నిత్యజీవితంలో ప్రతిఫలించని జ్ఞానం నిరర్ధకం

21, ఫిబ్రవరి 2021, ఆదివారం

ప్రశ్నలు - జవాబులు

ఈ మధ్యలో కొంతమంది నన్నడిగిన ప్రశ్నలు నేనిచ్చిన జవాబులు ఇక్కడ చదువుకోండి.

1. హాయ్ ! మాది అప్పడాల వ్యాపారం. నేను ఆధ్యాత్మికంలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నాను. ఏ పుస్తకాలు చదవాలి?

జవాబు : ముందు ఎవరిని ఎలా సంబోధించాలో తెలుసుకో బాబు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని కాను 'హాయ్' అంటూ కులకడానికి. పుస్తకాలు చదివితే ఆధ్యాత్మికానికి దూరమౌతావు. నీలాంటివాడు ఆధ్యాత్మికమార్గంలో అడుగుపెట్టాలంటే కనీసం పదిహేను జన్మలెత్తవలసి ఉంటుంది. అప్పటిదాకా రోడ్లమీద అరుచుకుంటూ అప్పడాలమ్ముకో.

2. నా వయసు 20. నేను 'క్షుద్రవిద్య' మీద పుస్తకం వ్రాస్తున్నాను. మీ ప్రొఫైల్ చూశాను. మీ విద్యలు నాకు బాగా నచ్చాయి. మీరేమైనా మెటీరియల్ ఇవ్వగలరా?

జవాబు: ఓ యస్ అదెంతపని? రెండు దయ్యాల్నీ మూడు పిశాచాలనీ పంపిస్తాను. ఎలాంటి సాయం కావాలన్నా మొహమాటపడకుండా  చేస్తాయి. ఎలా కావాలో అడిగి మరీ చేయించుకో. ఒక ఇరవై లక్షలు పంపించు.

3. నా పేరు భైరవుడు. వయసు 55. ఉండేది హైదరాబాద్. జనాల  సమస్యలు తీర్చడానికి హోమాలు చేస్తుంటాను. కానీ ఈ మధ్యనే బాత్రూంలో కాలు జారి పడ్డాను. తుంటి ఎముక ఫ్రాక్చర్ అయింది. ఏ రెమెడీ చెయ్యమంటారు?

జవాబు: ఈ వయసులో కాలుజారావా? అయ్యో పాపం. ఇన్నాళ్లు నువ్వు చేసిన దొంగహోమాలకి శాస్తి ఈ విధంగా జరిగిందన్నమాట. అయినా నువ్వు పడాల్సింది కుడితి తొట్లో కదా బాత్రూంలోకి ఎందుకెళ్ళావు? సర్లే ఏదో ఒకటి. నీకు మామూలు హోమాలు పనిచేయవు. నీకు ఆత్మహోమమొక్కలే దారి. నువ్వే హోమగుండంలో నిలబడి, అంటించుకుని, ఆహుతైపో. జనానికి పీడా వదుల్తుంది.

4. హాయండి ! నా వయసు 52. నేను గ్రహాలను నమ్మను. ఎందుకంటే నేను ఆంజనేయస్వామికి వీరభక్తురాలిని. గ్రహాలు మా ఇంటి దరిదాపులకు కూడా రాలేవు. కానీ ఏంటో, ఈ మధ్య అన్నీ ఎదురు తిరుగుతున్నాయి. ఒబెసిటీ విపరీతంగా వచ్చేసింది. మోకాళ్ళు, గిలకలు తెగ నెప్పులు పుడుతున్నాయి. ఏం చెయ్యమంటారు?

జవాబు: అమ్మా పాపా! ఆంజనేయస్వామి పటం ఇంట్లో ఉన్నంతమాత్రాన ఆయన భక్తులైపోరు. ఆయన పక్కనున్న రాముడే అష్టకష్టాలు పడ్డాడు. ఎందుకలా జరిగింది మరి? తిండి తగ్గించు. ఎంతసేపూ నోటికే కాదు, కాస్త దేహానికి కూడా పనిచెప్పు. బరువు తగ్గు. భక్తితో ఆరోగ్యం రాదు. తిండి కంట్రోల్ చేసి, వ్యాయామం చెయ్యి. ఆంజనేయస్వామి పటానికి నైవేద్యాలు పెట్టి నువ్వు మెక్కడం కాదు. ఆయన ఫోటో ముందు గుంజీలు, దండాలు, బస్కీలు తియ్యి. సమస్య సాల్వ్ అవుతుంది.

5. ఎప్పుడో చనిపోయినవాళ్లు తెగ కలల్లోకి వస్తున్నారు. ఏం చెయ్యమంటారు?

జవాబు: నువ్వు కూడా అర్జంటుగా చచ్చిపోయి వాళ్లలో కలిసిపో. పీడా వదుల్తుంది. అప్పుడు మీరంతా కలసి నా కలల్లోకి వద్దురుగాని. సరేనా? బెస్ట్ ఆఫ్ లక్ ఇన్ యువర్ జర్నీ.

