Pages - Menu

Pages

11, ఫిబ్రవరి 2021, గురువారం

షష్ఠగ్రహ కూటమి

ఈ రోజు అమావాస్య .

దీనికితోడుగా  మకరరాశిలో షష్టగ్రహకూటమి జరుగుతున్నది. మకరరాశిలో ఆరుగ్రహాలున్నాయి.  అవి -  సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, నీచగురువు, శని.

వీరిలో గురుశుక్రులిద్దరూ ఒకే డిగ్రీ మీదున్నారు. బుధ చంద్రులిద్దరూ ఒకే డిగ్రీ మీదున్నారు. అపసవ్యపు పోకడలు, కుటుంబాలలో, అయినవాళ్ల మధ్యన కీచులాటలు,  గొడవలను ఈ గ్రహస్థితి సూచిస్తున్నది.

ఈ ప్రభావం వల్ల అనేకమంది జీవితాలు ఈ సమయంలో అతలాకుతలం అవుతాయి.చిన్నాపెద్దా కష్టనష్టాలనుంచి, మనుషులు హఠాత్తుగా  చనిపోవడం వరకూ అన్ని స్థాయిలలోనూ మనుషులు అనేక విపత్తుల నెదుర్కొంటారు.

మానసిక సమస్యలు ఎక్కువౌతాయి. గొడవలౌతాయి. దీర్ఘరోగాలతో బాధపడుతున్నవారు పరలోక ప్రయాణమౌతారు. యాక్సిడెంట్లు జరుగుతాయి. ఇవన్నీ గత రెండు రోజులనుంచి మొదలయ్యాయి. ఇంకా రెండు రోజులుంటాయి. 

ఈ షష్టగ్రహకూటమి వల్ల బాగా దెబ్బతినేవారు ఎవరంటే -

మిథునరాశి/ లగ్నం వారు - వీరికి దీని దెబ్బ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, వారికి అష్టమంలో ఈ కూటమి ఏర్పడుతున్నది గనుక. వీరికి నష్టం, కష్టం క్కువగా ఉంటుంది. త్రిప్పట అధికంగా ఉంటుంది. కష్టం  ఎక్కువ ఫలితం తక్కువ. చిన్న పనికి కూడా ఎక్కువ కష్టపడవలసి వస్తుంది.

తులారాశి/ లగ్నం వారు - వీరికి చతుర్దంలో ఈ కూటమి ఏర్పడుతున్నది. అందుకని వారికి ఇంటిలో, చదువులో సమస్యలు ఎక్కువౌతాయి. మానసికంగా టెన్షన్లతో నలిగిపోతారు.

మేషరాశి/ లగ్నం వారు - వీరికి దశమంలో ఈ కూటమి ఏర్పడుతునందున వీరికి వృత్తిపరంగా టెన్షన్ ఎక్కువౌతుంది. కొంతమంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. పనివత్తిడి బాగా ఇబ్బంది పెడుతుంది. 

మీనరాశి/ లగ్నం వారు - వీరికి దీర్ఘరోగాలు తలెత్తి బాధలు పెడతాయి. వీరి స్నేహితులు, అన్నలు, అక్కలు గతిస్తారు. లేదా నానాబాధలు వారిని చుట్టుముడతాయి. 

ధనూరాశి/ లగ్నం వారు - వీరికి కుటుంబపరంగా చాలా చిక్కులు సమస్యలు, త్రిప్పట ఎదురౌతాయి. డబ్బులు పోగొట్టుకుంటారు. నష్టాలు ఎదురౌతాయి.

కర్కాటక రాశి/ లగ్నం వారు - వీరికి సప్తమంలో ఇది ఏర్పడుతున్నది. కనుక, ఉద్యోగంలో పని వత్తిడి ఎక్కువౌతుంది. మానసిక చింత ఎక్కువౌతుంది. పార్ట్ నర్లతో గొడవలొస్తాయి. అన్నీ ఎదురౌతుంటాయి.

కన్యా రాశి/ లగ్నం వారు - వీరికి మానసిక చింత, డిప్రెషన్ ఎక్కువగా ఉంటాయి. సంతానం వల్ల చాలా బాధలు ఎదురౌతాయి. షేర్ మార్కెట్లో నష్టాలొస్తాయి.

కుంభరాశి/ లగ్నం వారు - వీరికి యాక్సిడెంట్లు అవుతాయి. లేదా దీర్ఘరోగాలు తలెత్తుతాయి. ఆస్పత్రిలో చేరవలసి వస్తుంది. డాక్టర్ల చుట్టూ, క్లినికల్ ల్యాబ్ ల చుట్టూ తిరగవలసి వస్తుంది. 

అంతా చెడేనా అంటూ భయపడకండి ! మంచీ చెడూ అనేవి సాపేక్షాలు. ఎక్కువా తక్కువా అంతే. కాలచక్ర పరిభ్రమణంలో రెండూ కలిసే తిరుగుతూ  ఉంటాయి. మకర, వృషభ, కన్యా, తులా లగ్నాలవారికి చెడుతోబాటు ఇదే సమయంలో మంచి కూడా జరుగుతుంది.

ఈ ఫలితాలన్నీ ఈ అయిదు రోజులలోనే జరుగుతాయి. మీ చేతుల్లో లేనివాటి విషయంలో మీరేమీ చెయ్యలేరు. కనీసం అలా ఉన్నవాటి విషయంలోనైనా కాస్త గమనించుకుని జాగ్రత్తపడండి మరి !