Pages - Menu

Pages

24, జనవరి 2021, ఆదివారం

కొందరు

భయంతో కొందరు బాధతో కొందరు 

కుళ్లుతో కొందరు కుట్రతో కొందరు 

నన్ననుసరించేవారే అందరూ 

ప్రేమతో కొందరు పెంకితనంతో కొందరు


విప్పారిన కళ్ళతో కొందరు

విరబూసిన మనసుతో కొందరు

నను చూస్తూనే ఉంటారందరూ 

విసుగుతో కొందరు విరక్తితో కొందరు


వాదనతో కొందరు వేధిస్తూ కొందరు

సాధిస్తూ కొందరు రోదిస్తూ కొందరు

నాతోనే ఉంటారందరూ

మౌనంగా కొందరు మమేకమై కొందరు


కయ్యాలతో కొందరు కలహాలతో కొందరు

నెయ్యంతో కొందరు నేర్పరులై కొందరు

నాతో జీవించేవారే అందరూ 

నవ్వుతూ కొందరు నాటకాలతో కొందరు


కుతూహలంతో కొందరు కుళ్ళుమనసుతో కొందరు

నేర్చుకోవాలని కొందరు నేర్పించాలని కొందరు

నాతో నడిచేవారే అందరూ

వెనుకగా కొందరు  వెన్నుపోట్లతో కొందరు


అహంతో కొందరు అతిశయంతో కొందరు 

అమాయకంగా కొందరు ఆడంబరంగా కొందరు

నను  చేరవచ్చేవారే అందరూ

నవ్వుతూ కొందరు నటిస్తూ కొందరు


అలిగేవారు కొందరు అల్లాడేవారు కొందరు

ఆట్లాడేవారు కొందరు పోట్లాడేవారు కొందరు

నాతోనే ఆడుకుంటారందరూ

మానవుల్లా కొందరు మరోరకంగా కొందరు


దగ్గరగా కొందరు దూరంగా కొందరు

మనసులో కొందరు మాటల్లో కొందరు

నను వీడిపోలేరెవ్వరూ

పోషిస్తూ కొందరు ద్వేషిస్తూ కొందరు...