిగినప్పుడు ప్రజలైనా పాలకులైనా వేటు పడుతుంది.

హిందువులు విగ్రహారాధకులని అందరూ అనుకుంటారు. అది తప్పు. దైవం  విగ్రహానికి పరిమితం కాడని వారికి బాగా తెలుసు. దైవం సర్వాంతర్యామి అని కూడా వారికి తెలుసు. అంతటా ఉన్న దేవుడినే విగ్రహంలో చూస్తారు. విగ్రహమనేది ఒక ఆధారం. అంతేగాని, అదే దేవుడు కాదని వారికి తెలుసు. విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ద్వారా వారిని కొంత కలత పెట్టవచ్చు. కానీ హిందూమతాన్ని గాని, ధర్మాన్ని గాని నాశనం చెయ్యడం సాధ్యం కాదు. క్రైస్తవం, ఇస్లామ్ నిన్నగాక మొన్న పుట్టిన పిల్లమతాలు. మనం పోన్లే అని రానిస్తే ఇప్పుడవి పాలుత్రాగిన రొమ్మునే గుద్దుతున్నాయి. ఇలాంటి పనులవల్ల హిందూమతానికి ఎలాంటి హానీ జరుగదు. హిందూమతాన్ని లేకుండా చేస్తామని బీరాలు పలికిన ఔరంగజేబులాంటివాళ్లే ఈ మట్టిలో కలసిపోయారు. ఇది సనాతనధర్మం. దీనికేమీ కాదు. కంగారుపడకు.

కాకుంటే ఒకటి. ఇంకొక నూరేళ్లు బీజేపీ ప్రభుత్వమే ఈ దేశాన్ని పాలించాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇంకోమాట విను. ఆంధ్రాలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినపుడు మాత్రమే ఇలాంటి దౌర్జన్యాలు మోసాలు అంతమౌతాయి. అంతవరకూ న్యూస్ చూసుకుంటూ ఉండటం తప్ప నువ్వేమీ చెయ్యలేవు. ఎక్కువ ఆవేశపడకు. నన్ను విసిగించకు. భోజనం వస్తే లేపు. అప్పుడు లేస్తాను' అని చెప్పి నిద్రకుపక్రమించాను.

సహచరుడు మొబైల్లో తలదూర్చాడు.

కం || మనుజుడు ధర్మము మరచిన 

కనివిని ఎరుగంగనట్టి కష్టము లెదురౌ

ఘనకలి ముదురుట ఇదియే

వినబోవరు మూర్ఖులెపుడు విజ్ఞుల మాటల్ !


కం || ధర్మము వీడిన లోకము

కర్మలలో జిక్కుకొనుచు కళదప్పునుగా 

మర్మముగా జేయు దొసగు

ఖర్మై వెంటాడు విధము గాంచర సత్యా !

అనిన పద్యములు ఆశువుగా నా నోటివెంట పలికాయి.

రైలు పోతూ ఉంది. మాకు వేరే పనేముంటుంది? ఆ రోజంతా అలాంటి చర్చలలోను, వేళకు తిని  పడుకోవడంలోను గడిచింది. రాత్రి తొమ్మిదికి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. దిగి ఎవరిళ్ళకు వాళ్ళం చేరుకున్నాం.

జై శ్రీరామ్ !

(అయిపోయింది)