Pages - Menu

Pages

19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఇంతే లోకం..

ఏవీ లేనప్పుడు కెవ్వుకెవ్వున ఏడవడం

అన్నీ ఉన్నప్పుడు కొవ్వుబట్టి పాడవడం

ఇంతే లోకం


కాలం అనువైతే కళ్ళు నెత్తికెళ్ళడం

కలసిరాకపోతుంటే కాళ్లుపట్టుకోవడం

ఇంతే లోకం


అవసరముంటే నక్కలా నటించడం

అవసరం తీరాక అసలు నువ్వెవరనడం

ఇంతే లోకం


అవకాశం లేనప్పుడు అతిగా మంచితనం

అవకాశం దొరికినపుడు అడ్డంగా దోచేయడం

ఇంతే లోకం


అన్నీ తెలుసన్న అహంకారంతో విర్రవీగడం

అంతా అయిపోయాక ఏడుస్తూ కుప్పకూలడం

ఇంతే లోకం


చేతిలో ఉన్నపుడు చిన్నచూపు చూడటం

చేయిజారిపోయాక చింతిస్తూ చేయిచాచడం

ఇంతే లోకం


సాయం అడిగినవారిని చీదరించుకోవడం

ప్రాయం అయిపోగానే బిక్కముఖం వెయ్యడం

ఇంతే లోకం


డబ్బు చూచుకొని దబదబా అడుగులేయడం 

జబ్బు చేయగానే దబ్బుమని పడిపోవడం

ఇంతే లోకం


తను గోతులు తీస్తూ అందరికీ నీతులు చెప్పడం

అదే గోతిలో తనే పడి మూతి పగిలిపోవడం

ఇంతే లోకం


మనీ పరుసు చూచుకొని తలబిరుసు పెంచుకోవడం

పరుసు పనికి రానప్పుడు పరుగు అందుకోవడం

ఇంతే లోకం


నోట్లకట్ట చూచుకోని నోరు పారేసుకోవడం

అందరూ దూరమయ్యాక అమ్మాబాబూ అనడం

ఇంతే లోకం


పిల్లల్ని గాలికొదిలి డబ్బువెంట తిరగడం

పిల్లలు పట్టించుకోనప్పుడు పిచ్చివాళ్ళై పోవడం

ఇంతే లోకం


ఎవరు తనవాళ్ళో తెలీక ఎక్కడెక్కడో తిరగడం

అయినవాళ్లు అరుదైతే అలమటించి పోవడం

ఇంతే లోకం


అన్నీ తెలుసనుకుంటూ బోర విరుచుకోవడం 

ఏమీ తెలీదని తెలిశాక కోరలూడిపోవడం

ఇంతే లోకం

 

పూజించవలసిన వారిని హేళనగా నవ్వడం

నేతిబీరకాయల్ని మాత్రం నెత్తికెత్తుకోవడం 

ఇంతే లోకం


భూమీ బంగారాల కోసం నానా గడ్డీ కరవడం 

చివరకు అదే భూమిలో మట్టిగా మారిపోవడం

ఇంతే లోకం

 

నేనే మొనగాణ్ణంటూ ఆగడాలు చేయడం

చివర్లో దిక్కులేక కుక్కచావు చావడం

ఇంతే లోకం