Pages - Menu
Pages
31, మార్చి 2021, బుధవారం
సూయజ్ కెనాల్ సంక్షోభం - జ్యోతిష్య విశ్లేషణ
సౌత్ డకోటా కార్చిచ్చు - జ్యోతిష్య విశ్లేషణ
29, మార్చి 2021, సోమవారం
ఇండోనేషియా చర్చిలో ఆత్మాహుతి దాడి - జ్యోతిష్య విశ్లేషణ
నాష్ విల్ వరదలు - జ్యోతిష్య విశ్లేషణ
ఎందుకని అమెరికాలోనే ఇవి జరుగుతున్నాయి? రోజుకొక్క రాష్ట్రంలో, ఒక్కొక్కవిధంగా ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. జ్యోతిష్య దిక్సూచి అమెరికాను ఎందుకు స్కాన్ చేస్తున్నది? అన్న అనుమానం మీకు రాలేదా? ఆలోచనాపరులైనవారికి, జ్యోతిష్యవిద్యలో ప్రవేశం ఉన్నవారికి అలాంటి సందేహాలు వచ్చే ఉండవచ్చు. వారికి నేను జవాబులు చెప్పనుగాని, ఈ వరదల కారణాలను కొంచం విశ్లేషిద్దాం.
అప్పటిదాకా తీవ్ర అస్తంగతుడైన శుక్రుడు సూర్యుని పట్టునుండి విడివడి ముందుకు పురోగమించడమే దీనికి కారణం. శుక్రుడు జలగ్రహం, మీనం జలతత్వ రాశి, కేతువు జలరాశియైన వృశ్చికంలో ఉన్నది, అక్కడనుంచి శుక్రుని చూస్తున్నది. కనుక హఠాత్తుగా వర్షాలు మొదలై అమెరికాలోని ఒక రాష్ట్ర రాజధానిని అతలాకుతలం చేశాయి.
వాతావరణాన్ని పసిగట్టే రాడార్లు, ఉపగ్రహాలు, ఆధునికవ్యవస్థలు ఉన్న అమెరికానే, ప్రకృతి దెబ్బకు గగ్గోలు పడింది. ఇక ఇవేవీ లేని దేశాలను గ్రహదృష్టి ఎలా ఊపుతుందో ఆలోచించండి !
28, మార్చి 2021, ఆదివారం
వర్జీనియా బీచ్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ
జ్యోతిష్యపరంగా కారణాలు చూద్దాం.
ఈ సమయంలో శుక్రుడు, రవి ఇద్దరూ మీనరాశి 12 డిగ్రీలమీద ఉన్నారు. దీనిని జ్యోతిష్యపరిభాషలో యుతి లేదా కంజంక్షన్ అంటారు. దీనివల్ల శుక్రుడు పూర్తిగా అస్తంగతుడయ్యాడు. శుక్రుని కారకత్వాలేమిటి? అందగత్తెలైన యువతులు, విలాసప్రాంతాలు, పిక్నిక్ స్పాట్లు మొదలైనవి. జలతత్త్వరాశియైన మీనరాశి దేనిని సూచిస్తున్నది? చేపలు విరివిగా ఉండే నదులు,సముద్రప్రాంతాలు, బీచ్ లను సూచిస్తున్నది. మీనమంటేనే చేప. అందుకే బీచ్ లో ఈ కాల్పులు జరిగాయి.
ఆ సమయంలో అక్కడ తులారాశి ఉదయిస్తుంది. సుఖస్థానమైన మకరం నీచగురువు శనుల యుతితో ధ్వంసమైపోయింది. జలతత్త్వరాశి అయిన మీనంలో జలకారకగ్రహమైన శుక్రుడు తీవ్ర అస్తంగతుడైనాడు. గందరగోళాన్ని విధ్వంసాన్ని సూచిస్తున్న అష్టమంలో గొడవలకు సూచకులైన రాహు కుజులున్నారు. ఇంకేం కావాలి?
అసలీ జ్యోతిష్య దిక్సూచి ఎలా మారుతుంది? దీని గమనం ఎలా ఉంటుంది? ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒకే దేశంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎలా ఇది మారుతుంది? అని మాత్రం అడక్కండి. అబ్బా ! ఆశకైనా అంతుండాలి. ఏళ్లకేళ్లు ఘోరమైన రీసెర్చి చేసి నేను కనుక్కున్న జ్యోతిష్య సూత్రాలను, లోతైన విషయాలను ఊరకే బ్లాగులో చెప్పేస్తాననుకున్నారా? ఊరకే ఊరిస్తాగాని అసలైన రహస్యాలను మాత్రం ఎప్పటికీ వెల్లడించను. అది నెక్ట్ టు ఇంపాజిబుల్ !
