Pages - Menu

Pages

4, ఫిబ్రవరి 2021, గురువారం

Yoga Sutras of Sage Patanjali ఇంగ్లీష్ ఈ బుక్ విడుదల


తిధుల ప్రకారం ఈరోజు వివేకానందస్వామివారి 158 వ పుట్టినరోజు.అందుకని  Yoga Sutras of Sage Patanjali ఇంగ్లీష్ ఈ బుక్ ను నేడు విడుదల చేస్తున్నాను.

ఈ పుస్తకం తెలుగులో ఇప్పటికే ఉన్నది. ఇంగ్లిష్ పాఠకుల కోసం దీనిని ఇంగ్లిష్ లోకి అనువదించి ఈ బుక్ గా ప్రచురిస్తున్నాము. 

యోగసూత్రాలను మొదటిసారిగా 1976 లో నాకు 13 ఏళ్ల వయసులో చదివాను. అప్పటికి నాకు సంస్కృతం రాదు. ఇంగ్లిష్ కూడా రాదు. 'వివేకానంద సంపూర్ణ గ్రంధావళి' అనే పుస్తకాలలో ఒకదానిలో వివేకానందస్వాములవారు ఇచ్చిన రాజయోగ ఉపన్యాసాలున్నాయి. అవి యోగసూత్రాలమీద  ఆయన విదేశాలలో ఇచ్చిన ఉపన్యాసాలు. వాటిని చదివాను. అప్పటికి వాటిల్లో కొన్ని సూత్రాలు అర్ధమయ్యాయి. ఎక్కువశాతం  అర్ధం కాలేదు. ఆ తర్వాత, కాలేజీ చదువుకు నర్సరావుపేట వెళ్ళడము, అక్కడ ఇంగ్లిష్ నేర్చుకుని ఇంగ్లీషులో వివేకానందస్వామి చెప్పిన అసలైన మాటలు ఏమిటా అని ఇంగ్లిష్ వెర్షన్ కూడా చదివాను. ఆ విధంగా కొన్ని వందలసార్లు వాటిని చదవడం, ఈలోపల నేను చేస్తున్న సాధనతో వాటిని సమన్వయం చేసుకుంటూ అర్ధం చేసుకోవడం జరిగింది.

నా గురువులలో ఒకరైన పూజ్యపాద  నందానందస్వామివారు తన గుర్తుగా నాకిచ్చినది రాజయోగోపన్యాసాలున్న Complete works of Swami Vivekananda పుస్తకమే.

యోగసూత్రాలకు ఎందరో పండితులు ఎన్నోరకాలుగా వ్యాఖ్యానించారు. నా అవగాహననుబట్టి, నా సాధనానుభవములను బట్టి, ఋషిరుణమును  తీర్చుకుంటూ నేనుకూడా ఈ వ్యాఖ్యానమును వ్రాశాను. పతంజలిమహర్షి కంటే ముందువైన సాంఖ్యము, బౌద్ధముల నుండి ఆయన ఏయే భావములను స్వీకరించారో, ఎలా వాటిని మార్పులు చేసి యోగసంప్రదాయంతో మేళవించారో ఆ వివరమంతా ఈ పుస్తకంలో వ్రాశాను.

యోగోపనిషత్తులలో చూస్తే, ఈ యోగసూత్రాలకంటే ప్రాచీనమైన  పూర్తిగా సనాతన సంబంధమైన యోగసాంప్రదాయం గోచరిస్తుంది. ఇందులోనైతే, సాంఖ్యము, బౌద్ధము, యోగముల మేలుకలయిక గోచరిస్తుంది. రెంటినీ పోల్చి చదవడం ద్వారా పాఠకులు ఈఈ సాంప్రదాయ మార్గములను వివరంగా అర్ధం చేసుకోవచ్చు. తద్వారా హిందూమతం యొక్క మౌలిక గ్రంధాలలో ఏముందో స్పష్టంగా అర్ధం చేసుకునే వీలు కలుగుతుంది.

తెలుగుపుస్తకాన్ని ఇంగిలీషు లోకి అనువాదం చేయడంలో చేదోడు వాదోడుగా సహకరించిన నా శ్రీమతి సరళాదేవికి, నా శిష్యురాళ్ళు అఖిల జంపాల, శ్రీలలితలకు, కవర్ పేజీ డిజైనర్ ప్రవీణ్ కు కృతజ్ఞతలు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ఈ ఇంగిలీషు పుస్తకం అంతర్జాతీయంగా పాఠకుల అభిమానాన్ని పొందుతుందని ఆశిస్తున్నాం.

ఈ పుస్తకం కూడా మా వెబ్ సైట్ నుంచి  https://mapanchawati.org/publications/ లభ్యమౌతుంది.