ఆ || బూలుబాబు యొకడు బురదలో బడవేసె
కూలిబాబు జేరి కూతబెట్టె
గాలిబాబు మిగుల గగ్గోలు బుట్టించె
పాగలింటి పేరు పానశాల 1
ఆ || బక్కపలచ బాబు బలశాలి ఎంతైన
ముక్కుమూసుకొనక మురిపెమేల?
తుక్కుగాదె ఇల్లు తుమ్మ యూడెడి ముక్కు
పాగలింటి పేరు పానశాల 2
ఆ || రొప్పుజీవికేమొ రొక్కంబు హెచ్చాయె
పప్పుజీవికేమొ పంటపండె
నిప్పుజీవి మిగుల నిర్ఘాంతపోయెరా
పాగలింటి పేరు పానశాల 3
ఆ || గోలబాబు లేచి గోంగూర పప్పొండె
జోలబాబు జేరి ఈలవేసె
పీలబాబు కేమొ పిచ్చెక్కి పోయెరా
పాగలింటి పేరు పానశాల 4
ఆ || రాజుబాబు కేమొ రంభలే యగుపించె
గాజుబాబు కేమొ ఘనత దక్కె
బూజుబాబు కేమొ బుర్రపాడైపోయె
పాగలింటి పేరు పానశాల 5
ఆ || ముక్కబాబు కేల మూడుపొద్దుల గోల
బక్కబాబుకేల బయటిగోల
పాగలింటి పేరు పానశాల 6
ఆ || పాడుబాబు కేమొ పావలా కాసంట
మాడుబాబు కేమొ మండు మంట
తాడుబాబు కెపుడు తద్దినపు గోలంట
పాగలింటి పేరు పానశాల 7
ఆ || నక్కబాబు కేమొ నక్షత్రమగుపించె
నాగబాబు కేమొ నడ్డివిరిగె
లెక్కబాబు కేమొ డొక్కలో పోటాయె
పాగలింటి పేరు పానశాల 8
ఆ || కొంగబాబు కేమొ కోటప్ప కొండాయె
బుంగబాబు కేమొ బుర్రబగిలె
బెంగబాబు కిచట బేవార్సు పనిదక్కె
పాగలింటి పేరు పానశాల 9
ఆ || అమ్మబాబు యనగ అర్ధంబు గాబోదు
తుమ్మబాబు కేమొ దూరరాదు
కొమ్మబాబు కెపుడు కోతికొమ్మచ్చిరా
పాగలింటి పేరు పానశాల 10
ఆ || శకునిమామ కేమొ శక్కర్ల చాయంట
కిచెనుభామ కేమొ కీసరంట
దోరజామ కేమొ దొరగారి కొలువంట
పాగలింటి పేరు పానశాల 11
ఆ || పాటగత్తె జేసె పైపైని యత్నాలు
ఆటగత్తె బడియె అడుసునందు
మోటుగత్తె కేమొ మోకాళ్ళ నొప్పిరా
పాగలింటి పేరు పానశాల 12
ఆ || చీట్లపేకలమ్మ చిత్రాలనే జూచె
కాట్లకుక్కలమ్మ కాలుజారె
పోట్లగిత్త లమ్మ పొద్దేల గుంకెరా
పాగలింటి పేరు పానశాల 13
ఆ || ఆలిచాటు బాబు అర్భకుండై పోయె
పాలికాపుబాబు పక్కదడిపె
జాలిగొల్పు బాబు జందెమ్ము నేసెరా
పాగలింటి పేరు పానశాల 14
ఆ || అక్కబాబు కేమొ లెక్కలే తప్పాయె
చుక్కబాబు వచ్చె స్కూలు ఫస్టు
కుక్కిబాబు లేచి కుప్పించి దూకెరా
పాగలింటి పేరు పానశాల 15
ఆ || వీరబాబుకేమొ విస్తర్లు గరువాయె
బోరబాబు కేమొ బొచ్చు యూడె
పారబాబు కెపుడు పనిదప్పకుండెరా
పాగలింటి పేరు పానశాల 16
ఆ || లైటుబాబుకేమొ లైకుల్లు పెచ్చాయె
ఫైటుబాబుకేమొ సైటు బెఱిగె
కైటుబాబు కెపుడు కైపెక్కి యుండురా