25, మార్చి 2021, గురువారం
బోల్డర్ గ్రోసరీ స్టోర్ కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ
19, మార్చి 2021, శుక్రవారం
అట్లాంటా స్పా కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ
ఆ సమయంలో శుక్రుడు దారాకారకుడుగా ఉంటూ సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడివున్నాడు. మనఃకారకుడైన చంద్రుడు, మొండి పట్టుదలకు సూచికగా మేషంలో ఉంటూ, పాపార్గళానికి గురయ్యాడు. ఇది చాలదన్నట్లు శుక్రునిమీద నీచ గురువు, శనుల దృష్టి ఉన్నది. గురువు ద్వేషభావానికి సూచికైన షష్టాధిపతిగా సప్తమంలో ఉంటూ లగ్నాన్ని బలమైన దృష్టితో చూస్తున్నాడు. ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఆడవాళ్ళతో సంబంధం ఉన్న విలాసపూరితమైన స్థలాలు (మసాజ్ పార్లర్లు, స్పాలు), విదేశీయులపట్ల ద్వేషం, మొండిమూర్ఖత్వం, హింస ఇవన్నీ సూచింపబడుతున్నాయి. అదేగా మరి జరిగింది?
శుక్రునికి మీనరాశిలో ఉచ్ఛస్థితి ఉన్నది. కానీ సున్నా డిగ్రీలలో శుక్రుడు బలంగా లేడు. ఒకపక్కన ఉఛ్చత్వం, మరొకపక్కన బలహీనత్వం ఈ రెండూ కలసి శుక్రుడిని అటూఇటూ ఊపేస్తాయి. కనుక శుక్రకారకత్వాలు గందరగోళానికి గురౌతాయి. కుజ, రాహు, శనులవల్ల విధ్వంసకాండ జరుగుతుంది. నా పుస్తకాలు చదివినవారికి ఈ యోగాలు సుపరిచితాలే.
నాడీజ్యోతిష్యంలో వాడే రాశితుల్యనవాంశ విధానం ప్రకారం చూస్తే కర్కాటకలగ్నం నాలుగు గ్రహాల ప్రభావానికి లోనైంది. అవి - రవి, చంద్రుడు, రాహువు, శుక్రుడు. ఇది అమావాస్య యోగం (పిచ్చిప్రవర్తన) + సెక్స్ పరమైన పెడధోరణులకు సూచిక. రాహువు, కుజుడు, శని వృషభంలో ఉన్నారు. ఇది కాల్పులు, యాక్సిడెంట్లు, నేరాలకు సూచిక. వీరందరూ శుక్రరాశి యైన వృషభంలో ఉన్నారు. అంటే శుక్ర సంబంధం వీరికి ఉన్నది. శుక్రుడేమో ఇలాంటి చోట్లను ఇలాంటి పనులను చక్కగా సూచిస్తాడు. అదేగా మరి జరిగింది?
ఇందులో రేసిస్ట్ ఛాయలున్నాయని కొందరంటున్నారు. కాదు, ఇది పూర్తిగా సెక్స్ పరమైన విపరీతప్రవర్తనతో కూడిన నేరమని కొందరంటున్నారు. రెండూ కలసి ఉన్నాయని గ్రహాలు చెబుతున్నాయి. అసలు గ్రహాల దాకా ఎందుకు? సింపుల్ సైకాలజీ తెలిస్తే చాలు. సెక్స్ కోరికలనేవి మనసులోనుంచి పోవాలిగాని, మసాజ్ పార్లర్లు, బార్లు, స్పాలు, రెడ్ లైట్ ఏరియాలను తొలగిస్తే అవి ఎలా పోతాయి? ఇది చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. కారణాలు చెప్పడానికైనా అర్ధాలుండాలి.
ఇప్పుడు మీకొక చచ్చుసందేహం రావచ్చు. దీనికి కారణం గ్రహాలైతే, భూమ్మీద అన్నిచోట్లా ఇవే జరగాలికదా? ఎందుకు జరగలేదు అని. దానికి నా జవాబేమిటంటే, భూమ్మీద అందరికీ ఇదే సందేహం రావాలి కదా, మీకొక్కరికే ఎందుకొచ్చింది? ముందు దీనికి జవాబు చెప్పండి, తర్వాత మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను.
ఇలాంటి సంఘటనలకు కారణాలు గ్రహాలు కాదు. అలా చెప్పేవారికి ఏమీ తెలియదు. గ్రహాలు కారకాలేగాని కారణాలు కావు.