6.  మా పక్కింటి అబ్బాయి నాకు చాలా చాలా నచ్చాడు. కానీ సమస్యేమంటే అతనికి భార్య ఉంది. నాకూ మొగుడున్నాడు. ఇద్దరికీ ఎదిగొస్తున్న పిల్లలూ ఉన్నారు. దయచేసి నవ్వులాటగా తీసుకోకండి. సిన్సియర్ గా అడుగుతున్నాను. సమస్యేమంటే పక్కింటబ్బాయి మీ శిష్యుడని తెలిసింది. నాతో ఎఫైర్ పెట్టుకోవాలంటే మీ పర్మిషన్ కావాలట. నేను మా ఆయన్నీ వదల్లేను. ఇతన్నీ వదల్లేను. ఏం చెయ్యమంటారు?

జవాబు: అబ్బ ! ఎంత మంచి ప్రశ్న అడిగావమ్మా ! ఇంతమంచి శిష్యుడా నాకు? నా జన్మ తరించింది. అసలిది ఒక సమస్యామ్మా? నేను సాల్వ్ చేసిన సమస్యలముందు ఇదొక సమస్యే కాదు. చాలా సింపుల్. విను. నువ్వు నిరభ్యంతరంగా అతనితో సంబంధం పెట్టుకో. అలాగే మీ ఆయన్ని అతని భార్యతో సంబంధం పెట్టుకోమను. అదే విధంగా, మీ పిల్లల్ని వాళ్ళ పిల్లలతో సంబంధం పెట్టుకోమను. అంతా కలసి, ఒకిల్లు కొనుక్కొని సకుటుంబ సపరివార సమేతంగా అందులో ఏడవండి. అసలే నూక్లియర్ పేమిలీలు ఎక్కువౌతున్న ఈ రోజుల్లో కావాల్సింది మీలాంటి ఉమ్మడి కుటుంబాలే ! ఇంకోమాట. నా శిష్యుడిని ఈజన్మలో నావైపు తిరిగిచూడొద్దని చెప్పమ్మా ! అలాంటివాళ్ళని నేను భరించలేనులే.

7. సార్ ! మీ వెబ్ సైట్ చూచి చాలా ఇంప్రెస్ అయ్యాను మీ బోధనలు నాకు చాలా నచ్చేశాయి. నా దగ్గర ఒక పెద్ద లైబ్రరీ ఉంది. లారీడు పుస్తకాలుంటాయి. వాటికి మీకు డొనేట్ చెయ్యాలని అనుకుంటున్నాను. ఏమంటారు?

జవాబు : నేను రాసిన పుస్తకాలే ప్రస్తుతం మా ఇంట్లో ఒక రూము నిండా ఉన్నాయమ్మ! నీ లారీని నేనేం చేసుకోను? ఒక పనిచెయ్యి. ఆ లారీడు పుస్తకాలనీ నీ మెడకి కట్టుకుని బంగాళాఖాతంలో దూకు. లోకానికి నీ పీడ విరగడ అవుతుంది.

8. హాల్లో అండి ! నేను కాళీ ఉపాసన చేస్తున్నాను. దానిని నాకు నేర్పించిన గురువుగారు, ఒకరు చేసిన చేతబడిలో చనిపోయాడు. ప్రస్తుతం నాకు గైడెన్స్ లేదు.  నేను మీ దగ్గరకు రాలేను. ఫోన్లో నాకు పరిష్కారాలు సూచనలు చెప్పగలరా>

జవాబు; అలాగే నాయన ! అంతకంటే నా బ్రతుక్కి వేరే పనేముంది గనుక? అయితే ఒక చిన్న సమస్య. కరోనా వచ్చినప్పటినుండి కాళీకాదేవి పనిలోకి రావటం లేదు.  లీవు పెట్టింది. ఇవ్వాళోరేపో వస్తుంది. తనొచ్చాక కనుక్కుని నీకు ఫోన్ చేస్తా. అప్పటిదాకా చచ్చిన మీ గురువు అస్థికలని మెళ్ళో వేసుకుని రోడ్లమ్మట తిరుగు. సమస్య తీరుతుంది.

9. నమస్తే గురూగారు ! ఆంజనేయస్వామి చిరంజీవి అని క్రీగంటివారి ఉపన్యాసాలలో విన్నాను. ఆయన్ని ఎలా కలవాలి? ఎక్కడ కనిపిస్తారు?

జవాబు : తప్పకుండా నాయన. ఆయన అప్పుడప్పుడు మా తోటలోకి వస్తూ ఉంటారు. గోడలమీద తిరుగుతూ కనిపిస్తారు. ఈ సారొచ్చినపుడు నీకు ఫోన్ చేస్తా.  నువ్వొచ్చేలోపల ఎక్కడికీ పారిపోకుండా చెట్లమీద ఉంటే నీ అదృష్టం. అన్నట్టు మరోమాట ! క్రీగంటిగారిని కూడా తీసుకురా మర్చిపోకుండా. ఆయనక్కూడా చిరంజీవి దర్శనం చేయిస్తా.

