అనగనగా ఒక టావోయిస్టు
తన గుహలోనుంచి బయటకు రాదు
ఎవరో ఏదో తెచ్చిస్తారు తింటుంది
ఎప్పుడూ తన ధ్యానంలో ఉంటుంది
అనగనగా ఒక మావోయిస్టు
బజారు వదిలి ఇంట్లోకి రాదు
ఎవరి పనిమీదో బయటే ఉంటుంది
ధ్యానం గీనం జాన్తానై అంటుంది
మావోయిస్టు దగ్గరొక టెర్రరిస్టు
వాళ్ళతోపాటే ఒక మూడిష్టు
టావోయిస్టు దగ్గర జర్నలిస్టు
వాళ్ళ సైన్యమొక పెద్ద లిస్టు
టావోయిస్టుకి సకలభక్తి స్వస్తి
మావోయిస్టుకి నకిలీభక్తి జాస్తి
టెర్రరిస్టుకెపుడూ లోకంతో కుస్తీ
జర్నలిస్టుకి మాత్రం జనంతో దోస్తీ
మూడిస్టు ఇంటిపేరు మాడా
అతన్ని చూసే పెట్టారు టాడా
మావోయిస్టుకి అతడొక ఘోడా
మనిషి మాత్రం మహాపెద్ద తేడా
మూడిష్టు నిజానికి పెద్ద శాడిష్టు
లోలోపల కుమిలిపోయే కోపిష్టు
పెద్దగా ఏదీ సాధించలేని లోపిష్టు
దాన్ని కప్పుకుంటూ వాగే వాగిష్టు
అందితే అదిలిస్తుంది టావోయిస్టు
అందర్నీ బెదిరిస్తుంది మావోయిస్టు
తెలివి తనదే నంటాడు టెర్రరిస్టు
జరిగింది నాదేనంటాడు జర్నలిస్టు
టావోయిస్టుకి తనివితీరదు
మావోయిస్టుకి మనసు మారదు
టెర్రరిస్టుకి తెలివి రాదు
జర్నలిస్టుకి జలుబు పోదు
మాడిష్టుకి మందు దొరకదు
మూడిస్టుకి మూర్ఛ విడదు
లోపిష్టుకి లొల్లి ఆగదు
కోపిష్టుకి కోర్కె చావదు
కాలం ఎవరి ఆగడాలనైనా
ఎన్నాళ్లు భరిస్తుంది చెప్పండి?
ఇదిలా ఉండగా ....
టావోయిస్టుకి తన్నులు మొదలయ్యాయి
మావోయిస్టు మంచం ఎక్కింది
టెర్రరిష్టుకి టెక్కు దిగిపోయింది
జర్నలిష్టుకి జాతర ఎక్కువైంది
మాడిష్టుకి మత్తు దిగింది
మూడిష్టుకి ముక్కు పగిలింది
శాడిష్టుకి శాస్తి జరిగింది
కోపిష్టుకి కోతబడింది
అందుకే నేనంటాను ...
ఒరే ఇష్టుల్లారా, మీకెందుకీ భ్రష్టు?
టావోయిజమైనా, మావోయిజమైనా
టెర్రరిజమైనా, కమ్యూనిజమైనా
జర్నలిజమైనా, బర్నలిజమైనా
మీది ఏ ఇజమైనా సరే
అన్ని ఇజాల్లోకీ ఈగోయిజం
చాలా చాలా చెడ్డది
ఈ రొష్టు తగ్గి సుష్టుగా ఉండేమార్గం చెప్పనా?
ఈగోయిజం వదలండి, హాయిగా బ్రతకండి
మనుషులని మనుషుల్లా చూడండి
మనుషులలో మనుషుల్లా బ్రతకండి
మనసులు విశాలం చేసుకోండి
మమతల ప్రకారం నడుచుకోండి
ఏమ్? రుచించడం లేదా? అయితే,
అనుభవించే కాలం ఇంకా ఉందన్నమాట
ముందుముందు ఎంతో ఉంది సిన్మా
మంచిమాట వినకపోతే మీ ఖర్మ !