భూమిమొత్తం మీద ఒకే సంఘటన ఎప్పుడూ జరగదు. ఒకే గ్రహకారకత్వానికి సంబంధించిన సంఘటనలు రకరకాలైన ఛాయలలో కోణాలలో అనేక ప్రదేశాలలో ఒకేసారి జరుగుతాయి. అదే ఈ భూమ్మీద జరుగుతున్న డ్రామా. మరొక్కవిషయం చెబుతా వినండి ! ఆ రోజున చవితి అయింది. మీరు గమనించుకుంటే, చాలామంది ఆడవాళ్లు ఆ రోజునా, ఒకరోజు అటూఇటూగా, చాలా హిస్టీరికల్ గా ప్రవర్తించినట్లు గమనిస్తారు. అది మీ మీ కుటుంబాలలో కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల కావచ్చు. కరెక్టేనా కాదా? అదేమరి గ్రహప్రభావమంటే !
లొకేషనల్ ఎష్ట్రాలజీ సూత్రాలు తెలిస్తే మీకీ విషయాలు అర్ధమౌతాయి. సందర్భం వచ్చినపుడు వాటిని వివరిస్తాను. అంతవరకూ, జ్యోతిష్యశాస్త్రం నిజమే అని చెప్పడానికి ఈ సంఘటన మరొక్క చక్కటి రుజువని అర్ధం చేసుకోండి. అంతవరకూ అర్ధమైతే చాలు !
14, మార్చి 2021, ఆదివారం
శివరాత్రి - 2021
మొన్న శివరాత్రి నాడు, రాత్రి పదకొండున్నర దాటాక మిత్రుడు ఫోన్ చేశాడు. అప్పుడే నిద్రపట్టబోతోంది. 'ఏంటి ఈ టైంలో ఫోన్?' అనుకుంటూ ఫోనెత్తి 'హలో' అన్నా బద్ధకంగా.
'ఏం చేస్తున్నావ్' అన్నాడు.
తనెప్పుడూ ఇంతే. భోంచేస్తుంటే ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటాడు. నిద్రపోతుంటే ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? అంటాడు. స్నానం చేసే టైం లో అడగటం లేదు. అదొక్కటే వెసులుబాటు. ప్రస్తుతానికి బాత్రూం లోకి ఫోన్ తీసికెళ్ళడం లేదు. ముందుముందు అదికూడా చెయ్యాల్సి వస్తుందేమో మరి?
'ఈ టైంలో ఏం చేస్తాను? ఎగుర్లాడుతున్నా' అన్నా.
'అవునా? నువ్వు కూడా అదే చేస్తున్నావా?' అన్నాడు ఆశ్చర్యంగా.
'నేను కూడానా? ఇంకా ఎవరైనా ఇదే చేస్తున్నారా ఏంటి ఖర్మ?' అన్నా.
'అదేంటి? నువ్వు చూడటం లేదా?' అన్నాడు.
'ఏంటి చూసేది?' అన్నా.
'అదే. లైవ్ ప్రోగ్రామ్. ఫలానా ఆశ్రమంలో శివరాత్రి లైవ్ వస్తోంది. అందరూ ఎగురుతున్నారు' అన్నాడు ఉత్సాహంగా.
'శివరాత్రి లైవా? అదేంటి? అదేమన్నా ఫేషన్ షోనా లైవ్ రావటానికి? పైగా ఎగరటమేంటి?' అన్నాను.
'అక్కడ శివరాత్రి అలాగే చేస్తారు. పెద్దపెద్ద వాళ్లంతా ఉన్నారు. అందరూ ఎగురుతున్నారు' అన్నాడు మళ్ళీ.
'పెద్ద పెద్దవాళ్ళంటే ఏంటి? సైజా? ఎంత పొడుగున్నారేంటి?' అన్నాను.
'ఛ అది కాదు. అర్ధరాత్రికూడా నీ జోకులూ నువ్వూనూ. సినిమా యాక్టర్లు కూడా ఉన్నారు. నా ఫెవరెట్ హీరోయిన్ కూడా ఉంది. ఆమె డాన్స్ చెయ్యకపోతుంటే, స్వామీజీ ఆమె జబ్బ పట్టుకుని లేపి మరీ డాన్స్ చేయిస్తున్నాడు చూడు' అన్నాడు ఎంతో ఊగిపోతూ.
'హతవిధీ' అనుకున్నా మనసులో
'శివరాత్రి అలా కూడా చేసుకుంటారా? అయినా ఊరకే ఎగరమంటే ఆమెందుకు ఎగురుతుంది? లక్షలిస్తే ఎగురుతుంది గాని' అడిగా.
