ఈరోజు పొద్దున్నే ఇద్దరు వ్యక్తులొచ్చి నన్ను కలిశారు.
మామూలు కుశలప్రశ్నలయ్యాక 'ఎవరు మీరు? ఎందుకు నన్ను కలవడానికి వచ్చారు?' అనడిగాను.
అసలు విషయం చెప్పకుండా వాళ్ళు 'మేం ఆత్మజ్ఞానం కోసం వెదుకుతున్నాం. మాకు గురువు కావాలి. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం.' అన్నారు.
ఇలాంటివాళ్ళని ఇప్పటికి వందలాదిమందిని చూచాను. వాళ్ళు ఎందుకొచ్చారో ఆ అసలు విషయం చెప్పకుండా ఏదేదో డొంకతిరుగుడు మాటలు ఇలాంటివే మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఇంటర్ నెట్, యూట్యూబుల మహిమ. అందులో అదీ ఇదీ చూసి నాలుగు మాటలు బట్టీపట్టి మాట్లాడబోతూ ఉంటారు. కానీ వాళ్ళ బాడీలాంగ్వేజిని బట్టి అయిదే అయిదు నిముషాలలో వాళ్ళ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గానికి వాళ్ళు పనికొసారా లేదా అనేది ఒకేఒక్క క్షణంలో తెలుస్తుంది.
విసుగ్గా 'ఆత్మకే జ్ఞానం లేదు. ఇక మీకెలా దొరుకుతుందది?' అడిగాను సూటిగా.
వాళ్ళు స్టన్నయ్యారు నా ధోరణికి.
'అదేంటి? ఆత్మజ్ఞానం లేదా? రమణమహర్షి 'ఆత్మజ్ఞానం' ఉందని అన్నారుకదా?' అడిగారు వాళ్ళూ తెలివిగానే.
'ఆయన నాతో అనలేదు. నేనూ ఆయనతో అనలేదు. పైగా, నేనాయన్ని కాను. ఆయనామాట అంటే, ఆయన్నే అడగకపోయారా నాదగ్గరకెందుకొచ్చారు?' అడిగాను.
'అంటే ఆత్మకి జ్ఞానం లేదంటారా?' అడిగాడొకాయన.
'లేదు' అన్నాను ఖరాఖండిగా.
'ఉందని మా గురువుగారు కూడా అన్నారు' అన్నాడు రెండో ఆయన.
దొరికావురా దొంగా అనుకుని 'ఎవరు మీ గురువుగారు?' అడిగాను.
బయటపడిపోయామన్న కంగారు వాళ్ళ కళ్ళలో ప్రస్ఫూటంగా కనిపించింది.
'అదీ, అంటే, ఆయన ఫలానా' అంటూ ఆయన పేరు చెప్పారు.
ఫకాల్న వాళ్ళ ముఖం మీదే నవ్వాను.
వాళ్లకు కోపమొచ్చింది.
'ఎందుకలా నవ్వారు?' అడిగాడు వాళ్లలో కొంచం పొగరుగా కనిపిస్తున్న ఇంకొకాయన.
'ఆయనకే గురువవసరం. ఆయన మీకు గురువా? అయినా,ఏ విధంగా మీకు గురువాయన?' అన్నాను మొహమాటం లేకుండా.
'మేమాయన్ని నమ్ముకున్నాం' అన్నాడు రెండోవాడు.
'మీరు నమ్ముకుంటే ఆయన గురువౌతాడా?' ఎదురు ప్రశ్నించాను.
'ఆయన సంస్థ బాగా డెవలప్ అవుతోంది. మాకొక ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది' అన్నాడొకాయన.
'ఓహో. మీరు ఆ కాలేజీ పెట్టినవాళ్ళా?' అడిగా.
'అవును. ఇంకా ఉన్నారు. ఆ కాలేజీ మాదే' అన్నాడు.
'కాలేజీలు పెట్టడం జ్ఞానానికి చిహ్నమా?' అడిగాను.
వాళ్ళు ఎదురుదాడి ప్రారంభించారు.
'మీరు రామకృష్ణుల భక్తులని విన్నాం. మరి రామకృష్ణా మిషన్ కూడా అనేక కాలేజీలు పెట్టి నడుపుతోంది కదా?' అన్నారు.
' మీరు విన్నది అబద్దం' అన్నా నేను.
'అదేంటి మీరు రామకృష్ణుల భక్తులు కాదా?' అడిగారు.
'కాదని నేననలేదే?' అన్నాను.
వాళ్లకు అర్ధం కాలేదు. అయోమయంగా చూస్తున్నారు.
ఎక్కువ ఏడిపించడమెందుకని ఇలా చెప్పాను.