10. ఇలా వ్రాస్తున్నందుకు ఏమీ అనుకోకండి. మీకున్న జ్యోతిష్యవిద్య నాకుంటే ఈ పాటికి లక్షలు సంపాదించేవాడిని. మీ విద్యను వేస్ట్ చేసుకుంటున్నారు.

జవాబు: అవున్నాయన ! జోతిష్యం వేస్టని, అది డబ్బులు సంపాదించడానికి పనికిరాదని, దానిని పూర్తిగా నేర్చుకున్నాక అర్ధమైంది. లక్షలు సంపాదించడానికి చాలా ఈజీ మార్గాలున్నాయి. వాటిని అవలంబించు. నన్నిలా వదిలేయ్.

11. నా పేరు ఫలానా. వయసు 58. హైదరాబాద్ లో కాలేజీలో ఆఫీస్ స్టాఫ్ గా పనిచేస్తున్నా. బూడిదబాబా వీరభక్తుడిని. అందుకే మా ఇంటికి 'అశాంతినిలయం' అని పేరు పెట్టుకున్నా. బాబా పోయిన రోజునుంచీ బాధతో రాత్రిళ్ళు తిండి మానేశా. ఆయన ఫోటోకి పావుకేజీ స్వీటు నైవేద్యం పెట్టి అదే తిని పడుకుంటా. ఇలా పదేళ్లనుంచీ చేస్తున్నా. ప్రస్తుతం ఆరోగ్యం బాగా పాడైపోయింది. షుగర్ 300 ఉంది. కళ్ళు కనిపించడం లేదు. నీరసం వస్తోంది. బీపీ బాగా పెరిగింది. ఇంట్లో శాంతి లేదు. ఎందుకిలా జరుగుతోంది? రెమెడీ చెప్పండి.

జవాబు : బాబాగారి ఆకలెక్కువ కదా. మీరు పెడుతున్న పావుకేజీ స్వీటు ఆయనకు సరిపోవడం లేదు. ఆయన ఆగ్రహించారు. అందుకే మీకు షుగరు పెరుగుతోంది. రేపట్నించీ రోజుకి రెండుకేజీలు నేతి మైసూరుపాకు నైవేద్యం పెట్టండి. ఒక్కముక్క కూడా ఎవరికీ పెట్టకుండా రాత్రికి మొత్తం మీరే తిని పడుకోండి. నెలరోజుల్లోనే మీకు బాబా సశరీరంతో దర్శనమివ్వడమే గాక, తనలో ఐక్యం కూడా చేసుకుంటారు. మీ పీడా విరగడయ్యాక మీఇంట్లో వాళ్లకి శాంతి దక్కుతుంది. మీ ఇంటిపేరు ఆటోమేటిగ్గా 'శాంతినిలయం' అయిపోతుంది.

12. ఇంకొకామె రోజుకొక విష్ణు సహస్రనామాల మీద ఎవడో వెర్రినాగన్న వ్రాసిన తోటకూర భాష్యం నాకు పంపిస్తూ ఉంటుంది. మొదట్లోనే కరెంటు షాకెందుకు పాపం ఆడకూతురని చాలా రోజులు ఓపిక పట్టా. ఆమె ఆగడం లేదు. చూసీ చూసీ ఆమెకిలా మెసేజి పెట్టాను.

'ప్రస్తుతం మొదట్లోనే ఉంది. బాగా ముదరకముందే మంచి డాక్టరుకి చూపించుకోమ్మా. ముదిరితే తగ్గడం కష్టం'

-------------------------------

చాలామంది నన్నడిగే ప్రశ్నలు ఈ క్రింది విషయాలమీదే ఉంటున్నాయి.

1. ఈజీగా డబ్బు ఎలా సంపాదించాలి?

2. అక్రమ సెక్సు సంబంధాలు వాటిల్లో సమస్యలు.

3. క్షుద్రవిద్యలు, మంత్రాలతో పనులు సాధించడం.

4. దొంగగురువుల దగ్గర తెలిసీతెలీని సాధనలు చేసి జీవితాలు పాడుచేసుకుని, 'ఇప్పుడేం చెయ్యమంటారు?' అనే ప్రశ్నలు.

5. టీవీ ప్రవచనాల అతితెలివితో నాకే నేర్పించే ప్రయత్నాలు.

--------------------------------

ఈలోకాన్ని ఎవడూ మార్చలేడు, మంచిదారిలో నడిపించలేడు. ఈ చౌకబారు మనుషులూ,ఇంతే, ఈ చెత్తలోకమూ ఇంతే.

పదేళ్లనుంచీ వ్రాస్తున్నది చదివి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే, జనాల స్థాయి ఎలా ఉందో చాలా చక్కగా అర్థమౌతోంది. ఇలాంటి లోకానికి ఇప్పుడున్న దొంగగురువులు చాలరు. సందుకి వందమంది కావాలి, గొందికి వెయ్యిమంది కావాలి. జనం ఇంకా సర్వనాశనం కావాలి.

లోకుల అజ్ఞానం ఇంకా ఇంకా వర్ధిల్లుగాక !