దానికి జవాబు చెప్పకుండా 'నేనుకూడా వెళ్తే బాగుండేది. తనతో నేను కూడా డాన్స్ చేసేవాడిని ' అన్నాడు నిరాశగా.
'తనతో అంటే ఎవరితో స్వామీజీతోనా' అన్నా నవ్వుతూ.
'ఛా! ఆ ముసలోడితో నాకెందుకు? నా ఫెవరెట్ హీరోయిన్ తో' అన్నాడు నీరసంగా.
'ఆ! నీకోసమే ఎదురుచూస్తోంది వెళ్ళు. ఆ దరిదాపులకు కూడా నిన్ను వెళ్లనివ్వరు. సోలో డాన్స్ చేసుకోవడమే నీకు చివరకు జరిగేది. ఇదంతా సరేగాని, దీనిని శివరాత్రి అంటారా? నా చిన్నప్పుడు కోటప్పకొండ తిరునాళ్లలో రాత్రంతా ఎద్దుబండ్లమీద రికార్డింగ్ డాన్సులు జరిగేవి. వాటికీ వీటికీ తేడా ఏంటో?' అన్నా నవ్వుతూ.
'అది నేలబారు. ఇది సోఫిస్టికేటెడ్, మైల్డ్ వెర్షన్ ఆఫ్ ఓషో ఆశ్రమంలా ఉంది.' అన్నాడు మిత్రుడు గాలిలో తేలిపోతూ.
'బైటికి మైల్డ్, లోపల మాత్రం వైల్డ్. బయటపడటానికి సమయం పడుతుంది' అన్నా.
'అంతేనంటావా?' అన్నాడు నీరసంగా.
'అయితే ప్రస్తుతం ఈ స్వామీజీ భక్తుడివా నీవు? శ్రీవిద్యని వదిలేశావా?' అన్నా మళ్ళీ నవ్వుతూ.
'అదేం లేదు. సరదాగా లైవ్ చూస్తున్నా. కాసేపాగి శంకరాచార్యులవారు వ్రాసిన నిర్వాణ శతకం చదువుకుంటా. విన్నావా ఈ పేరు ఎప్పుడైనా?' అన్నాడు.
'అది నిర్వాణశతకం కాదు. నిర్వాణషట్కమని ఆరుశ్లోకాలు. అది చిక్కటి అద్వైతం. అవి చదివితే నీకేమొస్తుంది?' అడిగా.
'అందులో నువ్వే శివుడివి నువ్వే శివుడివి అని ఉంటుంది తెలుసా నీకు?' అన్నాడు.
'హైస్కూల్లో ఉన్న రోజుల్లో చదివా అది. అయినా, నేనే శివుణ్ణి నేనే శివుణ్ణి అనుకున్నంత మాత్రాన నువ్వు శివుడివి అయిపోవు.' అన్నాను విసుగ్గా.
'ఏదో ఒకటి చెయ్యాలి కదా. నువ్వేం చేస్తున్నావు?' అడిగాడు.
'ఏమీ చేయ్యను. నిద్రపోతాను నువ్వు వదిలితే' అన్నా నవ్వుతూ.
'అదేంటి కనీసం అర్ధరాత్రి పన్నెండు వరకైనా మెలకువగా ఉండవా?' అడిగాడు చిరాగ్గా.
'ఎందుకు? ఏమొస్తుంది అలా ఉంటే?' అడిగాను.
'శివరాత్రి కదా? శివపూజ చెయ్యవా?' అడిగాడు.
'పూజ మానుకున్నదెప్పుడు మళ్ళీ ఆరంభించడానికి?' అన్నాను.
'అంటే ప్రత్యేకపూజ లేదా?' అడిగాడు.
'ఏ ప్రత్యేకతా లేకపోవడమే పూజనుకుంటున్నాను' అన్నాను.
'అంటే, శివరాత్రికి ఏమీ చెయ్యవా?' అడిగాడు.
'ప్రతిరాత్రీ శివరాత్రే. శివుడు లేని రాత్రేక్కడుంది? పగలెక్కడుంది?' అడిగాను.
'అంటే, చేస్తున్నవాళ్లంతా పిచ్చివాళ్ళా?' అడిగాడు మళ్ళీ.
'పిచ్చివాళ్ళయితే బానే ఉండేది. అజ్ఞానులు. అహంకారులు' అన్నా.
'మరి నువ్వు చేసే పూజ ఏంటి?' అడిగాడు.
'చెప్పినా నీకర్ధం కాదు' అన్నాను.
'సర్లే ఏదో ఒకటి నీగోల. హాయిగా డాన్స్ చూసుకుంటా' అన్నాడు.