'నేను సత్యానికి భక్తుడిని. రామకృష్ణులు చెప్పినది సత్యం గనుక ఆయన భక్తుడిని. అదే విధంగా మిగతావాళ్ళు చెప్పినదాంట్లో సత్యముంటే వారినీ ఒప్పుకుంటాను. వినండి. నేను రామకృష్ణుల భక్తుడిని గాని రామకృష్ణా మిషన్ భక్తుడిని కాను. ఆ కాలేజీలు ఆ గోలతో నాకు సంబంధం లేదు. అందుకే అన్నాను. మీరు కాలేజీ పెట్టడం మీ జ్ఞానానికి చిహ్నం కాదని'.
'మరి దేనికి చిహ్నమంటారు?' అడిగాడాయన.
'చెప్తే మీరు బాధపడతారు' అన్నాను.
'పర్లేదు చెప్పండి. వింటాం' అన్నారు.
'మతాన్ని, నమ్మకాన్ని సొమ్ము చేసుకుని వ్యాపారం చెయ్యడం తప్ప ఇందులో జ్ఞానం ఏమీ లేదని నా ఉద్దేశ్యం' అన్నాను.
'రామకృష్ణా మిషన్ కూడా అంతేనా?' అన్నాడొకాయన ఎదురుదాడికి కొనసాగిస్తూ.
'దానికీ మీకూ పోలికే లేదు. అది నాకలోకం. మీకంత ఉన్నతమైన ఆదర్శాలేమీ లేవు. ఉంటే మీరింకో కొత్త కుంపటిని పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకరిని గురువంటూ ప్రచారం చెయ్యాల్సిన పనీ లేదు'. అన్నాను.
'అయితే ఇప్పుడేమంటారు?' అడిగాడు ఆవేశపరుడు కోపంగా.
'నేనేమీ అనడం లేదు. మీరు నాదగ్గరకొచ్చారు. నేను మీ దగ్గరికి రాలేదు' అన్నాను నవ్వుతూ.
'మా గురువుగారికంటే మీకెక్కువ తెలుసా?' అన్నాడు ఆవేశపడుతూ.
'మీ గురువుగారికెంత తెలుసో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోంది. అడిగారు కాబట్టి చెబుతున్నా. ఎక్కువ తెలీడం వల్ల గురుత్వం రాదు. పోనీ అలా చూసినా, మీ గురువు నాలో పదిశాతానికి కూడా చాలడు' అన్నా మళ్ళీ నవ్వుతూ.
'మీకు అహంకారం ఎక్కువని ఫలానా మీ శిష్యుడు చెప్పాడు నిజమేనని రుజువైంది' అంటూ వెళ్ళిపోడానికి లేచారు వాళ్ళు.
'ఓహో అతను మీ గుంపా ఇప్పుడు? నాకు అహంకారం ఎంతో నాకు తెలీదుగాని, మీరు సత్యాన్ని ఒప్పుకోలేరని, మీకు కావలసింది సత్యం కాదని నాకర్ధమైంది'. అన్నా అంతే కూల్ గా నవ్వుతూ.
వాళ్ళు చాలా కోపంగా చూస్తూ లేచి వెళ్లిపోబోయారు.
వెళ్లిపోతున్న వాళ్ళని ఆపి ఇలా చెప్పాను.
'చూడండి మీరు ఎందుకొచ్చారో నేను ఊహించగలను. మనసులో ఒకటి పెట్టుకుని మరొకటి డొంకతిరుగుడుగా మాట్లాడుతూ, అదేదో పెద్దతెలివి అనుకునే మీకు 'ఆత్మజ్ఞానం' అనేది ఎన్ని జన్మలెత్తినా రాదు. ఇది ముందు తెలుసుకోండి. మీకు కాలేజీలు ఉండొచ్చు, దానికీ ఆధ్యాత్మికసిద్ధికీ ఎలాంటి సంబంధమూ లేదు. మీకు నిజంగా నిజాయితీ ఉంటె, మీ గురువుని వచ్చి వినయంగా నా కాళ్లదగ్గర కూర్చుని నేర్చుకోమని చెప్పండి'.
' అంటే మా గురువుగారికి సిద్ధి లేదంటారా?' అడిగాడొకాయన ఇంకా మొండిగా.
'సిద్ధి అనే పదానికి అర్ధం తెలిస్తే మీరామాట అడగరు' అన్నాను మళ్ళీ నవ్వుతూ.
వాళ్ళు విసవిసా వెళ్లిపోయారు.
చాలామంది ఎవరెవరి గురువుల శిష్యులో, నా బ్లాగు మా వెబ్ సైట్లు చూచి, ఇక్కడే హైదరాబాదే కదా కలుద్దామని, 'వీడిదగ్గర సరుకెంతుందో చూద్దామని' వస్తూ ఉంటారు. ఇలాంటిది ఇది మూడో కేసు. నా సరుకు అర్ధం కావాలంటే ముందు వాళ్ళదగ్గర ఉండాలిగా సరుకు !
ఆత్మజ్ఞానం కావాల్ట బఫూన్ గాళ్ళకి ! అదేమైనా బజార్లో అమ్మే సరుకా డబ్బులు పడేసి కొనుక్కోడానికి ! ధనమదం తలకెక్కినవాళ్ళకి ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? ఎన్ని జన్మలకి కలుగుతుంది?