పాగలింటి పేరు పానశాల 17
ఆ || చార్టు జూచు బాబు చాలించు కొనెనంత
పార్టు మార్చు బాబు పక్కవేసె
ఆర్టు దెలియకున్న అర్ధంబు మారురా
పాగలింటి పేరు పానశాల 18
ఆ || తాగుబోతు బాబు తంటాలు బడసాగె
తందనాల బాబు తడిసిపోయె
సాగుబోతు బాబు సరదాలు మానేసె
పాగలింటి పేరు పానశాల 19
ఆ || ఆడగాలి బాబు అగచాట్లలో గూలె
సోడదాగు బాబు సొమ్మసిల్లె
పేడపురుగు బాబు పేట్రేగిపోయెరా
పాగలింటి పేరు పానశాల 20
ఆ || చింతపండు బాబు చీకాకులో జిక్కె
బోడిగుండు బాబు వేడి తగ్గె
రామదండు బాబు రాజ్యాల నేలురా
పాగలింటి పేరు పానశాల 21
ఆ || ఓరుగల్లు బాబు ఓర్పులే నశియించె
పోరుగల్లు పాప పొంగిపోయె
గుంటకల్లు గుంట గుఱ్ఱమ్ము లెక్కెరా
పాగలింటి పేరు పానశాల 22
ఆ || ముద్దులొలుకు పాప ముక్కాలి పీటెక్కె
బొద్దుపాప వినక బోర్లబడియె
హద్దుమీరు పాప హైరాన బడునురా
పాగలింటి పేరు పానశాల 23
ఆ || మందుమాకు పాప మనమాట వినదాయె
ఆశపోతు పాప అల్లరాయె
ముక్కుజూచుపాప మునుగీత వేసెరా
పాగలింటి పేరు పానశాల 24
ఆ || బక్కపీచుపాప భయమెంతొ బుట్టించె
కుక్కమూతి పాప కుదురుదప్పె
లెక్కలేనిపాప లేటైన ఫ్లైటురా
పాగలింటి పేరు పానశాల 25
ఆ || తిరుగుబోతు పాప తిట్లకే లంకించె
వదరుబోతు పాప వాగెనెపుడు
పరుగుదీయు పాప పనిలేనిదాయెరా
పాగలింటి పేరు పానశాల 26
ఆ || అస్థిపంజరమ్ము అగచాట్ల పాలాయె
కుస్తి పాపకేమొ కుళ్లుబుట్టె
పస్తులుండు పాప పర్వతంబాయెరా
పాగలింటి పేరు పానశాల 27
ఆ || పొగరుబోతు పాప పోగొట్టుకొనెనంత
విగరు లేని పాప విర్రవీగె
అగరుబత్తి పాప అడుసులో కాలేసె
పాగలింటి పేరు పానశాల 28
ఆ || లిప్పుస్టిక్కు పాప లీలల్లు జూపించె
పెత్తనాల పాప ఫేటు మారె
పూజపిచ్చి పాప బూజుల్ల బడిపోయె
పాగలింటి పేరు పానశాల 29
ఆ || పుల్లకూర పాప మెల్లకన్నై పోయె
తోటకూర పాప తొండిజేసె
బచ్చలాకు పాప బంతిలా గెంతెరా
పాగలింటి పేరు పానశాల 30
ఆ || ఓర్పులేనిపాప ఓదార్పు గనదాయె
తీర్పుదీర్చు పాప తిక్కదాయె
మార్పులేని పాప మర్రిచెట్టై పోయె
పాగలింటి పేరు పానశాల 31
ఆ || గిల్టుపాప కేమొ గిజగిజల్ పెచ్చాయె
బెల్టుపాప లేచి బేరుమనియె
కల్టు పాప జూడ కడగండ్ల పాలాయె
పాగలింటి పేరు పానశాల 32
ఆ || నేర్పబోవు పాప నెమ్మదిన్ గోల్పోయె
కూర్చబోవు పాప కుళ్ళిపోయె
వార్చబోవు పాప వంటింట్ల బడిపోయె
పాగలింటి పేరు పానశాల 33
ఆ || రాతపాప కందె రత్నాల పెనుగొండ