'ఆ పని చెయ్యి. శివుడి సంగతి ఎలా ఉన్నా, నీ హీరోయిన్ దర్శనం మాత్రం అవుతుంది, మీ స్వామీజీ ఆమె జబ్బ వదిల్తే' అన్నా నవ్వుతూ.
'సరే పడుకో. ఇక ఉంటా' అంటూ ఫోన్ కట్ చేశాడు మిత్రుడు.
'గుడ్ నైట్' అంటూ ముసుగేసి నిద్రలోకి అడుగుపెట్టా.
ఈ ఒక్క రాత్రికి శివుడిని తలచుకుంటే సరిపోతుందా? అదికూడా ఇలా డాన్సులు పాటలతో దరిద్రంగానా? అసలు శివుడు లేని రాత్రేక్కడుంది?
డర్టీ వరల్డ్ ! దీనిని ఎవడూ బాగుచెయ్యలేడు !
5, మార్చి 2021, శుక్రవారం
కర్ణపిశాచి - కరోనా వాక్సిన్
రాత్రి భోజనం చేస్తూ ఉండగా ఫోన్ మ్రోగింది.
ఎవరా అని చూస్తే రవి. సామాన్యంగా ఉదయంపూట మాత్రమే రవి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అమెరికా శిష్యురాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను గనుక అతడి ఫోన్ ఎత్తను. అందుకని ఈ టైంలో చేశాడా అనుకుంటూ 'హలొ రవి' అన్నా.
'ఏం చేస్తున్నావ్?' అడిగాడు తాపీగా.
'ఇప్పుడే సాంగ్స్ అయిపోయాయి. డాన్స్ చెయ్యబోతున్నా' అన్నా అంతకంటే తాపీగా.
'అదేంటి డాన్స్ కూడా వచ్చా నీకు? ఇన్నేళ్ల తర్వాత కొత్తకోణాలు కనిపిస్తున్నాయే?' అడిగాడు వింతగా.
'అవును. ఇప్పుడే కదా టీనేజిలోకి అడుగుపెడుతున్నాను. నువ్వెంటి అప్పుడే ముసలాడివై పోయావా? స్పెషల్ చ్యవనప్రాశ్ విత్ గోల్డ్ వాడటం లేదా?' అడిగా నవ్వుతూ.
'సరేలే ఏంటి నముల్తున్నావ్?' అడిగాడు మళ్ళీ.
'ఈ టైంలో ఏం నములుతం చెప్పు? అన్నం తింటున్నా. సరేలేగాని, నువ్వెంటి ఈ టైంలో?' అడిగాను.
'పొద్దున్నే ఫోన్ చేస్తే యోగా అంటావు. కొంచం సేపయ్యాక ఫోన్ చేస్తే అమెరికా శిష్యురాళ్లంటావు. ఆఫీస్ టైంలో పలకవు. సాయంత్రం ఫోన్ చేస్తే మార్షల్ ఆర్ట్స్ అంటావు. అందుకని రాత్రి తొమ్మదికి ఫిక్సయ్యా' అన్నాడు.
'సరే ఏంటి సంగతి చెప్పు' అన్నా.
'ఏం లేదు. అందరూ కరోనా వాక్సిన్ వేసుకుంటున్నారు. మన బాస్ కూడా వేసుకున్నాడు. నన్నూ వేసుకోమంటున్నారు. నువ్వూ వస్తే మనిద్దరం వెళ్ళొద్దాం' అన్నాడు.
'నాకొద్దులే. నువ్వెళ్ళి పొడిపించుకో' అన్నా.
'అదేంటి? అందరూ వేసుకుంటున్నారు. భయమా?' అన్నాడు.
'అదేం లేదులే. క్లాసికల్ హోమియోపత్స్ వాక్సిన్లను నమ్మరు. మాకొద్దు' అన్నా.
'మరి రక్షణ ఎలా?' అడిగాడు.
'అందరికీ ప్రభువే రక్షణ' అన్నా నవ్వుతూ.
'అదికాదు. సీరియస్. మరి కరోనా నుంచి ప్రొటెక్షన్ ఎలా?' అడిగాడు.
'హోమియో వాడేవాళ్ళకి వాక్సిన్ అవసరం లేదు' అన్నా.
'అదేంటి?' అన్నాడు అయోమయంగా.
'అవును. వైద్యజ్యోతిష్యం పుస్తకంలో చూడు. కొన్ని కేసులలో వాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్స్ గురించి చర్చించా. నా దృష్టిలో హోమియోపతిక్ ప్రోఫిలాక్టిక్స్ వాడితే చాలు. వాక్సిన్ అవసరం లేదు' అన్నాను.
