Pages - Menu

Pages

19, మార్చి 2021, శుక్రవారం

అట్లాంటా స్పా కాల్పులు - జ్యోతిష్య విశ్లేషణ

16-3-2021 మంగళవారం సాయంత్రం అమెరికా టైం 5 గంటల ప్రాంతంలో అట్లాంటాలోని స్పాలలో జరిగిన కాల్పులలో ఎనిమిదిమంది చనిపోయారు. చనిపోయినవారిలో ఎక్కువమంది కొరియా జాతీయులైన ఆడవాళ్లు. వారిని కాల్చినది 21 ఏళ్ల పిల్ల అమెరికన్. అదేరోజు సాయంత్రానికి పోలీసులు అతన్ని పట్టేశారు. అతని పేరు రాబర్ట్ ఎరన్ లాంగ్, జార్జియా కు చెందినవాడు. సెక్స్ ఎడిక్షన్ కు ఇంతకు ముందు ట్రీట్మెంట్ తీసుకున్నాడని అంటున్నారు. మసాజ్ పార్లర్లను నిర్మూలించాలని కంకణం కట్టుకున్నాడట. ఎందుకంటే, అక్కడ అలాంటి కార్యకలాపాలు జరుగుతాయి కాబట్టిట. ఇంతకు ముందు తనుకూడా ఆ పార్లర్ల కష్టమరేట. ఆ వ్యసనాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళని కాల్చేశానని అంటున్నాడు. ఇదీ న్యూస్.

అసలు జ్యోతిష్యపరంగా ఇదంతా ఏంటో చూద్దాం.

ఆ సమయంలో శుక్రుడు దారాకారకుడుగా ఉంటూ సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడివున్నాడు. మనఃకారకుడైన చంద్రుడు, మొండి పట్టుదలకు సూచికగా మేషంలో ఉంటూ, పాపార్గళానికి గురయ్యాడు. ఇది చాలదన్నట్లు శుక్రునిమీద నీచ గురువు, శనుల దృష్టి ఉన్నది. గురువు ద్వేషభావానికి సూచికైన షష్టాధిపతిగా సప్తమంలో ఉంటూ లగ్నాన్ని బలమైన దృష్టితో చూస్తున్నాడు. ఇవన్నీ వేటిని సూచిస్తున్నాయి? ఆడవాళ్ళతో సంబంధం ఉన్న విలాసపూరితమైన స్థలాలు (మసాజ్ పార్లర్లు, స్పాలు), విదేశీయులపట్ల ద్వేషం, మొండిమూర్ఖత్వం, హింస ఇవన్నీ సూచింపబడుతున్నాయి. అదేగా మరి జరిగింది?

శుక్రునికి మీనరాశిలో ఉచ్ఛస్థితి ఉన్నది. కానీ సున్నా డిగ్రీలలో శుక్రుడు బలంగా లేడు. ఒకపక్కన ఉఛ్చత్వం, మరొకపక్కన బలహీనత్వం ఈ రెండూ కలసి శుక్రుడిని అటూఇటూ ఊపేస్తాయి. కనుక శుక్రకారకత్వాలు గందరగోళానికి గురౌతాయి.  కుజ, రాహు, శనులవల్ల విధ్వంసకాండ జరుగుతుంది. నా పుస్తకాలు చదివినవారికి ఈ యోగాలు సుపరిచితాలే. 

నాడీజ్యోతిష్యంలో వాడే రాశితుల్యనవాంశ విధానం ప్రకారం చూస్తే కర్కాటకలగ్నం నాలుగు గ్రహాల ప్రభావానికి లోనైంది. అవి - రవి, చంద్రుడు, రాహువు, శుక్రుడు. ఇది అమావాస్య యోగం (పిచ్చిప్రవర్తన) + సెక్స్ పరమైన పెడధోరణులకు సూచిక. రాహువు, కుజుడు, శని వృషభంలో ఉన్నారు. ఇది కాల్పులు, యాక్సిడెంట్లు, నేరాలకు సూచిక. వీరందరూ శుక్రరాశి యైన వృషభంలో ఉన్నారు. అంటే శుక్ర సంబంధం వీరికి ఉన్నది. శుక్రుడేమో ఇలాంటి చోట్లను ఇలాంటి పనులను చక్కగా సూచిస్తాడు. అదేగా మరి జరిగింది?

ఇందులో రేసిస్ట్ ఛాయలున్నాయని కొందరంటున్నారు. కాదు, ఇది పూర్తిగా సెక్స్ పరమైన విపరీతప్రవర్తనతో కూడిన నేరమని కొందరంటున్నారు. రెండూ కలసి ఉన్నాయని గ్రహాలు చెబుతున్నాయి.  అసలు గ్రహాల దాకా ఎందుకు? సింపుల్ సైకాలజీ తెలిస్తే చాలు. సెక్స్ కోరికలనేవి మనసులోనుంచి పోవాలిగాని, మసాజ్ పార్లర్లు, బార్లు, స్పాలు, రెడ్ లైట్ ఏరియాలను తొలగిస్తే అవి ఎలా పోతాయి? ఇది చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతాడు. కారణాలు చెప్పడానికైనా అర్ధాలుండాలి. 

ఇప్పుడు మీకొక చచ్చుసందేహం రావచ్చు. దీనికి కారణం గ్రహాలైతే,  భూమ్మీద అన్నిచోట్లా ఇవే  జరగాలికదా? ఎందుకు జరగలేదు అని. దానికి నా జవాబేమిటంటే, భూమ్మీద అందరికీ ఇదే సందేహం రావాలి కదా, మీకొక్కరికే ఎందుకొచ్చింది? ముందు దీనికి జవాబు చెప్పండి, తర్వాత మీ ప్రశ్నకు నేను జవాబిస్తాను.

ఇలాంటి సంఘటనలకు కారణాలు గ్రహాలు కాదు. అలా చెప్పేవారికి ఏమీ తెలియదు. గ్రహాలు కారకాలేగాని కారణాలు కావు.

భూమిమొత్తం మీద ఒకే సంఘటన ఎప్పుడూ జరగదు. ఒకే గ్రహకారకత్వానికి సంబంధించిన సంఘటనలు రకరకాలైన ఛాయలలో కోణాలలో అనేక  ప్రదేశాలలో ఒకేసారి జరుగుతాయి. అదే ఈ భూమ్మీద జరుగుతున్న డ్రామా. మరొక్కవిషయం చెబుతా వినండి ! ఆ రోజున  చవితి అయింది. మీరు గమనించుకుంటే,  చాలామంది ఆడవాళ్లు ఆ రోజునా, ఒకరోజు అటూఇటూగా, చాలా హిస్టీరికల్ గా ప్రవర్తించినట్లు గమనిస్తారు. అది మీ మీ కుటుంబాలలో కావచ్చు, లేదా మీ చుట్టుపక్కల కావచ్చు. కరెక్టేనా కాదా? అదేమరి గ్రహప్రభావమంటే ! 

లొకేషనల్ ఎష్ట్రాలజీ సూత్రాలు తెలిస్తే మీకీ విషయాలు అర్ధమౌతాయి. సందర్భం వచ్చినపుడు వాటిని వివరిస్తాను. అంతవరకూ, జ్యోతిష్యశాస్త్రం నిజమే అని చెప్పడానికి  ఈ సంఘటన మరొక్క చక్కటి రుజువని అర్ధం చేసుకోండి. అంతవరకూ అర్ధమైతే చాలు !