పీతపాప జూడ పిచ్చిదాయె
లేతపాప యొకటి లేడియై వచ్చెరా
పాగలింటి పేరు పానశాల 34
ఆ || రత్నపాప కేమొ రంగురాళ్లే దక్కె
ముత్యపాప కందె ముద్దులెన్నొ
వెండిపాప కేమొ వేషాలు పెచ్చాయె
పసిడి పాపకొచ్చె పంటినొప్పి 35
ఆ || బుజ్జిపాప యొకటి బుక్కులే భోంచేసె
మజ్జుపాప మంచి మాటలాడె
ఫ్రిజ్జు పాప లేచి ఫ్రీ ప్రేమ బంచెరా
పాగలింటి పేరు పానశాల 36
ఆ || గుర్తులేనిపాప గుండెల్ల కొలువాయె
మంచిమనసు పాప మనసు నిండె
పిచ్చిప్రేమ పాప పిలువంగఁ బల్కురా
పాగలింటి పేరు పానశాల 37
ఆ || గోరుముద్ద లొసఁగె గోదారి వలరాణి
ఊయలూచె కృష్ణ ఊపిరూది
పెన్న పక్కనుండి పెంపుజేకూర్చెరా
పాగలింటి పేరు పానశాల 38
ఆ || పేరు పానశాల పెద్దదౌ మధుశాల
మధువు చిందునెపుడు మనసు నిండి
త్రాగకున్నవాడు తంటాల బడునురా
పాగలింటి పేరు పానశాల 39
ఆ || బోర విరచువారు బొకబోర్ల బడియేరు
విర్రవీగువారి బుర్రబగులు
పాగలింటి పేరు పానశాల 40
ఆ || త్రాగినంత త్రాగు తడబాటు లేకుండ
రొక్కమడుగ రెవరు; రోషపడరు;
మంచిమనసు యున్న మాకదే చాలంద్రు
పాగలింటి పేరు పానశాల 41
ఆ || పానశాల గాని; పాఠశాలల మిన్న
మడియు తడియు లేవు; మచ్చ లేదు
కుళ్ళు కుమ్ము లేని కుదురైన మధుశాల
పాగలింటి పేరు పానశాల 42
ఆ || పంతులెవడు లేడు పాఠాలు పదివేలు
నేర్పువాడు లేడు నేతి చవులు
దిద్దువాడు లేడు దినమంత దిట్లురా
పాగలింటి పేరు పానశాల 43
ఆ || చూచుచుండగానె చుక్కల్లు గనుపించు
వేచియుండగానె వేప బెరుఁగు
పాగలింటి పేరు పానశాల 44
ఆ || మధువు ఎక్కడుండు? మనకెట్లు దాపౌను?
మరుగు దెలియదెపుడు మనసు పడగ
కల్లుపాక గాదు కల్ల కల్లౌనురా
పాగలింటి పేరు పానశాల 45
ఆ || చెప్పరాని మత్తు; చేదైన సుధమత్తు
విప్పరాని గుట్టు వీడిపోవు
కుప్పగూలి ఇచట గూర్చుండ హాయిరా
పాగలింటి పేరు పానశాల 46
ఆ || పప్పుగాళ్ళ కెపుడు పట్టంగ రాబోదు
తుప్పు వదలగొట్టి తూకమేయు
మెప్పు గోరనట్టి మేలైన పాకరా
పాగలింటి పేరు పానశాల 47
ఆ || తాపి దాపనట్లు తాపించు మధుశాల
దోపి దోపనట్లు దోషమడపు
మోపుకున్నయంత మోక్షంబు నీదిరా
పాగలింటి పేరు పానశాల 48
ఆ || పాతపిచ్చివారి పాటైన మధుశాల
గొప్పవారలుండు గోప్యశాల
దొరకరాని మధువు దొరకేటి చోటురా
పాగలింటి పేరు పానశాల 49
ఆ || మధువు దాగు రాత మందిలో గనరాదు
అరుదుగానె యుండు నర్హతుండు
ఇచటి మధువు దొరుక నింతింత గాదురా
పాగలింటి పేరు పానశాల 50