'ఓరి నీ హోమియో పిచ్చి ! డేంజరేమో ఆలోచించు' అన్నాడు.
'ఓరి నీ వాక్సిన్ పిచ్చి ! ప్రచారాలకు పడిపోకు' అన్నా నవ్వుతూ.
ఆ తర్వాత అదీ ఇదీ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు రవి.
భోజనం ముగిసింది. టైం తొమ్మిదిన్నర అయింది. గేట్లు వెయ్యాలి. నేనుండే బంగళాకు రెండు గేట్లుంటాయి. ఒకటి పెద్దగేటు. అది ఇంటికి రెండొందల మీటర్ల దూరంలో ఉంటుంది. దానికి తాళం వేసి వస్తూ వస్తూ చిన్నగేట్టు తాళం వేసి, తోటలోని చెట్లలోనుంచి నడుస్తూ ఇంటి వాకిలి దగ్గరకు రావాలి. ఇది ప్రతిరాత్రీ నా రోజువారీ దినచర్య. నిజం చెప్పొద్దూ? రాత్రిపూట ఈ నిర్మానుష్య కాలనీలో, ఈ బంగళాలో, ఈ చెట్లమధ్యన నడుస్తూ పోతుంటే కొంచం భయంగానే ఉంటుంది. అప్పుడప్పుడూ ఒళ్ళు ఝల్లుమంటూ ఉంటుంది కూడా! అసలైతే, నేనీ బంగళాలో చేరిన కొత్తలో ఇది భూత్ బంగళా అని నన్ను భయపెట్టబోయాడు రవి.
'అవునా ! అలా అయితే మరీ మంచిది. నేను ఇక్కడకు రావడం వల్ల ఇక్కడున్న దయ్యాలకు మోక్షం వస్తుందిలే, నువ్వు భయపడకు' అని నవ్వేశాను. నవ్వానేగాని లోలోపల పీచుపీచుమంటూనే ఉంటుంది మరి ! అయినా సరే, కొన్నిసార్లు రాత్రి పన్నెండువరకూ హాల్లొ ఒక్కడినే కూచుని, గజగజా వణికిపోతూ, నెట్ ఫ్లిక్స్ లో హర్రర్ మూవీస్ చూస్తూనే ఉంటాను. కానీ అదేంటో మరి? మోక్షం ప్రసాదిద్దామంటే, ఒక్క దయ్యం కూడా ఇప్పటివరకూ కనిపించలేదు. బహుశా వాటికి కూడా నన్ను చూస్తే హడలెత్తి ఉంటుంది !
యధాలాపంగా, నిన్న కూడా భోజనం అయ్యాక గేట్లు తాళాలు వేసి వద్దామని బయల్దేరాను. పెద్ద గేటుకు తాళం వేసి చెట్లలోనుంచి నడుస్తూ లోపలకు వస్తున్నాను. వెనుక ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి వెనక్కు చూశా. ఎవరో ఒకమ్మాయి మూతికి మాస్క్ వేసుకుని కొంచం దూరంలో నడుస్తూ వస్తోంది. మాస్కున్నా సరే, చూస్తూనే కర్ణపిశాచిని గుర్తుపట్టా. మా బంధం ఇప్పటిది కాదు కదా మరి !
కానీ తెలీనట్లు నటిస్తూ ' ఏయ్ అమ్మాయ్ ! ఎవరు నువ్వు? గేట్ వేసి ఉండగానే లోపలకెలా వచ్చావు? ఎందుకు నా వెంట వస్తున్నావు?' అడిగా.
అదో రకంగా నవ్వింది కర్ణపిశాచి.
'ఎక్కువ నటించకు. ఎవార్డు రాగలదు' అంది గోదారి జిల్లా యాసలో.
'అబ్బో . తూగో నించా రాక? ఏంటి కధ? ఎవర్నువ్వు?' అన్నా మళ్ళీ.
'నీ నాటకాలు నీ శిష్యుల దగ్గర వేసుకో, నమ్ముతారు, నా దగ్గర కాదు' అంది ఇంకా దగ్గరకొస్తూ.
నేనూ నవ్వేస్తూ 'నీ నాటకాలేంటి మరి? ముఖానికి ఆ మాస్కేంటి? ఆగాగు. అక్కడే ఆగు. సోషల్ డిస్టెన్స్ ఉండాలి' అన్నా ఉడికిస్తూ.
'కరోనా వాక్సినే వద్దనేవాడికి సోషల్ డిస్టెన్స్ ఎందుకో?' అడిగింది ఇంకా దగ్గరకొస్తూ మళ్ళీ అదే యాసలో.
