అమెరికాలోని సౌత్ డకోటా రాష్ట్రంలో రష్ మోర్ పర్వతం ఉంది. ఇది పర్యాటకస్థలం మాత్రమేగాక అమెరికా పుట్టకముందునుంచీ నేటివ్ ఇండియన్స్ కి చెందిన చారిత్రకస్థలం కూడా. ఈ పర్వతం మీదే అమెరికా అధ్యక్షుల ముఖాలు చెక్కబడి ఉంటాయి. దీనిని అనేక సినిమాలలో కూడా మనం చూచాం.
గత మూడురోజులనుంచీ ఇక్కడ కార్చిచ్చు చెలరేగి అడవులు తగలబడిపోతున్నాయి. వందలాది ఇళ్లను ఖాళీ చేయించారు. పర్యాటకులను రావద్దని ఆపేస్తున్నారు. ఫైర్ ఫైటర్స్ పెద్దఎత్తున రేగుతున్న మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నారు. కానీ ఇది సాధ్యం కాని పని. ఒకటి రెండిళ్ళు తగలబడుతుంటే ఆర్పవచ్చు. తీవ్రమైన గాలులు వీస్తూ, వేలాది ఎకరాల అడవులు కాలిపోతుంటే ఆర్పడం తేలికైనపని కాదు. ప్రస్తుతం దాదాపు వెయ్యి ఎకరాలలో మంటలు రేగుతున్నాయి. మూడుచోట్ల మంటలు పుట్టి వేగంగా వ్యాపిస్తున్నాయి. యంత్రాంగం నానా తంటాలూ పడుతోంది. ఎందుకిది జరుగుతున్నది?
నేనింతకుముందు వ్రాశాను. ఒక గ్రహస్థితి కొన్నిరోజులపాటు ఖగోళంలో ఉంటుంది. దానిలో ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి ఉత్తేజితం అవుతూ ఉంటుంది. అప్పుడు భూమ్మీద రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే.
రెండ్రోజుల క్రితం తీవ్ర అస్తంగతుడైన శుక్రుడు సూర్యుడిని వదిలి ముందుకు కదిలాడు. నీరు అగ్నిని వదలి దూరం జరిగింది. అప్పుడేమౌతుంది? అగ్ని విజృంభిస్తుంది. ఇది చాలదన్నట్లు రాహువు కుజుడు ఒకే డిగ్రీ మీదకు వచ్చారు. కుజుడు అగ్నిస్వరూపుడు. రాహువు శనిని సూచిస్తున్నాడు. శని వాయుతత్త్వ గ్రహం. అంటే, అగ్నికి గాలి తోడౌతుంది. నవాంశలో శని వాయుతత్వరాశి అయిన మిథునంలో ఉన్నాడు. అంటే, గాలికి బలం చేకూరింది. ఇవన్నీ కలుపుకుని చూడండి. సౌత్ డాకోటాలో సరిగ్గా అప్పుడే ప్రచండమైన గాలులు ఎందుకు మొదలయ్యాయి? అడవులలో అగ్ని ఎలా పుట్టింది? ఎందుకు వ్యాపిస్తోంది? వందలాది ఇళ్లను ఎందుకు ఖాళీ చేయించారు? టూరిస్టులను ఎందుకు ఆపేస్తున్నారు? ఇవన్నీ అర్ధమౌతాయి.
ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ! సౌత్ డకోటాలోనే ఇది ఎందుకు జరిగింది? అన్నిచోట్లా ఎందుకు జరగలేదు? అంతేగా మీ ప్రశ్న?
నా జవాబు కూడా మీకు తెలుసుకదా? తప్పమ్మా ! ఏదో చెబుతున్నా కదా అని అలుసు తీసుకుని అన్నీ అడగకూడదూ? సరేనా !
అది దేవరహస్యం !
ఆ ఒక్కటీ అడక్కండి మరి !