'అంతా విన్నావన్న మాట' అన్నా నీరసంగా.
'నా పనే అది కదా ! ఎవరేం చెప్పుకుంటున్నారో వినడమే కదా నా పని. రోజూ నేనుకూడా నీతోపాటు హర్రర్ మూవీస్ చూస్తున్నా నీ పక్క సోఫాలో కూచుని, తెలుసా నీకు?' అడిగింది.
'నీ నాటకాలు మీ పిశాచాల దగ్గర వేస్కో. నా దగ్గర కాదు' అన్నా ఉడికిస్తూ.
'నిజ్జం, నీమీదొట్టు' అంది ఇంకా దగ్గరకొస్తూ.
'అవునా? అయితే చెప్పు, ప్రస్తుతం ఏం చూస్తున్నానో నెట్ ఫ్లిక్స్ లో?" అడిగాను.
'పరీక్షలా మాకు ! 'యాష్ వెర్సస్ ఈవిల్ డెడ్' సీరీస్ సెకండ్ సీజన్ చూస్తున్నావ్' అంది.
'ఆమ్మో. కనిపించొచ్చు కదా మరి ! నాతోబాటు నీకూ టీ ఇచ్చేవాడిని కదా' అన్నా నవ్వుతూ.
'మాకు టీ ఎక్కడ సరిపోతుంది? మీ శిష్యురాలు తెచ్చిచ్చిన బాటిల్ ఇస్తే బాగుంటుంది' అంది నవ్వుతూ.
' ఆ బాటిల్ సంగతి నీకూ తెలిసిపోయిందా?' అన్నా ముని స్టైల్లో నటిస్తూ.
' ఇక చాల్లే ఆపు నీ నాటకాలు. పాపం మీ ఫ్రెండ్ భయస్తుడు. అతనికోసమన్నా వేసుకోరాదు వాక్సిన్?' ప్రాధేయపడింది.
'ఆ ! నువ్వూ రా తోడు. మనిద్దరం వేసుకుందాం వాక్సిన్' అన్నా నవ్వుతూ.
తనూ నవ్వేసింది.
'ఏంటి ఈ మధ్య బిజీనా? అస్సలు దర్శనాల్లేవు? మీ చెల్లెలు కన్నెపిశాచి కూడా కనిపించడం లేదు?' అడిగా నడుస్తూ.
'మేం బిజీ కానిదెప్పుడు? క్షణం తీరికలేదు దమ్మిడీ ఆదాయం లేదంటే మా బ్రతుకే' అంది నిట్టూరుస్తూ నడుస్తూనే.
'సర్లే బాధపడకు. మీకూ మంచిరోజులొస్తాయి. పడ్డవాళ్ళు చెడ్డవాళ్లు కారు, నవ్విన నాపచేనే పండుతుంది' అంటూ ఇంకా ఏదో చెప్పబోయా
'ఆపుతావా సోది సామెతలు. అలాంటివి నన్ను చెప్పమంటే లక్ష చెబుతా నీకు వినే ఓపికుంటే' అన్నది.
'సర్లే ఏంటి ఇలా వచ్చావ్?' అడిగా..
'నువ్వంటే దిగులు పుట్టింది. ఒకసారి చూసిపోదామని వొచ్చా' అంది.
'ఛా! నిజమా' అడిగా హాశ్చర్యపోతూ !
'అదే మరి ! రాజమండ్రి నుంచి నార్త్ ఇండియాకు పోతున్నా. దార్లో క్రిందికి చూస్తే నువ్వు గేటు వేస్తూ కనిపించావు. సర్లే ఒకసారి పలకరిద్దామని దిగా. సరదాగా మాస్క్ వేస్కుని కనిపించా. అంతే, సింపుల్' అంది.
'ఓ అదా సంగతి ! ఏంటి కబుర్లు?' అడిగా నడుస్తూనే.
'ఏమున్నాయి. నడుస్తోంది ప్రపంచం' అంటూ మా శిష్యుల గురించీ, మా బంధువుల గురించీ, కొన్ని చాడీలు చెపింది తను.
'అవునా' అంటూ తెగ ఆశ్చర్యపోయా మళ్ళీ.
'ఆ నటనే వద్దనేది. సర్లే నే పోతున్నా, మీ ఆవిడ ఇటే చూస్తోంది అనుమానంగా. ఆవిడకి ఎమ్ చెప్పుకుంటావో చెప్పుకో. వస్తా పనుంది. బై' అంటూ గాల్లోకి నిలువుగా ఎగిరిపోయి చీకట్లో మాయమైపోయింది.
చిన్నగేటుకు కూడా తాళం వేసి, చెట్లలోనుంచి గార్డెన్లో నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చా. మా ఆవిడ అక్కడే నిలబడి నావైపే తీక్షణంగా చూస్తోంది.
'ఏంటి?' అన్నా సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తూ.
'ఏంటది? చీకట్లో మీలో మీరే చేతులు తిప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నారు. మధ్యలో ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయారు ?' అడిగింది అనుమానంగా.
నా వేషాలు మొదట్నుంచీ చూస్తున్నా కూడా, ఈనాటికీ ఇంకా కొన్ని అనుమానాలున్నాయి తనకి.
'అదా ! ఆబ్బె అదేం లేదు. కరోనా గురించి రవితో ఇందాక మాట్లాడా కదా ! బ్రెయిన్ కి కరోనా ఎక్కినట్లుంది. పిచ్చి పిచ్చిగా ఉంది. రేప్పొద్దున వాక్సిన్ పొడిపించుకుంటా'. అన్నా నవ్వుతూ.
'మీ నాటకాలు నా దగ్గర కాదు. మీ శిష్యుల దగ్గర వేసుకోండి నమ్ముతారు' అంది శ్రీమతి సీరియస్ గా.
'ఖర్మరా బాబు ! భార్యా నమ్మక, శిష్యులూ నమ్మక, మనుషులూ నమ్మక చివరికి పిశాచాలు కూడా నమ్మకపోతే నేనేం చెయ్యాలి? ఇలా లాభం లేదు. రేప్పొద్దున్నే వెళ్లి కరోనా వాక్సిన్ బ్రెయిన్ కి పొడిపించుకోవాల్సిందే' అని గట్టిగా నిర్ణయించుకుని, 'అసలిదంతా నీ వల్లే జరిగింది. నువ్వు కనిపించకపోతే నీతో మాట్లాడేవాడినే కాను. ఇప్పుడు చూడు మా ఆవిడ ! నాకు పిచ్చనుకుంటోంది' అని కర్ణపిశాచిని తిట్టుకుంటూ దుప్పటి ముసుగేసి నిద్రకుపక్రమించాను.
నిద్రలోకి జారుకుంటున్న నాకు 'ఆపు నీ నాటకాలు ! నా దగ్గరకాదు. నీ శిష్యులదగ్గర వెయ్యి నమ్ముతారు' అని నవ్వుతున్న కర్ణపిశాచి స్వరం క్లియర్ గా వినిపించింది.
కర్మవలయం - ప్రశ్నశాస్త్రం
2, మార్చి 2021, మంగళవారం
గెట్ లాస్ట్
జ్యోతిష్యపు జిమ్మిక్కులూ
పాండిత్యపు తైతక్కలూ
నేర్పాలని కొందరడిగారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
మంత్రాల మ్యాజిక్కులూ
తంత్రాల టానిక్కులూ
కావాలని కొందరడిగారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
కలిసొచ్చే కాలం కిటుకులు
వలవేసే గాలం ఒడుపులు
చెప్పమన్నారు కొందరు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
ఈగోల ట్రిప్పుల్లోకి
పోగోల ట్రక్కుల్లోకి
రమ్మంటూ కొందరడిగారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
పారుతున్న నదులలోకి
జారుతున్న బురదలోకి
దిగమంటూ కొందరడిగారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
నన్ను మోస్తామని కొందరు
వాళ్ళను మొయ్యమని కొందరు
వెంటపడుతూ వేధించారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
అహంకారపు ఆర్భాటాలతో
నానారకాల నాటకాలతో
దగ్గరవబోయారు ఇంకొందరు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
అసూయతో కొందరు
అసహనంతో కొందరు
దురాశతో కొందరు
దురుద్దేశంతో కొందరు
ఆడుకుందాం రమ్మన్నారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
సోది వినిపిస్తూ కొందరు
సోడా త్రాగిస్తామని కొందరు
బూది పూయిస్తూ కొందరు
బూందీ తినిపిస్తూ కొందరు
బులుబూచికాలు చూపించారు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
కిరీటాలు మెప్పులకోసం
పరోటాలు పప్పుల కోసం
దగ్గరవబోయారు కొందరు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
గురుత్వాల గద్దెలకోసం
గుణింతాల సుద్దులకోసం
నవ్వు పులుముకున్నారు కొందరు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను
మా వాళ్లకు ఇష్టం లేదంటూ
మా కాళ్లకు కష్టంగా ఉందంటూ
ఉండలేమన్నారు కొందరు
గెట్ లాస్ట్ అంటూ
వాకిలిని చూపించాను